సోగ్గాడు ఇక లేరు : ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు గుండెపోటుతో హఠాన్మరణం
కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను సోగ్గాడిగా అలరించిన నటభూషణ శోభన్‌బాబు (71) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నై చూలైమేడులోని తన స్వగృహంలో ఉదయం 9 గంటల సమయంలో ఆయన కుర్చీలో కూర్చుని పత్రిక చదువుతుండగా... ఆయన భార్య అల్పాహారం తీసుకురావడానికి వెళ్లారు. ఇంతలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి కుర్చీలోంచి నేలపై పడిపోయారు. ముక్కుచిట్లి రక్తస్రావమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కారులో అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శోభన్‌బాబును బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 9.40 గంటలకు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి భౌతికకాయానికి నివాళులులర్పించారు. శోభన్‌బాబుకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కరుణాశేషు, కుమార్తెలు మృదుల, నివేదిత నగరంలోనే ఉంటున్నారు. మరో కుమార్తె ప్రశాంతి భర్తతో కలిసి ఆమెరికాలో ఉంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత శుక్రవారం శోభన్‌బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన తండ్రి హఠాన్మరణం పాలవుతారని ఊహించలేకపోయామని కరుణాశేషు విలేకరులతో వ్యాఖ్యానించారు.
న్యాయశాస్త్రం ఆపేసి కథానాయకుడిగా...
శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. 1937 జనవరి 14న కృష్ణా జిల్లా మైలవరం సమీపంలోని చిన్ననందిగామలో ఆయన జన్మించారు. తండ్రి ఉప్పు సూర్యనారాయణరావు. తన అమ్మమ్మ ఊరైన కుంటముక్కలలో పదిహేనేళ్లు ఉన్నారు. మైలవరంలో చదువుకున్నారు. ఉంగుటూరు మండల పొట్టిపాడుకు చెందిన శాంతకుమారిని ప్రేమించి 1958లో వివాహం చేసుకున్నారు. విజయవాడలో విద్యాభ్యాసం తర్వాత శోభన్‌బాబు న్యాయశాస్త్రం చదవడానికి మద్రాసు వచ్చారు. అదే సమయంలో సినీరంగంలోకి ప్రవేశించడంతో న్యాయశాస్త్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆయన తొలిసారిగా వసంతకుమార్‌రెడ్డి దర్శకత్వంలో దైవబలం అనే సినిమాలో చిన్న పాత్ర వేశారు. అయితే తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం భక్తశబరి. 'వీరాభిమన్యు' చిత్రంతో గుర్తింపు పొందిన ఆయన... కార్తీకదీపం, స్వయంవరం, బలిపీఠం, మహరాజు, ఇల్లాలు ప్రియురాలు, దేవాలయం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో స్టార్‌గా మారారు. కుటుంబ కథాచిత్రాల ద్వారా భర్తంటే ఇలాగే ఉండాలి అనుకునేంతగా మహిళా ప్రేక్షకుల అభిమానం పొందారు. ఆయన మొత్తం 236 సినిమాల్లో నటించారు. చివరిసారిగా హలోగురు అనే చిత్రంలో నటించారు.
శోభన్‌బాబు మరణంతో ఆయన పుట్టిపెరిగిన గ్రామాలైన చిననందిగామ, కుంటముక్కల విషాదంలో మునిగిపోయాయి. చెన్నైలో స్థిరపడిన తర్వాత కూడా ఆయన ఏడాదికోసారైనా ఇక్కడికి వచ్చి అందరినీ పలకరించేవారు. శోభన్‌బాబు మరణం విషయం తెలియగానే బంధుమిత్రులు వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లారు. పలువురు ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. తన సినిమా విడుదల కాగానే ఫోన్‌చేసి 'ఎలా ఉంది బాబాయ్' అని అడిగేవారని శోభన్‌బాబు చిన్నాన్న ఉప్పు పెద వెంకటేశ్వరరావు (కృష్ణయ్య) 'న్యూస్‌టుడే'తో చెప్పారు. తనకు పెద్దమ్మ కుమారుడైన శోభన్‌బాబు తనను ఎంతో ఇష్టంగా చూసుకునేవారని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు తెలిపారు.
బహుదూరపు బాటసారి ''సినిమా అనేది ఓ కళ. నిజమే... కానీ ఇప్పుడు పరి'శ్రమ'గా మారింది. కాబట్టి విరామం, విశ్రాంతి తప్పవు'' అన్నది శోభన్‌బాబు అభిప్రాయం. నటన ఒక వృత్తేననీ, అందులో కూడా ఓ దశకు చేరాక విరమణ చేయాల్సిందేనని చెప్పేవారు. అరవయ్యేళ్లు వచ్చేసరికి సినిమాల నుంచి తప్పుకోవాలని ప్రగాఢంగా వాంఛించారు. అందుకు తగినట్లుగానే 59వ ఏటనే 'హలో గురూ' సినిమాతో నట జీవితానికి స్వస్తిచెప్పారు. ఆపై మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ఈ విషయంలో ఎంత ప్రణాళికతో మెలిగారో... నటుడిగా ఉన్నప్పుడూ అంతే క్రమశిక్షణతో వ్యవహరించారు. చెన్నై వచ్చిన మొదట్లో సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగిన శోభన్‌బాబు 'వీరాభిమన్యు' చిత్రానికి ముందు ఓదశలో స్వగ్రామం వెళ్లిపోవాలనుకున్నారు. ఆ సినిమాలో అవకాశం రావడం, అది ఘనవిజయం సాధించడంతో తన నిర్ణయం మార్చుకున్నారు. అయితే ఆ తర్వాత అరకొర వేషాలే రావడం, కుటుంబ బాధ్యతలు పెరగడంతో అనేక కష్టాలు పడ్డారు. ఈ అనుభవాలే ఆయనకు ఆర్థిక పాఠాలు నేర్పాయి. పొదుపుగా జీవించడాన్ని అలవాటు చేశాయి. తొలినాళ్లలో శోభన్‌బాబుకి ఎన్టీఆర్ అండదండగా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా కొన్ని అవకాశాలు ఇప్పించారు. దర్శకుడు వి.మధుసూదనరావుని శోభన్‌బాబు గాడ్‌ఫాదర్‌గా భావించేవారు. లెక్కంటే లెక్కే: శోభన్‌బాబు పారితోషికం విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. షూటింగ్ సమయంలో తన కోసం వచ్చే అతిథులకు నిర్మాణ సంస్థ కాఫీ, టీ, టిఫిన్లు అందిస్తే వాటి ఖర్చుని తన పారితోషికంలోంచి మినహాయించమని కచ్చితంగా చెప్పేవారు. అలాగే నిర్మాతకు సంబంధించిన ఫోన్ నుంచి ట్రంక్‌కాల్స్ లాంటివి చేసినా వాటి బిల్లుని అణాపైసలతో చెల్లించేవారు. సినీరంగంలో వారాంతపు సెలవుల్ని అమలు చేసిన తొలి హీరో శోభన్‌బాబే. భూమిని నమ్ముకొంటే తిరుగులేదని నమ్మి ఆయన విజయం సాధించారు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని భూములు, భవనాలపై పెట్టుబడిగా పెట్టారు. అదే ఆయన్ని సంపన్నుణ్ని చేసింది. ఈ సూత్రాన్ని ఆచరించడమే కాకుండా సహనటులకు, సాంకేతిక నిపుణులకూ చెప్పేవారు. వ్యక్తిగత జీవితంలో ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ముందుగా చెన్నైలోని కొన్ని అనాథాశ్రమాలకు వెళ్లి ఆర్థిక సాయాన్ని అందించేవారు. తన ఇంట్లో పనిచేసే సిబ్బందికి ఇంటి సమీపంలోనే వసతిగృహాలు నిర్మించి ఇచ్చారు. |
గంపలగూడెం, న్యూస్‌టుడే: శోభన్‌బాబు హఠాన్మరణం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని గుళ్లపూడిలోని అతని సోదరి కుటుంబంలో విషాదం నింపింది. శోభన్‌బాబు రెండో సోదరి ఝాన్సీలక్ష్మీభాయి ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఇక్కడ చనిపోయారు. తన చెల్లెలిపై అమితమైన మమకారం కలిగిన శోభన్‌బాబు ఆమె మరణ వార్త తెలిసినప్పటి నుంచి మనోవ్యధకు లోనయ్యారని ఇక్కడి కుటంబసభ్యులు తెలిపారు. చెల్లెలు మృతి చెందిన నెల రోజులుకే అన్న చనిపోవటం గమనార్హం. చెల్లెలు మృతి చెందడంతో బాధపడుతూ ప్రతి రోజు ఇక్కడకి ఫోన్ చేసి గద్గద స్వరంతో ఆవేదన చెందేవారని, అది తట్టుకోలేకనే గుళ్లపూడిలో చెల్లెలి కర్మకాండలకు తన కుంటుంబ సభ్యుల్ని మాత్రమే పంపారని చెప్పారు. శోభన్‌బాబు కుటుంబానికి సంబంధించి నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవటం వారి బంధువుల్లో విషాదాన్ని నింపింది. |
అజరామరుడు.. ఈ సోగ్గాడుఖాళీ చెక్ ఇచ్చినా:
ఆగిపోయిన గడియారం కూడా ఇరవైనాలుగు గంటల్లో రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని అది పనిచేస్తోందనుకుంటే భ్రమే! ఈ విషయం అందరికన్నా శోభన్‌బాబుకి బాగా తెలుసు. భ్రమల్ని పటాపంచలు చేస్తూ వాస్తవిక దృక్పథంతో ఆయన ఆలోచించారు. వృత్తి జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య స్పష్టమైన హద్దు ఏర్పరచుకుని... సరిహద్దులోనే మసలుకున్నారు. నలుగురూ అసూయపడేలా నాణ్యవంతమైన జీవితాన్ని కడదాకా కొనసాగించారు.
'పెదవులపైన సంగీతం.. హృదయంలోన పరితాపం. సెగలై రగిలే నా బతుకు.... చివరికి పాడెను ఈ గీతం'. - 'పుణ్యవతి' సినిమాలో శోభన్‌బాబు మీద చిత్రించిన పాట ఇది. దీని ప్రభావం ఆయన మీద ఎంత వరకూ ఉందో తెలీదుగానీ, తన కెరీర్‌కి అలాంటి ముగింపు రాకూడదని ఆయన గట్టిగా కోరుకునేవారు. ఇందులో రెండు కోణాలు. మొదటిది వాస్తవిక దృక్పథం... రెండోది మానసిక ఉద్వేగం... ''మనిషి యంత్రం కాదు.. కాకూడదు. రకరకాల మాస్కులు వేస్తూ.. తీస్తూ అనుక్షణం ఒత్తిడితో సావాసం చెయ్యకూడదు. ఉద్యోగంలో విరమణ ఎలా ఉంటుందో వృత్తిలోనూ అది ఉండాలి. కీళ్లు అరిగిపోయినా కీ ఇస్తే ఆడే మరబొమ్మలాగా మనిషి మారిపోకూడదు''.. ఇదీ శోభన్‌బాబు వాస్తవిక దక్పథం తాలూకు సారాంశం.
ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలంటే భారీ స్కోర్ ఎంత అవసరమో వృత్తి జీవితాన్ని విరమించే వేళకి ఆర్థిక భద్రత అంతే అవసరం. అందుకే శోభన్‌బాబు దూరదృష్టితో భూమిని నమ్ముకున్నారు. మేకప్ చెరిపేసుకున్న పది సంవత్సరాల తరవాత కూడా ఆయన్ని కెమెరా ముందుకు రప్పించాలని ఎందరో ప్రయత్నించారు. వూహించని స్థాయిలో పారితోషికాలు వూరించినా తన నిర్ణయానికే ఆయన కట్టుబడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. 'అతడు'లో మహేష్‌బాబు తాత వేషం కోసం నిర్మాత మురళీమోహన్ బ్లాంక్ చెక్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. ఆకర్షణీయమైన సినీ ప్రపంచంలో అనిశ్చితి ఎలాంటిదో శోభన్‌బాబుకి బాగా తెలుసు. మళ్లీ వేషం వేయడం అంటే అనిశ్చితిని ఆవాహన చేసుకుంటూ ఒత్తిళ్లపొత్తిళ్లలో కేకలు పెట్టాల్సి ఉంటుందని భావించారు. ఆ జ్ఞాపకాలను కూడా వద్దనుకున్నారు. ఏదైనా ఛానెల్‌లో తను నటించిన సినిమా వస్తుంటే తట్టుకోలేక ఛానెల్ మార్చే ఉద్వేగపరుడాయన! ''సంపాదన కోసం రంగుపూసుకున్నాం. దట్సాల్. పేకప్ చెప్పిన తరవాత మళ్లీ నోటేకాఫ్''అనేవారు. తన పిల్లల్ని ఆ ఛాయలకు కూడా రానీయలేదు. శోభన్‌బాబు డబ్బు మనిషి అన్నవాళ్లూ లేకపోలేదు. పారితోషికాన్ని ముక్కు పిండి వసూలు చేసేవారన్న పేరూ ఉంది. అయితే కొంతమంది దగ్గర పారితోషికాన్ని తగ్గించుకున్న సందర్భాలూ లేకపోలేదు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా చెప్పుకొనేవారు కాదు. ఆయనతో తిలక్ అనే నిర్మాత 'సంసారం సంతానం' చిత్రాన్ని నిర్మించారు. రూ.5 లక్షలు పారితోషికం అన్నారు. సినిమా పూర్తయ్యే దశలో రూ.75 వేలు తగ్గించి తీసుకున్నారు. తిలక్ 'ఈనాడు సినిమా'తో మాట్లాడుతూ ''నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గ్రహించి ఆ సొమ్ము వదులుకున్నారు. ఆ సంగతి నేను ఎవరికి చెప్పినా నమ్మలేదు. నా కంటే ముందు ఛటర్జీ అనే నిర్మాత దగ్గరా పారితోషికం వదులుకున్నారు. నేను ఆర్థికంగా కుదుటపడ్డాక ఆ సొమ్ము ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించి, మీ అమ్మాయిల పేరన ఏదైనా ఆస్తి కొనమని చెప్పిన మంచి మనిషి'' అన్నారు.
వైరాగ్యం అనుకున్నా:
తొలినాటి పాత్రల్లోని ఉద్వేగం, మానసిక సంఘర్షణ, ఒంటరితనం లాంటి లక్షణాలు శోభన్‌బాబు వ్యక్తిత్వంలోనూ కనిపిస్తాయనాలి. మనిషిలాగే మనసు కూడా నాజూకు! ఓ రకంగా ఆయన అంతర్ముఖుడు. ''జీవితం ఏవిఁటి?.. ఎందుకు?.. ఎప్పుడూ నలిగిపోవలసిందేనా?.. సంపాదించిన దాన్ని సంతోషంగా అనుభవించే రోజులు ఉండనవసరం లేదా?''.. ఇలాంటి తాత్విక దృక్పథం ఆయనలో ఉంది. దానితోపాటు 'సౌందర్య స్పృహ' వెన్నంటి ఉండటం మరో వైరుధ్యం. కళ్ల చుట్టూ వలయాలూ.. మొహం నిండా ముడతలూ.. గొంతులో వణుకూ.. తన గ్లామరస్ ఇమేజ్‌ని గడ్డపారతో పెకిలించిక ముందే.. ఎప్పటికీ వన్నెతరగని 'అందగాడు'గా శోభన్‌బాబు మిగిలిపోవాలనుకొన్నారు. అలాగే ప్రేక్షకులకు చిరాకు పుట్టించేవరకూ చిన్నచిన్న పాత్రల్లోకి చొరబడి నటించకూడదన్నదీ ఆయన ఉద్దేశం. షష్టిపూర్తికి ఓ ఏడాది ముందే సెలవు ప్రకటించేశారు. సినిమాల్లోకి ప్రవేశించడం కాదు నిష్క్రమించడమే ముఖ్యం. ''ఓ సినిమాలో నేను మేజిస్ట్రేట్ పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర నిడివి తక్కువే. తర్కాలు వింటూ మధ్యలో ఆర్డర్ అంటూ డైలాగులు చెప్పడం. అప్పుడు గత స్మృతులు మదిలో మెదిలాయి. నేను చిన్న నటుడిగా ఉన్నప్పుడు గొప్పవాళ్లుగా వెలిగినవాళ్లు తరవాతి కాలంలో బోనులో నిలబడే ముద్దాయి పాత్రల్లో కనిపించడం బాధ కలిగించింది. ఆ పరిస్థితి నాకు రాకూడదు అనుకున్నాను. ఆ క్షణమే రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది'' అన్నారు శోభన్‌బాబు. ఎందుకు మీకింత వైరాగ్యం అని సన్నిహితులు చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యే స్థితిని కలలో కూడా వూహించుకోలేని మానసిక ఉద్వేగం శోభన్‌బాబుది. చిత్ర పరిశ్రమలోని వృత్తి జీవితాన్ని తామరాకు మీద నీటిబొట్టులాగా భావించే తాత్విక దృక్పథం ఆయనది. అందరూ అలా ఉండలేరు.. అందగాళ్లందరూ శోభన్‌బాబులు కాలేరు.
__________________________________________
''నేను హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు పాతాళభైరవి, దేవదాసు, మల్లీశ్వరి ఆంధ్రదేశాన్ని ఓ వూపు వూపాయి. మల్లీశ్వరి పాటలు వినని రోజంటూ లేదు. ఆ సినిమా అంటే ఎంత అభిమానమో తెలుసా... చదువుకొనే రోజుల్లోనే 22సార్లు చూశాను. ఇక పాతాళభైరవిలోని తోట రాముడి పాత్ర మనసులో చెరగని ముద్ర వేసింది. దేవదాసు కూడా అలాంటి అనుభూతినే ఇచ్చింది. ఆ మూడు చిత్రాలూ నా మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. సినిమాలపై ఆసక్తిని పెంచాయి''.
అప్పట్లో ప్రముఖ దర్శకులు చిత్రపు నారాయణమూర్తి 'భక్త శబరి' చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. శోభన్‌బాబు ఆయన్ని కలిసి ఫొటోలిచ్చి ఏదైనా వేషం ఇవ్వమన్నారు. నాలుగు రోజుల తరవాత పిలిచి ముని కుమారుడు 'కరుణ' పాత్ర ఇచ్చారు. ఆ సినిమాతోనే గుర్తింపు పొందారు. అందుకే తన కుమారుడికి కరుణ పేరు కలిసేలా కరుణ శేషు అనే పేరు పెట్టుకున్నారు.
_______________________________
కిరీటం పెట్టిన పాత్రలు..
పురాణ కథలకు ఎన్టీఆర్.. సామాజిక పాత్రలకు ఏఎన్నార్.. కుటుంబ కథలకు శోభన్‌బాబు... ఇలా విభజించి దర్శకనిర్మాతలు సినిమాలను తెరకెక్కించేవారు. అలాంటి తరుణంలో కూడా శోభన్‌బాబు నట జీవితంలో మరచిపోలేని పౌరాణిక పాత్రలూ ఉన్నాయి. తొలి అడుగులోనే 'భక్త శబరి'లో ముని కుమారుడు కరుణగా కనిపిస్తారు. నటుడిగా ఆయనకు పూర్తి గుర్తింపునిచ్చింది అభిమన్యుడి పాత్ర. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 'వీరాభిమన్యు' చిత్రంలో ఆ పాత్ర పోషించారు. ఆ తరవాతి కాలంలో 'సీతారామ కళ్యాణం'లో ఆయన లక్ష్మణుడి పాత్రను పోషించారు. 'సతీ అనసూయ', 'శ్రీకృష్ణావతారం' చిత్రాల్లో నారదుడిగా కనిపించారు. 'లవకుశ'లో శత్రుఘ్నుడు. 'నర్తనశాల'లో అభిమన్యుడు. 'బుద్ధిమంతుడు'లో కృష్ణుడు. 'సంపూర్ణరామాయణం'లో శ్రీరామచంద్రుడు. 'కురుక్షేత్రం' సినిమాలో మరోమారు శ్రీకృష్ణ పరమాత్ముడు. 'పరమానందయ్య శిష్యుల కథ'లో శివుడి పాత్రను పోషించారు. 'దేవాలయం' చిత్రంలో 'దేహమేరా దేవాలయం' అంటూ సాగే పాట శోభన్‌బాబు జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఇందులో ఆయన దశావతరాల్లో కనిపిస్తారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే తనకు బాగా కావల్సిన వాళ్ల పెళ్లికి ఆయన వెళ్లాల్సి వచ్చింది. మేకప్ తీసుకునేంత సమయం లేకపోవడంతో ఈ సినిమాలో పోషిస్తున్న పూజారి పాత్రలోనే ఆ పెళ్లికి హాజరయ్యారు.
మానవత్వమే మతం!
ఇలా వీలును బట్టి తనదైన శైలిలో పౌరాణిక పాత్రలకు న్యాయం చేసిన ఘనత శోభన్‌బాబు సొంతం. ఇక్కడో మరో విషయం చెప్పుకోవాలి. ఇంత మంది పురాణ పురుషుల పాత్రల్ని పోషించిన ఆయనకు విగ్రహారాధన, మత విషయాలపై నమ్మకం లేదు. సామ్యవాద భావాలు కలిగిన నటుడీయన. ఆయన సహ నటుడు మాదాల రంగారావు ఇలా చెప్పారు: ''శోభన్‌బాబు ఇంట్లో బుద్ధుడు చిత్రపటం ఉండేది. ఆయన బోధనల్ని తరచూ చదివేవారు. మానవత్వాన్ని మించిన మతం లేదనేవారు. అనాథలకీ, ఆపదల్లో ఉన్నవాళ్లకీ సాయం చేసేవారు. కానీ వాటి గురించి ఎక్కడా చెప్పేవారు కాదు. ప్రచారం కూడా కోరుకొనేవారు కాదు''.
తొలి సంగతులు
తొలి చిత్రం : కీలుగుర్రం
నటించిన తొలి చిత్రం : దైవబలం (చిన్న పాత్ర)
విడుదలైన తొలి చిత్రం : భక్త శబరి
తొలి చిత్ర దర్శకుడు : చిత్రపు నారాయణమూర్తి
తొలి చిత్ర నిర్మాత : బి.డి.నాయుడు
తొలి చిత్ర సంగీత దర్శకుడు: పెండ్యాల నాగేశ్వరరావు
తొలి శత దినోత్సవ చిత్రం : నర్తనశాల
హీరోగా తొలి 25 వారాల చిత్రం : మనుషులు మారాలి
తొలి కలర్ చిత్రం : కన్నవారి కలలు
తొలి ద్విపాత్రాభినయం : పొట్టి ప్లీడర్
విగ్‌లేకుండా నటించింది : కిలాడీ బుల్లోడు
తొలిసారి విదేశాలకు షూటింగ్‌కి వెళ్లింది: రాముడు పరశురాముడు
(Eenadu, 21:03:2008)
=============================
Labels: Cinema, Cinima/ Telugu
0 Comments:
Post a Comment
<< Home