పంట పొలాల్లో పాటల సందడి
''సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే...'' అన్నారు త్యాగరాజు. మంచి సంగీతానికి ముగ్ధులుకానివారు అరుదు. ''చక్కని సంగీతం విని ఆనందించలేనివారు హత్యలు చేయటానికైనా వెనుకాడరు'' అన్నాడు షేక్స్‌పియర్. పురాణకాలం నుంచీ సంగీతం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. మన దేవతలంతా సంగీత ప్రియులే. ఎంత గొప్ప సంగీతమైనా పక్కవాద్యాల హంగు ఉంటేనే శోభిస్తుంది. మహతి అనే వాద్య విశేషాన్ని చేతబుచ్చుకొనే విష్ణు సంకీర్తనం చేస్తూ నారదమహర్షి త్రిలోక సంచారం చేసేవాడని పురాణ కథనం. ''పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే'' అని మహాకవి అన్నట్లుగా నారదుడికి తుంబురునికి సంగీతపరంగా పోటీ ఉండేదని చెప్పే కథలున్నాయి. చదువులతల్లి సరస్వతి పుస్తకం ఎప్పుడు పట్టుకొనేదో కాని సదా వీణ వాయిస్తూనే ఉండేదన్నట్లుగా చిత్రాల్లో దర్శనమిస్తుంది. వీణాపాణి అన్న పేరుతో ఆమె ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా వీణ వాయించేవాడని ప్రసిద్ధి. వీణలలో మళ్ళీ రావణ వీణలు రజత వీణలు గోవింద వీణలు రుద్రవీణలు వంటి ఎన్నో రకాలుంటాయంటారు. అవన్నీ ఇప్పుడు ప్రాచుర్యంలో లేకపోయినా వీణ, ఫిడేలు వంటి వాద్యాలు సంగీతానికి సుసంపన్నమైన హంగును సమకూరుస్తూనే ఉన్నాయి.
కాస్త ఉల్లాసం కలిగినప్పుడల్లా కూనిరాగాలు తీయటం మనుషులకు అలవాటు. బాత్‌రూం భాగవతార్లు, వంటింటి కోయిలమ్మలు ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తారు. ''మా ఆయనవి కూనిరాగాలు కాదు. ఖూనీ రాగాలు... ప్రతిరాగాన్ని ఖూనీ చేస్తారు-'' అని పళ్ళు కొరుకుతుంది తాయారమ్మ. ''నేను కాస్త పాడదామని గొంతెత్తినపుడల్లా మీరు పరిగెత్తికెళ్ళి వీధిగుమ్మంలో కూర్చుంటారెందుకు?'' అని రుసరుసలాడింది గానసరస్వతి. ''ఎందుకంటే... ఎవరూ నాపై గృహహింస కేసు పెట్టకుండా'' అన్నాడు అయోమయం తెలివిగా. ''గృహహింసేమిటి?'' అంది గానసరస్వతి తెల్లబోతూ. ''నువ్వు పాడుతున్నావనీ, ఏడుస్తూ గోలపెట్టటంలేదనీ, నేను నిన్నుకొట్టటం లేదని నలుగురికీ తెలియాలని నువ్వు పాడుతున్నప్పుడల్లా నేను వీధిగుమ్మంలో కూర్చుంటాను'' అన్నాడు అయోమయం. ఆ తరవాత భార్యాభర్తలమధ్య సీతారామయుద్ధం భీకరంగా జరిగుంటుందని వేరే చెప్పనక్కరలేదు. గిరీశం పాటగాడు అవునోకాదో తెలియదుకాని బుచ్చమ్మను చూడగానే అతనిలో కూనిరాగాలు పుట్టుకొచ్చేవి. ''కాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే చెలి యేమని సహింతునే...'' అని ఒకసారీ, ''ఎటులోర్తునే చెలియా...'' అని మరోసారి రాగాలు పలికించినా ఆట్టే ప్రయోజనం కలగలేదు. అమాయకురాలైన బుచ్చమ్మకు ఈ రాగాలు సరాగాలు అంతగా తెలియవు. ''యీ రుబ్బురోలు నిండా తాటాకు ముక్కలు పడుతున్నాయి. ఇవతలికి లాగేసి పెడతారూ?'' అని అడుగుతుంది తప్ప గిరీశం గాన కళానైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ఒక్కమాటా మాట్లాడదు. సాధారణంగా సంగీతం మనిషిని కదిలిస్తుంది. మైమరిపిస్తుంది. మనిషికి మోదం కలిగినా రాగం జాలువారుతుంది. ఖేదం కలిగినా పాట- 'గొంతుకలో కొట్లాడుతుంది'. సంగీతం ఒక్క మనుషులనే కాదు పంట పొలాలనూ, ప్రభావితం చేస్తుందని ఇటీవల శాస్త్రజ్ఞులు రుజువు చేశారు.
వరి పొలాలు చక్కని సంగీతానికి ప్రభావితమై ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తాయని దక్షిణకొరియా శాస్త్రవేత్త మిజియోంగ్ జియోంగ్ తన పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ప్రస్తుతం జన్యుమార్పులకోసం రైతులు రసాయనిక ఎరువులు తదితరాల్ని ఉపయోగిస్తున్నారు. రసాయనిక ప్రక్రియలవల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమేకాకుండా ఖర్చుకూడా ఎక్కువవుతోంది. సంగీతంవల్ల ఇదే మార్పును ఆట్టే ఖర్చు లేకుండా పర్యావరణానికి నష్టం కలిగించకుండా సాధించవచ్చని కొత్తగా రుజువైంది. దక్షిణకొరియాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీకి చెందిన మిజియోంగ్‌జియోంగ్ తన సహచర శాస్త్రజ్ఞులతో కలిసి వరి పొలాలకు 14 రాగాల శాస్త్రీయ సంగీత రికార్డులను వినిపించాడు. వాటిల్లో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బెథోవిన్ సృష్టించిన సంగీతమూ ఉంది. ఈ సంగీతం వింటూ ఆ ప్రభావానికి వరి జన్యువుల్లో కలుగుతున్న మార్పులను శాస్త్రజ్ఞులు నిశితంగా పరిశీలించారు. సంగీతం వింటూ వరిలోని రెండు జన్యువులు బాగా ఉత్తేజితం అవుతున్నట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. అంతేకాక అందులోని ఒక జన్యువు ఇతర జన్యువులను కూడా సంగీత ధ్వనులకు ప్రభావితమయ్యేలా చేస్తుందని వీరి పరిశోధనలలో తేలింది. దక్షిణకొరియా శాస్త్రజ్ఞుల పరిశోధన పుణ్యమా అని ఇక రైతులు తమ పొలాలలో అవసరమైన మార్పులు తీసుకురావటానికి రసాయనిక ప్రక్రియల జోలికి పోనక్కరలేదు. సలక్షణంగా తామే ఏ వాయిద్యమో నేర్చుకొని చక్కని సంగీతం మొక్కలకు వినిపిస్తే చాలు!
(Eenadu,16:09:2007)
Labels: Liesure/Telugu
0 Comments:
Post a Comment
<< Home