వివేకానంద మాటలు
''జీవితంలో అందమైన మలుపు ఇది. బతుకును పూలతేరుగా పేర్చుకున్నా ముళ్లబాటగా మలుచుకున్నా పునాది పడేది ఇక్కడే. బడి గడపలు దాటి కాలేజీ గేటులోకి అడుగిడే మధుర క్షణాల నుంచి సమాజంలో ఓ వ్యక్తిగా మనకంటూ గుర్తింపును సాధించే వరకూ ఎన్నో మలుపులు... మరెన్నో మార్పులు. నా ఆశలన్నీ యువతరం పైనే. వారే ఆశయ సాధకులు'' అనే స్వామి వివేకానంద మాటలు యువతకు ఎప్పటికీ ఆచరణీయాలే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉండాలనే ఆయన యువత కోసం ఎన్నో 'ఆయుధాలు... నైపుణ్యాలు' సూచించారు. వాటిల్లో కొన్ని మీకోసం.
* అందరూ నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఒకటుంది. ఎవరినీ నిందించకండి. ఎవరి పైనా నెపం వేయకండి. దేనికైనా మీరే కారకులని గుర్తించండి. అదే నిజం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
* ఇది గ్రహించండి. అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళే ఆపదలో పడతారు. గౌరవాన్ని కోల్పోతామని భయపడేవాళ్ళే అవమానానికి గురవుతారు. నష్టాలకు బెదిరిపోయే వాళ్ళే అన్నీ కోల్పోతారు.
* మనని అజ్ఞానులుగా మార్చేది ఎవరు? మనమే. మన చేతులతో మనమే కళ్ళు మూసేసుకుని అంతా చీకటిగా ఉందని ఏడుస్తున్నాం.
* ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే జీవితం చేసుకోండి. దాని గురించే ఆలోచించండి. కలలు కనండి. దానిపైనే బతకండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి భాగమూ ఆ లక్ష్యంతో నిండిపోనివ్వండి. అదే విజయానికి దారి.
* ప్రేమ... డబ్బు జ్ఞానం.. చదువు... దేనికోసమైనా సరే అదే లక్ష్యంగా తపన పడేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుం పట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.
* ఆత్మవిశ్వాసం లేకపోవడం క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తులు జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మ విశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకంలేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.
* అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం... ఇవే మనకు కావాలి. వీటితోనే మనం ఏదైనా సాధించగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.
* ఎవరికో బానిసలా కాకుండా యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అదే నిన్ను యజమానిని చేస్తుంది.
* మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ, ఇనుప కండరాలూ కావాలి. మేథస్సుకు చదువులా... శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంట పూజ చేసేకన్నా ఫుట్‌బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం. బలహీనతే మరణం.
* వెళ్లండి ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యథను తుడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణంకూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం... కలహం కాదు.కోరుకోవాల్సింది సృజన... విధ్వంసం కాదు. కావాల్సింది శాంతి, సమన్వయం. సంఘర్షణ కాదు.
(Eenadu, 12:01:2008)
______________________________________
Labels: Self development, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home