బోనాల సంబరం
జాతరలు, ఉత్సవాలు, వేడుకలు, పర్వాలు... ఇలా పేర్లేవైనా వీటన్నింటి పరమార్థం- సామాజిక ఐక్యత, సామూహికంగా దైవానుగ్రహాన్ని అందుకోవడం. ఆ పరంపరలోదే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకునే బోనాల సంబరం. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలతో తెలంగాణ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉంటుంది. పొలిమేరల్లోని గ్రామ దేవతల్ని శాంతింపజేయడానికి ఆషాఢంలో వారికి బోనాల్ని సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. బోనాల పండుగకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 15వ శతాబ్దంలో భాగ్యనగరంలో ప్రతిఏటా భారీవర్షాల కారణంగా కలరా బారిన పడి ఎక్కువమంది చనిపోతుండేవారు. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో గ్రామ దేవతలకు బోనాలు (ప్రసాదాలు) సమర్పించడంవల్ల రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసించేవారు. అంటురోగాలు ప్రబలకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని ఊరంతా చల్లుకుంటూ బోనాలతో ఊరేగింపుగా వెళ్లేవారు. అమ్మతల్లికి అభిషేకాలు చేసి, బోనాల్ని నైవేద్యంగా పెట్టేవారు. అప్పటినుంచి ఇదొక సంప్రదాయంగా స్థిరపడింది.
బోనాల పండుగకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 18వ శతాబ్దంలో, సికింద్రాబాద్ వాసి అయిన అప్పయ్య సైనికాధికారిగా ఉజ్జయినిలో ఉండేవారు. అక్కడ కూడా ఓ సందర్భంలో కలరా వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి తగ్గుముఖం పడితే, తన స్వస్థలమైన సికింద్రాబాద్‌లో అమ్మవారికి గుడి కట్టిస్తానని ఉజ్జయినీ మహాకాళిని ప్రార్థించారు. వ్యాధి తగ్గడంతో ఉజ్జయినీ ఆలయం నమూనాలోనే ఆ భక్తుడు సికింద్రాబాద్‌లో అమ్మవారికి 1815లో గుడి కట్టించాడని చెబుతారు. 1864లో ఆలయ ప్రాంగణంలోని ఓ బావికి మరమ్మతు చేస్తున్నప్పుడు తవ్వకాల్లో 'శ్రీమాణిక్యాలదేవి' విగ్రహం లభించింది. ఆ విగ్రహంతోపాటు, అప్పటివరకు కొయ్య విగ్రహంగా ఉన్న ఉజ్జయినీ మహాకాళీ స్థానంలో కూడా ఓ రాతి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఆలయంలో మహాకాళి, ఆమెకు కుడివైపున మాణిక్యాల దేవి శిలామూర్తులుగా దర్శనమిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో ఆషాఢ జాతర జరిగిన తరవాత, మరుసటి ఆదివారాల్లో ఇతర ప్రాంతాల్లో బోనాల వేడుకల్ని నిర్వహించుకుంటారు.
బోనాల వేడుకలు ఘటం ఎదుర్కోళ్ల ఉత్సవంతో ఆరంభమవుతాయి. భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి, అమ్మవారికోసం నైవేద్యాల్ని సిద్ధం చేస్తారు. వాటిని ఓ పాత్రలో ఉంచి, ఆ పాత్రపై జ్యోతిని వెలిగించి, ఆ బోనాన్ని ఆలయంలో సమర్పిస్తారు. పసుపునీరు, వేపాకుల్ని అమ్మవారికి అభిషేకిస్తారు. దీనిని 'సాకబెట్టుట' అంటారు. ఈ పర్వదినాల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్ని తయారుచేసుకుని ఓ బండిలో ఆలయాలకు తీసుకొస్తారు. గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి, ప్రసాదాన్ని అమ్మవారికి కొంత నివేదించి, మిగిలింది మహాప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. బండ్లపై ప్రసాదాలు తెచ్చి, అమ్మతల్లికి సమర్పించే ఘట్టాన్ని 'ఫలహారపు బండ్లు' అని వ్యవహరిస్తారు. పోతరాజులు బాజా భజంత్రీలతో ప్రదర్శించే నృత్యాలు, విచిత్ర వేషధారుల విన్యాసాలు, ఆటపాటలతో బోనాల పండుగ ఉత్సాహంతో పోటెత్తుతుంది. భవిష్యవాణిని వివరించే 'రంగం' వేడుక, అమ్మవారు పూనిన పోతరాజులకు సొరకాయ, గుమ్మడికాయలతో దిష్టితీసే 'గావు పట్టు' ఈ సంబరంలో ప్రధాన అంశాలు. అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించే 'సాగనంపు' ఘట్టంతో ఆషాఢ బోనాల వేడుకలు పరిసమాప్తమవుతాయి. సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనానికి ప్రతీకగా బోనాల సంబరాలు కొనసాగుతున్నాయి.
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
(Eenaadu, 05:08:2007)
Labels: Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home