ముద్దు - ముఖారవిందం
పార్కులో నడుస్తూ, వర్షంలో సరదాగా తడుస్తున్నారిద్దరూ. అతడు తడిసి 'ముద్ద' అయ్యాడు. ఆమె తడిసి, అతనికి 'ముద్దు' అయ్యింది. 'బాకీలుంచుకోవడం మా ఇంటా వంటా లేదు... నీ బాకీ ఇప్పుడే తీర్చేస్తాను' అని అబ్బాయి ముచ్చటపడ్డాడు. 'ఏం బాకీపడ్డావు' అని అమ్మడు అమాయకంగా అడిగింది. 'ఇందాక నాకో ముద్దు ఇచ్చావుగా. దాన్ని తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నాను'. 'సంతోషించాం గాని అంతకుముందు దానికి నేను బదులు తీర్చిన బాపతది. ప్రస్తుతం మన మధ్య బాకీలేమీ లేవు' అందామె. 'ముమ్ముమ్ముద్దంటే చేదా...' అంటూ అతగాడు అందంగా పాట అందుకుంటే- 'మోజేగాని ప్రస్తుతం నాకా ఉద్దేశం లేదు బాబూ' అని పల్చని వచనంలో గడుసుగా దాటవేసింది అమ్మడు.
శృంగార రసయాత్రలో ముద్దుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. 'వలపు పాటకు తొలకరి, జీవిత తరుశాఖాశిఖపై విరిసిన తొలివిరి... నాలుగు పెదవులు పలికే మౌన మంత్రాక్షరి' అంటూ తొలిముద్దు మహిమను వర్ణించారు ఖలీల్ జిబ్రాన్. మన్మథ సామ్రాజ్యంగా మారిన మనసులో ప్రవేశార్హతకు తియ్యని ముద్దే అనుమతి పత్రం. శృంగార రసోద్దీపనకూ ముద్దే తొలిమెట్టు. 'రాత్రిలో కూడా నీ పెదవులానిన ప్రాంతమంతా తూర్పులా ఉదయిస్తుంది' అని 'స్పర్శానురాగాన్ని' ఆలాపించారొక ఆధునిక కవయిత్రి. 'మదనార్తి జ్వరతీవ్రతకు మందేమిటయ్యా?' అంటే- 'ఏముందీ! అధర చుంబనం అనుపానమున్నూ, గాఢాలింగనం పథ్యమూను'' అన్నాడొక వైద్యశిఖామణి. 'అడగక ఇచ్చిన ముద్దే ముద్దు' అని ఓ కవి భావిస్తే- 'సరేగాని, అడిగినా ఇవ్వని ముద్దుంటే అది ఇంకా ముద్దుగా ఉంటుంది... ఆలోచించి చూడండి' అన్నారొక ప్రముఖ హాస్యరచయిత. 'ఇచ్చే ముద్దు రుచి, ఇప్పించుకున్నది రుచిన్నర, ఒప్పుకోని ముద్దు రుచిమ్ముప్పావు' అని సిద్ధాంతం చేశారాయన. 'పక్కింటాయన్ని చూడండి, రోజూ ఉద్యోగానికి బయలుదేరేముందు వాళ్ళావిణ్ని ముద్దాడిగాని గుమ్మం దిగడు... మీరూ ఉన్నారెందుకూ!' అని ఇల్లాలు అర్ధోక్తిగా సూచిస్తే- 'అవును! నాకూ అలా చేయాలని ఉందిగాని, ఆవిడ ఒప్పుకోదేమోనని అనుమానం'' అని బదులిచ్చాడు- రుచిమ్ముప్పావు ముద్దును ఊహించుకుంటూ ఇంటాయన. నెత్తిన ఒక్క చరుపు చరిచి పారిపోయిన గిరీశం వైపు రామప్పంతులు తెల్లబోయి చూస్తుంటే 'నీ మగతనం ఏడిసినట్లే ఉంది' అని పస్తాయించిన పూటకూళ్లమ్మలా 'చాల్లే సంబడం' అని నిట్టూరుస్తూ తలుపేసుకుందా ఇంటావిడ!
'మోముమోమున ఆనించి ముద్దూ ముచ్చటలాడబోవగా...' తరవాత ఏం జరిగిందో జావళీ పాడుతుంది 'ముత్యాలముగ్గు'లో కాంట్రాక్టరు పురమాయించిన పడుచుపిల్ల. శ్రీనాథుడూ అంతే! 'ముద్దిడు నీ నంబి పడుచు ముచ్చట తీరన్' అంటూ మొదలుపెట్టి, '...మృదుకేళి శయ్యల శుభాంతర్గ గేహంబులుందంబూలీదళ భాగ పూరిత ముఖుల్ ధన్యాత్మ కుల్మీత కాలంబెంతేనియు, నిద్రవోదురు నిశల్ సంభోగ నీలావధిన్'' అంటూ చివరికి ఏం జరుగుతుందో వర్ణించాడు శివరాత్రి మహాత్యంలో. దానికితోడు పెద్దన వర్ణించిన కప్పురవిడెము కూడా తోడైందా, ఇక ఆ ముద్దు మజాయే వేరు. 'పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవింద తాంబూలము మోవి మోవిపయి మోపుచు రాధికకిచ్చు' ధూర్త గోపాలుని సైతం వదిలిపెట్టలేదు కవిసార్వభౌముడు తన భీమఖండంలో. 'ముద్దు'పళని తరహాలో అద్వైత స్థితిని అనుభూతి పూర్వకంగా గ్రహించిన రచయిత ఆర్.ఎస్. సుదర్శనం 'బంధమనుబంధమైన చుంబనము తోడ నేను నీవైతి నీలాలనింగినీడ' అంటూ ఆ అనుభూతిని తలచుకున్నారు. సాహిత్యంలో ఒకరని కాదు, సంస్కృతాంధ్రాల్లో ఎందరో కవులు ముద్దును సృశించినవారే. సంస్కృత కవి జయదేవుడు సహా ముద్దును తమ కావ్యాల్లో ఇముడుస్తూ వచ్చారు. నంది తిమ్మన తన ప్రబంధనాయికను ముద్దుముద్దుగా ఏడ్పించాడు కూడా. రసజ్ఞత కలిగిన కవులకు స్త్రీల ఏడుపులోనూ ముద్దూమురిపెం తోచాయన్నది గమనించాల్సిన విషయం.
కాలంలో ఎన్ని మార్పులొచ్చినా ప్రజల్లో ముద్దుపట్ల మోజు తరగనే తరగదనిపిస్తుంది- బ్రిటన్‌లో నిర్వహించిన ఒక సర్వే నివేదికను గమనిస్తే! పద్దెనిమిదేళ్లు దాటిన వెయ్యిమందికిపైగా మహిళలపై సౌందర్య సాధనాల ప్రముఖ సంస్థ ఒకటి తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో 'ముద్దే' మాకు అందం... దానికే మా మొదటి ఓటు' అని బ్రిటన్ మహిళలు విస్పష్టంగా ప్రకటించారు. గాఢ చుంబనం కారణంగా ప్రేయసి మొహంలో అందం విరబూస్తుందని పరిశోధనల్లో తేలినట్లుగా ఆ సంస్థ ప్రతినిధి నిక్‌లాంగ్ వెల్లడించారు. లోదుస్తులు, కొనుగోళ్లు, చివరికి లైంగిక కార్యకలాపాలకన్నా ముద్దుకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆ మహిళలు తేల్చి చెప్పారు. మధురవాణి చర్యల్ని ఒక కంట కనిపెట్టమని రామప్పపంతులు లంచమిచ్చి మరీ, కొండుభొట్లును నియమిస్తే వాడు మధురవాణితో లాలూచీ అయ్యి ఆమె రహస్యం కాపాడినప్పుడు, తియ్యని ముద్దు బహుమానంగా ఇస్తుంది. అప్పుడు కొండుభొట్లు ఆనందంతో గంతులు వేస్తాడు. గుర్తుందా! ఆ మాదిరిగా నచ్చిన మగాడు తమ అధరాలపై గాఢంగా ముద్దు పెట్టుకోవడం కారణంగా తాము ఆకర్షణీయంగా ఉన్నామన్న భావన కలుగుతోందని బ్రిటన్ మహిళలు చెబుతున్నారు. ''దీని ద్వారా ఆత్మవిశ్వాసానికి మహిళలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకున్నాం'' అని ఆ సంస్థ సంబరపడుతోంది. వనితల మొహాల్లో వసంతాలు విరబూయాలంటే మగవారు ఏం చెయ్యాలనేది ఈ సర్వే వల్ల మరోసారి రుజువుకావడం చాలామందికి ముచ్చట గొలుపుతోంది.
(Eenadu, 23:12:2007)
__________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home