My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, May 05, 2015

1942- Radios & nostalgia



__________________
The pleasant memories of a bygone era, when life was not controlled by TV or social networks like fb etc but moved at a slow and relaxed pace with valve radios (later transistors) and gramophones, haunt.
Middle1950s through’60s, makes me nostalgic of Telugu/ English news readers, drama artists, Sunday cinemas (only audio), programmes etc.-Mangamma, Rajamannar, Melvel de mellow,Surjit Sen, Latika Ratnam, Balanandam annayya- Nyapati Raghava Rao, Karmikula karyakramam Ekambaram, Subbaramayya, Dharmasandehalu- Ushasri, Nanduri Subba Rao, Vittal, Banda Kanakalingeswar Rao, Samantaka Mani, Sarada Srinivasan, Sarada Asokavardhan, Sthanam. Radio Ceylon ‘Binaca/ Cibaca Geetamala’ on Wednesdays at 8pm- Ameen Sayani; KLSaigal song at the end of Hindi songs in radio Ceylon, Vividh Bharati with their popular programmes 'Sangeet Sarita', 'Bhule Bisre Geet', Hawa Mahal, 'Jaimala', 'Inse Miliye', 'Chhaya Geet' etc.,
5day test cricket match commentary by Chakrapani, Anand Rao, expert comments by Raja of Vizayanagaram-‘Vizzy’! Radios- Pie,Murphy, Bush, Sharp jhankar etc.HMV Gramophones with handles to wind and needles 78rpms, later with light crystals 45, 33.3 rpms, LPs etc.(Even now, I hold those LPs, like clinging to old memories). All these will definitely have resonance with all the senior citizens.

Those days were not with so many comforts as of the present, but life with few wants was very sublime and fulfilling. ‘Jaane kahaan gayE O din..’- to quote Mera Nam Joker.
Now radio is resurrected with FMs, since 2005, with their RJs trying to out beat the pioneer, Ameen Sayani of Binaca geetmala!
[Binaca brand was owned by Reckitt Benckiser which sold it to Dabur in 1996 for INR12 million (US$190,000)].
___________________________________

Labels: , , , , , , ,

Wednesday, March 05, 2014

1358- ఇళ్లలో ఇంద్రచాపాలు!

వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా, హుందాతనానికి నిదర్శనంగా భాసించే చీరకట్టుతోనే లలనల అందచందాలకు ఇనుమడింపు. ప్రకృతి సౌందర్యాన్నీ ఆకృతి ప్రత్యేకతనీ మేళవించిన ముదితల అలంకరణ 'అరవిచ్చిన విరజాజుల/ చిరునవ్వుల కలికి సిగ్గు సింగారమ్ముల్‌/ సరికొత్త చీర మడతల/ మరుగున చెరలాడ' ప్రతి చూపరి హృదినీ రాగరంజితం చేస్తుంది. వేల వత్సరాల చరితను తనలో ఇముడ్చుకొన్న రెండక్షరాల 'చీర' భారతీయ విలక్షణతకే కాక సంప్రదాయ వస్త్రవిశిష్టతకూ సిసలైన ఉదాహరణ. కవి భావన ఉప్పొంగినట్లు 'భారత అంగనామణి శభాషని మెచ్చెడు సంప్రదాయ మొ/ప్పారగ కుంకుమాంకిత శుభావహమౌ వదనారవిందమై/ చీరను గట్టి లక్ష్మీకళ జిల్కుచు' నయనానందకరంగా ఆకట్టుకుంటాయి కట్టూబొట్టూ! సింధు నాగరికతలో, గ్రీకు-రోమనులనాటి వేషధారణలో, అజంతాది శిల్పకళాకృతుల్లో ప్రతిఫలించిన చీరల వన్నెచిన్నెలు వూహకైనా అందేవి కావు. పురాణయుగాల నార చీర నుంచి అత్యాధునిక కాల వస్త్రప్రపంచందాకా మార్పుచేర్పులు అనేకం చోటు చేసుకున్నాయి. ఇంటా బైటా, నిలయాలూ ఆలయాలూ, పండుగలూ వేడుకలూ, విందులూ విహారాలూ, సంస్థలూ సంఘాల కార్యక్రమాల్లో చీర సొగసు చూడతరమా? ధరించినవారినీ దర్శించినవారినీ ఒకేరకంగా మెరిపించి మురిపించే చీరకట్టు వాస్తవానికో కళ, శాస్త్రం. 'పాద పంకజములకు పారాణి అద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనం/ నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి'- ఆ సోయగాలకు అదనపు ఆకర్షణలు. కాంత పైట జిలుగు, కుచ్చిళ్ల కులుకు సొబగు అంతగా మైమరపిస్తుంటే ప్రియకాంతుడికి ఆ భామ అయస్కాంతం కావడంలో వింతేముంది? 'సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీరగట్టి' సఖుని ఎదుట సరాగాలు ఆలపించిందో సుందరాంగి. 'కొప్పున మల్లెపూలు, జడ కుప్పెలు, బంగరు పట్టుచీర'తో విభుని అలరించిందో భార్యామణి. అమందానంద కందళిత హృదయారవిందుడైన పతిదేవుడు ఆ కులుకు మిటారి తళుకులొలుకు పయ్యెద నీడన సేదతీరకుండా ఉంటాడా? 'అందెనైతే గదా అరవింద ముఖి! నిన్ను చేరి నీ పదసేవ చేయుచుందు/ కోకనైతే గదా కోమలి! నీ ఘన జఘనోరు సౌందర్య సరణి గందు' అని ముద్దుపళని కావ్యపురుషుడు పడిన తపనే ఇక్కడా పునరావృతమవుతుంది. విభిన్న సందర్భంలో- నాయిక చిలిపి కయ్యానికి దిగేసరికి, తటాలున ఆ చీర అంచుల్ని చేతపట్టి తన వైపు తిప్పుకోబోయాడు నాయకుడు. 'అబ్బ ఉండండీ' అంటూ తప్పించుకొనే యత్నంచేసిన ఆ కోమలాంగి విసురుపాటు వేళలోనే ఒంటిమీది అద్దాలచీర మరీ మిలమిలలాడింది. 'పోతన చరిత్రము' నాయకురాలు కట్టిన తెలి పట్టు పట్టపు ఉడుపు విజయకేతనంలా రెపరెపలాడిందట. ఆ మనోహరి చీర చెంగావి అంచులు అతిలోక రసవంతాలైన వసంతాలనే చిత్రించాయి. వలపుల రేరాణి పువ్వులాంటి తెల్లచీర కట్టుకుని, పాదాలకు పారాణి అలంకరించుకొని కదిలొస్తుంటే 'కలహంస చలన విలాస లాస్యమా' అనిపించింది ఒకానొక నాయకాగ్రణికి! మనసూ మమతా కలబోసిన ఏ కల(ల)నేత అయినా రసాధిదేవతకు సిరిజోతే అవుతుంది మరి. వధువుకు ఒడికట్టు బియ్యమిచ్చేది, వరుడితో కొంగుముడి బిగించేదీ చీరతోనే. ఆడపిల్లను అత్తవారింటికి పంపుతూ 'రస ప్రసార రుచిర ప్రసరంబుగ' కన్నవారు అందించే చీరసారెలు ఆ ఇంతి మనోబలాన్ని ఇంతింతలు చేస్తాయి. చీర అంచు కుచ్చిళ్లు తళతళలాడటమే వనితలకు కళకళ. ముంగాళ్లమీదుగా జీరాడే పరికిణీలతో గలగల తిరగటం అమ్మాయిల పర్వదినోత్సాహానికి సూచిక. పానుగంటి పుటల్లో వినిపించే గాజుల గలగల, అందెల ఝుణఝుణలే కావు; కనిపించే బనారసు కోకలు, బరంపురం పీతాంబరాలూ బహు రమ్యాలు. గద్వాల చీరలు కట్టుకున్నవారంతా కదలాడే తారలంటోంది సాంస్కృతిక గీతిక. వర్ణవైవిధ్యాల వలువలతో ఒంటికి సొంపు, కంటికి ఇంపు ఉంటుందంటుంది హృదయభావ వీచిక. క్లుప్తంగా చెప్పాలంటే- చీర నారీభూషణం!
'చెంగావి చీరలు కొంగులు చెంగున/ జారంగ రంగైన నవమోహనాంగీ' అని వినవస్తుంటే పులకించని మది ఉండదు. నిండైన చీరకట్టు గొప్పతనమైనా, జిలుగు పైట నీడలోని పరవశమైనా, ఓణీ పరికిణీల పరవళ్లయినా... వేటికవే ప్రత్యేకం. 'వీరాంగనలైనచో నడుములన్‌ బిగచుట్టి పరాక్రమంబు లెస్సం కురిపించు చీరలు' మహిళామణుల సహజ వనరులు. పల్లె పొలాల గట్లమీద పడుచుల కట్టు వేరు. పరిణయ తరుణాన పట్టుచీరల రెపరెపలది మరో తీరు. సింగారం దారంగా, అందాల రంగులే అద్దకంగా వెలసే నేత చీరలది ఇంకొక రీతి. మగ్గాలమీద నేసే వస్త్రాల్లో రంగు హంగులతో పాటు పనిమంతుల కళాచాతుర్యమూ కలబోసి ఉంటుంది. ఆ గ్రామీణ నైపుణ్యాన్ని గమనించటమంటే, అనల్ప శిల్పసౌందర్యాన్ని సాంతం సొంతం చేసుకున్నట్లే. ఉక్కపోతలో వింజామర అయ్యేదీ, చలీ వానా ఎండల్లో తల రక్షణ ఇచ్చేదీ చీరకొంగే. చీరనే మెత్తటి బొంతగా చేసి, బుజ్జితల్లినో చిన్నితండ్రినో బజ్జోపెడుతుంది తల్లి. 'చీర ఉయ్యాలలోని చిన్ని శిశువు... తల్లిజోలకు హాయిగా ఉల్లమలర' విశ్రమించడమూ సహజమే. ఆ పసిపాపే కాస్తంత పెద్దయ్యాక 'తనకంటె పొడుగు చీరను/ తన మేనికి చుట్టుకొనుచు, తన చేతులకున్‌/ కొనలందక కలతపడేటి' సన్నివేశం నేత్రపర్వం. పుత్తడిబొమ్మ పట్టుచీర కడితే 'నీ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ' అన్న చలనచిత్ర కవి వర్ణనా అత్యంత ఉల్లాసభరితం. సప్తవర్ణ తోరణాలుగా వెల్లివిరిసే చీరలతోనే అందాలూ ఆనందాలూ. కనువిందుచేసే ఆ ఇంద్రధనువులు ఎక్కడో గగనంలో కాదు, ఇక్కడే గృహసీమల్లోనే ప్రభవించటం సదా రమణీయం, బహుధా మననీయం.
(ఈనాడు, 26:01:2014)
________________________

Labels: , , ,

1357- అన్నప్రసాదం!

కుబేరుడికైనా కుచేలుడికైనా క్షుద్బాధ ఒక్కటే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్దలన్నదీ అందుకే. లోకంలో బాధలు అనేకమున్నా, కవిహృదయం ఏనాడో తేటతెల్లం చేసినట్లు 'దురంత దుఃఖకర ఆకలిబాధ భరింప అశక్య'మన్నది ప్రత్యక్షర సత్యం. మనిషికే కాదు, సృష్టిలో ప్రతిప్రాణికీ ఆకలిదప్పులూ తిండితిప్పలూ తప్పవు. 'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి చెప్పినా, 'ఆకొన్న కూడె అమృతము' అంటూ సుమతీ శతకకర్త చాటినా- సారాంశమొకటే, అన్నం ప్రాధాన్యం లెక్కకట్టలేనిది. 'అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడు మేతబెట్టె/వన చరాదులకు భోజనమెవ్వడిప్పించె?' అని కవిగళం గుప్పించే ప్రశ్నలకొచ్చే జవాబుల్లో ఆస్తిక నాస్తిక తేడాలుండొచ్చు. మనిషి ఆకలి తీర్చే నాథుడెవరన్నప్పుడు వచ్చే సమాధానం- సాటి మనిషే! 'తల్లి పెట్టు తియ్య తాయిలములన్నియు తోటి బాలకులకు పంచిపెట్టిన' ఆర్ద్రహృదయుడు బాల గౌతముడు. 'ఉపకారము తలచని కఠినాత్ముడు ఉండి వ్యర్థము, మదిలో/ చపలత వీడక వ్రతములు తపములు జేయుట వ్యర్థము' అన్న హితోక్తి అర్థపరమార్థాలు గ్రహించి వ్యవహరించే మానవుడే మాధవుడన్నది సర్వజన సమ్మతం. అరణ్యవాసకాలంలో ధర్మజుడు తనవెంట ఉన్నవారి భోజనార్థం సూర్యభగవానుణ్ని ప్రార్థించి అక్షయపాత్ర సంపాదించాడు. ఎంత వడ్డించినా ఇంకా నిండుకుండలా ఉన్నందునే, అది ఎందరెందరి ఆకలినో రోజూ తీర్చగలిగేది. అక్షయగుణ సంపన్నత ఆ పాత్రలో ఉందా, లేక ధర్మరాజు ధర్మబుద్ధిలోనే అది ఉందా అన్నదొక్కటే కీలకం. 'ఖ్యాతి చేకూరు, దీనులకు అన్నదానమిడు పుణ్యప్రాణికిన్‌' అని పలికిన ప్రౌఢకవి మల్లన మాటనే బాటగా మలచుకుంటే, మానవజన్మకు అంతకుమించిన సార్థకత వేరొకటి ఉండదు! ఉపకారబుద్ధికి ప్రకృతే ప్రతీక. 'తరువులతి రస భార గురుత గాంచు/ నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు/ డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము' అన్నట్లు ప్రకృతిమాతే సమర్పణశీలతకు నిదర్శనం. పండ్ల బరువుతో వంగే చెట్ల కొమ్మలకు చేతికి అందుబాటులో ఉండటం తెలుసు. గగనసీమలో షికారుచేసే మేఘాలకు వర్షించటమే తెలుసు. తోటివారికి ఇవ్వటంలోని సంతృప్తి, సంతోషం మనసునిండా ఉన్నప్పుడు మానవుడూ అంతే. పోషక సమృద్ధమైన గంజిని దారిపక్క కాలువపాలు చేయటంలో మానవత లేదు. ఆ వృథాను అరికట్టడంతో పాటు, అన్నమూ జతచేర్చి ఆర్తులకింత అందించటంలోని ధన్యతా అంతా ఇంతా కాదు. జాషువా కవినేత్రం తిలకించిన భారతంలో 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు' వారెందరో ఉన్నారు. 'దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్పని'వారి తత్వమే భాగ్యవిహీనత్వమన్న ఆయన వాదం సంపూర్ణ హేతుబద్ధం. కాస్తంత తిండి దొరక్క అల్లాడిపోయిన దుర్భర అనుభవం నాడు గుణనిధికి ఎదురైంది. చేతికందిన ఆహారం నోటిదాకా చేరని వైనాన్ని తలచుకుని కుమిలిపోయిన దీనదశ అతడిది. 'అన్నం అమృత రూప'మని శ్రుతులు, 'పరమాత్మ స్వరూప'మని స్మృతులు చాటాయి. అన్నపూర్ణగా ఆరాధించి, 'సుఖీభవ'గా ఆశీర్వదించి భారతీయతను వేనోళ్ల కీర్తించిన ఘనచరితా మనకుంది. 'దానమునకు అధికమైన ధర్మము కలదే' అని హరిభట్టు, 'కరమున నిత్యాన్నదానము సురుచిర భూషణము' అంటూ భర్తృహరి ప్రస్తుతించిందీ దానగుణశీలతనే. దానమివ్వనివాడు ధన్యుడు కాడని, కాలేడని స్పష్టీకరించిన సుద్దులూ చాలా ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నా ఎన్నో తెలిసినా, ఎక్కడో ఏ మూలనో- ఇవ్వటానికి చేతులురాని వైనం, ఉన్నదాన్ని తెలిసో తెలియకో వృథాచేసే నైజం దాపురించింది. స్థానికమో ప్రాంతీయమో జాతీయమో కాదు... ఈ పెనుజాడ్యం ప్రపంచవ్యాప్తం!
'వృథా చేయబోకు, జన్మము సదా రాదు నీకు' అని తెలిసినవారున్నా అన్నార్తులకు లభిస్తున్న ఉపశమనం కొంతే. మాటలూ చేతలకు అంతరాలున్నచోట 'కాగితమ్ము లిచట కరిపించువారు శి/క్షింపబడుదు' రని లిఖించి పెద్ద/కాగితమ్ము గోడకంటించె దొరగారు' తరహా వ్యవహార సరళీ ప్రమాదమే. చెప్పింది చేయటం, చేసిందే చెప్పటం సమర్థ శక్తివనరుగా ఉత్తమ ఫలితాలనిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న భావన, బాధ్యతాయుత వర్తన ఇళ్లు, భోజనశాలలు, విందులు, ఉత్సవాల్లో వెల్లివిరియాల్సి ఉంది. 'ఎంత తింటావో అంతే వడ్డించుకో... తిన్నంత తిని, మిగిలిందంతా పారేసే అలవాటు మానుకో' అంటూ అవ్వలూ తాతయ్యలూ, అమ్మానాన్నలు చెప్పే మాట ఇప్పుడు ఎంతమందికి చెవికెక్కుతుంది? భోజనవేళ విధివిధానాలు, నియమనిబంధనలు ఉన్నట్టే వృథాను పరిహరించాలన్నదీ ఓ విధానం, నిబంధన. 'కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు/ బహువిధారిష్టముల భస్మీపటలమొనర్చు' జీవితమే జీవితం. అది సకల వృథాల నివారణ, సర్వవనరుల సద్వినియోగంతోనే పరిపూర్ణమవుతుంది. విశ్వమంతటా అనునిత్యమూ లక్షల టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దేశదేశానా ఒకవంక ఆకలికేకలు మిన్నంటుతుంటే, మరోవైపున వ్యధార్తుల కంట రక్తాశ్రువులు చిందిస్తూ అన్నపానీయాల వృథా విచ్చలవిడిగా సాగుతోంది. తగినన్ని రవాణావసతులు లేక కొంత, గోదాముల్లో అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా మరికొంత- దాపురించిన దుస్థితి ఇది. ఎక్కువగా వడ్డించుకొని చివరికి కుప్పతొట్లలో పారేసే పంచభక్ష్య పరమాన్నాల తీరు మరింత బాధాకరం. పొలం నుంచి పళ్లెంలోకి, అక్కడినుంచి నోటికి చేరేలోగా ఎంతెంత వృథా! వీటన్నింటితో కోట్లమంది నిరుపేదల కడుపు నింపవచ్చని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఐరోపా సంఘం ప్రకటించిన 'ఆహార వృథా వ్యతిరేక సంవత్సరం' ముగింపు దశకు చేరుకుంది. నేటికీ దురవస్థ మారటం లేదంటే- 'నరుడి నెత్తిమీద రుద్దిన దరిద్రం/ అది ఎప్పుడో కట్ట తెగే సముద్రం' అన్న కవి హెచ్చరికకు రూపం వస్తున్నట్లేగా!
(ఈనాడు, 15:12:2013)

___________________ 

Labels: , , , ,

Sunday, February 23, 2014

1350- సంబురాల తెలంగాణ!

https://lh5.googleusercontent.com/-tnHtRxNdCPY/Ufd5nNddHsI/AAAAAAAAjM4/Fn2CaSV2rr8/s288/Telangan-state.jpg

సుమారు నాలుగు కోట్ల స్వరతంత్రులతో కోటి రతనాల వీణ సంబురాల సరిగమలు పలుకుతున్న వేళ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల దశాబ్దాల కల ఫలించబోతోంది. రాష్ట్రపతి మొహరు పడటమే తరువాయి, దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ తళుకులీననుంది. లక్షా 14వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 3.52కోట్ల(2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభాతో తెలంగాణ దేశంలో పదకొండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తోంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా నాలుగో స్థానంనుంచి ఆరోస్థానానికి, జనసంఖ్య పరంగా అయిదునుంచి పదోస్థానానికి పరిమితం కానుంది. 'అయిదున్నర దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండు చరిత్రను, తాము సాగించిన విస్తృతస్థాయి సంప్రతింపులను పరిగణనలోకి తీసుకొని ముందడుగేశా'మని నిరుడు జులై చివరివారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించినప్పటినుంచి, నేటిదాకా విభజన ప్రక్రియ అంతా- ఉద్విగ్నత, ఆవేశోద్రేకాల సమ్మిళితంగానే సాగింది. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా యాభై ఏడేళ్లక్రితం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ఎంత సున్నితమైనదో 2009 డిసెంబరులోనే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసివచ్చింది. పార్టీలు సైతం ప్రాంతాలవారీగా చీలిపోయిన విపత్కర వాతావరణంలోని భావోద్విగ్న తీవ్రతలను గుర్తించి- ఈ ఆరున్నర నెలల కాలావధిలో సర్వామోద పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండాల్సింది. ఆ పని చెయ్యని హస్తం పార్టీ అధిష్ఠానం- 2006లోనే ప్రత్యేక తెలంగాణకు 'సై' అన్న భాజపానూ విశ్వాసంలోకి తీసుకోలేకపోయింది. పర్యవసానమే, పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టడం నుంచి రాజ్యసభలో ఆమోదం పొందేదాకా అనుక్షణం ఎడతెగని ఉత్కంఠ; అయిదు కోట్లమంది ప్రయోజనాల్ని అసలేమాత్రం పట్టించుకోలేదంటూ సీమాంధ్రుల్లో తీవ్ర భయాందోళన. 'తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి' అన్నట్లు కేంద్ర సర్కారు అడుగడుగునా అప్రజాస్వామికంగా వ్యవహరించిందనడంలో మరోమాట లేదు. విపక్షాల అభ్యంతరాలన్నీ ఎగువ సభలో వీగిపోయిన నేపథ్యంలో, నవతెలంగాణ శిశూదయాన్ని స్వాగతించాలిప్పుడు!

వేర్వేరు పరగణాల్లో ఉన్న తెలుగువారంతా ఒక్కతాటిమీదకు వచ్చితీరాలన్న సమైక్య భావకాంక్షకు ఫలశ్రుతి- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఇప్పుడు తెలంగాణ వేర్పాటుకూ అలుపెరుగని ప్రజాందోళనే కారణం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదిక అయింది. కాకతీయుల కాలంలో కలిసి ఉన్న ఆంధ్రులు మళ్ళీ భారత రిపబ్లిక్‌లో ఏకమయ్యారన్న ఆనందానుభూతుల్ని అంతలోనే ఆవిరి చేసేలా ఒప్పందాల ఉల్లంఘనలు తెలంగాణవాదుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. సమైక్య రాష్ట్రం ఏర్పడిన పదమూడేళ్లకే వేర్పాటువాదం రాజుకోవడానికి పాలకుల తప్పిదాలే పుణ్యం కట్టుకొన్నాయి. 1973లో ప్రధానిగా ఇందిర ప్రతిపాదించిన ఆరుసూత్రాల పథకం అమలు సైతం వివాదగ్రస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కూర్పు బేషరతు కాదని, విద్యా ఉద్యోగాలు పారిశ్రామిక ప్రగతి సేద్యరంగం వంటివాటన్నింటా తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశం తెలంగాణ వేర్పాటు కాంక్షలకు ఎరువవుతూ వచ్చిందని తెరాస సిద్ధాంతకర్తగా జయశంకర్ లోగడే స్పష్టీకరించారు. పదమూడేళ్ల క్రితం తెలంగాణ సాధనే లక్ష్యంగా తెరాస స్థాపించిన బక్కమనిషి కేసీఆర్ ఉక్కు సంకల్ప దీక్షా దక్షతలతో ప్రజాకాంక్షకు ఉద్యమ రూపమిచ్చి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో శ్రేణుల్ని కదం తొక్కించారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా సమైక్యవాదం వినిపించిన సీనియర్ రాజకీయవేత్త చెన్నమనేని రాజేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ అవసరం ఎందుకొచ్చిందో తెలుగుదేశం తరఫున సాగించిన అధ్యయనంలో వివరించారు. వైఎస్ పాలన, అర్ధశతాబ్ది ప్రత్యేక తెలంగాణ వాదనను రెట్టింపు చేసిందని, భూముల్ని తెగనమ్మడం, 'సెజ్'ల దోపిడి, నదీజలాల తరలింపు తదితర ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకబాట పట్టిస్తున్నాయని ఆరేళ్లక్రితమే వాస్తవాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనసుల్లో తాము విచక్షణకు, దాష్టీకానికి గురి అవుతున్నామన్న భావన తీవ్రమైన ఆవేశకావేషాల దశకు చేరుకుందని, ప్రత్యేక తెలంగాణ డిమాండు పూర్తిగా అన్యాయమైనదేమీ కాదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టీకరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించిన పక్షంలో భిన్న ప్రాంతాలవారి భయాలు ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకొని వారికి భరోసా కల్పించాలనీ సూచించింది. ఆ భరోసాల అంశంలోనే కేంద్రప్రభుత్వం దాగుడుమూతలు, లేనిపోని వైమనస్యాలను పెంచాయని చెప్పక తప్పదు!

ఒక జాతి కట్టుబాటును మతంకన్నా ఎక్కువగా భాష శాసిస్తుందని, అందుకు తానే ఉదాహరణ అనీ ఉపఖండంలో భాషాప్రయుక్త దేశంగా బంగ్లాదేశ్ చాటింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 'యునెస్కో' నిర్వహిస్తోంది. ఈసారి మాతృభాషా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన మరో గుణపాఠం నేర్పుతోంది. ఓ జాతి కట్టుబాటుకు భాషా ప్రాతిపదిక ఒక్కటే సరిపోదని, అంతకుమించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంక్షలకు గొడుగుపట్టే సుపరిపాలన మరెంతో అవసరమనీ పాలకులు తెలుసుకోవాలి. 'సంబంధిత అన్ని వర్గాలతోనూ తగిన చర్చలు, ఏకాభిప్రాయ సాధన, సరైన సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పరిశీలన' అన్నవి 2004లో తొలి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలోని ముఖ్యాంశాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలహరణం తరవాత, పదహారో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళే 'సరైన సమయం' అంటూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు హడావుడి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం- రెండుపక్కలా కడ నిమిషందాకా ఉద్విగ్న వాతావరణాన్ని పెంచి పోషించింది. రాష్ట్రంలో, దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక దశలో తెలంగాణకు అనుకూలత చాటాయి. వాటి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగేస్తే అసలు గొడవన్నదే లేకపోయేది. మూడు ప్రాంతాల మధ్య సామరస్యంగా సయోధ్య సాధించగలిగితే విభజన చేయవచ్చని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీయే సూచించింది. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండే సుహృద్భావానికి ప్రోది చెయ్యాల్సిన కేంద్రప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించింది. పాలకుల రాజకీయ పాచికలు పెంచిన మనస్పర్ధల్ని పక్కన పెట్టి, ఇరువైపులా తెలుగువారి ఔన్నత్యం మరింతగా పరిమళించాల్సిన తరుణమిది. నీటి వనరుల పంపిణీ, విద్యుత్, ఉద్యోగులు, ఉమ్మడి రాజధానిలో కలసి పదేళ్లు పనిచేయడం వంటి అనేకాంశాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాల మధ్య సౌహార్దపూర్వక సంప్రతింపులు తప్పనిసరి. విభజన క్రమంలో భేదాభిప్రాయాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొంటూ సముజ్జ్వల భవిత నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెట్టపట్టాలు కట్టి సాగాలి!
(సంపాదకీయం, ఈనాడు, 21:02:2014)
__________________________________

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Labels: , , , , , , , ,

Wednesday, October 09, 2013

1273-హైదరాబాద్‌పై పోటాపోటీగా కావూరి-జైపాల్ వాదనలు




 (ఈనాడు,04:10:2013)

హౖదరాబాద్‌ను చారిత్రక కోణంలో చూడాలి:
జైపాల్‌రెడ్డి, సీమాంధ్ర ప్రాంత మంత్రులు వ్యక్తంచేసిన అభిప్రాయంతో విభేదిస్తున్నందుకు బాధ పడుతున్నట్లు చెబుతూ... ''తెలంగాణను చారిత్రక కోణంలో చూడాలి. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేపథ్యాన్ని, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన గతులను చూడాలి. ఫజల్అలీ కమిషన్ కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. సమైక్య రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు, పెద్దమనుషుల ఒప్పందాలు, జోనల్ వ్యవస్థ వచ్చాయి. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు 300 మంది చనిపోయారు. 1971లో మళ్లీ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఇచ్చిన గరిబీ హటావో నినాదం ఉన్నప్పటికీ తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. అప్పట్లో తెలంగాణ ప్రజా సమితికి 11 సీట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రహ్మానందరెడ్డిని, ఆంధ్ర ఉద్యమ సమయంలో పీవీ నరసింహరావును (పదవుల పరంగా) త్యాగం చేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి విభజన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2004లో కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా తెలంగాణను పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పాం. శ్రీకృష్ణకమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. మహారాష్ట్రకు బాంబే ఎలాగో తెలంగాణకు హైదరాబాద్ అలా అయిపోయింది. దీన్ని చారిత్రక కోణంలో చూడాలి. దేన్నయినా మార్చొచ్చుకానీ భౌగోళిక పరిస్థితులు మార్చలేం. 1956లో హైదరాబాద్ దేశంలో 5వ పెద్దనగరం. ఈరోజున కూడా అదే స్థానంలో ఉంది. హైదరాబాద్ నగరాభివృద్ధిలో తెలుగేతరుల శ్రమే ఎక్కువగా ఉంది'' అని పేర్కొన్నారు.

అంతకుముందు కావూరి సాంబశివరావు సీమాంధ్ర ప్రాంతంలో రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం గురించి వివరించారు. ''60 రోజుల నుంచి తీవ్రంగా నడుస్తున్న ఉద్యమాన్ని దురదృష్టవశాత్తు జాతీయ మీడియా చూపెట్టడం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ జరగడం లేదని మీరు భావిస్తున్నట్లున్నార''ని ఆక్షేపించారు. తాము నియోజకవర్గాలక్కూడా పోలేక పోతున్నట్లు వాపోయారు. ఆ వాదనలను జైపాల్‌రెడ్డి తోసిపుచ్చారు. ''అలాగైతే మేం కూడా నాలుగేళ్ల నుంచి ఇక్కడే ఇరుక్కుపోయాం, డిసెంబర్ 9 ప్రకటన నాటి నుంచి మేం కూడా నియోజకవర్గాలకు వెళ్లలేని సంకటస్థితిని ఎదుర్కొంటున్నా''మని వాపోయారు. ''కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ఇస్తామని చెప్పలేదు. ఎందుకు తెలంగాణా ఇవ్వడానికి తొందరపడుతున్నారు. వైకాపా, తెలుగు దేశం పార్టీలు విభజన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గే సమయంలో కాంగ్రెస్ ఎందుకు వేగంగా ముందుకెళ్లాలి? శ్రీకృష్ణకమిటీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పేర్కొంది'' అని కావూరి గుర్తు చేయగా... అదే శ్రీకృష్ణకమిటీ అయిదో అంశం కింద రాష్ట్రాన్ని విభజించాలని కూడా చెప్పింది కదా అని జైపాల్ పేర్కొన్నారు.

ఏకాభిప్రాయం అసాధ్యం-వినోభా కాలంలో లేం:
ఏకాభిప్రాయం అంశం గురించి వచ్చినప్పుడు జైపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ''ఏ అంశంపైనా 100 శాతం ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మొరార్జీదేశాయ్ ముంబాయి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి రామ్‌కిషన్‌కూడా! 66లో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టి పంజాబ్ రాష్ట్రాన్ని విభజించారు. అక్కడ ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. వినోభాభావే కాలంలో 100 శాతం అభిప్రాయం ఉంటేనే ఏకాభిప్రాయం కింద లెక్క. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. మనం ఆ కాలంలో లేం. కాబట్టి పూర్తి ఏకాభిప్రాయం అసాధ్యం. దాదాపు ఏకాభిప్రాయం తీసుకుంటే చాలు. తెలంగాణ కూడా 60 ఏళ్ల నుంచి మండుతోంది. నేను ఒకప్పుడు సమైక్య వాదిని అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యవాదిని'' అని పేర్కొన్నారు. అంతకుముందు పళ్లంరాజు 10 ఏళ్లకు మించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరారు. కావూరి మాట్లాడుతూ తాను పార్టీని ధిక్కరించే వాణ్ణి కానని, కానీ ఇప్పుడు వ్యవహరించిన తీరు మాత్రం తనను తీవ్ర వేదనకు గురి చేసిందని స్పష్టం చేశారు.

అంతా తెలంగాణకే జై
ఇద్దరు సీమాంధ్ర మంత్రులు తప్ప మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన వారంతా తెలంగాణకే జై కొట్టార

Labels: , , , , ,

Monday, June 24, 2013

1207 - అత్యాశకు పోతే అంతే సంగతులు.. పెరుగుతున్న 'నైజీరియా మోసాలు'

  • సంక్షిప్త  సమాచారాలతో తస్మాత్ జాగ్రత్త !
  • రూ.2.95 కోట్లు వస్తుందని బ్యాంకు సొమ్ముకు టోకరా
  • కటకటాల పాలైన బ్యాంకు మేనేజర్
ఈనాడు, విజయనగరం: 
దురాశ దుఃఖానికి చేటు... అన్న నీతిని జీవితంలో ఆచరించకపోతే అనర్థాలు తప్పవు అని చెప్పడానికి ఈ ఉదంతం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్‌లకు బహుమతుల సంక్షిప్త సమాచారాలు (ఎస్ఎంఎస్) వెల్లువెత్తుతున్నాయి. ఇది కచ్చితంగా మోసమే. ఇలాంటివాటిని పోలీసు భాషలో నైజీరియన్ మోసాలుగా పిలుస్తారు. విజయనగరం జిల్లా రామభద్రపురం ఎస్‌బీఐ మేనేజర్ కూడా ఈ వూబిలో చిక్కుకున్నారు.

మేనేజర్ వారణాశి బాలకృష్ణ సెల్‌ఫోన్‌కు నెల రోజుల క్రితం 'నోకియా మొబైల్ ప్రమోషన్ అవార్డు-2013 ఈ ఏడాది ప్రకటించారు. అందులో మీకు రూ.2.95 కోట్లు బహుమతి వచ్చింది. ఈ మొత్తం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ ఉన్న నోకియా ప్రతినిధి డిప్లమేట్ జేమ్స్ విలియమ్స్‌ను కలవండి.' అని ఎస్.ఎం.ఎస్. వచ్చింది. ఈ వివరాలు చూసిన బాలకృష్ణ వెంటనే జవాబు మెసేజి ఇచ్చారు. దీంతో... ముందుగా రూ.2.96 కోట్ల డబ్బు ఎయిర్‌పోర్టు కస్టమ్స్ విభాగం నుంచి విడుదల చేసేందుకు రూ.25,000 కట్టాల్సి ఉందని ఓ బ్యాంకు ఖాతా నెంబరు 32744551193 కూడా ఇచ్చారు. ఈ ఖాతాకు 2013 మే 6న రూ.25,000 తొలిసారిగా జమ చేశారు. బాలకృష్ణ వ్యక్తిగత ఖాతా నెంబరు, మెయిల్ ఐడీ వగైరా సమాచారం కూడా వారు తెలుసుకున్నారు.

  • తరువాత మరికొన్ని ఖర్చులు ఉన్నాయంటూ 7.5.2013న 32888104626 ఖాతాలో రూ.98,000 జమ చేయాల్సిందిగా సూచించారు.
  • ఐఎంఎఫ్ క్లియరెన్స్ ఛార్జీలుగా రూ.3,31,000 కట్టాలంటూ శైలేంద్ర ఓటా పేరిట ఉన్న ఖాతా నెంబరు పంపారు.
  • రూ.2.95 కోట్లకు 12 శాతం ఆదాయపు పన్నుగా రూ.35,40,000 కట్టాలని కోరగా... తాను కట్టలేనని బాలకృష్ణ తెగేసి చెప్పారు. దీంతో బేరసారాలు చేసిన నోకియా మొబైల్ ప్రొమోటర్స్ చివరకు రూ.5,13,000 కట్టాల్సిందిగా సూచిస్తూ 3273960186 ఖాతా నెంబరు ఇచ్చారు. కృష్ణా పింక్ ఇన్‌ఫో పేరిట ఆ ఖాతా ఉంది.
  • ఫైనాన్స్ మినిస్టర్ కార్యదర్శులు ఒక్కొక్కరికి పది లక్షలు ఇవ్వాలని కోరగా.. ఆ మొత్తం చెల్లించారు. అలా రూ.1.83 కోట్ల మేర నోకియా మొబైల్ ప్రమోటర్స్ పేరిట చెల్లించారు.

ఈ మొత్తం చెల్లించడానికి అమ్మ, అక్క, గతంలో తన వద్ద పనిచేసిన అనిల్‌రాజ్ దివల అనే వ్యక్తి పేరిట తన బ్యాంకు నుంచే రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ముంబై స్టేట్ బ్యాంకు బ్రాంచి నుంచి మేనేజర్.. బాలకృష్ణకు ఫోన్ చేసి... 'మీ బ్రాంచి నుంచి అనిల్‌రాజ్ దివల పేరు మీద లోన్ చూపుతూ... వేరెవరికో క్రెడిట్ అవుతోంది చూసుకోండి' అని చెప్పారు. అదే విషయాన్ని విశాఖపట్నం రీజియన్ కార్యాలయానికి వివరించారు. దీంతో విశాఖపట్నం బ్యాంకు అధికారులు రంగంలోకి దిగితే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో సెల్‌ఫోన్ మెసేజీ ..ఆయన చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను బాలకృష్ణ బయటపెట్టారు. చివరికి కటాకటాల వెనక్కి వెళ్లారు. 

(ఈనాడు ,07:06:2013)
______________________________________

Labels: , , , ,

Sunday, April 28, 2013

1122- భార'తీయదనం'


ఒకటి, రెండు, మూడు... గణితం. మూడు, రెండు, ఒకటి... వివాహ జీవితం! మూడుముళ్లతో ఇద్దర్నీ ఒక్కటి చేసే పెళ్ళి- ఆనందం 'జల్లులై కొల్లకొల్లలై/ పెల్లుబికి వెల్లివిరియ'జేసే పవిత్ర క్రతువు. అది అంకురారోపణంతో మొదలై నక్షత్రదర్శనందాకా కొనసాగి కన్యాదానం, కల్యాణ హోమం, జీలకర్ర- బెల్లం, మంగళసూత్రధారణం, పాణిగ్రహణం, తలంబ్రాలు, సప్తపది కలుపుకొని నవవిధ ప్రధాన శోభితం. విష్ణుపురాణ సంబంధిత నాయికా నాయకులు నర్మద, పురుకుత్సుల పరిణయ రమణీయత ప్రబంధ కవి స్మితశ్రీ అవలోకించినట్టు 'అగరు ధూపంబులు గగన భాగంబెల్ల/ సౌరభమ్ములు నింపి స్వాగతించె/ పట్టువస్త్రములపై పన్నీరు జిల్కింప/ సౌగంధికాపూర్ణ సౌఖ్యమిచ్చె'. ఎదుర్కోలు ఆహ్లాదభరితమనీ, ప్రాంగణమంతటా మోగిన మంగళవాద్యాలతో పెండ్లివేదిక సందడించిందనీ ఆ గళ సారాంశం. కమనీయ రీతిన సాగిన గోదా రంగనాథుల మనువూ నిత్య మననీయమే. దేవి గళాన శ్రీవారు మంగళసూత్రం కట్టడంతోనే- అక్కడంతా నవోత్సవం, మహోత్సాహం. 'నెలతయు పతియును కరముల/ నలవరచిరి కంకణంబు లన్యోన్యంబున్' అంటూ దాంపత్యబంధ ఘనతను ఆవిష్కరించారా కావ్యకర్త. ఆది దంపతులు గౌరీశంకరులది సత్య సనాతనత్వం, అర్ధనారీశ్వర సముదాత్త తత్వం. ధన్య చరితులు జానకీరాముల మది నిత్య ఏకాత్మకం. వారిది సముల్లసిత సౌభాగ్య సహిత మహిత మనోజ్ఞ జీవనం. చందనాల చల్లదనం, మకరందాల తియ్యదనం, సకల కళల చక్కదనం సమస్తం... ఆ ఆదర్శ జంటల సొంతం.

'నేను' నుంచి 'మన'లోకి రస హృదయాల్ని అలవోకగా తరలించుకుపోయే బహుచక్కటి ముచ్చట మనువొక్కటే. ఆ సరసమయ సామ్రాజ్యంలో ఆలూమగలిద్దరిదీ సమ భాగస్వామ్యం. ఆ క్రీడానంద జగతిలో నాటికీ నేటికీ ఏనాటికీ ఉభయులదీ ఘన విజయం. 'చిత్తచోరా! శ్రీయుతాకారా!' అని శ్రీకృష్ణుణ్ని ప్రస్తుతించిన రుక్మిణి ఆయనకు 'సోగకన్నుల రాణి, సౌభాగ్యవాణి, జీవిత కల్యాణి'. ప్రణయ పరిణయాల్లో విజయవిలాస యానం సాగించిన సుభద్రార్జునులదీ మహదానంద అనుభవమే. గిరికా వసురాజులది అనురాగోదయ వృత్తాంతమైతే, ధూర్జటి సందర్శించిన ఇందుమతీ వివాహ వైభవం నవనవానంద రసోదయం. మూడు పువ్వులూ ఆరు కాయలుగా రోజులు దొర్లిపోయేలా వేదికమీద ధ్వనిస్తాయి పెళ్ళినాటి ప్రమాణాలు. అంతకుముందు- తేనె, పెరుగు, బెల్లం కలగలిపిన మధుర పదార్థ సేవనం వరుడి నోటినీ మనసునూ తీపి చేస్తుంది. ఎదుర్కోలు వేళ, వధూవరుల ఉభయపక్షాల సమక్షంలో పానకమూ మధురాతిమధురమే. వరుడి కాళ్లు కడిగి జరిపే కన్యాదానం అతడి ధర్మకామార్థ సిద్ధికి మూలం. ప్రమాణాల్ని అతిక్రమించనంటూ ఆ అల్లుడు ముమ్మార్లు మామకు చేసే వాగ్దానమే సర్వ వేదోక్తం. ఇల్లంటే అనురాగాల నిలయమని, కుటుంబమంటే అనుబంధాల సమాహారమని చాటే ఆ వైనం కవి స్వరం పలికినట్టు 'యుగయుగాల జాతికి ఉజ్జీవనం/ జగజగాల జ్యోతికి సంభావనం'. భిన్నరుచులను మమేకం చేసేందుకే బెల్లమూ జీలకర్రా. కార్యక్రమ ఆరంభంలోనే 'బరువు కాదు- ఇది బాధ్యత' అన్నట్టు గంపలో వధువును తెచ్చి పెళ్ళిపీట దరికి చేరుస్తారు మేనమామలు. వధువు తల్లికి రక్తసంబంధ సోదరులైన మేనుమామలే వారు. వధువుకు వరుడు తాళికట్టే తరుణంలోనూ 'పెళ్ళంటే నూరేళ్ల పంట' అంటూ మంగళవాద్య ధ్వనులు. నూతన దంపతులపైన బంధుమిత్రాదులు కురిపించే అక్షతలు అ-క్షతాలు. పెద్దల దీవనలు కోరుతూ ఆ భార్యాభర్తలు నడిచే ఏడడుగులూ ఏడేడు జన్మల అనుబంధాలకు సూచికలు. వారు దర్శించే నక్షత్రమంత కాంతిప్రభ జీవితమంతా నిండి, కవిశ్రీ గీత మాధురిలా 'మమతామయివై సృష్టికి/ సమరస భావమ్ము నేర్పు సౌజన్యముతో/ రమణీయ రాగరంజిత/ సుమనోరథమెక్కి రమ్ము శోభనమూర్తీ' అని ఆహ్వానిస్తుంది.

చిలిపి నవ్వులూ కొంటె చూపులూ సరసాలూ మురిపాలూ పెళ్ళిరోజుకే పరిమితాలు కావు. పద్మరాగాల్లా, కుంద ప్రసూనాల్లా, ఇంద్రనీలాల్లా, పుష్పవర్షాల్లా శాశ్వత శోభితాలవి. లోకోత్తరులూ రాజవంశీకులైన సుచంద్ర, చంద్రికల పెళ్ళిఘట్టాన్ని స్మరణకు తెచ్చుకుంటే 'ఒకరి దరహాసం మరొకరికి మధుమాసం, ఒకరి చరణం మరొకరికి శశికిరణం'. అభినవ తార ఒకరైతే, రసమయ కాంతిధార మరొకరు. జడ అల్లి, బొట్టుపెట్టి, గంధంపూసి, వజ్రమాలిక వేసి- పెళ్ళికూతుర్ని చేశారామెను. రత్నాల పతకం, ముత్యాల బాసికం, కెంపుల ఉంగరం, రవ్వల భుజకీర్తితో అలంకరించారు అతణ్ని. అక్కడి ఆ అందాలూ ఆనందాలకు పరిమితులంటూ ఉంటాయా? అటువంటి భావగాఢతే పెద్దన రచనలో 'వలపుల సమత, తలపుల తనూలత'గా రూపుదిద్దుకుంది. భారతీయ వివాహ సంస్కారంలో, జంటతో చేయించే ప్రతి పనికీ ఓ అంతరార్థమూ ఓ పరమార్థమూ ఉంటాయి మరి. అందుకు ఎంతగానో స్పందించినందునే జపాన్ యువతి, యువకుడు భాగ్యనగరికొచ్చి మరీ తెలుగు సంప్రదాయ రీతిలో ఇటీవల పెళ్ళాడారు. చీర, ఉత్తరీయం అంచుల్ని కలిపి వేసిన ఆ బ్రహ్మముడితో ఇద్దరి జీవితాలూ హాయిహాయిగా తీయతీయగా చూపరుల కనుల పంటగా ముడివడ్డాయి. ఇక్కడి సంస్కృతి అపురూపమని, పెళ్ళిముస్తాబు అపూర్వమనీ మురిసిపోయారా ఇద్దరూ. మనసున మల్లెల మాలలూగించిన వారి ఆ అనుభవాల్ని చూసిన, విన్న ఎవరికైనా భారతీయతకు నమోస్తుతి చేయాలనిపించదూ


(ఈనాడు ,సంపాదకీయం , 31:03:2013)
____________________________________

Labels: , , , ,

Wednesday, April 17, 2013

1096- జలాభివందనం


సకల భువన పావని మన భరతావని. గంగా తరంగాలు పొంగి పొరలే ఈ నేల జన హృదయాంతరంగ తరంగిణి. గరికిపాటివారన్నట్టు ఇక్కడ 'నీటిబొట్టున కేదియు సాటిరాదు'. సిరులు నిండించుకుంటూ, కలలు పండించుకుంటూ సాగే గంగానదీ జలప్రవాహంలోని ఒక్కో నీటిచుక్కా భారతీయత పాలిట ఆశాదీపిక. ఈ నదీమతల్లితో పాటు యమునా సరస్వతుల సంగమ స్థలమైన త్రివేణికి చేరి 'ఒక్క చుక్కను తలమీద చల్లుకున్నా చాలు' అనుకునేవారు ఎందరెందరో. వీరంతా అనేకానేక ప్రాంతాలనుంచి వందల్లో వేలల్లో లక్షల్లో... అన్నీ కలిపి కోట్ల సంఖ్యలో ఫిబ్రవరి నెలలో  అలహాబాద్‌కి బారులు తీరడమే మహా కుంభమేళా. ఏటా ఎన్ని పర్వదినోత్సవాలున్నా, ప్రతీ పన్నెండేళ్లకీ పుష్కరాలొస్తున్నా, నూట నలభైనాలుగేళ్ల బహు సుదీర్ఘకాలం తరవాత సాగిన భక్తజన ప్రభంజన విశ్వవిఖ్యాత మేళా ఇదే. 'అడుగులో అడుగులో అకలంక మంకమై/ అడుగు వేసినదయ్య అలల రాణి/ నడకలో నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్య నల్ల తరగ/ పరుగులో పరుగులో పరమార్ద్ర భావమై పరుగెత్తి వచ్చెనా నురుగు నవ్వు' అనుకున్నప్పుడు సంగమ స్థలిలో పుణ్యస్నానం అపూర్వమూ అపురూపమే కాదు, మహా విశేషం మహా విశిష్టం కూడా. కుంభరాశిలోకి దినకరుడు అడుగిడిన  సందర్భంలో రోజుల పర్యంతం కొనసాగిన ఈ స్నాన పరంపర భిన్న విధానాల విభిన్న సంప్రదాయాల ఏకైక సమ్మేళనం. నాగరికత, ధార్మికత, సంస్కృతుల మేలు కలయికగా భాసించిన ఇది అన్ని వయసులవారికీ ఉమ్మడి వేడుక.

'అఖిలాండకోటి బ్రహ్మాండనాథు డంతరంగమున/ నెలకొనియుండగ నిక గావలసినదేమి?' అన్న త్యాగయ్యకు సమాధానమా అన్నట్టు సాగుతుంటాయి మేళా స్నానాదికాలు. పోయిన నెల పదో తేదీన మహాశివరాత్రి తరుణంలోనూ ఎటుచూసినా ఎక్కడ విన్నా ఇక శివానంద లహరులే. ఎక్కడైనా ఎప్పుడైనా నదులే జాతి సజీవతకు సూచికలు, సుగతికీ త్వరితగతి ప్రగతికీ వీచికలు. గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే పండేవి ఒక్క బంగారు పంటలేనా? ప్రజలందరి కలలూ కోరికలూ పండి... కవి అద్దేపల్లి అనుభవానికి వచ్చినట్టు 'నీళ్లు దోసిట్లోకి తీసుకుంటే అందులో సంస్కృతీ నిలబడుతుంది, గొంతులో పోసుకున్న నీళ్లతోపాటే చరిత్రా లోనికి ప్రవహిస్తుంది'. అదే రీతిన గంగమ్మను తలచుకున్నా 'తీర్థగమన ఫలంబెల్ల పుణ్యంబులకు విశేష'మన్న నన్నయకవి మాటా స్మృతిపథాన మెరవాలి. ఆ జలాల శుచి, శుభ్రత, రంగు, రుచి, వాసనలన్నీ ఇంపుగా ఉన్నప్పుడే- అక్కడి స్థితి సజావుగా ఉన్నట్టు. ఉత్తుంగ తరంగాల గంగకు ముకుళిత హస్తాలతో భక్తి నమస్కారాలు చేయాలే కానీ, వాటి స్థానే భయం కమ్ముకోకూడదు. 'అయ్యయొ! ముక్కు మూసుకొనుమయ్య!' అనేంతగా వాతావరణం ఉందంటే, అది కాలుష్య హారిణి కాదు- అక్షరాలా కాలుష్యకారిణే. వేదాలూ ఇతిహాసాల్లో చోటుచేసుకున్న నదీసంపదకు వర్తమానంలో ఎదురవుతున్న విపత్కర స్థితి అతి దుర్భరం. మన ఆశల ప్రశ్నలకు జవాబు కావాల్సిన కాలం మన ఆశయాలకే పెద్ద సవాలుగా మారుతుండటం- ఆరుద్ర చెప్పినట్టు 'కష్టాల కడగండ్ల నడుమ మొత్తంగా ఇరుక్కుపోవడం!' మామూలు రోజుల్లో పవిత్రత నిలపాల్సిన నదీస్నానాలు, ఘట్టాలు మహామేళా వంటి కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఉండితీరాలి.

దేశవిదేశాలవారు సందర్శించిన  కుంభమేళా స్థలి ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 17,ఆదివారం రథసప్తమి, 18 సోమవారం భీష్మాష్టమి కూడా ప్రధాన పుణ్యస్నానాల రోజులే. జనసందోహం పోటెత్తుండటంతో అసలు రూపురేఖలే మారిపోయే ఆ సంగమ ప్రదేశాన్ని పరిపూర్ణ అధ్యయనం చేసింది హార్వర్డ్ బృందం. 'చెదరిపోవునో శేషుని శిరములు/ బెదరిపోవునో దిక్కుంజరములు/ అదరిపోవునో అవనీతలమే' అన్నంతగా అలహాబాద్ నగర జీవనాన్ని చట్రంలో బందించిన వైనాన్ని  పరిశీలించారా సభ్యులు. జలమయం, జనమయం... రెండింటినీ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండటం 'ఏయే తీరము లూరడిల్లినవి తల్లీ! నీదు పొత్తిళ్లలో?/ ఏయే సారము లంతరించినవి మల్లీ! నీవు సాక్ష్యమ్ముగా?' అన్న ప్రశ్నల్ని వారిముందు ఉండడమూ సహజమే. పర్యావరణాన్నే కాక ప్రజారోగ్యం, సాంకేతిక సమాచార రంగాలనూ విశేషంగా ప్రభావితం చేసిన ఈ మేళా తదుపరి ఏర్పాటు 'కుంభమేళా' పేరిట ఉజ్జయిని కేంద్రంగా ఇక మళ్ళీ రెండేళ్లకే. అటు తరవాత క్రమంలో పూర్ణ కుంభమేళా నిర్వహణ ఉంటుంది. పేర్లు ఏవైనా, నిర్వహణ స్థలాలు ఎక్కడున్నా- అడివి బాపిరాజు ఆనాడే దర్శించినట్టు 'వడులలో గర్వాన/ నడలలో సుడులలో/ పరవళ్లు తొక్కుతూ ప్రవహించి' వస్తుంటుంది నదీమ తల్లి. ఆ జలదేవత ఒడిలో స్నానం ఎప్పుడైనా ఎక్కడైనా పరమ పవిత్రం, బహు ఆహ్లాదభరితం. ఇప్పుడు గంగమ్మతల్లినీ 'రసమయివై సదా హృదయ రంజనివై/ యనురాగ స్వర్ణ కుసుమిత వల్లివై, మధుర కోమల హాస విలాస రేఖవై' రమ్మని ఆహ్వానిస్తూనే ఎదురెళ్లడం చలచల్లని పాలవెల్లిలో జాబిల్లిని చూసినంత మధురం. మల్లెమొగ్గలను మెలమెల్లగా చల్లినంత మనోహరం కూడా. భక్తిశ్రద్ధలతో ఆ జననికి చేసే అభివందనం జనజీవితాల్లో విరిచందనం. 'జననీ! నీ అర్చనలు సర్వోదయశ్రీలు/ తల్లీ! నీ దీవనలు ధర్మవిజయశ్రీలు' అంటూ ముందుకు సాగడమే అందరి కర్తవ్యం. 

(ఈనాడు ,సంపాదకీయం , 17:02:2013)
____________________________________ 

Labels: , , , , ,

Wednesday, August 15, 2012

మన స్వాతంత్య్రం మేడిపండు!

అసత్యం నుంచి సత్యానికి (అసతోమా సద్గమయ), అజ్ఞానాంధకారంనుంచి జ్ఞానజ్యోతుల ప్రకాశానికి (తమసోమా జ్యోతిర్గమయ), మృత్యువునుంచి అమృతత్వానికి (మృత్యోర్మా అమృతంగమయ)... ప్రభూ, మమ్మల్ని తోడ్కొని వెళ్లు'- అంటూ చేసే ప్రార్థన సహస్రాబ్దాల భారతావని సంస్కృతీ సారం. అరవైఆరేళ్లనాడు ఇదే రోజున దేశమాత దాస్యశృంఖలాలు తెగిపడి, నడిరేయి స్వాతంత్య్ర భానూదయమైన వేళ ప్రతి భారతీయుడి గుండె ఆనందార్ణవమై ఘూర్ణిల్లిన మాట నిజం. 'ప్రాగ్దిశాకాశంలో వినూత్న తార'గా పండిట్ నెహ్రూ సంభావించిన స్వతంత్ర దేశం ఎలా సాధ్యపడింది? దోపిడి పీడనల వలస పాలనమీద యావద్దేశం ఒక్క తాటిమీదకొచ్చి పూరించిన సత్యాగ్రహ సమరశంఖం తెల్లవాడిని తరిమికొట్టింది. 'తమసోమా జ్యోతిర్గమయ' అంటూ అర్ధరాత్రి స్వాతంత్య్రం కోట్లాది తాడిత పీడిత జనావళి జీవితాల్లో ఉషోదయ కాంతులు ప్రసరిస్తుందన్న విశ్వాసంతోనే భారతావని ప్రగతి ప్రస్థానం మొదలైంది. ఆరున్నర దశాబ్దాల కాలగతిలో ఇండియా తన శక్తి సామర్థ్యాల మేరకు అభివృద్ధి సాధించగలిగిందా అన్న ధర్మసందేహం మొన్నామధ్య ప్రధానమంత్రికే కలిగింది. అభివృద్ధికి అవినీతిని సమానార్థకం చేసిన పాలకుల పాలబడి రాజ్యాంగ వ్యవస్థలే భ్రష్టుపట్టిన దురదృష్టకర వాతావరణం ఇప్పుడు దేశంపై దట్టంగా ముసురేసింది. అందులోనూ, ప్రగతి పేరిట అవినీతి జగతి సృష్టించిన వైఎస్ జమానా- సుహార్తో, మార్కోస్‌లాంటి మహామహా నేతల తలదన్నిన దోపిడి నమూనా! దాని దుష్ప్రభావాలు రాష్ట్రాన్ని నేటికీ వెంటాడుతుండగా, సీబీఐ అభియోగపత్రంలో అయిదో నిందితుడిగా ముద్రపడి తాజాగా మంత్రి పదవి త్యజించారు ధర్మాన! 'కొడుకు వలన, కొడుకు చేత, కొడుకు కోసం'గా ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ అస్మదీయ మంత్రులు, ఐఏఎస్‌ల అండతో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి పదుల వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్‌కు నిర్మించి ఇచ్చారు. 'కోట్లు మీకు- కోర్టులు మాకా' అని ఎంత గుస్సా పడితేనేం- నాటి పాపంలో పాల్పంచుకొన్నందుకు మంత్రులూ బాధ్యత వహించక తప్పదు. రాక్షసంగా జనానికి కీడుచేసే యంత్రాంగమే రాజకీయంగా చలామణీ అవుతోందిప్పుడు!

'గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్' అన్న భావన బలపడుతోందంటే, క్షీణ విలువలకు ఆటపట్టుగా జాతి దిగజారుతోందని అర్థం. నేడు భారతావనిని పట్టి కుదుపుతోంది అదే అనర్థం. భారత స్వాతంత్య్రోద్యమం పూర్తిగా త్యాగధనుల చరిత్ర. మందికోసం మాగాణులమ్ముకొన్న (అ)సామాన్యులు మొదలు, దేశహితం తప్ప మరేమీ పట్టని దార్శనికులు యాభయ్యేళ్ల క్రితందాకా నడయాడిందీ నేల! సొంత ఇల్లు లేని 'హోం'మంత్రిగా, దరిమిలా ప్రధానమంత్రిగా ఆయా పదవులకే వన్నె తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం నేటి నేతల్లో ఎందరికి తెలుసు?ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రైల్వేమంత్రి పదవిని త్యజించిన లాల్ బహదూర్ ముందు నేటి నేతలంతా పిపీలికాలే. 'ప్రయత్నలోపం లేకుండా ముందడుగేద్దాం... విజయం సాధిస్తే సంతోషం. విఫలమైతే రాజీనామా చేసి నిష్క్రమిస్తా'నని ప్రధానమంత్రిగా ఆయన చెప్పిన మాట సమున్నతాదర్శానికి కరదీపికే! అభియోగపత్రం దాఖలైతే రాజీనామా చెయ్యాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని కుతర్కం తీసిన లాలు మహాశయుల తలదన్నే నేతలు రాష్ట్రంలోనే దాపురించారు. ఫెరా ఉల్లంఘన కేసులో జైలుశిక్షకు గురైనా నైతిక బాధ్యతను తుంగలో తొక్కి పదవిని పట్టుకు వేలాడుతున్నారు ఓ మంత్రిసత్తములు! పదవులు చేపట్టేముందు చేసిన రాజ్యాంగ ప్రమాణాలే గీటురాయి అయితే మంత్రివర్గంలో అసలు మిగిలేదెందరు? 'రాజ్యాంగాన్ని ముట్టకుండానే, కేవలం పాలన యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాచి, దాన్ని భ్రష్టుపట్టించడం సాధ్యమే'నని 1949 అక్టోబరులోనే భారతరత్న అంబేద్కర్ హెచ్చరించారు. అక్రమాల ఏలికలు ఇప్పుడు చేస్తున్నవి అదే తరహా అవినీతి ప్రయోగాలు!

క్రమం తప్పక ఎన్నికలు జరగడమే ప్రామాణికమైతే, 'మేరా భారత్ మహాన్' అనుకోవాల్సిందే. డబ్బులు వెదజల్లి గెలవడం, మళ్ళీ అంతులేని సంపదలు పోగేసుకోవడానికి నానా గడ్డీ కరవడం- భారత ప్రజాస్వామ్య ముఖచిత్రం ఇదీ అంటే, సిగ్గుపడాల్సిందే! నేడు- నేరం, రాజకీయం అవిభాజ్యం; రాజ్యం అవినీతి భోజ్యం! 'కాగ్' లెక్కల ప్రకారం లక్షా 76వేలకోట్ల రూపాయల రాబడి నష్టానికి కారకుడైన అవినీతి 'రాజా'- సుప్రీంకోర్టు కొరడా ఝళిపించేదాకా కేంద్రమంత్రి పదవిలో ఎలా కొనసాగగలిగాడో తెలియనిది కాదు. పద్నాలుగుమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు రువ్విన అన్నా బృందమే అందుకు రుజువులు చూపాలంటున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రివర్యులు! 'ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపండి- వాస్తవాలుంటే, విచారణ జరిపిస్తాం' అన్నది వైఎస్ పెడధోరణి. అదే పంథాను కేంద్రమూ పుణికిపుచ్చుకొంటే- ఎక్కడికక్కడ దోచుకొన్నవాళ్లకు దోచుకున్నంత! అవినీతిపరులకు రక్షాకవచాలు తొడగడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పరస్పరం పోటీపడుతున్నాయని చెప్పక తప్పదు. పట్టుమని అయిదేళ్లలో రాష్ట్రం పుట్టిముంచి పదుల వేలకోట్ల రూపాయల అక్రమాస్తుల్ని జగన్‌కు దోచిపెట్టేలా నీకిది నాకది(క్రిడ్ ప్రో కో) బాటలో సాగిన వైఎస్, 26 జీఓలతో చీకటి లాలూచీలకూ చట్టబద్ధత కల్పించారు. ఆ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు సంబంధిత మంత్రులు, అధికారులకు నోటీసులు జారీచేస్తే న్యాయసహాయం పేరిట- మళ్ళీ ప్రజాధనాన్నే వెచ్చించి మచ్చపడ్డవాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తోంది కిరణ్ సర్కారు! ప్రజలకోసమే ప్రభుత్వాలున్నాయని, జనశ్రేయం కోసమే అవి పనిచేస్తున్నాయని ఎవ్వరూ గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పలేని మేడిపండు ప్రజాస్వామ్యం మనది. అధికార స్థానాల్లోని అవినీతి కుళ్లును ప్రక్షాళించడానికి సత్యాగ్రహ స్ఫూర్తితో జనం మరో స్వాతంత్య్ర సమరమే సాగించాలి!
(సంపాదకీయం, ఈనాడు , 15:08:2012)
____________________________________________

Labels:

Saturday, March 13, 2010

తరంతరం నిరంతరం...

రెండు దశాబ్దాల రెండేళ్ళ కిందటి మాట...
అప్పటి ప్రధాని ఎర్రకోటపై మూడు రంగుల బావుటా ఎగురవేసిన జండాపండుగపూట- దూరదర్శన్బుల్లితెరపై తేనెలూరే పాట! భీమ్సేన్జోషి మొదలుగానగాంధర్వుడు బాలమురళి దాకా రవిశంకర్సితార్తో జకీర్హుస్సేన్తబలాతోతలపడి నరేంద్ర హీర్వాణీ ప్రకాష్పదుకొణె వంటివారితో కలిసి ఆడుకుంటున్నట్లుఅమితాబ్బచన్‌, హేమమాలిని వంటి హేమాహేమీలతో జతకలిసి చేసినశ్రుతిలయల మాయ అది. ఇన్నేళ్ళు గడిచినా నవ్యమై భవ్యమై ఉండటానికికారణం- సమైక్యతారాగతోరణం మట్టి నుంచి పుట్టింది కావటమే! పీయూష్పాండే పద్దెనిమిది సార్లు రాసి చించిన పల్లవిని సురేశ్మల్లిక్‌, ఆర్తి, కైలాస్సురేంద్రనాథ్ఎంతో ఆర్తిగా సృజించారు గనకనే- ఆనాటి రాగేంద్రజాలం మనజాతిపాడుకునే మరో వందేమాతరంలాగా అనధికార జాతీయహోదాను అందుకోగలిగింది. ఆసేతుహిమాచల పర్యంతం
‌‌ ‌‌ ‌ ‌ ‌ 'మిలే సుర్‌ మేరా తుమ్హారా' గీతం అంత మన్ననలందుకోవడానికి రాగం తానం పల్లవులకన్నా అంతర్లీనంగాఅందులో మిళితమై సాగిన మన జాతీయతనమే ప్రధాన కారణమంటే కాదనేవారెవరూ ఉండరు. 'నా స్వరమూ నీ స్వరమూ సంగమమై మనస్వరంగా అవతరించె'నంటూ- దేశ నదీనదాలలోని వేదనాదాన్ని సాగర గంభీరతతోజతపరచి మేఘమాలికలవంటి రాగాలను కూర్చి సుతిమెత్తని భావుకతను అత్యంత హృద్యంగా ఆలపించి నేలనలుచెరగులా జాతి మత కుల వయో లింగ భేదాలకు అతీతంగా స్వరగాంధర్వులు చిరుజల్లులుగా కురిపించడమేఅపురూపం. రాగాల వర్షంలో తడిసి ముద్దగా మారని భారతీయుడెవడూ ఆనాడు లేడు, ఈనాడూ ఉండడు. గీతానికి కాలానుగుణమైన గుణాత్మకమైన మార్పులు చేసి 'ఫిర్మిలే సుర్‌' అంటూ గణతంత్ర వజ్రోత్సవ వేళ మరోమారునగారా' మోగించటం హర్షదాయకమే కాదు- దేశ కాల పరిస్థితుల దృష్ట్యా తక్షణావసరం కూడా!

ఆధునికతే నాగరికతగా భ్రమించే నేటి యువతకు వేల సంవత్సరాల ఘనచరిత గలభారతీయతలోని విశిష్టతపైన శీతకన్ను ఉండటం కలత కలిగించే విషయం. దాదాపు ఆరు వందల జిల్లాల్లో పదిహేడు రకాల భాషలు, రికార్డులకెక్కని మరెన్నోవందల యాసలు, రకరకాల మతాలు, మూడుకోట్ల ముప్ఫై లక్షల చదరపుకిలోమీటర్ల పర్యంతం పరచుకుని ఉన్న సువిశాల భారతంలో వృత్తుల వారీగాలెక్కకు అందని ఎన్నో కులాలు- ప్రవృత్తి రీత్యా చూసినా అత్యంత వైవిధ్యంగా నిత్యచైతన్యంతో సాగే జనజీవనానికి విభిన్నత్వమే బలం. ఏకత్వ భావలేమి బలహీనత. బౌద్ధం పుట్టిన హిందూదేశం ఇది. థెరెసాను మదర్గా గౌరవించిన వేదభూమి మనది. మైనారిటీల నుంచి నలుగురిని రాష్ట్రపతులుగా ఎంచుకున్నలౌకికరాజ్యం ఇది. రాష్ట్రపతి నుంచి సభాపతుల వరకు మహిళలు పాలన సాగిస్తున్న నేల కూడా మనదే. యోగులుబాలలైనా సాగిలపడే ఆధ్యాత్మిక విశాలత భారతీయులది. బడుగుల నుంచి ఎదిగిన మహానుభావుడు దేశానికిరాజ్యాంగ కల్పన చేశాడు! 'భారతదేశం నా మాతృభూమి... సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదనాకు గర్వకారణం...' అని చదువుకొనే ప్రతిజ్ఞ పాఠాన్ని వాచకాల మొదటి పుటల వరకే పరిమితం చేసే ప్రజ్ఞావంతులుపెరిగిపోతున్నారిప్పుడు. వరస మార్చి అయినా సరే, మన సంగీత్మహాన్ఏఆర్రెహమాన్‌ 'వందేమాతరం' గీతానికి కొత్తరాగాలను కూర్చి నవతరానికి ఉత్తేజం కలిగించిన తీరులో- 'ఫిర్మిలే సుర్మేరా తుమ్హారా'కు సైతం అదే సురేంద్రకైలాస్నాథ్నూతన స్వరాలను సమకూర్చడం తప్పేమీ కాదుకదా- తప్పనిసరిగా మిగతా సామాజిక హితుల తక్షణ విధి!

దేవులపల్లి వారు గీతించిన విధంగా కవి గాయక వైతాళికుడైనా భావ తాదాత్మ్యతకు దివ్య గీతామృతాన్నేనమ్ముకుంటాడు. 'అర్థమతులహంకృతులు అంధమతులు రాని/ నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని/ కొత్తజగం కొత్త యుగం కోరుకునే వారెవరికైనా, కులందాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి/ సమభాగం సమభాగ్యంసమసంస్కృతి నాటి/ కొత్త శాంతి, కొత్త కాంతి జగతి నిండాలని, భావించేవారికైనా పాటను మించిన వజ్రాయుధం లేదు. పల్లవిని మించిన దేవదత్తం లేదు. ఆకులందున అణగిమణిగిన కోయిల వలె పలికితే పలుకులకు పులకలెత్తిదేశాభిమానాలు మొలకెత్తుతాయని మహాకవి గురజాడ ఏనాడో పలికిన మాట. తెల్లవాడి పాలన తెల్లారి నేటికి భారతానఆరుపదులు దాటినా- ఉగ్రవాదం అగ్రవాదం ధాటికి మన ఇంట చీకటి తెరలింకా విడిపోనేలేదు. చీటికి మాటికిభాషాద్వేషాలు, కులం కుమ్ములాటలు, మతం మాత్సర్యాలు, ప్రాంతాల వారీగా పెరిగిపోతున్న పంతాలూ పట్టింపులతోవేడెక్కిపోతున్న వాతావరణం- 'ఫిర్మిలే సుర్‌' వంటి సుస్వరాలు కడుసొంపుగ కడలికి చేరి... మబ్బులై పైపైకి లేచిచల్లగా మెల్లగా మళ్ళీ మళ్ళీ చిరుజల్లులుగా కురిస్తేనన్నా చల్లబడుతుందేమో! ఇరవై రెండేళ్ళ కిందటి రాగమాలికనుమంది నవతారలతో కలిసి ఆరుపదుల కళాకారులు అరవై ఏళ్ళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అతి నవ్య రాగాలతోవారి వారి భాషల్లో గొంతెత్తి పాడటం దివ్యంగా ఉంది. ఇలాంటి జాతీయ సమైక్యతా గీతాలు మరిన్ని వచ్చి జాతి గుండెలమధ్య అడ్డుగోడలను కూలగొడతాయేమో చూడాలి!
(ఈనాడు, సంపాదకీయం, ౦౭:౦౨:౨౦౦౧౦)
____________________________________

Labels:

Wednesday, March 19, 2008

జెండా వూంచా... రహే హమారా..

పూర్వకాలంలో వీరుల రథాలకు పైన జెండాలుండేవి. వాటిని ధ్వజాలనేవారు. ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేక చిహ్నం ఉండేది. ఆయా ధ్వజ చిహ్నాలతో కలిపి వీరులను సంబోధించడం పరిపాటి. భీష్ముడు- తాళధ్వజుడు, అర్జునుడు- కపిధ్వజుడు అలా... రణరంగంలో తీవ్రమైన పోరు జరిగే సమయంలో వీరులను గుర్తుపట్టేందుకు వారి రథాలపై ఎగిరే జెండాలే ఆధారం. ఫలానా వీరుడితో పోరాడాలి, రథం పోనిమ్మని రథికుడు ఆజ్ఞాపించేవాడు. వారి టెక్కెపు గుర్తులను సారథి పసిగట్టి, ఆ దిశగా రథం నడిపించేవాడు. భారతం ఉత్తర గోగ్రహణ ఘట్టంలో కౌరవవీరుల రథాలపై రెపరెపలాడే జెండాలను తిక్కన గొప్పగా వర్ణించాడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాడు కలశజుండు... స్వర్ణమయ వేదిక గుర్తుగా ఉన్న జెండా ఎగురుతోందే... ఆ రథంలో అస్త్రవిద్యాగురువు ద్రోణాచార్యులవారు ఉంటారు.. మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి... మణులు కలిగిన మహాసర్పాన్ని సుయోధనుడు తన కేతనానికి చిహ్నంగా పెట్టుకున్నాడని అర్జునుడు మిగిలిన వీరుల ధ్వజ చిహ్నాల గురించీ ఉత్తర కుమారుడికి వివరిస్తాడు. అలా రథాలపై సగర్వంగా ఎగిరే జెండా ఆయా వీరుల శౌర్యప్రతాపాలకు ప్రతీక. పరాక్రమానికి చిహ్నం. పౌరుషానికి సంకేతం. కాలం పుటలపై వీరుల చరిత్రలను లిఖిస్తున్నాయా అన్నట్లుగా జెండాలు రెపరెపలాడుతుంటాయి. వారి విజయగాథలను ఆలపిస్తున్నాయా అన్నట్లుగా చిన్నగా సవ్వడి చేస్తుంటాయి. ప్రతి మహావీరుడికీ తన జెండా ప్రాణసమానం, జెండాను పడగొట్టడమంటే తలతెగ్గొట్టడమే! రథకేతనాన్ని విరవడం ద్వారా వీరుణ్ని నిర్వీర్యుణ్ని చేయడం యుద్ధవ్యూహంలో ఒక భాగం. వీరుల విషయంలో జెండా అంటే ఏదో మామూలు గుడ్డపీలిక ఎంతమాత్రమూ కాదు. అది పౌరుషచిహ్నం, సలసల కాగే రక్తం. సర్రున లేచే స్వాభిమానం, కణకణమండే తెగువ, కుప్పించి ఎగసే కసి. వీరుల కళ్లల్లో ప్రజ్వలించే అఖండ విజయకాంక్షకు ప్రతిరూపం జెండా!

దేశం విషయానికి వస్తే- అది జాతి స్వతంత్ర ప్రతిపత్తికి జయకేతనం. సర్వతంత్ర స్వతంత్ర భారతదేశ సార్వభౌమత్వానికి వైభవోపేతమైన చిహ్నం- మన జాతీయ జెండా! మనది త్రివర్ణపతాకం. జెండా అనే రెండక్షరాలకు, దానిలోని మూడురంగులకు- ప్రచండ మార్తాండమండల సహస్ర దుర్నిరీక్ష్య సహజ తేజోవిరాజితమైన ఘనచరిత్ర నేపథ్యంగా ఏర్పడి ఉంది. ఎందరో దేశభక్తుల త్యాగానికి వేదికగా, వారి గుండెచప్పుళ్ళ నివేదికగా భాసించింది. ఈ జాతిని ఉరకలెత్తించింది. ఉర్రూతలూగించింది. ఉత్సాహానికి ఊపిరులూదింది. కుంచెలను, కలాలను పరుగులెత్తించింది. గళాలను హోరెత్తించింది. మనజెండాను కీర్తించిన ప్రతిపదమూ, ప్రతిపద్యమూ, ప్రతిపాటా ఒక్కో జాతీయగీతమా అన్నంతగా ప్రాచుర్యం పొందాయి. జాతీయజెండా కనబడితే చాలు- పౌరులకు నాడు దేహం నిటారుగా నిలిచేది. చిన్నజెండాను చొక్కాగుండీకి గుచ్చిపెడితే, గుండెకే అతికించినంతగా స్పందింపజేసేది. థిల్లాంగ్‌ రాగచ్ఛాయలో హుందాగా సాగే మన వందేమాతర గీతం, గుండెల్లో గణగణగంటల సవ్వడిచేసే మన జనగణమన, నరనరాల్లో ఉత్తేజాన్ని నింపే మన మువ్వన్నెల జెండా... భారత జాతికి సౌభాగ్యం అనడం అతిశయోక్తి కాదు. గాంభీర్యం, ఔన్నత్యం, ఔజ్జ్వల్యం వంటి గొప్పపదాలకు సజీవప్రతీకగా ప్రకాశించేది మన మూడు రంగుల జెండా! ఆంధ్రుడు పింగళి వెంకయ్య రూపొందించిన ప్రస్తుత జాతీయజెండా స్వరాజ్య సమరోద్యమ చరిత్రలో సంచలనాలు సృష్టించింది. మన యోధులు సగర్వంగా ఎగరేసిన జెండాలను ఆంగ్లేయులు పీకి పారేసేవారు. అవి నేలను తాకరాదని, మట్టిపాలు కారాదని జాగృత కార్యకర్తలు నేలపై అడ్డంగా పడుకుని జెండా గౌరవాన్ని కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చేసేవారు. తాము ప్రాణాధికంగా ప్రేమించడమే కాదు, జెండాను ఎవరైనా అవమానపరిస్తే సహించని లక్షణం కూడా ఆ తరంలో ఉండేది.

ఇటీవలి కొన్ని పరిణామాలు చూస్తుంటే ఒకవైపు ఆవేదన, మరోవైపు ఆందోళన కలుగుతున్నాయి. ఈ దేశానికి స్వేచ్ఛ లభించిన ఆగస్టు పదిహేనో తేదీని మనం స్వాతంత్య్ర దినోత్సవంగానే కాక, 'జెండా పండుగ'గానూ పిలుస్తాం. అలాంటి పర్వదినం రోజున త్రివర్ణపతాకాన్ని తలకిందులుగా ఎగరేస్తున్న అధికారులు కనిపిస్తున్నారు. ఒక సినిమాలో విలన్‌ పాత్రధారి జెండాను చేతిగుడ్డలా వాడుతూ- దీనితో తుడుచుకుంటాను, ఏం చేస్తావని మిలిటరీ అధికారిని పెడసరంగా ప్రశ్నించి తన్నులు తింటాడు. జెండాకు తన కాళ్ళు తగిలేలా నిర్లక్ష్యంగా కూర్చుంటుందొక క్రీడాకారిణి. ఒక మోడలైతే జెండా రంగులను తన చీర అంచుగా డిజైన్‌ చేయించుకుని విలాసాలను ఒలకబోస్తుంది. నాటికి, నేటికి ఎంత తేడా! త్యాగబుద్ధీ, దేశభక్తీ పడుగూ పేకలుగా నేసిన అపురూపమైన, పవిత్రమైన జెండా పట్ల ఈతరం చూపించవలసినంత శ్రద్ధ చూపించడం లేదనిపిస్తోంది. జెండాలు మోసేవారికే పార్టీ పదవులని మన రాజకీయ నాయకులు ప్రకటిస్తుంటారు. జెండా మోయడమంటే పార్టీకి సేవ చేయడమనే వారి భావన. జెండాకు, పార్టీకి తేడాలేదని వారి అభిప్రాయం. పార్టీ సిద్ధాంతాలపట్ల అంకిత భావం, నిబద్ధత కొరవడితే జెండా మోయాలన్న ఆలోచనే రాదన్నది వారి నమ్మకం. ఆ రకంగా పార్టీకి, జెండాకు తేడా లేదన్న సందేశాన్ని శ్రేణుల్లోకి జొప్పిస్తారు. జెండాల రూపకల్పనలో రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. తమ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రతిబింబించేలా జెండాల్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటిది- కొన్నితరాలుగా ఎంతో గొప్పగా ప్రభావితం చేస్తూవచ్చిన జాతీయ జెండా పట్ల ఉదాసీనత న్యాయమేనా?


జెండాయే కేంద్రబిందువుగా సంకల్పించిన ఇటీవలి 'తిరంగా రన్‌' వయోభేదం లేకుండా వేలమందిని ఉత్తేజభరితుల్ని చేసింది. జెండా ప్రభావంలో లోపం ఏమీలేదు. కొద్దిమంది నిర్లక్ష్యంవల్లనే కొన్ని బాధాకరమైన సంఘటనలు ఎదురవుతున్నాయంతే. ఇలాంటి అవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజానీకం చైతన్యవంతమై స్పందిస్తే- మళ్ళీ మన జాతీయజెండాకు పునర్వైభవ ధగధగలు తథ్యమే!
(Eenadu, Editorial, 10:02:2008)
==============================

Labels: ,

Wednesday, December 12, 2007

మనదేశం

ఎవరి దేశమంటే వారికి ఎంతో ఇష్టం, అది సహజం. దేశాభిమానం దోషం కాదు. ఇతర దేశాలపట్ల, ఆ ప్రజల పట్ల చులకన భావం ఏర్పడినా, తన దేశంపట్ల అభిమానం మితిమీరి దురభిమానంగా మారినా- ఎదుటివారికి వెగటు పుడుతుంది. వెనకటికోసారి ఇలాగే ఒక ఇంగ్లిషాయన ''బ్రిటిష్‌ మహాసామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు తెలుసా'' అంటూ అదే పనిగా గొప్పలు చెబుతున్నాడు. తాపీ ధర్మారావు ఆ పెద్దమనిషిని ఆపి ''సూర్యుడు మీ దేశంలో ఎందుకు అస్తమించడో తెలుసా?'' అని అడిగారు. ఆయన తెల్లబోయాడు. అప్పుడు ధర్మారావే తాపీగా చెప్పారు-''చీకట్లో వదిలేస్తే మీరు నమ్మదగినవారు కాదు... చీకటిపడితే మీ ప్రవర్తన సరయినది కాదని సూర్యుడికి బాగా తెలుసు. అందుకే ఇక్కడ ఆయన అస్తమించడానికి జంకుతాడు''! ''దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌. గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌''- అని గురజాడ ప్రబోధించడంలో ఉద్దేశమదే అనిపిస్తుంది. కేవలం మాటల్ని కోటలు దాటించడం కాదు, మేలు చేసే పని ఏదైనా తలపెట్టడమే దేశభక్తికి చిహ్నమని మహాకవి భావంగా తోస్తుంది. ''అత్యున్నతమైన ఆశయాలు, ఉదాత్తమైన లక్ష్యాలు, ఉత్తమమైన భావాలు కలిగిన ఒక వ్యక్తి కోరుకునేవన్నీ భారతదేశంలో ఉన్నాయి కనుక నాదేశం నాకు చాలా ఇష్టమైన దేశం'' అన్నారు మహాత్మాగాంధీ. ఈ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు కనుక రాయప్రోలు ''విపుల తత్వము విస్తరించిన విమల తలమిది'' అంటూ మనదేశాన్ని కొనియాడారు. కృష్ణశాస్త్రి వంటి భావకవి కలంలో 'జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి'గా ఆవిష్కృతమైన ఈ పవిత్రదేశం, ఆంధ్రపురాణ కర్త మధునాపంతులకు 'మంగళక్షితి'గా దర్శనమిచ్చింది. ''ఇతర క్షోణిని లక్షలిచ్చినను గానీ పుట్టను... ఈ భారత క్షితిపై వేద పురాణ శాస్త్ర కృతి రాశి స్థానమీ మంగళక్షితిపై...'' పునర్జన్మ కావాలనుకోవడాన్ని 'దివ్యజ్జీవ సంస్కారం'గా భావన చేశారాయన.

కళాకారుల అభిప్రాయమూ అంతటిదే. మన మంగళ వాయిద్యం సన్నాయి మాదిరిగా ఉత్తరాదిలో భజంత్రీలకు పెళ్ళి పందిళ్ళకూ పరిమితమైన షెహనాయికి అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలపై కనకాభిషేకాలు జరిపించిన రససిద్ధుడు ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌. అమెరికాలో స్థిరపడవలసిందిగానూ, ఈ 'పూర్‌ ఇండియా'లో లేని సకల సదుపాయాలను అందుకోవలసిందిగానూ ఆయనను ఆహ్వానిస్తే- ''నన్ను తీసుకెళతారు సరే, ఈ గంగామాయిని అమెరికా ఎలా రప్పించగలరు?'' అని అడిగారాయన. భిస్మిల్లాఖాన్‌కు వారణాసి అన్నా గంగానది అన్నా ప్రాణసమానం. 'ఇస్‌ దేశ్‌మే గంగా బెహతీహై'! అదొక్కటిచాలు- ప్రపంచదేశాల మధ్య భారతదేశం సగర్వంగా తలెగరేయడానికనేది ఖాన్‌ దృఢాభిప్రాయం. సరిగ్గా అలాగే ప్రకటించాడు జర్మనీ మేధావి మేక్స్‌ ముల్లర్‌ కూడా. 'పునర్జన్మంటూ ఉండి ప్రభువును ఏమని ప్రార్థిస్తావ'ని అడిగితే 'గంగానదీ తీరాన పుట్టించమంటా'నని స్పష్టంగా చెప్పాడాయన. ఆ మధ్య ఒక సర్వే నిర్వహిస్తే విదేశాల్లో స్థిరపడిన ఆధునిక యువతరంలో తొంభైశాతం తమ వృద్ధాప్య జీవితాన్ని మనదేశంలోనే గడపాలని ఉందని, మళ్ళీ ఈ దేశంలోనే పుట్టాలని ఉందని తమ నిశ్చితాభిప్రాయంగా ప్రకటించారు.

కవులు, కళాకారులు, ప్రాచీనులు, ఆధునికులు, భారతీయులు, పాశ్చాత్యులు, హిందువులు, ముస్లిములు, జానపదులు... అందరిదీ ఇదే ధోరణి! ఈ సాహిత్యం, ఈ జీవజలాలూ, ఈ గాలీ, ఈ నేలా... ఏమిటిదంతా? ఒకేరకమైన ఈ భావ పరంపర ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నది? మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఈ గాలి నుంచి ఈ మట్టి నుంచి ఈ జలాల నుంచి ఏ దివ్య భావనల్ని మన శరీరాల్లోని జీవాణువులు గాఢంగా పీల్చుకుంటున్నాయి? అమోఘమైన ఏ పవిత్ర చైతన్యపు సూక్ష్మాతి సూక్ష్మమైన అణురజం మన రక్తంలోకి ఇంకిపోతోంది? మహర్షులు, మహాపురుషుల ఉనికిలోని ఏ వైశిష్ట్యం మనదేశానికి ప్రపంచ దేశాలన్నింటా ఒక ప్రత్యేకతను, పూజార్హతను ఆపాదిస్తున్నది? మహర్షుల కవిత్వాల్లో ఒదిగిన, మహానుభావులు తమ తమ కళాస్వరూపాల్లో పొదిగిన మహోదాత్త జీవ సంస్కారాలను, ఆశయాలను, లక్ష్యాలను, భావాలను వేటిని ఆకళించుకున్నాక- మహాత్ముడు ఈ దేశంపట్ల పరమప్రీతిని పెంపొందించుకుని 'నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను' అని ప్రకటించాడు? ఈ దేశాన్ని ప్రేమించడమంటే దాని జీవలక్షణాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన పెంచుకోవడమే. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్న పానీయాలు, వస్త్రాభరణాలు, కళాసంగీత సాహిత్య విజ్ఞాన విశేషాలు, భాషలు, జీవితంపట్ల ప్రజల విశిష్ట దృక్పథం... ప్రజల మనుగడలోంచి తొంగిచూసే ఎన్నో అంశాలను కలిపి పోగేస్తే అది ఆ దేశ సాంస్కృతిక స్వరూపం. ఒక జాతి నాగరికతను, ఔన్నత్యాన్ని అంచనా వేయాలంటే ఆ దేశంలో విలసిల్లిన సాంస్కృతిక వైభవాన్ని క్షుణ్నంగా అర్థంచేసుకోవాలి. అది ఉన్నతమైన స్థితిలో ఉంటే- ఆ జాతిని ఆ సంఘాన్ని మనం నాగరికంగా అభివృద్ధి చెందిన జాతిగా సంఘంగా కీర్తించాలే తప్ప వాటి జనాభా లెక్కల్ని బట్టికాదు. 'నాగరికత అనే పదార్థానికి రూపాన్నిచ్చేది సంస్కృతి' అని అరిస్టాటిల్‌ నిర్వచించడంలోని ఆంతర్యం అదే. ఆ రకమైన సమగ్ర స్వరూపాన్ని దర్శించాడు కాబట్టే మేక్స్‌ ముల్లర్‌- ''సమస్త విద్యలకు సర్వశాస్త్రాలకు సకల కళలకు స్థావరం భారతదేశం. ప్రపంచ దేశాలకు నాగరికతను భిక్షగా పెట్టిన దేశమది'' అని విస్పష్టంగా ప్రకటించాడు. అంతటి గొప్ప దేశం భారతదేశం! మనమంతా ఆ దేశం వారసులం!
(Eenadu, 09:12:2007)
______________________________________

Labels:

Sunday, August 26, 2007

మేరా భారత్‌ మహాన్‌!

-ఎవరి జన్మభూమి వారికి ప్రియమైనదిగా అనిపించినా, ఏ దేశం ప్రత్యేకత దానిదే అయినా- భారతదేశం సంగతి వేరు. ఈ దేశం భోగభూమి కాదు, కర్మభూమి. అనాదిగా చరిత్రలో, గాథల్లో కర్మభూమిగా పేరుపొంది మన్ననలందుకొంది. భారతావని నాలుగు వేదాలకూ పుట్టినిల్లు. గౌతమబుద్ధుని బోధనలతో, ఆదిశంకరుల ఉపదేశాలతో, వేదఘోషలతో పులకించిన పుణ్యసీమ. ఈ దేశంలో జన్మించటమే మహద్భాగ్యం అని కవులు కీర్తిగానాలు చేశారు. ''ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జనియించినాడవీ స్వర్గఖండమున-'' అన్న కవి, ''లేదురా ఇటువంటి భూదేవి యెందు...'' అనీ అన్నారు. తమ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదని ఎందరో భావిస్తుంటారు. ఈ విషయంలో అమెరికన్లు, బ్రిటిష్‌వారు అగ్రస్థానంలో ఉంటారు. ఓ క్లబ్బులో ఓ అమెరికన్‌ పెద్దమనిషీ, ఇంగ్లిషాయనా మాట్లాడుకుంటున్నారు. అమెరికా పెద్దమనిషి తన దేశం ఎంత గొప్పదో వివరిస్తూ గొంతు చించుకొని అనర్గళంగా ఉపన్యసించాడు. ఇంగ్లిషాయనమాత్రం ఒక్క మాటా మాట్లాడకుండా మూతి బిగించుకొని కూర్చున్నాడు. ''అదేమిటండీ ఆ అమెరికా బాబు తన దేశ గొప్పతనం గురించి అంతగా చెబుతుంటే మీరేమి మాట్లాడరేం? మీరూ మీ దేశం ఎంత గొప్పదో నాలుగు ముక్కలు చెప్పవచ్చుకదా?'' అన్నాడు వారితోపాటే ఉన్న మూడో వ్యక్తి. ''వేరే చెప్పటం ఎందుకు? ఆ విషయం ప్రపంచమంతటికీ ముందే తెలుసు'' అన్నాడు ఇంగ్లిషాయన గంభీరంగా.

దేశాభిమానమే కాదు ప్రాంతీయాభిమానమూ సహజంగా ఉండేదే. ''మనం కృష్ణాతీరం వాళ్ళం. పేరు గొప్పే కాదు, ఎక్కడికి వెళ్ళినా పెద్దపీట వేయించుకుంటాం...'' అంటుంది రాజమ్మ అనే ఆమె మల్లాదివారి 'కృష్ణాతీరం' నవలలో. ''ఏటి ఒడ్డున పుట్టిన వాళ్ళెవరైనా అలానే అంటారు. అటు పెన్నలో వాళ్ళు, ఇటు గోదావరిలో వాళ్ళూను. అక్కడ నన్నయ, ఇక్కడ తిక్కన పుట్టుకొచ్చారు'' అని ఎదురు చెప్పినవారికి- ''ఆఁ... భారతమూ పుట్టుకొచ్చింది... మూడూళ్ళు తిరిగితేకాని ముడిపడలేదు. కృష్ణ ఒడ్డున కూర్చొని సంకల్పం చెప్పుకొని, ఒంటిచేతిమీద భాగవతం రాశాడు ఆ పేదబ్రాహ్మడు. అన్నీ నదులే కాని ఇదిరా నాయనా తేడా'' అంటుంది రాజమ్మ. తమ ప్రాంతం పట్ల గల అభిమానం ప్రతివారిచేతా ఇలానే వాదనలు చేయిస్తుంటుంది. పుట్టిన దేశంపై అభిమానం, భక్తీ అవశ్యం ఉండవలసినవే. పాశ్చాత్య నాగరికతా ప్రభావంలో పడి తమ దేశం కంటే ఇతర దేశాల్లో పరిస్థితులే బాగున్నాయని భ్రమించేవారు కొందరుంటారు. చదివింది అయిదో ఫారమే అయినా పైచదువులకు ఇంగ్లాండు వెళ్ళటమే భేషయిన పని అనుకున్న మొక్కపాటివారి పార్వతీశం బారిష్టర్‌ చదువు కోసం పడిన తిప్పలు తెలుగువారిని కడుపుబ్బా నవ్వించాయి. ఎంతయినా ఉన్న ఊరు, కన్నతల్లి, పుట్టినదేశాలకు సాటి వచ్చేవి మరొకటి ఉండవు.

దేశభక్తిలో, దేశం పట్ల మమకారంలో భారతీయులే అగ్రగణ్యులు. ఈ విషయం ఢిల్లీకి చెందిన ఏసీ నీల్సన్‌ కంపెనీ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో తేలింది. మళ్ళీ జన్మంటూ ఉంటే భారతీయులుగానే పుట్టాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం- అన్నది ప్రతి పదిమంది భారత పౌరుల్లో తొమ్మండుగురు వెలిబుచ్చిన అభిప్రాయం. సర్వేలో పాల్గొన్నవారిలో 89 శాతం తిరిగి భారతదేశంలో జన్మించాలన్నదే తమ ప్రగాఢవాంఛ అని చెప్పారు. తాము భారతీయులమని చెప్పుకోవటానికి గర్వపడతామనీ వారన్నారు. భారతీయులుగానే తిరిగి జన్మించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్న నిర్వాహకుల ప్రశ్నకు వారు దీటుగానే జవాబు ఇచ్చారు. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టని కోటగా భారతదేశం విల్లసిల్లుతోందని, విదేశీ సంస్కృతుల వెల్లువ దేశాన్ని ఎంతగా ముంచెత్తుతున్నా భారతీయత చెక్కు చెదరకుండా నిలిచి ఉంటోందని, ఆ కారణంగానే వచ్చే జన్మలోను తాము భారతీయులుగానే ఉండాలని కోరుకుంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో సగంమంది చెప్పారు. దేశంలో ఎన్నో భాషలున్నా, విభిన్న సంస్కృతులు, ప్రాంతాలు ఎన్ని ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో పరిఢవిల్లుతోందని, భారతీయుల పరస్పర మమతానుబంధాలను ఆ భావమే కాపాడుతోందని, ఆ కారణంగానే తాము భారతీయులుగా ఉండటానికే ఇష్టపడతామనీ వారన్నారు. భారత్‌లో కుటుంబ వ్యవస్థ విశిష్టమైనదని, గొప్పదనీ ప్రపంచంలోని ఏ దేశంలోను ఇంతటి ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థ లేదనడంపై భిన్నాభిప్రాయాలకు తావెక్కడిది? ఇక్కడి రాజకీయ వ్యవస్థ ఘోరంగా తయారైందని విమర్శించినవారి సంఖ్య గణనీయంగానే ఉంది. పేదరిక నిర్మూలనపై మరింత శ్రద్ధ వహించాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని, విద్యారంగంపై అధిక శ్రద్ధ వహించి నిరక్షరాస్యత కనపడకుండా చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది భారతదేశంలోని జీవనమే సుఖజీవనం అని నమ్ముతూ వచ్చే జన్మలోను భారతదేశంలోనే పుట్టాలన్నది తమ కోరిక అని చెప్పారు. అందుకే అన్నారు- జననీ జన్మభూమీ స్వర్గాదపి గరీయసీ అని!
(Eenadu,25:08:2007)
---------------------------------------------

Labels: ,