తల్లివేరు కోసం తపిస్తున్న పిల్లవేర్లు
తెలుగునేల మా అమ్మ వూరంటున్న గిరిపుత్రులు.
అలెక్స్ హెలీ 'ద రూట్స్'(తెలుగు అనువాదం 'ఏడుతరాలు') నవలలోలాగా- గాంబియా దేశం నుంచి నీగ్రో బానిసలుగా అమెరికాకు బలవంతంగా ఎగుమతిఅయిన కుంటాకిటేలు కారు వారు. ముస్లింల దండయాత్రలతో స్వదేశం పర్షియా(ప్రస్తుత ఇరాన్)ను వీడి భారత్‌కు పారిపోయి వచ్చిన పార్శీలూ కారు. బానిసత్వమో, దండయాత్రలో వీరిని తరిమేయలేదు. కానీ పురిటిగడ్డను వీడి దేశంకాని దేశం చేరారు. ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో వీరికే తెలియదు. తరాలు మారాయి కాబట్టి తాము ఏ ప్రాంతం నుంచి వచ్చామో నేటితరం ఎరుగదు. వారు గుర్తుంచుకున్నదల్లా... ఎన్నితరాలు మారినా, మారని వారి భాష. ఆంధ్రరాష్ట్రంతో పేగుబంధాన్ని గుర్తుకుతెచ్చే తేటతెనుగు భాష. వారు ఆంధ్రులు అనడానికి ఆ ఒక్క రుజువు చాలు. దాదాపు 400 పైచిలుకు ఏళ్లకిందట శ్రీలంకకు చేరిన తెలుగు బిడ్డల యథార్థ జీవనగాథ ఇది. ఆదరిస్తే ఆంధ్రకు వచ్చేస్తామంటున్న తెలుంగు గిరిపుత్రుల భావోద్వేగానికి అక్షర రూపమే ఈ కథనం. -చామర్తి మురళీధర్
వీడని మమకారం
పాములు, కోతులు ఆడిస్తూ...
శ్రీలంక జనజీవనంలో కలిసిపోయినప్పటికీ... వందల ఏళ్లుగా వీరు తెలుగే మాట్లాడతారన్న సమాచారాన్ని తెలుసుకున్న న్యూస్‌టుడే ప్రతినిధి వారిని కలిసేందుకు శ్రీలంకకు వచ్చారు. కొంత కష్టమ్మీదైనా వారిని కలువగలిగారు. వారి జీవనాన్ని పరిశీలిస్తే.. ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంచార జీవనం గడిపే ఈ గిరిజనుల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే. పాములు, కోతులు ఆడిస్తూ, జోతిష్యం చెప్పే వీరు శ్రీలంకలో విలక్షణంగా కనిపిస్తారు. నిరుపేదలైన వీరు వారం రోజులకు మించి ఎక్కడా స్థిరంగా ఉండరు.
అక్కడక్కడ విసిరేసినట్లు..
మాది తెలుంగ జాతి
కొలంబోకు 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న తముత్తేగమలో 80కి పైగా తెలుగు జిప్సీ కుటుంబాలున్నాయి. 'మీ జాతి పేరేమిటి? అని ప్రశ్నించగా... 'మాది తెలుంగ జాతి' అని జిప్సీ నాయకుడు నటరాజ చెప్పారు. 'నువ్వు యాడ నుంచి వచ్చావ్. నీ భాష సక్కగా ఉంది? నీలా మాట్లాడేవాళ్లు ఎక్కడుంటారు? ఎంత మంది ఉంటారు?' అని అతను ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇళ్లల్లోని వారు పరుగున వచ్చి చుట్టుముడితే.. ఆడవాళ్లు సిగ్గుపడుతూ.. ఆసక్తిగా చూస్తుండిపోయారు. వీరు మాట్లాడే తెలుగులో అక్కడక్కడా సింహళీ మాటలు వినిపిస్తాయి. 'మనోళ్లు కలిసినప్పుడు.. ఇంట్లో తెలుంగు మాట్లాడతాం' అని ఆనంద్ అనే యువకుడు చెప్పుకొచ్చారు. వీరి పిల్లలకు పెట్టే పేర్లు చాలా వరకు తెలుగువే కనిపిస్తాయి. అక్కడక్కడా మాత్రం తమిళ పేర్లు ఉంటాయి. ఆచార వ్యవహారాలు దాదాపు తెలుగు వారిని పోలి ఉన్నా.. ఆరేళ్లు కిత్రం వీరిలో అధిక భాగం మతం మార్చుకోవడంతో వీరి సంప్రదాయాల్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు.
శ్రీలంక ఎందుకొచ్చారు?
వీరు ఆంధ్రదేశం నుంచి శ్రీలంకకు ఎందుకు వచ్చారన్నది పెద్ద ప్రశ్న. కొద్దిమంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ తెగ శ్రీలంక రాకపై పరిశోధన చేసినా ప్రయోజనం లేకపోయింది. 'ఇప్పటికీ అహుకుంటికలు ఎప్పుడు.. ఎందుకు వచ్చారన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. సుమారు 400 ఏళ్ల కిందట శ్రీలంకకు వచ్చి ఉండవచ్చు' అని యూనివర్సిటీ ఆఫ్ పేరాదెనియాకు చెందిన ప్రొఫెసర్ హెర్త్ చెప్పారు. ఈ జాతిపై తమిళనాడుకు చెందిన ఎం.డి.రాఘవన్ విస్తృతంగా పరిశోధనలు చేసినట్లు ఆయన తెలిపారు. బ్రిటీష్ కాలానికి ముందు వ్యవసాయం, చేపలు, గొర్రెల పెంచే వారిని శ్రీలంకకు తరలించారన్న కథనం కూడా ఉంది. 'అలా అయిన పక్షంలో పాములు ఆడించే వృత్తి ఎందుకు వచ్చింది?' అన్న ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతారు.
సేతు దాటారా?
తెలుంగు జాతికి చెందిన నటరాజ్ మాత్రం తమ పూర్వీకుల రాకపై మరో కథనాన్ని వినిపించారు. తాను చెప్పే విషయాలన్నీ తన ముత్తాత చెప్పారంటూ... 'మా పూర్వీకులు గొర్రెల వ్యాపారం చేసేవారట. అలా సముద్రం దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాటిని అమ్మాక అనుకోకుండా ఏర్పడిన ప్రకృతి విపత్తుతో వాళ్లు చిక్కుకుపోయారు. మళ్లీ సముద్రం గుండా తిరిగి వెళ్లలేకపోయారు' అని తెలిపాడు. రామసేతు మీదుగా వచ్చారా? అని అడిగితే... అదేంటి? అని అతను ఎదురు ప్రశ్నవేశాడు.
ఆంధ్రలో ఎక్కడివారు?
వీరు ఆంధ్రప్రాంతంలో ఏ తెగకు చెందిన వారన్న దానిపై కూడా పరిశోధనలు జరిగాయి. అహుకుంటికలుగా పేర్కొనే వారిలో ముఖ్యంగా కురవ, వడ్డెర, ఎరుకల తెగకు చెందిన వారున్నారనిశ్రీలంకలోని సామాజిక శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తెగలోని కొందరు తాము 'కురవ, వడ్డెర' అని చెబుతారు. ఆసక్తికర అంశమేమంటే.. ఈ రెండు వర్గాలు కలిసిఉండరు సరికదా... వీరుండే ప్రాంతాలు సైతం వేర్వేరుగా ఉంటాయి. విజయనగరం.. శ్రీకాకుళం ప్రాంతాల్లోని ప్రజల యాసకు దగ్గరగా వీరి భాష ఉంటుంది.
మేం రావచ్చా?
పుత్తళంలోని కొద్దిమంది మాత్రం- 'సముద్రం అవతల మనలాంటోళ్లే ఉన్నారు' అని తమ పెద్దవాళ్లు చెప్పేవారన్నారు. వీరెవరికీ చదువుకోకపోవడంతో బాహ్యప్రపంచానికి సంబంధించిన అంశాలపై పెద్దగా అవగాహన లేదు. 'అక్కడి వాళ్లు అంగీకరిస్తే మేమందరం అక్కడికి వచ్చేస్తాం' అని వారు ఆశగా కోరారు. మీరు పుట్టిన ఊరు ఇదేగా అని ప్రశ్నిస్తే... 'అది మా అమ్మ ఊరు కదా' అని బదులిచ్చారు. తమ పిల్లలు సింహళి నేర్చుకుంటున్నా... తెలుగు మాట్లాడటానికే ఇష్టపడతామని తల్లిదండ్రులు చెప్పారు. పై చదువులు చదివినా తెలుగును మాత్రం వదిలేది లేదని పిల్లలు చెప్పారు. ''అమ్మ భాషను వదిలేస్తే చెడు జరుగుతుంది'' అని అన్నారు. తెలుంగుల ఆనందం... ఉద్వేగాన్ని స్వయంగా చూసిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి స్పందిస్తూ... ''దయచేసి మా వారిని మా నుంచి దూరం చేయరుగా'' అని ప్రశ్నించడం వింతగొలిపింది. ఆయనకు సహాయకురాలిగా పనిచేసే... అరవై రెండేళ్ల సరత్‌సీలీ అనే సింహళీ మహిళ... ''అహుకుంటికలు మా దేశ సంస్కృతిలో ఓ భాగం. మేం వాళ్లను విడిచి ఉండటానికి ఏ మాత్రం సిద్ధంగా లేం. అందుకు సమ్మతించం కూడా'' అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించడం విశేషం.
కబడ్డీ బాగా ఆడతారు
తముత్తేగమలో అహుకుంటికల పిల్లల కోసం ప్రభుత్వం ఓ పాఠశాలను ఏర్పాటుచేసింది. ఆ స్కూల్‌కి కోచ్ లేరు. కానీ 2005లో దేశవ్యాప్తంగా జరిగిన అండర్ 16 స్కూల్ స్థాయి కబడ్డీ పోటీలో రన్నర్స్‌గా నిలిచారు. ప్రత్యేకత ఏమంటే... పోటీలకు ముందు ఈ జట్టులోని క్రీడాకారిణులు ఎవరూ పట్టుమని నాలుగు రోజులు కూడా సాధన చేయలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకుండానే... దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న పాఠశాల అయిన తక్షశిలపై ఫైనల్స్‌లో ఆడారు.
మాటలన్నీ మనవే
ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతంల్లో వాడే చాలా మాటల్ని వీరు వాడుతుంటారు. కూడు, ఆడది...మొగుడు, అబ్బ, సారం, బొత్తాం, పురచేయి, మాను, టెంకాయ, అంగడి, తల్లితాయి, మెంచులు, ఎంటికతాళ్లు, రిబ్బన్, రోజా, ముక్కర, కాలిగొలుసు, పోయేసిరా(వెళ్లిరా) మొదలైన మాటల్ని వాడుతున్నారు..
అంతరించిపోతున్నారు!
చదువుకోవటం, మతం మారటం, సింహళీయుల్ని పెళ్లాడటంలాంటి కారణాల వల్ల రానున్న కొన్నేళ్లలో అహుకుంటికల జాతి అదృశ్యం అయ్యే అవకాశం ఉందని ఓ సామాజిక శాస్త్రవేత్త విశ్లేషించారు. ''అరుదైన ఓ జాతి అంతరించిపోవడానికి దాదాపు రంగం సిద్ధమైనట్లే. మారిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చదువు సంధ్యల అలవాట్లతో రాబోయే పాతికేళ్లలో ఈ జాతి ఉనికి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. గతంలో కొన్ని జాతుల విషయంలోనూ ఇలాగే జరిగింది'' అని ఆయన ముక్తాయించారు.
(Eenadu, 10:12:2007)
_______________________________
Labels: Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home