చిలక-గోరింక
'స్త్రీ పురుషులు ఇరువురూ సమానమే' అనేది నినాదమే తప్ప, నిజం కాదు. పుట్టుక ఒక్కలాంటిదే అయినా, ఇరువురి మధ్యా అంతరం చాలా ఉంది. ఇది సృష్టి సహజం. శారీరకమైన తేడాను సాకుగా తీసుకుని మగవాడు- స్త్రీని ద్వితీయశ్రేణి పౌరురాలిగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. 'చిలకాగోరింకల్లా జీవించండి' అని నూతన దంపతులను దీవిస్తుంటారు. చిలక గోరింకల జాతులు వేరు. అవి కలిసి జీవించవు. అయినా నన్నెచోడుని కుమారసంభవం మొదలు, నేటి సినీయుగళగీతాల వరకు- ఆ జంట అన్యోన్యతకు చిహ్నంగా నిలుస్తూ వచ్చింది. నిజానికి ఆ ఆశీస్సు వెనుక గొప్ప ఆలోచనే ఉంది. చిలకల్లో ఆడ చిలకకీ, గోరింకల్లో మగదానికీ ఆప్యాయత, అనురాగం చాలా ఎక్కువ. వియోగం ఏర్పడితే తక్షణమే ప్రాణం విడిచిపెట్టేంత స్థాయి ఆత్మీయతను అవి పెంచుకుంటాయి, పంచి ఇస్తాయి. దాంపత్య జీవితంలోకి ప్రవేశించే ప్రతిజంటా అంతటి గాఢమైన అన్యోన్యతను సాధించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టాలన్నది ఆ దీవెనలో ఆంతర్యం. అలా సాధించిన జంటను కవయిత్రి మహెజెబిన్ వర్ణించారు. ఒంటరిగా కూర్చొని హాయిగా కవిత్వం రాసుకునే వేళ 'అతను' నెమ్మదిగా సమీపిస్తాడు. '...ముద్దు పెట్టుకుంటాడు. అతని అడుగుల సవ్వడిలో ఛందస్సు వెతుక్కుంటూ నేను అలవోకగా కళ్ళు మూసుకుంటాను. ఒక యౌవనం నా మీదుగా ఉప్పొంగిపోతుంది. నా 'కవిసమయం' దారుణంగా కొల్లగొట్టబడుతుంది...'- ఈ కవితలో చివరి వాక్యం నిజానికి ఆరోపణ కాదు, అర్పణ! అలా తమకపు గమకాలు వినిపించే చిలకలున్నా- రసాస్వాదనాసక్తి, శృంగారాభిరుచి గోరింకల్లో అరుదైపోవడం ఆధునిక జీవన సరళిలోని విషాదం. 'పాలింకి పోవడానికి ఉన్నట్లు- మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు' అని స్త్రీకి అనిపించే దుస్థితి, జడత్వం మగవాడి నిర్వాకమనే చెప్పాలి.
'పురుషుడి ప్రతి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుంది' అన్నది అభిమానంతో కాదు, అవగాహనతో చెప్పిన మాట. ఆ స్త్రీ బాలచంద్రుని వెనుక మగువ మాంచాలి కావచ్చు, అభిమన్యుడి వెనుక ఉత్తర కావచ్చు. లేదా- శివాజీ వెనుక జిజియాబాయి కావచ్చు, పాండవుల వెనుక కుంతీమాత కావచ్చు. యుద్ధంలోంచి పారిపోయి వచ్చిన ఖడ్గతిక్కనకు అతని భార్య చానమ్మ గాజులు, పసుపునీళ్ళు అందించడంలో సైతం స్త్రీ వ్యక్తిత్వంలోని ఒకానొక విశిష్టకోణాన్ని దర్శించవలసి ఉంది. అవసరమైన సందర్భాల్లో స్త్రీ తనలోని అనంతమైన అంతర్గత శక్తులను ఆవిష్కరిస్తుంది. ఆ శక్తులను పురుషుడు స్వాగతించాలి, గౌరవించాలి. పరమశివుడికి పార్వతితో పరిణయం జరిపించాలని సప్తర్షులు పర్వతరాజు వద్దకు రాయబారానికి బయలుదేరారు. 'మీరెంతమంది వెళ్ళినా పొసగదు. ఒక స్త్రీని వెంటపెట్టుకుని వెళ్లండి' అంటాడు శివుడు. 'ప్రాయేణీవం విధే కార్యే పురంధ్రీణాం ప్రగల్భతా'- పెళ్ళివంటి పెద్దపనులను చక్కబెట్టడంలో స్త్రీలు కడు నేర్పరులని మహాకవి కాళిదాసు కుమారసంభవంలో శివుడి నోట పలికించాడు. అదీ భారతీయ స్త్రీ అసలు స్థానం! ఆ ప్రాగల్భ్యాన్ని అంగీకరించే గుండెదిటవు లేక మగవాడు అవకాశవాదిగా మారాడు. ఒకప్పుడు ఈ దేశంలో సగటు యువతి తనకు యోగ్యుడు, సమర్థుడు భర్తగా లభించాలని కలలు కనేది. పూజలు చేసేది. నోములు నోచేది. ఇప్పుడు పరిస్థితి మారింది. తననే యోగ్యురాలిగా సమర్థురాలిగా నిరూపించుకునేందుకు స్త్రీ తపనపడుతోంది. శ్రమిస్తోంది. తానే సమాజాన్ని చేయిపట్టుకుని నడిపించడానికి ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో '...బయట ఎన్నో సమస్యలతో సతమతమై, ఇంటికివచ్చిన మగవాడికి స్త్రీ చల్లని చలివేంద్రం కావాలి' వంటి చవకబారు సినీమార్కు చలిమిడి ఆలోచనలు ఇక చెల్లవు. బయట తనను వేధిస్తున్న సమస్యకు- భార్యనుంచి గొప్ప సలహా లభిస్తుందేమోననే ఆలోచన భర్తకు తట్టాలి. తనకు తోచిన దారికన్నా మెరుగైనది ఆమె చూపిస్తే, కృతజ్ఞతతో దాన్ని స్వీకరించగల హృదయవైశాల్యం, మగతనం పురుషుడికి ఉండాలి. చరిత్రలో వీరుడి స్థానమెంతటిదో- వీరపత్నిదీ, వీరమాతదీ కూడా అంతటిదేనన్న ఎరుక కలగాలి.
'పురుషుడి కన్నా స్త్రీ చాలా విభిన్నంగా ఆలోచిస్తుంది' అంటున్నారు, బ్రిటన్‌లోని ఉప్సల విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎలీనా జాజిన్. మానవ మస్తిష్కంలో జన్యుపరమైన విభిన్నతలపై పరిశోధనలు చేసిన బృందానికి ఆయన నాయకుడు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడంలో, నిర్ణయాత్మక వైఖరి ప్రదర్శించడంలో, సవాళ్ళను స్వీకరించడంలో, సాహసంతో ముందడుగు వెయ్యడంలో స్త్రీ పురుషుల్లో ఎంతో వైవిధ్యానికి కారణమవుతున్న వందలాది జన్యువులను వారు కనుగొన్నారు. కొన్నేళ్ళ క్రితం డాక్టర్ రోజర్ స్పెర్రీ అనే శాస్త్రజ్ఞుడు మనిషి మెదడులోని ఎడమ, కుడి విభాగాల వ్యవహారశైలిని వెల్లడించారు. బుద్ధి, తర్కం, విశ్లేషణ... వంటివి ఎడమభాగం ప్రభావంతోను, సంగీతం, సౌందర్యాభిలాష, కళాభిరుచి, వేదాంతం... వంటివి కుడిభాగం ప్రేరణతోను వస్తాయని తేలింది. శాస్త్రజ్ఞులు, విమర్శకులు, వ్యాకరణ పండితులు, లెక్కల మాస్టార్లు ఎడమ మెదడు ముద్దుబిడ్డలు. కవులు, భావుకులు, సంగీత విద్వాంసులు, సినీదర్శకులు కుడి మెదడు దత్తపుత్రులు. ఆ రెండు భాగాలను 'కార్పస్ కెల్లోసమ్' అనే నరాల సముదాయం అనుసంధానిస్తోందని ఆయన పరిశోధనలో తేలింది. ఆ వారధి చురుకైన పాత్ర పోషిస్తే- ఆ మనిషికి సృజనశీలత, కార్యదక్షత రెండూ దక్కుతాయి. భిన్నమైన వృత్తి, ప్రవృత్తి రెండింటా రాణించే అవకాశం ఉంటుంది. అదే తరహాలో స్త్రీపురుషుల మధ్య జన్యువైవిధ్యాన్ని నేర్పుగా అనుసంధానించుకోవడం తెలిస్తే- అద్భుత విజయాలు దక్కుతాయి. విభిన్న జాతులకు చెందిన చిలక గోరింకల మధ్య అన్యోన్యతలా- వైవిధ్యమైన ఆలోచనలతో ఉండే జంట మధ్య మిథునానురాగం వర్ధిల్లుతుంది. 'ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెచ్చాడు' అని అభినందించే రమ్యమైన అవకాశం స్త్రీకి లభిస్తుంది!
(ఈనాడు,సంపాదకీయం, 29:06:2004)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home