విప్లవ శ్రీశ్రీ ప్రేమ కవిత్వం
''క్రిష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు.
క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ'' - ఇది చలం మహాప్రస్థానానికి ఇచ్చిన యోగ్యతా పత్రం సారాంశం.
చలం శ్రీశ్రీని పొగడడం బాగుందిగానీ కృష్ణశాస్త్రిని వేలెత్తి చూపడమెందుకు? ప్రేమ కవిత్వం రాసినందుకేగా కృష్ణశాస్త్రి మాట పడింది. శ్రీశ్రీ మాత్రం ప్రేమ కవిత్వం రాయలేదా? ఎందుకు రాయగూడదు. విప్లవకారులు ప్రేమించకూడదు. ప్రేమికులు విప్లవ కవిత్వం రాయకూడదా? విప్లవమూ ప్రేమ రెండూ విరుద్ధమైన విషయాలేం కాదే: శ్రీశ్రీ ప్రేమగీతాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
''నీ తలపున రేకులు పూస్తే
నా వలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం
స్వర్గానికి నిచ్చెనవేస్తాం'' అంటారు. ఆమె హసనానికి రాణి అట: ఆయనకేమో వ్యసనానికి బానిస అట!
''నీ మోవికి కావినినేనై
నా భావికి దేవివి నీవై
నీ కంకణ నిక్వాణంలో
నా జీవన నిర్మాణంలో-
ఆనందం ఆర్ణవమైతే
అనురాగం అంబరమైతే -
ప్రపంచమును పరిహసిస్తాం
భవిష్యమును పరిపాలిస్తాం''
అంటారు శ్రీశ్రీ. ఈ గేయం రాసినందువల్ల శ్రీశ్రీ విప్లవతత్వం ఏమైనా దెబ్బతిన్నదా? శ్రీశ్రీయే, స్వయంగా 'వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనస్సు' అని కూడా అన్నారు.
విప్లవమూ, ప్రేమా ఢీకొంటే వచ్చే కవిత్వం కాస్త వెరైటీగా ఉంటుంది. దానికీ శ్రీశ్రీ రాసిన 'మంచి ముత్యాల సరాలు' అనే గీతమే ఉదాహరణం.
ఇందులో ఆయన
ఎర్రశాలువ కప్పుకొని మా ఇంటికొచ్చిందొక రివాల్వర్
బాధలో బెంజైన్ సీసా
ప్రేమలో డైమాన్ రాణీ అని రాశారు.
ఆ ప్రేయసి కూడా సామాన్యమైన వనితకాదు.. చిచ్చర పిడుగు.
'నన్ను తిట్టిన తిట్లతోనే
మల్లెపూవుల మాలకట్టెను
నాకు వ్రాసిన ప్రేమ లేఖలు
పోస్టు చేయుట మానివేసెను' అని రాశాను.
పోస్టు చేయుట మానివేసెను' అని రాశారు. పోస్టు చేయడం మానబట్టి సరిపోయింది. కొంపతీసి పోస్టుచేసి ఉంటే శ్రీశ్రీ ఇలా కవిత్వం రాయగలిగేవాడా?
శ్రీశ్రీ విప్లవ గీతాల్లో ఎంత స్పెషలిస్టో ప్రేమగీతాల్లో అంత కంటె ఎక్కువ స్పెషలిస్టు. జేమ్స్ జాయిస్‌కు ఇమిటేషన్‌గా రాసిన ఈ ప్రేమ గీతం చూద్దాం.
''ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది
ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే
ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది''
అంటూ ప్రేమ మయమైన గీతం రాశారు.
ప్రేమికులకు శ్రీశ్రీ బోలెడు ఉదాహరణలు కూడా ఇస్తారు.
''నర్సు కొత్త డాక్టర్‌ను ప్రేమిస్తుంది
14 నం. కనిష్టీబు మేరీకెల్లీని
ప్రేమిస్తాడు
హంటర్‌వాలా హంటర్‌వాలీని ప్రేమిస్తాడు
మనవాళ్లయ్య వాళ్ల వాళ్లమ్మను
ప్రేమిస్తాడు
సరోజాబాయి సైకిలు మీద వచ్చిన
కుర్రాణ్ని ప్రేమిస్తుంది''
అంటూ పెద్ద చిట్టా విప్పుతాడు. చివరకు 'భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు' అని ముక్తాయింపు ఇస్తాడు.
ఇవన్నీ చూస్తుంటే ప్రేమ ఎవరికీ అస్పృశ్యం కాదని అనిపించడంలో వింతేముంది?
- శంకరనారాయణ
(Eenadu, Saahityam
http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha295.htm )
______________________________________
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home