బాలరాజును బలిగొన్నది ప్రమాదమే
3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన బాలరాజు టుటన్‌ఖమున్ మరణం వెనకాల ఉన్న చిక్కుముడి చివరికి విడిపోయింది. ప్రమాదవశాత్తు రథంపైనుంచి పడిపోవటం వల్లనే అతడు మరణించాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచ పురావస్తు (ఆర్కియాలజీ) పరిశోధనల చరిత్రలో టుటన్‌ఖమున్‌ది ఆసక్తికరమైన అధ్యాయం. 1922లో బ్రిటన్ పురావస్తు పరిశోధకుడు హోవర్డ్ కార్టర్ టుటన్‌ఖమున్ సమాధిని కనుక్కున్నారు. దాంట్లో లభించిన అద్భుతమైన కళాఖండాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు యావత్ ప్రపంచాన్ని సమ్మోహపరిచాయి. టుటన్‌ఖమున్ మమ్మీపై అప్పటి నుంచి పరిశోధనలు మొదలైనాయి. బాల్యంలోనే అతను చనిపోవటానికి అంతఃపుర కుట్రలే కారణం అయి ఉంటాయని తొలుత భావించారు. 1968లో తీసిన ఎక్స్‌రే రిపోర్టులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరిచాయి. ఈ నివేదికల్లో, పుర్రె అడుగు భాగం ఉబ్బిపోయి కనిపించింది. తలమీద బలంగా కొట్టి హత్య చేశారని అందరూ అనుకున్నారు. ఈ విధంగా బాలరాజు మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, తాజాగా జరిగిన పరిశోధనలు టుటన్‌ఖమున్‌ది హత్య కాదని తేల్చి చెబుతున్నాయి.
విరిగిన కాలే ప్రాణం తీసింది
సిటీస్కాన్‌తో నిర్వహించిన పరీక్షల్లో టుటన్‌ఖమున్ కుడికాలు విరిగిపోయిందని తేలింది. మోకాలిపై భాగంలో అయిన ఈ గాయంతో రక్తం విషతుల్యమై చనిపోయి ఉంటాడని కైరో మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్ నాదియా లోక్మా అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ ఆ గాయం ఎందుకైంది అన్న ప్రశ్నకు, వేటకు వెళ్లినప్పుడు రథం పడిపోవటం వల్లేనని ఆవిడ సమాధానమిస్తున్నారు. దీనికి ఆవిడ చూపుతున్న ఆధారాలు ఏమిటంటే, సమాధిలో లభించిన రథాలు, వందలాది బాణాలు. వీటిని సమాధిలో అలంకారం కోసం ఉంచలేదని, గతంలో వాడారని అది కూడా యుద్ధాల్లో కాకుండా వేటలో ఉపయోగించారని ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది. అంతేగాక, టుటన్‌ఖమున్ సమాధిలో ఒక కవచం కూడా గతంలో లభ్యమైంది. వేటకు వెళ్లినప్పుడు ఉదరభాగంలో దీన్ని ధరించేవారు. దీనిద్వారా కూడా అతనికి వేటకు వెళ్లే అలవాటు ఉండేదని తెలుస్తోంది.
గుట్టు విప్పిన పూలదండ
నాదియా చెప్పే వాదనకు వూతమిచ్చే మరో ఆధారం, టుటన్‌ఖమున్ మెడ చుట్టూ ఉన్న పూల దండ అవశేషాలు. వృక్షశాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో, కార్న్ ఫ్లవర్స్, మేవీడ్స్ పూలను ఉపయోగించి ఆ దండను తయారుచేశారని తెలిసింది. ఈ రెండు రకాల పూలు ఈజిప్టులో మార్చి, ఏప్రిల్‌లో మాత్రమే పూస్తాయి. శవాన్ని మమ్మీలా రూపొందించటానికి ప్రాచీన ఈజిప్టులో 70 రోజులు పట్టేది. అంటే, మార్చికి రెండు నెలల ముందు టుటన్‌ఖమున్ మరణించి ఉంటాడు. అది డిసెంబర్‌గానీ, జనవరిగానీ అయి ఉండవచ్చని రాయల్ హార్టీకల్చరల్ సొసైటీకి చెందిన నీగెల్ హెప్పర్ అంటున్నారు. ప్రాచీన ఈజిప్టు చరిత్ర ప్రకారం, ఈ సమయంలోనే చలికాలపు వేట జరిగేది. ఈ నేపథ్యమూ, లభించిన ఆధారాలూ... టుటన్‌ఖమున్ మృతికి ప్రమాదమే కారణమని వెల్లడిస్తున్నాయి. ఈజిప్టు పురావస్తు సంపద సుప్రీం కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జాహి హవస్ కూడా ఈ విషయాన్నే ఒక టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా ధృవీకరించారు. మొత్తానికి పురావస్తు పరిశోధనలకే సవాల్‌గా నిలిచిన బాలరాజు మరణం చిక్కుముడి విడిపోయింది. అదొక్కటే కాదు, యువకులందరిలాగే టుటన్‌ఖమున్ కూడా చురుకైనవాడనీ, ధైర్యవంతుడనీ ఈ పరిశోధనలు వెల్లడించాయి. రాచబిడ్డ కాబట్టి టుటన్‌ఖమున్ అత్యంత కోమలంగా పెరిగి ఉంటాడని చరిత్రకారులు ఇప్పటి వరకూ భావించేవారు.
(Eenadu, 01:11:2007)
_______________________________
Labels: Amazing
0 Comments:
Post a Comment
<< Home