ఫన్‌కర్ ఫటాఫట్
పల్స్ పోలియో కన్నా పెద్ద సమస్య?
'పర్స్' పోలియో
*బంగారం ధర పెరిగినా, తగ్గినా తేడా ఏమిటి?
పెరిగినా, తగ్గినా ఇంటాయనకే కన్నీళ్లు. అందులో తేడా ఏమీ లేదు.
*మన దేశంలోనే ఎక్కువమంది ఆరోగ్యవంతులు ఉన్నారట! నమ్మమంటారా?
నమ్మక తప్పదు. 'చచ్చినంత' ఒట్టు!!
*నా కవి మిత్రుడొకడు వ్యాపారం పెట్టాడు. అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
'టపాలు తక్కువ, తిరుగు టపాలు ఎక్కువ'గా సాగిపోతుంది.
* కొంత కాలం నుంచి చిన్న హోటల్ పెట్టుకొని వంట మాస్టర్ మొదలుకొని అన్ని పనులూ నేనే చేసుకుంటున్నాను. అయినా ఎవరూ హోటల్ గడప తొక్కడం లేదు. ఎందుకో?
మీరు 'చెమటోడ్చి' కష్టపడటం కళ్లారా చూసి ఉంటారు. పూర్ 'కష్ట'మర్లు
తినగతినగ వేము తీయనుండు అంటారు. ఎదురుదెబ్బలు తినగతినగ...
కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చున్..
* నగరాలకు గ్రామీణుల వలస ఆగాలంటే
సిటీలనిండా 'ఫ్త్లె ఓవర్'లు కడితే సరి. బతుకుంటే బలుసాకు తినొచ్చు అనుకుని వాళ్లే రావడం మానేస్తారు.
* ఎంత కష్టపడ్డా వ్యాపారంలో తొలిమెట్టు మీదే ఉన్నాను. మీ సలహా
అక్కడ ఉంటేనే బెటర్! పైకి వెళ్తే ఎప్పుడయినా ఒక 'మెట్టు' దిగి రావాల్సిందే కదా! అది ఎంత అవమానకరం చెప్పండి.
* వ్యాపారానికి నమ్మకం ముఖ్యమా? అమ్మకం ముఖ్యమా?
నమ్మకంతో అమ్మడం ముఖ్యం. ఎటొచ్చీ నమ్మితే అమ్మగలం. నమ్మనివ్వరు. అమ్మితే నమ్మగలం. అమ్మనివ్వరు.
* నిర్మాణాత్మకంగా పని చేయాలని ఉంది. ఏం చేయమంటారు?
కన్‌స్ట్రక్షన్ కంపెనీ పెట్టండి. మీరు అనుకున్నట్టు 'నిర్మాణాత్మకం'గా సాగుతుంది.
*అయినవాళ్లలో కలిసి వ్యాపారం చేస్తే?
కాని వాళ్లు లేని లోటు తీరుతుంది.
* నా ఫ్రెండొకడు నాదగ్గర అప్పు తీసుకుని 'చెక్కిస్తాను చెక్కిస్తాను' అని చెప్పి పెన్సిల్ చెక్కిచ్చాడు. ఇప్పుడేం చేయాలి?
ఇంకా నయం. ఎక్కడికీ చెక్కేయకుండా అదైనా చేశాడు. సంతోషించండి. 'మాట' మీద నిలబడ్డ అతడి పెన్సిల్‌తో రాసుకు పూసుకు తిరగడమే మీరు చేయాల్సింది.
* మన దేశంలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే?
పంట పొలాలు రాజకీయ నాయకులకు తప్ప ఇంకెవరికీ ఉండకూడదు.
(Eenadu, 07:10:2007)
____________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home