My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, March 14, 2008

అత్యాచారాల్లో అగ్రస్థానం

పరమశివుడు పార్వతీదేవిని మనువాడితే బాగుంటుందని సప్తర్షులు సంకల్పించారు. హిమవంతుడితో మాట్లాడి పెళ్లి కుదర్చాలని బయలుదేరారు. శివుడు వారిని పిలిచి- ''పురుషులు ఎందరు వెళ్ళినా చాలదు, వివాహ సంబంధిత శుభకార్యాలకు స్త్రీలు తోడు ఉండాలి. పెళ్ళి పనుల్లో స్త్రీలే కడు నేర్పరులు... ప్రాయేణీవం విధేకార్యే పురంధ్రీణాం ప్రగల్భతా... ఒక మహిళను వెంట పెట్టుకుని మరీ వెళ్ళండి'' అని కోరాడు. దాంతో సప్తర్షులు అరుంధతిని తమతో తీసుకునివెళ్ళి, పని చక్కబెట్టుకొచ్చారు. వారి సంకల్పం దిగ్విజయంగా నెరవేరిందని 'కుమారసంభవం'లో మహాకవి కాళిదాసు వర్ణించాడు. భారతీయ సంస్కృతిలో స్త్రీమూర్తికి లభించే స్థానమెంతటిదో ఆ ఘట్టం వివరిస్తోంది. తల్లిని తొలిగురువుగా, దైవస్వరూపంగా పూజించే ఆచారం మనది. మాతృదేవోభవ అని పూజ్యుల్లోనూ స్త్రీకి మొదటిస్థానమిచ్చి గౌరవించిన సంప్రదాయం మనది. లక్ష్మీనారాయణులు, పార్వతీపరమేశ్వరులు, సీతారాములు.... ఇలా పిలుపుల్లో సైతం మహిళలకు అగ్రతాంబూలం సమర్పించిన జాతి మనది. భారతీయ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ఆధారపీఠంగానిలిచి, వాటిని సజీవంగా నిలిపిన ఘనత మగువలకు దక్కుతుంది. ఇంటికి దీపం ఇల్లాలే! పూజాపునస్కారాల విషయంలోను, పెట్టుపోతల సందర్భంలోను, గృహనిర్వహణలో, సంతానాన్ని మంచిపౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో... స్త్రీలపాత్ర ఎంతటిదో అనుభవం అయితేనే తెలుస్తుంది. అలాంటి అనుభవజ్ఞులు స్త్రీలను తప్పక పూజిస్తారు, ఎంతో గౌరవిస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవం పొందుతారో అక్కడ దేవతలు స్థిరపడతారు- 'యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవతాః'. దేవతల నివాసంవల్ల ఆ ఇల్లు కోవెల అవుతుంది. ఇల్లాలు దీపం అవుతుంది. అసారభూతే సంసారే, సారభూతా నితంబినీ... నిస్సారమైన ఈ లోకానికి శోభనిచ్చేది, సారభూతమైనదీ స్త్రీయే, అందుకేగా శివుడు స్త్రీకి సగం దేహం ఇచ్చాడు... అని వర్ణించాడో కవి.

అపురూపమైన స్త్రీత్వం ఇప్పుడు అపచారానికి గురవుతోంది. వాడవాడలా కీచకులు పుట్టుకొస్తున్నారు. దుశ్శాసనులు తయారవుతున్నారు. మాతృవత్‌ పరదారాంశ్చ... పరకాంతలు ఎదురైతే మాతృభావనచేసి మరలిపోయే ప్రహ్లాదులు కరవైపోతున్నారు. పుష్కరతీర్థాల్లో పుణ్యస్నానాలాచరించి, తడిబట్టలతో వస్తున్న ప్రమదలను- ప్రమిదనూనెలో నానిన వత్తులతో పోల్చ
ి ''ప్రమిదలలోన నాని పొలుపొమ్ము వెలార్చెడు దూదివత్తులై, ప్రమదలు గౌతమిన్‌ మునిగివత్తురు'' అని ఆనాడు వర్ణించారు కవులు. ఈనాటి సంఘటనలకు తీవ్రంగా విస్తుపోయి స్వరం మారుస్తున్నారు. ''ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో'' అని తల్లడిల్లుతున్నారు. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదాలను చిత్రిస్తున్నారు. 'ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి' వంటి ప్రబోధాలు ఈ తరానికి తలకెక్కడంలేదు. చంద్రమతి మాంగల్యం ఆమె భర్త హరిశ్చంద్రుడొక్కడికే దర్శనీయం... ప్రతి భారతసతి మానమూ చంద్రమతి మాంగల్యమే సుమా... అని తడిగుండెతో చేస్తున్న విజ్ఞప్తులు చెవినపడటం లేదు. 'అర్ధరాత్రి స్త్రీ నిర్భయంగా వీధిలో తిరగగలిగిన రోజున ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు' అని ఆశపడిన మహాత్ముడి కల నెరవేరే అవకాశం కనపడటంలేదు. 'గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య వా' అని రావణుడు దేవభాషలో చెప్పిన తన అవలక్షణాలను ''పరాయి స్త్రీలను అపహరించడం, బలాత్కరించడం''గా తెలుగులో స్పష్టంగా అర్థం చేసుకుని రావణుని అనుసరిస్తున్న రాక్షసమూకలు పెరిగిపోయాయి. శ్రీశ్రీ మిత్రుడైన జగన్నాథ్‌ అనే దర్శకుడు 'ద్రౌపదీ మానసంరక్షణం' పేరుతో విడుదలచేసిన చిత్రం ఘోరపరాజయం పాలైన రోజుల్లోనే దానికి పోటీగా వచ్చిన 'ద్రౌపదీ వస్త్రాపహరణం' ఘనవిజయం సాధించింది. శ్రీశ్రీ దానిపై స్పందిస్తూ ''ప్రజలు మానసంరక్షణం వద్దన్నారు... వస్త్రాపహరణమే కావాలన్నారు వారికి'' అని దెప్పిపొడిచారు. అది మన జాతిలక్షణం కాకూడదని అప్పట్లో పెద్దలు దూరం ఆలోచించారు. బి.ఎన్‌.రెడ్డివంటివారు తమ చిత్రాల్లో తగుజాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. లేకపోతే ఆంధ్రదేశంలో ఆడపడుచుల మానమర్యాదలకు భంగం కలుగుతుందని భయపడ్డారు.

ఇటీవల వెలుగుచూస్తున్న వాస్తవాలను గమనిస్తుంటే వారి భయం నిజమైందని రుజువవుతోంది. 2006 నేరరికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం భారతదేశంలో గంటకు 18 మంది మహిళలు ఎన్నోరకాలుగా బాధితులవుతున్నారు. గంటకు రెండు అత్యాచారాలు, రెండు అపహరణలు, నాలుగు వేధింపులు- భర్త, బంధువుల చేతుల్లో ఏడు గృహహింస సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటితోపాటు మరికొన్ని నేరాలు మహిళల పాలిట శాపాలవుతున్నాయి. జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్‌.సి.ఆర్‌.బి.) విడుదలచేసిన నివేదికలోని ఈ వివరాలు నివ్వెర పరుస్తున్నాయి. మహిళలపై నేరాల్లో మన రాష్ట్రం 21,484 కేసులతో అగ్రస్థానంలో ఉంది. 2006లో జరిగిన నేరాల్లో 13శాతం మనరాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. 9.9శాతంతో ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. కారణాలు ఏమైతేనేం- అత్యాచారాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉండటం చాలా సిగ్గుపడాల్సిన విషయం. నగరాల విషయానికొస్తే 4134 సంఘటనలతో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిస్తే, 1755 దుర్ఘటనలతో మన భాగ్యనగరం నేరప్రపంచానికి రెండోవేదికగా ఎదిగింది. ఈ అత్యాచార, అఘాయిత్య ఘటనల్లో నిందితులు ఎక్కువమంది బాధితులకు పరిచయస్తులే కావడం మరీ ఘోరం. స్నేహితులు, ఇరుగుపొరుగువారు, బంధువుల బారినపడి అపచారాలకు గురైనవారే పెద్దసంఖ్యలో ఉన్నారు. 71.5 శాతంగా వారిసంఖ్య నమోదు కావడం దిగ్భ్రాంతపరుస్తోంది. అకారాది పట్టికలోనే కాకుండా అత్యాచారాల్లో సైతం ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండటం జాతికే తలవంపులు!

Labels:

0 Comments:

Post a Comment

<< Home