పిల్లలూ బహుపరాక్!
ఇల్లలకగానే పండగ కానట్లు పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు సంతోషపడటానికి లేదు. ఆ పిల్లలు ప్రయోజకులై నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని కన్నవారిపట్ల తమ బాధ్యతను గుర్తెరిగి వృద్ధాప్యంలో వారిని ఆదరణగా చూసినప్పుడే ఆనందపడాలి! తమను కని అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఎంతమంది పిల్లలు శ్రద్ధగా చూస్తున్నారు? ''కొడుకు పుట్టాడంటే కొండలెక్కుదురు, రంభ కోడలు వస్తే రచ్చకెక్కుదురు...'' అంటూ సాగిపోతుందో జానపదగీతం. అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలా అని సామెత. ఇటువంటి గీతాలు, సామెతలు అన్నీ సమాజంలోని ప్రస్తుత పోకడలను ప్రతిబింబించేవే. ''కన్నందుకు మమ్మల్ని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత మీదే'' అని పిల్లలు తల్లిదండ్రుల్ని అడగటానికి ఎంత హక్కుందో, ''మిమ్మల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసినందుకు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకూ ఉంది'' అని డిమాండు చేసే హక్కు తల్లిదండ్రులకూ ఉంటుంది. ఈ రోజుల్లో అనేక కారణాలవల్ల కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను గుర్తించటం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఉన్నవారి స్థితిగతులు దయనీయంగా తయారవుతున్నాయి. పరీక్ష ఫెయిలై శలవుల్లో స్వగ్రామం కృష్ణరాయపురం అగ్రహారం వెళ్ళటానికి భయపడుతున్న వెంకటేశాన్ని గిరీశం పంతులు, ''నువ్వు శలవుల్లో యిక్కడుంటావా ఊరికి వెళతావా?'' అని అడుగుతాడు. అందుకు వెంకటేశం, ''వెళ్ళాల్నుందిగాని పాసు కాలేదంటే మా తండ్రి చావగొడతాడు...'' అంటాడు. ''దటీజ్ టిరనీ - యిదే బంగాళీ కుర్రవాడవుతే ఏం జేస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రయేది కర్రపట్టుకొని చమ్డాలెక్కగొడతాడు'' అంటాడు గిరీశం అయ్యవారు. అలా అనటంలోని గురుబోధ తండ్రిని ఎదిరించమని చెప్పటమేనని వేరే వివరించనక్కరలేదు.
పిల్లలందరూ అలా ప్రవర్తించలేరు. తల్లిదండ్రుల మాటలనే శిరోధార్యంగా పరిగణించి అష్టకష్టాలు పడ్డవారూ ఉన్నారు. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు నారచీరలు ధరించి వనవాసం చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన పితృభక్తి, కార్యదీక్షా ఈనాటికీ మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచి ఉన్నాయి. ద్వాపరయుగంలో పూరుడు తన తండ్రి కోరిక ప్రకారం ఆయన వృద్ధాప్యాన్ని తాను ధరించి భరించి తన యౌవనాన్ని ఆయనకిస్తాడు. యయాతి చక్రవర్తి వయసుమీరి జరా రుజగ్రస్తుడైనా విషయవాంఛలు వదులుకోలేక తన కొడుకులను పిలిచి- ''మీలో ఒక్కడు నా ముదిమిగొని తన జవ్వనము నాకివ్వండి'' అని అడుగుతాడు. అందుకు కొడుకులెవ్వరూ అంగీకరించరు. ''తగిలి జరయు రుజయి దైవవశంబున నయ్యెనేని వాని ననుభవింత్రుగాక...'' అంటూ హితోపదేశం మొదలుపెట్టి, ''యెరిగి యెరిగి కడగి యా రెంటి జేకొందురయ్య యెట్టి కుమతులైన?'' అంటారు. అప్పుడు ఆఖరువాడైన పూరుడు తన యౌవనం తండ్రికిచ్చి ఆయన వృద్ధాప్యాన్ని తాను స్వీకరిస్తాడు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి పుణ్యక్షేత్రాలన్నీ తిప్పిన శ్రావణకుమారుని కథ లోకప్రసిద్ధమే. తండ్రి జంగమారాధన దీక్షను పరిపూర్ణం చేయటానికి తనను తాను అర్పించుకుంటాడు సిరియాళుడు. పురాణాల్లో, చరిత్రలో ఇటువంటి ఉదంతాలు ఎన్నో. కాలం ఒక్కతీరుగా నడవదు. కాలం మార్పువల్ల మనుషుల మనస్తత్వాల్లోను ప్రవర్తనలోను ఎన్నో మార్పులొచ్చాయి. పెద్దవారిపట్ల భక్తిశ్రద్ధలు తగ్గిపోయాయి. ''తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టెనేమి వాడు గిట్టెనేమి...'' అని వేమన కవీంద్రుడు విసుక్కొనేదాకా దిగజారిపోయింది వ్యవహారం.
ఆలికి అన్నం పెట్టనివాడు ఆచారం చెప్పె- తల్లికి తిండిపెట్టని వాడు తగవు చెప్పె అని సామెత. ఆత్మీయులపట్ల అనాదరణ చూపేవారిని సమాజం చిన్నచూపే చూస్తుంది. తల్లిదండ్రులపట్ల పిల్లలకు, పిల్లల ఎడల తల్లిదండ్రులకు సహజంగానే మమతానురాగాలు ఉంటాయి. లోగడ పెద్దవారిని గౌరవించటం వారి సౌకర్యాలు చూడటం తమవంతు బాధ్యతగా చిన్నవారు భావించేవారు. ఆనాటి కుటుంబ వ్యవస్థలో వృద్ధుల భద్రతా భావానికి లోటుండేది కాదు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగైపోయింది. దాంతో వృద్ధులైన తల్లిదండ్రులు తాము కన్న సంతానానికే భారమైపోతున్నారు. కొంతమంది తమ తల్లిదండ్రుల్ని ఏ వృద్ధాశ్రమంలోనో చేర్చి చేతులు దులిపేసుకుంటుంటే, మరికొందరు ఆ మాత్రం శ్రమా తీసుకోకుండా వారి ఆలనా పాలనా చూడటమే మానేశారు. తాము కని, పెంచి, పెద్దచేసిన పిల్లలే తమను నిరాదరణగా చూస్తుంటే తట్టుకోలేక వృద్ధులైన తల్లిదండ్రులు ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు. అటువంటివారిని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం వృద్ధాప్య బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను నిరాదరించే పిల్లలకు మూడునెలల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఏర్పడుతుంది. సంపాదనాపరులైన పిల్లలు తల్లిదండ్రులను సమాదరించాలి. కొన్ని సందర్భాల్లో నెలకు పదివేల రూపాయలవరకు జీవన భృతి ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో అటువంటి పిల్లలు శ్రీకృష్ణ జన్మస్థానం సందర్శించవలసిరావచ్చు. ఈ చట్టం అమలులోకి వస్తే వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూసే పిల్లల ఆటకట్టినట్లే అవుతుంది. ''అమ్మానాన్నలే అవనిలోన దేవతలు కాదంటే తప్పదులే కటకటాల కాపురం'' అన్న గ్రహింపు కలిగి ఇప్పట్నించీ పిల్లలు బహుపరాక్‌గా ఉండటం మంచిది!
(Eenadu, 02:09:2007)
-----------------------------------------------------
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home