తక్కువైనా ఇబ్బందే
ఏ దేశ ప్రగతి అయినా అక్కడి ప్రజల శక్తియుక్తులపై ఆధారపడి ఉంటుంది. సహజవనరులు, సంపదలు ఎన్ని ఉన్నా ప్రజల్లో చైతన్యం, కష్టించి పనిచేసే మనస్తత్వం లోపించినప్పుడు ఏ దేశమూ అభివృద్ధి సాధించలేదు. కర్షక సోదరులు హలాలను చేతబట్టి పొలాలను దున్నుతూ విరామమెరుగక పరిశ్రమించినప్పుడే బంగారు పంటలు పండుతాయి. పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉంటుంది. కార్మికులు యంత్రాల కోరలు తోమి వాటిని పరుగులు పెట్టిస్తేనే పరిశ్రమలు వర్ధిల్లుతాయి. దేశంలో సంపద పెరుగుతుంది. అన్ని సంపదలకన్నా జనసంపదే ముఖ్యం. అందుకే- ''దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్...'' అన్నారు మహాకవి గురజాడ. దేశంలాగానే కుటుంబాలూ. ఇల్లూ వాకిళ్ళూ, సిరిసంపదలు ఎన్ని ఉన్నా సంతాన సౌభాగ్యం లేకపోతే అవేవీ రాణించవు. ఇంట్లో పిల్లలు, తోటల్లో పిట్టలు ఉంటేనే వారి సందడితో ఆయా ప్రదేశాలు కలకలలాడుతూ ఉంటాయి. ''సకలైశ్వర్య సమృద్ధులు నొకతల సంతానలాభమొకతల'' అన్నాడు శ్రీనాథ మహాకవి. భాగ్యానికి పేద అయినా సంతాన సౌభాగ్యానికి పేద కాడు కుచేలుడు. పిల్లల్ని పోషించలేక అవస్థ పడినప్పటికీ ఆ సంతానంవల్లే అదృష్టం కలిసొస్తుంది కుచేలుడికి. దరిద్రంతో బాధపడుతూ పిల్లలను పోషించటానికి వేరే మార్గం కనపడక బాధపడుతున్న కుచేలునికి తన బాల్యస్నేహితుడు శ్రీకృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. కేవలం గుప్పెడు అటుకులకే ఆనందపడిపోయిన కృష్ణుడు కుచేలునికి సకలసంపదలూ ప్రసాదిస్తాడు.
పరిచయస్థులు ఎదురుపడినప్పుడు ''సుఖమె మనవారెల్ల సూరయ్యగారు అకలంక చరితులె అమిత బంధువులు'' అన్న కుశల ప్రశ్నలతో ప్రారంభించి, ''వరిపంటలేపాటి వర్షమేపాటి'' అని ఆరాలడిగి ఆ వెంటనే- ''పిల్లేది మీ చిన్న పిల్లవాడేడి...'' అని ప్రస్తావించటం పరిపాటి. పూర్వకావ్యాల్లో పురవర్ణనలే కాక అక్కడి పౌరుల వర్ణనలూ విధిగా ఉండేవి. ''ఇంద్రప్రస్థపురంబు భాసిలు రమా హేలాకళావాసమై'' అంటూ పాండవుల ఏలుబడిలో ఉన్న ఇంద్రప్రస్థపురాన్ని వర్ణిస్తాడు విజయవిలాస కావ్యకర్త. ''కడమాటు పగవానిగని చేమరచెనంచు భార్గవు మెచ్చరు బాహుజనులు, పనికిరాకొకమూల బడియెనాతని వస్తువని కుబేరుని మెచ్చరర్య జనులు...'' అంటూ ఆ నగరంలోని ప్రజల ఔన్నత్యాన్నీ విశదపరుస్తాడు. నాలుగు శతాబ్దాల క్రితం మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించినప్పుడు- ''ప్రభూ! చెరువునిండా చేపలు నిండినట్లు నా నగరమంతా మనుషులతో నిండిపోయేటట్లు అనుగ్రహించు'' అని దేవుణ్ని ప్రార్థించాడంటారు. ఇప్పుడు హైదరాబాద్ మనుషులతో నిండిపోవటమే కాదు, జనంతో కిటకిటలాడిపోతోంది. ప్రస్తుతం ప్రపంచం అధిక జనాభా సమస్యతో బాధపడుతోంది. ప్రతి రెండు సెకండ్లకు ప్రపంచంలో ఒక కొత్తవ్యక్తి పుట్టుకొస్తున్నట్లుగా గణాంక వివరాలు చెబుతున్నాయి. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతుంటే మరికొన్ని దేశాలు జనం తక్కువై బాధపడుతున్నాయి.
''గర్జించు రష్యా గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, దౌర్జన్యరాజ్యం ధ్వంసించు రష్యా-'' అంటూ రెండో ప్రపంచ యుద్ధకాలంలో మహాకవి శ్రీశ్రీ నినదించారు. నాజీ నియంత హిట్లర్ ఆగడాలను అరికట్టటంలో రష్యన్ ప్రజలు చరిత్రాత్మక పాత్ర పోషించారు. తమ ధైర్యసాహసాలతో ప్రపంచ ప్రజల మన్ననలందుకొన్నారు. అటువంటి రష్యా ఇప్పుడు జనాభా తక్కువై కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. రష్యాలోని జనాభా సంవత్సరానికి ఏడు లక్షల చొప్పున తగ్గిపోతున్నట్లుగా గణాంక నిపుణులు లెక్కలు చెబుతున్నారు. ఈ పరిణామం రష్యా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువమంది పిల్లలను కనమని ప్రజలను ఉద్బోధిస్తూ అక్కడి ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెడుతోంది. 'కావాలంటే సెలవులిస్తాం, వాటితోపాటు బహుమతులూ ఇస్తాం' అంటోంది. రెండో బిడ్డ లేదా అంతకుమించి పిల్లలను కన్న తల్లులకు నగదు బహుమతులిస్తున్నారు. యుల్యానోవిక్ రాష్ట్ర గవర్నర్ సెర్జిమోరజోవ్ పెళ్ళయిన జంటలకు ప్రతి బుధవారాన్ని సెలవుదినంగా ప్రకటించాడు. ఆ రోజుకు 'ఫామిలీ కాంటాక్ట్ డే' అని నామకరణం చేశారు. రష్యన్ జాతీయదినం జూన్ 12న పిల్లలను కనే జంటలకు ప్రత్యేక బహుమతులిస్తున్నారు. ఈ బహుమతుల పథకం విశేషంగా జనాన్ని ఆకర్షించగలదని, ఫలితంగా రష్యా జనాభా గణనీయంగా పెరగగలదనీ ప్రభుత్వం ఆశపడుతోంది. 'జనాభా క్షీణత క్రమేపీ తగ్గి 2015 సంవత్సరానికల్లా స్థిరంగా ఉంటుందని మా ఆశ' అంటున్నారు రష్యా ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి. రాబోయే కాలంలో రష్యా కొత్త జనాభాతో ధగధగలాడుతుందేమో చూడాలి!
(Eenadu, 23:09:2007)
_______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home