'ఓం నమో వేంకటేశాయ...'
తిరుమల... అంటే కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు. వందల కోట్ల రాబడి, రూ.1925 కోట్ల వార్షిక బడ్జెట్, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఆ వ్యవస్థ రూపుదిద్దుకునే క్రమంలో ఎన్నో మైలురాళ్లు. అడ్డంకులు. వివాదాలు. విజయాలు. ఆ చరిత్రను ఒక్కసారి తరచి చూస్తే...
ఒకప్పుడు సరైన దారి కూడా లేని ఏడుకొండల మీదుగా కాలినడకన రెండు రోజుల పాటు ఎక్కితే కానీ భక్తులకు ఆ వడ్డీకాసులవాడి దర్శనం దక్కేది కాదు. ఆ దారిలో రాళ్లూరప్పలూ జంతువులూ దొంగలూ... ఎన్నెన్ని అవరోధాలనీ! మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఎప్పుడో రాజులకాలం నాటివి రెండుమూడు దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ మాత్రం ఉండేవి. ఎక్కడపడితే అక్కడ మంచినీళ్లు దొరికేవి కావు. పోనీ కొండమీద ఊరేమైనా ఉందా అంటే అదీ లేదు. పూజారులు కూడా కిందనే ఉన్న కొత్తూరు నుంచే వెళ్లేవారు. 1870లో భక్తుల సౌకర్యార్థం మెట్లదారి నిర్మించేదాకా ఈ అవస్థలు తప్పలేదు. అప్పటికి తిరుమల కొండ హథీరాంజీ మఠాధిపతుల అధీనంలో ఉండేది.
ధర్మకర్తల మండలి
తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చింది. అంతేకాదు, తితిదేకు ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిని కూడా నియమించారు. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు.
తితిదే పాలకమండలి ఏర్పాటైన తర్వాత ఏడున్నర దశాబ్దాల్లో తిరుమల అంతటా సర్వతోముఖాభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం రూ.26వేల ఖర్చుతో మెట్లమార్గాన్ని నిర్మించడంతో ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మండలి. వారు తలపెట్టిన రెండో ప్రాజెక్టు ఘాట్‌రోడ్డు. అసలు, ఏడుకొండల మీదకు రోడ్డెలా వేస్తారు... అదసలు సాధ్యమయ్యే పనేనా! 1940ల్లో తిరుమల-తిరుపతి వాసులందరినీ వేధించిన ప్రశ్నలివి. 1944 ఏప్రిల్ పది నాటికి వారి సందేహాలూ భయాలూ పటాపంచలయ్యాయి. పెద్ద పాములా... వయ్యారాలు పోయే అమ్మాయి నడుములా... మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది.
తర్వాతిమెట్టు... ఆర్జితసేవలు. సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం, కల్యాణోత్సవం తదితర సేవలను ప్రవేశపెట్టింది తితిదే. నల్లరాతిశోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారుపూతతో పసిడి వన్నెలద్దింది. క్రమంగా బస్సుల సంఖ్య పెరుగుతుండటంతో కొండ మీదకు వచ్చే జనం సంఖ్య వేలల్లోకి చేరుకుంది. దాంతో అక్కడ వసతి కష్టమైంది. కానీ, ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు వచ్చాయి.
ఎన్నాళ్లుగానో వేధిస్తున్న ఇంకో సమస్య తలనీలాలు. దాన్నీ పరిష్కరించారు. అంతవరకు తిరుమలలో పలుప్రాంతాల్లో ప్రైవేటు క్షురకులు తలనీలాలు తీసేవారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వారికంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట తలనీలాలు తీసే విధానాన్ని అమలులోకి తెచ్చారు.
శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, సంగీత, నృత్య కళాశాల, బధిరుల పాఠశాల... రుయా ఆసుపత్రి, కుష్టురోగుల ఆసుపత్రి...
శతాబ్దాల తరబడి ఆధ్యాత్మిక క్షేత్రంగానే ఉండిపోయిన తిరుమలకు ఓ కొత్త ఇమేజ్ వచ్చింది.
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలూ పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేసిన ఘనత తొలి ఈవో చెలికాని అన్నారావుదే. అందుకే తిరుమలవాసులు నేటికీ ఆయన్ను నిత్యం తల్చుకుంటారు.
గుడిచుట్టూ...
1965-69 కాలంలో తిరుమల ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న తూర్పు మాడవీధి విస్తరణ జరిగింది.
...అని ఒక్కమాటలో చెప్తే సరిపోదు. అందుకోసం మహాద్వారానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించడం అంత సులభంగా జరగలేదు మరి. దర్శనానికి 'క్యూ లైన్' విధానాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు. పుష్కరిణిని సంస్కరించిందీ కొలిమి మండపాన్ని తీర్చిదిద్ది ఊంజల్‌సేవను ఏర్పాటు చేసిందీ అప్పుడే... 1969-72 మధ్యకాలంలో!
ఆ తర్వాత తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు. 1978 నాటికి రెండోఘాట్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి. 1978-82 కాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు. తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం, మాడవీధులను విస్తరించడం, అన్నదాన భవన నిర్మాణం... ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్ ప్రాజెక్టులను నెలకొల్పడం... ఇవన్నీ ఆయన చలవే. కోకిలమ్మ ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే.
ఎన్టీఆర్ పాత్ర...
1984-87 నడుమ తితిదే అభివృద్ధిని విశ్లేషించేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కచ్చితంగా ప్రస్తావించాల్సిందే. ఆయన పాత్రను విస్మరించి ఆ అధ్యాయాన్ని సమగ్రంగా వివరించలేం. పురాణపురుషుల పాత్రలతో తెలుగువారిని మెప్పించిన ఎన్టీరామారావు ఇష్టదైవం శ్రీనివాసుడే. 1983లో ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తిరుమల-తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. ఆయన హయాంలోనే వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. తిరుమలలో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు. కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు. తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు. కాలినడకమార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు. తిరుమలకు తెలుగుగంగ నీటిని తరలించారు. కొండమీద విద్యుత్తుకోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్, ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహతి సభామందిరం తదితరాలను నిర్మించారు. ఇలా తిరుమల-తిరుపతి అభివృద్ధికి ఎన్టీరామారావు చేసిన కృషి ఎనలేనిది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం వర్ణనాతీతం... కనులారా తిలకించాల్సిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా 1995లో దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇది భక్తులందరికీ ఎంతో ఆనందాన్నిచ్చిన నిర్ణయం. అత్యంత సంపన్నుడైన స్వామికి జరిగే సేవలను ప్రసారం చేసేందుకు ఇతర మార్గాలెందుకు! ఆయనకోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించింది తితిదే. అదే 'శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ)'. ఈ ఛానెల్ ద్వారా ఈ ఏడాది నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి.
మళ్లీ ఒకసారి వెనక్కివెళ్తే...
1999-2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం 'సుదర్శనం కంకణాల' విధానానికి రూపకల్పనచేసి అమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానం వల్ల భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అగత్యం తప్పింది.
రైలుగోవిందం
బాలాజీ దర్శన గోవిందం... తితిదే-భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ(ఐఆర్‌సిటిసి) నడుమ కుదిరిన ఒక చక్కటి ప్యాకేజీ ఒప్పందం పేరిది. ఈ పథకంలో భాగంగా వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తితిదే. శ్రీనివాసం విడిదిగృహంలో బస నుంచి అర్చనానంతర, సెల్లార్ దర్శన టిక్కెట్ల వరకూ అన్నీ చక్కగా అమరుస్తోంది. వివరాలివీ...
విజయవాడ నుంచి...
విజయవాడ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం వెుదలవుతుంది. గూడూరులో భోజనం. రాత్రి తిరుపతిలోని శ్రీనివాసం విడిదిగృహంలో బస. మర్నాడు తెల్లవారుజామున నాలుగింటికి కొండపైకి తీసుకెళ్లి అర్చనానంతర దర్శనం చేయిస్తారు. అనంతరం శ్రీకాళహస్తి, అలివేలు మంగాపురం ఆలయాల సందర్శన. మధ్యాహ్న భోజనం అయ్యాక శ్రీనివాస మంగాపురం, కాణిపాకం క్షేత్రాల్లో దర్శనం. చంద్రగిరి కోట సందర్శన. రాత్రికి మళ్లీ తిరుపతి శ్రీనివాసంలో బస. మర్నాడు తెల్లవారుజామునే విజయవాడకు తిరుగుప్రయాణం. ఉదయం ఫలహారం, రెండుపూటలా భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్ ఏసీ రుసుము పెద్దలకు రూ.2800, పిల్లలకు(5-11) రూ.2400. స్లీపర్‌క్లాస్‌లో అయితే పెద్దలకు రూ.2100, పిల్లలకు రూ.1950. ఇతర వివరాల కోసం 0866-2572280, 2767244 నంబర్లలో సంప్రదించవచ్చు.
సికింద్రాబాద్ నుంచి...
వారాంతాల్లో తిరుమలలో సెల్లార్ దర్శనం ఉండదు కాబట్టి సికింద్రాబాద్ నుంచి వారానికి ఐదురోజులు మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకూ. ఈ ఐదురోజుల్లో రోజూ రాత్రి ఎనిమిదింటికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం వెుదలవుతుంది. మర్నాడు పొద్దున్న ఆరింటికి తిరుపతికి చేరాక శ్రీనివాసంలో బస, ఫలహారం. అక్కణ్నుంచి కొండమీదకు తీసుకెళ్లి సెల్లార్ దర్శనం చేయిస్తారు. కొండ దిగాక మధ్యాహ్నభోజనం. అనంతరం అలివేలుమంగాపురంలో అమ్మవారి దర్శనం. సాయంత్రం మళ్లీ నారాయణాద్రిలోనే తిరుగు ప్రయాణం. ఆ రాత్రికి భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్ ఏసీ రుసుము పెద్దలకు రూ.3,400, పిల్లలకు రూ.2,400. స్లీపర్‌క్లాస్‌లో పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600. పూర్తి వివరాల కోసం 040-66201263, 27702407, నంబర్లలో సంప్రదించవచ్చు.
నభూతోనభవిష్యతి...
తితిదే వెుదటి నుంచి విద్యా, వైద్య సంబంధ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తోంది. ఇదంతా సామాజిక సేవ. కానీ, ఇటీవలికాలంలో చేపట్టిన కార్యక్రమాలు విప్లవాత్మకమైనవీ ఆదర్శనీయమైనవీ. అందులో వెుదటిది, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 'కల్యాణమస్తు'. ఇప్పటివరకు మూడు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 20వేల జంటలకు వివాహాలు జరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే నభూతో నభవిష్యతి.
కుమ్మరి భీముడి కుండలో అన్నం తిన్న శ్రీవారు తనకు పేదాగొప్పా తారతమ్యం లేదని తేల్చిచెప్పారన్నది ఏనాడో నిరూపితమైన సత్యం. మళ్లీ ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని రూపొందించిన కార్యక్రమమే 'దళిత గోవిందం'. స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం. దళితగోవిందం విజయవంతమైన క్రమంలో తితిదే పాలకమండలి మరో అడుగు ముందుకేసి 'మత్స్యగోవిందం' పథకానికి శ్రీకారం చుట్టింది. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణనిచ్చి సర్వమానవ సమానత్వాన్ని చాటుతోంది.
ఇంతేనా... తిరుమలలో జరిపించినంత వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవాలను తితిదే వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న తీరు భక్తులకు కన్నుల పండుగే. ఇక, పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వెయ్యి మంది పేద విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం.
రెండో అన్నదాన సత్రం
ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో 1,500 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉంది. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమైంది తితిదే. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వభోజనం పథకం భక్తుల ప్రశంసలందుకుంటోంది. భవిష్యత్తులో కొండమీద అసలు భోజనవ్యాపారం అన్నదే జరగకుండా దేవస్థానం ఆధ్వర్యంలోనే భక్తుల కడుపు నింపే సంకల్పంతో ప్రారంభించిందే ఈ పథకం.
ఇలా ఒకటా రెండా.. ఎన్నోఎన్నెన్నో సేవాకార్యక్రమాలు.
సృష్టిలో జరిగే ప్రతి చర్యకూ ఎక్కడో మూలం ఉంటుందన్నది ఓ థియరీ. గీతాకారుడు చెప్పిందీ అదే... కర్మసిద్ధాంతం.
జనహితం కోసం ఇన్ని శుభాలు జరగాలని రాసిపెట్టుంది కాబట్టే తిరుమల ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయమైందనీ నిత్యకల్యాణం పచ్చతోరణంగా వెలిగిపోతోందనీ భక్తుల నమ్మకం.
ఏదేమైనా కానీ... అంతిమంగా మానవకల్యాణం జరగడమే భగవత్తత్వం అయితే అందరూ కలిసి అనాల్సిన మాట... ఓం నమో వేంకటేశాయ!
- వడ్డాది శ్రీనివాస్,
న్యూస్‌టుడే, తిరుపతి
(ఈనాడు, 06:07:2008)
______________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home