సుఖానికి అలసత్వమే అవరోధం
- ప్రొఫెసర్ పిసిపాటి వెంకటేశ్వరరావు
మానవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ సుఖాన్నే కోరుకొంటాడు. సుఖమయ జీవనానికి కావలసింది సంపద. ధనధాన్యాలు, వస్తువాహనాలు, ఇల్లు వాకిలి మొదలైనవి వస్తురూప సంపదలు. కీర్తిప్రతిష్ఠలు, బంధుమిత్రుల ఆదరాభిమానాలు, ఇరుగుపొరుగువారి సహకారం ఇత్యాదులు భావరూప సంపదలు. విద్య నిగూఢసంపద. ఆరోగ్యం మరొక ఉత్కృష్ట సంపద. ఈ సంపదలను ఏ కొద్దోగొప్పో సాధించుకోవాలన్నా, ఉన్నవాటిని పెంపొందించుకోవాలన్నా తగిన రీతిలో వాటికోసం యుక్త వయస్సునుంచే ప్రయత్నించాలి. సంపదలను సాధించుకోవటం ఒక ఎత్త్తెతే, వాటిని నిలబెట్టుకొంటూ సుఖంగా జీవించటం మరొక ఎత్తు. ఈ విషయాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు చూద్దాం అనే ధోరణిని విడిచి వెనువెంటనే కార్యసిద్ధికి ప్రయత్నించటం అత్యవసరం. అలా ప్రయత్నించ (లే)కపోవటానికి కారణం మనిషిలోని అలసత్వమే. అదే ఉపేక్ష, వేచి చూ...స్తూ..నే ఉండే ధోరణి. ఈ జాడ్యం ఆవహించిన మనిషి ఇహలోక సుఖానికే కాక పరలోక సుఖానికీ దూరమవుతాడంటారు.
దివసేనైవ తత్ కుర్యాద్ యేన రాత్రే సుఖంవసేత్
అష్టమాసేన తత్ కుర్యాద్ యేన వర్షాః సుఖంవసేత్
పూర్వేవయసి తత్ కుర్యాద్ యేన వృద్ధః సుఖంవసేత్
యావజ్జీవేన తత్ కుర్యాద్ యేన ప్రేత్య సుఖంవసేత్
(రాత్రివేళ సుఖంగా నిద్రించాలంటే తనకూ, ఇంటికీ కావలసిన జాగ్రత్తలన్నీ పగలే తీసుకోవాలి. వర్షకాలంలో సుఖంగా ఉండాలంటే మిగిలిన ఎనిమిది నెలల్లోనే అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి. వృద్ధాప్యంలో సుఖంగా ఉండాలంటే యుక్తవయస్సు నుంచే దేహదారుఢ్యాన్నీ, మనోనిబ్బరాన్నీ పెంపొందించుకోవాలి. చనిపోయిన తరవాత సుఖానికి జీవితాంతం పాటుపడాలి). ఇది వివేకశాలి అయిన విదురుడు చేసిన బోధ. ఈ విషయాల్లో అలసత్వం ఏమాత్రం పనికిరాదని పరోక్షంగా చేసిన హెచ్చరిక.
ఇవన్నీ ప్రత్యక్ష విషయాలే అనుకొన్నా, 'ప్రేత్యసుఖం' అనే విషయంలో మాత్రం ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. 'చనిపోయిన తరవాత సుఖమేమిటి? అది లేనేలేదు' అని కొందరి అభిప్రాయం. 'ఉందేమో!' అని మరికొందరికి ఒక అనుమానం. 'ఉంది' అని బహుకొద్దిమందికి పూర్తివిశ్వాసం. 'ఇంతకీ అది ఉందా, లేదా' అనే వాదనలకు దిగి తర్కించుకొంటూ దుర్లభమైన మానవ జన్మను వృథా చేసుకోకుండా, ఉందని ప్రయత్నిస్తే అది లేకపోయినా నష్టంలేదు. లేదని ఉపేక్షిస్తే మాత్రం అది ఉంటే మరెన్ని జన్మలెత్తినా తీరని నష్టమే సంభవిస్తుందని శ్రీశంకరుల హిత వాక్కు.
ఈ సుఖాన్ని కూడా సాధించుకోవాలనుకొంటే జీవితాంతం ధర్మానికి కట్టుబడి ఉండాలనేది మహాత్ముల బోధ. ధర్మాచరణకు మార్గాలు ఎనిమిది. అవే యజ్ఞం, అధ్యయనం, దానం, తపస్సు, సత్యం, సహనం, అహింస, నిర్లోభత్వం. త్రికరణ శుద్ధిగా వీటిలో ఏ మార్గాన్ని నమ్ముకొని జీవితాంతం పాటుపడినా లక్ష్యం సుగమమే అవుతుంది. లలాట లిఖితం, ప్రాప్తం, అదృష్టం, కర్మఫలం, గ్రహస్థితి అనే విషయాల్లో సత్యం ఉన్నా లేకున్నా- వాటినే నమ్మి మన చేతిలో ఏదీ లేదనుకొంటూ నిర్లిప్తంగా జీవించటం సమంజసం కాదు. చక్కని పురుష ప్రయత్నంతో ఏదైనా సాధ్యమేనని చెబుతోంది.
(సర్వ మే వేహ హి సదా సంసారే రఘునందన! సత్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే||)
అలసత్వాన్ని విడిచి, ఈ బోధను కార్యరూపంలో పెట్టి సుఖాలను సొంతం చేసుకొనేవారందరూ వివేకశీలురే.
(ఈనాడు,అంతర్యామి,15;06:2008)
_____________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home