జెండా వూంచా... రహే హమారా..
పూర్వకాలంలో వీరుల రథాలకు పైన జెండాలుండేవి. వాటిని ధ్వజాలనేవారు. ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేక చిహ్నం ఉండేది. ఆయా ధ్వజ చిహ్నాలతో కలిపి వీరులను సంబోధించడం పరిపాటి. భీష్ముడు- తాళధ్వజుడు, అర్జునుడు- కపిధ్వజుడు అలా... రణరంగంలో తీవ్రమైన పోరు జరిగే సమయంలో వీరులను గుర్తుపట్టేందుకు వారి రథాలపై ఎగిరే జెండాలే ఆధారం. ఫలానా వీరుడితో పోరాడాలి, రథం పోనిమ్మని రథికుడు ఆజ్ఞాపించేవాడు. వారి టెక్కెపు గుర్తులను సారథి పసిగట్టి, ఆ దిశగా రథం నడిపించేవాడు. భారతం ఉత్తర గోగ్రహణ ఘట్టంలో కౌరవవీరుల రథాలపై రెపరెపలాడే జెండాలను తిక్కన గొప్పగా వర్ణించాడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాడు కలశజుండు... స్వర్ణమయ వేదిక గుర్తుగా ఉన్న జెండా ఎగురుతోందే... ఆ రథంలో అస్త్రవిద్యాగురువు ద్రోణాచార్యులవారు ఉంటారు.. మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి... మణులు కలిగిన మహాసర్పాన్ని సుయోధనుడు తన కేతనానికి చిహ్నంగా పెట్టుకున్నాడని అర్జునుడు మిగిలిన వీరుల ధ్వజ చిహ్నాల గురించీ ఉత్తర కుమారుడికి వివరిస్తాడు. అలా రథాలపై సగర్వంగా ఎగిరే జెండా ఆయా వీరుల శౌర్యప్రతాపాలకు ప్రతీక. పరాక్రమానికి చిహ్నం. పౌరుషానికి సంకేతం. కాలం పుటలపై వీరుల చరిత్రలను లిఖిస్తున్నాయా అన్నట్లుగా జెండాలు రెపరెపలాడుతుంటాయి. వారి విజయగాథలను ఆలపిస్తున్నాయా అన్నట్లుగా చిన్నగా సవ్వడి చేస్తుంటాయి. ప్రతి మహావీరుడికీ తన జెండా ప్రాణసమానం, జెండాను పడగొట్టడమంటే తలతెగ్గొట్టడమే! రథకేతనాన్ని విరవడం ద్వారా వీరుణ్ని నిర్వీర్యుణ్ని చేయడం యుద్ధవ్యూహంలో ఒక భాగం. వీరుల విషయంలో జెండా అంటే ఏదో మామూలు గుడ్డపీలిక ఎంతమాత్రమూ కాదు. అది పౌరుషచిహ్నం, సలసల కాగే రక్తం. సర్రున లేచే స్వాభిమానం, కణకణమండే తెగువ, కుప్పించి ఎగసే కసి. వీరుల కళ్లల్లో ప్రజ్వలించే అఖండ విజయకాంక్షకు ప్రతిరూపం జెండా!
దేశం విషయానికి వస్తే- అది జాతి స్వతంత్ర ప్రతిపత్తికి జయకేతనం. సర్వతంత్ర స్వతంత్ర భారతదేశ సార్వభౌమత్వానికి వైభవోపేతమైన చిహ్నం- మన జాతీయ జెండా! మనది త్రివర్ణపతాకం. జెండా అనే రెండక్షరాలకు, దానిలోని మూడురంగులకు- ప్రచండ మార్తాండమండల సహస్ర దుర్నిరీక్ష్య సహజ తేజోవిరాజితమైన ఘనచరిత్ర నేపథ్యంగా ఏర్పడి ఉంది. ఎందరో దేశభక్తుల త్యాగానికి వేదికగా, వారి గుండెచప్పుళ్ళ నివేదికగా భాసించింది. ఈ జాతిని ఉరకలెత్తించింది. ఉర్రూతలూగించింది. ఉత్సాహానికి ఊపిరులూదింది. కుంచెలను, కలాలను పరుగులెత్తించింది. గళాలను హోరెత్తించింది. మనజెండాను కీర్తించిన ప్రతిపదమూ, ప్రతిపద్యమూ, ప్రతిపాటా ఒక్కో జాతీయగీతమా అన్నంతగా ప్రాచుర్యం పొందాయి. జాతీయజెండా కనబడితే చాలు- పౌరులకు నాడు దేహం నిటారుగా నిలిచేది. చిన్నజెండాను చొక్కాగుండీకి గుచ్చిపెడితే, గుండెకే అతికించినంతగా స్పందింపజేసేది. థిల్లాంగ్ రాగచ్ఛాయలో హుందాగా సాగే మన వందేమాతర గీతం, గుండెల్లో గణగణగంటల సవ్వడిచేసే మన జనగణమన, నరనరాల్లో ఉత్తేజాన్ని నింపే మన మువ్వన్నెల జెండా... భారత జాతికి సౌభాగ్యం అనడం అతిశయోక్తి కాదు. గాంభీర్యం, ఔన్నత్యం, ఔజ్జ్వల్యం వంటి గొప్పపదాలకు సజీవప్రతీకగా ప్రకాశించేది మన మూడు రంగుల జెండా! ఆంధ్రుడు పింగళి వెంకయ్య రూపొందించిన ప్రస్తుత జాతీయజెండా స్వరాజ్య సమరోద్యమ చరిత్రలో సంచలనాలు సృష్టించింది. మన యోధులు సగర్వంగా ఎగరేసిన జెండాలను ఆంగ్లేయులు పీకి పారేసేవారు. అవి నేలను తాకరాదని, మట్టిపాలు కారాదని జాగృత కార్యకర్తలు నేలపై అడ్డంగా పడుకుని జెండా గౌరవాన్ని కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చేసేవారు. తాము ప్రాణాధికంగా ప్రేమించడమే కాదు, జెండాను ఎవరైనా అవమానపరిస్తే సహించని లక్షణం కూడా ఆ తరంలో ఉండేది.
ఇటీవలి కొన్ని పరిణామాలు చూస్తుంటే ఒకవైపు ఆవేదన, మరోవైపు ఆందోళన కలుగుతున్నాయి. ఈ దేశానికి స్వేచ్ఛ లభించిన ఆగస్టు పదిహేనో తేదీని మనం స్వాతంత్య్ర దినోత్సవంగానే కాక, 'జెండా పండుగ'గానూ పిలుస్తాం. అలాంటి పర్వదినం రోజున త్రివర్ణపతాకాన్ని తలకిందులుగా ఎగరేస్తున్న అధికారులు కనిపిస్తున్నారు. ఒక సినిమాలో విలన్ పాత్రధారి జెండాను చేతిగుడ్డలా వాడుతూ- దీనితో తుడుచుకుంటాను, ఏం చేస్తావని మిలిటరీ అధికారిని పెడసరంగా ప్రశ్నించి తన్నులు తింటాడు. జెండాకు తన కాళ్ళు తగిలేలా నిర్లక్ష్యంగా కూర్చుంటుందొక క్రీడాకారిణి. ఒక మోడలైతే జెండా రంగులను తన చీర అంచుగా డిజైన్ చేయించుకుని విలాసాలను ఒలకబోస్తుంది. నాటికి, నేటికి ఎంత తేడా! త్యాగబుద్ధీ, దేశభక్తీ పడుగూ పేకలుగా నేసిన అపురూపమైన, పవిత్రమైన జెండా పట్ల ఈతరం చూపించవలసినంత శ్రద్ధ చూపించడం లేదనిపిస్తోంది. జెండాలు మోసేవారికే పార్టీ పదవులని మన రాజకీయ నాయకులు ప్రకటిస్తుంటారు. జెండా మోయడమంటే పార్టీకి సేవ చేయడమనే వారి భావన. జెండాకు, పార్టీకి తేడాలేదని వారి అభిప్రాయం. పార్టీ సిద్ధాంతాలపట్ల అంకిత భావం, నిబద్ధత కొరవడితే జెండా మోయాలన్న ఆలోచనే రాదన్నది వారి నమ్మకం. ఆ రకంగా పార్టీకి, జెండాకు తేడా లేదన్న సందేశాన్ని శ్రేణుల్లోకి జొప్పిస్తారు. జెండాల రూపకల్పనలో రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. తమ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రతిబింబించేలా జెండాల్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటిది- కొన్నితరాలుగా ఎంతో గొప్పగా ప్రభావితం చేస్తూవచ్చిన జాతీయ జెండా పట్ల ఉదాసీనత న్యాయమేనా?
జెండాయే కేంద్రబిందువుగా సంకల్పించిన ఇటీవలి 'తిరంగా రన్' వయోభేదం లేకుండా వేలమందిని ఉత్తేజభరితుల్ని చేసింది. జెండా ప్రభావంలో లోపం ఏమీలేదు. కొద్దిమంది నిర్లక్ష్యంవల్లనే కొన్ని బాధాకరమైన సంఘటనలు ఎదురవుతున్నాయంతే. ఇలాంటి అవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజానీకం చైతన్యవంతమై స్పందిస్తే- మళ్ళీ మన జాతీయజెండాకు పునర్వైభవ ధగధగలు తథ్యమే!
(Eenadu, Editorial, 10:02:2008)
==============================
Labels: India, India/Telugu
0 Comments:
Post a Comment
<< Home