ఇంటింటా దివ్య శోభావళి
పండగ అంటే సందడి, సంతోషం. పండగల హడావుడి అంతా ప్రధానంగా పిల్లలదే. వారు పండగల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. పైకి అంతగా కనిపించకపోయినా పెద్దవారికీ పండగలంటే ఇష్టమే. మామూలుగా గడిచిపోయే జీవితాల్లోకి కొత్త వెలుగులు నింపుతూ, నూతన ఉత్సాహం కలిగిస్తూ ఆగమిస్తాయి పండగలు. ఈ రోజుల్లో అటువంటి ఆప్యాయతలు ఆదరణలు చాలావరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు బంధువులు ఇంటికివస్తే పండగగానే భావించేవారు. వారున్న నాలుగు రోజులు కబుర్లతో, నవ్వులతో, ఎప్పటివో ముచ్చట్లు నెమరేసుకోవటంతో సంతోషంగా సందడిగా గడిచిపోయేవి. ఇప్పుడు అటువంటి వాతావరణం అంతగా కనిపించకపోయినా పండగల ప్రాముఖ్యం మాత్రం తగ్గిపోలేదు. గృహిణులకే పనిభారాన్ని ఎక్కువ చేస్తాయి పండగలు. గృహాలంకరణలతోపాటు పండగ పిండివంటలతో వారు సతమతమైపోతారు. ''పండగంటే మాటలా... ఇల్లు సర్దుకోవాలి. బూజులు దులిపి ఇల్లు కడిగి ముగ్గులు పెట్టాలి. పిండివంటల తతంగం ఉండనే ఉంటుంది'' అంటూ ఇల్లాళ్ళు ఆయాసపడిపోతారు. పుస్తకాలు చదివి వంటలు చేసే ఓ పనిమంతురాలు ''గరిట తిప్పు- వంటచేయి'' అనే పుస్తకంలో రాసిన కొత్తరకం పిండివంటను పండగ కోసమని కష్టపడి తయారుచేసింది. ఇంటికి వచ్చినవారందరికీ ఆ వంటను గురించి గొప్పగా చెబుతూ- ''రుచిచూడండి... ఎంతబాగుందో-'' అంటూ తలాకాస్తా పెట్టింది. వచ్చినవారంతా చక్కగా తిని- చాలా బాగుంది- అని మెచ్చుకొని వెళ్లిపోయారు. తీరా పండగరోజు వచ్చేసరికి ఆ పిండివంట కాస్తా పూర్తిగా అయిపోయింది. ''పండగ పిండివంట పైవాళ్ళు రుచిచూడటానికే సరిపోయింది- ఇంట్లో వాళ్ళకు పస్తే...'' అని ఆ ఇల్లాలు నిట్టూర్చింది.
పండగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. అమావాస్యనాటి కారుచీకట్లను చీల్చుతూ వెలుగులు విరజిమ్ముతూ వచ్చే పండగ దీపావళి. పండగ కన్నా ముందే టపాకాయల మోతలు ప్రారంభమవుతాయి. పిల్లలు పేల్చే బొమ్మ పిస్తోళ్ళ పేలుడు ధ్వనులు, రోలు రోకళ్ళ శబ్దాలు, నేల టపాకాయల ఢామ్‌ఢామ్‌లు దీపావళి వచ్చేస్తోందనే సంకేతాన్ని ముందే అందిస్తాయి. ''వచ్చేను వచ్చేను దీపావళీ, ముచ్చటగొలిపే పండుగ భళిరా భళీ'' అన్న ఆరుద్ర, ''ప్రతి మనిషీ ఆ రోజున రంగరంగేళీ ప్రతి మనసున పయనించును కోర్కెల డోలీ'' అనీ అన్నారు. పసివాళ్ళు కప్పగంతులు కాలుస్తూ గంతులేస్తుంటే పెద్దవాళ్ళు మురిపెం తీరా చూస్తూ ముచ్చటపడిపోతుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కాకరపూవొత్తులు వెలిగించి సంతోషిస్తుంటే బామ్మలు, అమ్మమ్మలు వట్టి వత్తులతో సరిపెట్టుకుంటారు. ఆకాశం అందుకొనే అవ్వాయిచువ్వను చూసి- ''ఏమిటిది జవరాలి చక్కటి నవ్వా...'' అని ఆశ్చర్యపోయాడో కొత్త పెళ్ళికొడుకు. పిల్లల ఉత్సాహాన్నే కాదు స్త్రీ సాహసాన్నీ శక్తినీ ప్రతిఫలింపజేస్తుంది ఈ పండగ. నరకాసురుడు లోకకంటకుడై ప్రజల్ని పీడిస్తున్నప్పుడు అతని ఆటలు కట్టించటానికి సన్నద్ధుడవుతాడు శ్రీకృష్ణుడు. కృష్ణపరమాత్మ నరకునితో యుద్ధానికి బయలుదేరితే తానూ వస్తానంటుంది సత్యభామ. నీకిది తగదని కృష్ణుడు వారించినా వినిపించుకోదు. కొంగుబిగించి ''ధనువెక్కువెట్టి గుణనిస్వనముగావించి శరము సంధించి'' నరకునితో భీకరంగా యుద్ధం చేస్తుంది. ''ధనువుదెగటార్చి మేటిరథ్యముల గూల్చి సారథిని ద్రుంచి ధ్వజమును జక్కుజేసి, రథము బొలయించివేగ తద్రధికవరుల జాలిబడజేసె సతి బాణజాలములను'' అంటూ అప్పటి సత్యభామ రణకౌశలాన్ని చక్కగా వర్ణించారో పూర్వకవి.
దీపావళి అనగానే ఇటువంటి ఉదంతాలన్నీ మదిలో కదలాడటం సహజం. ఈ ఏటి దీపావళికి మరో ప్రత్యేకతా ఉంది. మన దీపావళి గొప్పతనాన్ని కొత్తగా అమెరికా ప్రభుత్వం గుర్తించింది. మతపరంగాను, చరిత్రాత్మకంగాను ఈ పండుగకున్న ప్రత్యేక ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభఆమోదం లభించింది. అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో దీపావళిని గుర్తిస్తూ ఒక తీర్మానం ఆమోదం పొందటం ఇదే మొదటిసారి. అమెరికాలోని భారతీయ సమాజానికి చెందిన దాదాపు 20 లక్షల మంది హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు- ప్రతిఏటా ఈ పర్వదినాన్ని అయిదు రోజులపాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దీపావళి విశిష్టతను అమెరికా ఇప్పుడు గుర్తించినా మనవారు ఏనాడో గుర్తించి శతాబ్దాలుగా ఈ పండగను దేదీప్యమానంగా జరుపుతున్నారు. ''దీపావళీ విశ్వరూపావళీ, నిత్యజ్యోత్స్నావళీ, వర్ణలేపావళీ, దివ్యచిత్రావళీ, పరమశిల్పావళీ, రాగవ్యాప్తావళీ'' అన్న అడివి బాపిరాజు, ''నా ఆశ ఆశయము, నా అవధి ఆనందమే దీపావళీ'' అనీ అన్నారు. అటువంటి దీపావళి రాబోతోంది. ఈ దీపావళన్నా మనుషుల్లోని స్వార్థ తిమిరావళిని పోగొట్టి వారి మనసులో సామరస్య వెలుగులు నింపే శోభావళి అవుతుందేమోనన్న చిన్న ఆశ. ఎంతయినా మనిషి ఆశాజీవి కదా!
(Eenadu, 04:11:2007)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home