హేమలతా లవణం మృతి
ప్రముఖ కవి గుఱ్ఱం జాషువా కుమార్తె హేమలతా లవణం(76) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం 3-50 నిమిషాలకు విజయవాడలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా వినుకొండలో గుఱ్ఱం జాషువా మరియమ్మలకు 1932 సంవత్సరం ఫిబ్రవరి 26న జన్మించారు. ఆమె హైస్కూల్ విద్య గుంటూరులో సాగింది. మద్రాసు యూనివర్సిటీ నుంచి డిగ్రీలో గోల్డ్ మెడల్ పొందారు. గోరా కుమారుడు లవణంతో(78) వివాహమైంది. విజయవాడ ప్రముఖ వైద్యుడు సమరం లవణానికి తమ్ముడు.
స్టూవర్టుపురం దొంగల పునరావాసం... సంస్కరణ, జోగినీ దురాచారంపై హేమలతా లవణం విశేషంగా కృషి చేశారు. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు పునరావాస సేవలందించారు. 1979లో ప్రకాశం, నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుపాను విపత్తు సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా నాన్న గారు జాషువా!, అహింసా మూర్తుల అమరగాథ, జీవనసాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, జీవన ప్రభాతం, తాయెత్తులు గమ్మత్తులు పుస్తకాలను రచించారు. ఆమె సంఘసేవికగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, తానా ఎచ్చీవ్‌మెంట్, వరల్డ్ ఎచ్చీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి తెలుగు ఆత్మగౌరవ అవార్డులు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి నుంచి ఉగాది పురస్కారాన్ని, అంబేద్కర్ శతజయంతి సందర్భంగా భీమరత్న అవార్డును పొందిన ఏకైక మహిళ హేమలత. గుఱ్ఱం జాషువా ఫౌండేషన్ స్థాపించి దేశంలో తొమ్మిది మంది కవులకు పురస్కారాలు అందజేశారు. గుఱ్ఱం జాషువా, రచయిత డా|| సి. నారాయణరెడ్డిలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. దళితుల సమస్యలను సామాజిక సమస్యలుగా పరిష్కారానికి కృషిచేసి, మానవ విలువలతో పనిచేసి దేశంలో అందరి ప్రతినిధిగా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నాస్తిక కేంద్రం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని నాస్తిక కేంద్రం నిర్వాహకులు తెలిపారు.
సెషన్స్ మెట్రోపాలిటన్ జడ్జి ఐజక్ ప్రభాకర్, ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆదిత్యప్రసాద్, కృష్ణకుమారిలు స్వాతంత్య్ర సమరయోధులు పరకాల పట్టాభిరామారావు, రావూరి అర్జునరావు, ధనలక్ష్మిలు, ఘంటశాల నృత్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ కె.వి. రెడ్డిలు హేమలత భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం వ్యక్తంచేశారు.
(Eenadu, 20:03@2008)
===============================
Labels: Personality
0 Comments:
Post a Comment
<< Home