మందూ ముచ్చటా
- శంభు
'ముందుగతి కానవే చిలుకా!' అన్నతత్వం ఒంటపడితే సాధించేదేమిటి? స్వర్గమేగా! ఆ స్వర్గం మాత్రం చెబుతున్నదేమిటి? మందుగతి కానవే చిలుకా అనేగా! సురాపానం లేకపోతే స్వర్గమేముంది? దేవతలు ప్రసన్నమయ్యే మార్గమేముంది? అందువల్ల దేవుడి పాలన అని చెప్పుకొంటున్న ప్రభువులు 'మద్యఛందస్సులను' ఎంచుకున్నారు. ఖజానాకు 'మందోబస్తు' చేసుకుంటున్నారు. ఎవరు 'బెల్టు' బిగిస్తున్నా రాష్ట్ర పాలకులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ ఆడవాళ్లను గౌరవిస్తే అక్కడ దేవతలుంటారన్నది చాదస్తం. మహిళలను గౌరవించడానికి ఎలాగూ ఆర్టీసీ బస్సులున్నాయి. అందులో ముందు మూడు సీట్లు వారికి కేటాయించారు. ఆ సంగతి ఎలాగూ ఎమ్మెస్సార్ సారు చూసుకుంటారు. ఎక్కడ మందు ఏరులై పారుతుందో అక్కడ దేవతలు కచ్చితంగా తిష్ఠవేస్తారు. అంతకన్నా ఏ ప్రభుత్వానికైనా ప్రతిష్ఠ ఏముంది? అందుకే ఏలినవారు 'తాగుడు' మూతలు ఆడుతున్నారు. మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ఖజానా గలగలలు వినిపిస్తున్నాయంటున్నారు. అదే 'మందడుగు' అంటున్నారు. ఎన్నికలనాడయినా ఎవరూ తాగకపోతే మన ప్రజాస్వామ్యం గతి ఏమైపోతుంది?
'మందు'గిస్తూ
ముందుకడుగెయ్
వెనకబడితే
వెనకేనోయ్ -
అని నాయకులు ప్రోత్సహించేది అందుకేగా! 'మందుదాతా! సుఖీభవ' అనుకుంటూ వారికి ఎంతోమంది 'జిన్'దాబాద్ అంటున్నారు.
మొరార్జీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో మహాకవి శ్రీశ్రీని ఎవరో ''మూత్రంతాగితే వంద సంవత్సరాలు బతకొచ్చని మొరార్జీదేశాయ్ అంటున్నారు. మీరేమంటారు?'' అని అడిగితే ''మూత్రం తాగి బతకడం కన్నా మద్యం తాగి చావడం మంచిది'' అని 'చెమ్మ'త్కరించారట! మందుబాబుల కళ్లు 'చెమ్మ'గిల్లేమాట ఇది!! ఈ మాట విన్నతర్వాత మద్యం అంటే ద్రవమే తప్ప ఉపద్రవమని చెబితే పాలకులు వింటారా? అందుకే ప్రాణాలను రక్షించే'మందు' అన్నమాట మద్యానికి పర్యాయపదమైపోయింది. నలుగురు తాగి దెబ్బతింటేకదా ఆసుపత్రులూ, వైద్యులూ బాగుపడేది! లక్షలు పెట్టి 'తెల్లకోటు' సంపాదించుకున్నందుకు డాక్టర్‌రాజ్యం వారికిచ్చే వరమిది అనుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. ఇంత మతలబు ఉండబట్టే పరిపాలన 'మందు'కొడిగ సాగుతోంది!
జనంలో ఈ మాత్రమైనా నీతి బతికి ఉన్నదంటే అందుకు కారణం తాగుడే. 'తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా' అనే పాట ఉంది. అదే పాలకుల బాట!
నిందితుల చేత నిజం కక్కించడానికి లైడిటెక్టర్లు ఎందుకు? మందు సీసా చేతికిస్తే ముందు వచ్చేది నిజమే. దర్యాప్తులో పోలీసులకు దండోపాయం అవసరమే ఉండదు! 'బాటిల్‌ఫీల్డు' బ్యాటిల్‌ఫీల్డుగా కనిపిస్తుంది. ఒక పండితుడి కష్టం ఇంకో పండితుడికి గానీ అర్థంకాదంటారు. ఇది పచ్చి అబద్ధం. ఒక పండితుడికి ఇంకో పండితుడికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. కానీ ఒక మందుప్రియుడి బాధను ఇంకో మందుప్రియుడు అర్థం చేసుకోగలడు. అందుకే పద్యపరిశ్రమ ముసిముసినవ్వులతో 'పెగ్గు'లొలకబోస్తుంది. 'బుడ్డి'మంతులు పెరిగే కొద్దీ కొత్తఅందాలను చిందిస్తుంది.
'కదిలేదీ కదిలించేదీ కవిత్వం' అనేదీ అబద్ధమే. మహా అయితే కవిత్వం జనాన్ని సభల్లోంచి బయటికి కదిలిస్తుందేతప్ప, అంతకుమించి సాధించేది లేదు. నిజానికి కదిలేదీ కదిలించేదీ మద్యమే. చిక్కని చుక్క గొంతులో పడిందంటే 'చుక్కలే హద్దు' అనిపిస్తుంది. కనిపించినవాడినల్లా 'విస్కి'ంచాలనిపిస్తుంది! మహాభారతం నుంచి ఎంకిపాటల వరకు అన్నీ కంఠస్థమైపోతాయి. అన్నీ రాగయుక్తంగా బయటపడతాయి. మద్యప్రియుడికి సొంతరాజ్యాంగం తయారవుతుంది. సరికొత్త వాక్‌స్వాతంత్య్రం వస్తుంది. కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. నిజంగా కుండలు బద్దలు కొట్టేస్తాడు. దాంతో భరతనాట్యం, కూచిపూడి, క్యాబరే వంటి డ్యాన్సులన్నీ మద్యప్రియుల అడుగులకు మడుగులొత్తుతాయి. అందువల్లనే పల్లెలకు పల్లెలు తాగుతున్నాయి. తూగుతున్నాయి.
పిచ్చిమహాత్ముడు గాంధీజీ 'కల్లుమానండోయ్ బాబూ కళ్లు తెరవండోయ్' అన్నాడు. అందులో ప్రజాసేవ ఏముంది? ఆయన వారసులు 'కల్లు తాగండోయ్ బాబూ కళ్లు మూయండోయ్' అంటున్నారు. ఇందులో ప్రజాసేవ ఉంది.
'తాగితే మరిచిపోగలను
కష్టసుఖాలను
తాగనివ్వరు' -
అని మద్యనిషేధం రోజుల్లో ఎంతమంది మందుబాబులు బాధపడ్డారు? మీచేత తాగించి మీ కష్టాలను మాన్పిస్తున్నాం, అంతకన్నా మీకేం కావాలని ప్రభువులు వూరిస్తుంటే-
'ఔను నిజం ఔను నిజం
మీరన్నది నిజం నిజం'
అంటున్నారు. అంతా పాత గాంధీ చెప్పినట్టే జరిగితే- కొత్త గాంధీలు ఎందుకసలు?
గాంధీజీ ఖద్దరు కట్టమన్నాడు. వీళ్లు అక్కర్లేదంటున్నారు. గాంధీజీ మద్యం తాగొద్దన్నాడు. తాగితే తప్పేముంది అంటున్నారు కొత్తగాంధీలు. టోపీ పెట్టుకోవయ్యా అన్నాడు పాతగాంధీ. 'టోపీ నీవు పెట్టుకోకు ఇతరులకు పెట్టు' అన్నది కొత్తగాంధీల అంతరంగం.
'తాగేవాడే కడతాడు తాళ్లపన్ను!' అన్నది సామెత. తాగనివాళ్లకోసం తాగేవాళ్లు ఎంత కష్టపడుతున్నారో తలచుకుంటే త్యాగాల 'సారా'ంశం బోధపడుతుంది!
'షరాయి వీడిపోతున్నా
తాను వైస్రాయిననుకుంటాడు
తాగుబోతు' -
అని ఒక కవి రాశాడు.
ఎన్ని ఉపనిషత్తులైనా 'మందోపనిషత్తు' ముందు బలాదూరే! తాగుబోతు ప్రత్యేకత అటువంటిది. ''మగువ పొలుపు దెలుపు నొక్క మారుతమొలసెన్'' అని మనుచరిత్రలో రాసి అల్లసాని పెద్దన మురిసిపోయాడు. వాసనామయ ప్రపంచాన్ని గురించి అద్భుతంగా రాశానని అనుకున్నాడు. దాందేముంది? మందు కొట్టివస్తుంటే అతగాడి జాడ ఎవరూ చెప్పనక్కరలేదు. అతగాడినుంచి వచ్చే 'పరిమళమే' జీవిత కథను 'రస'వత్తరంగా చెబుతుంది.
పదండి 'మందు'కు
పదండి తోసుకు
పోదాం పోదాం
పైపైకి'
అంటూ ముందుకు తోస్తుంది. ద్రవప్రస్థానం రుచిచూపిస్తుంది.
(Enadu.25:12:2007)
-----------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home