My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, September 02, 2008

వానా వానా వందనం...

'సువాసన పిలుపువంటిది- పదిమందినీ ఆకర్షిస్తుంది. సౌరభం పక్షివంటిది- దిక్కుదిక్కులా పరుగెత్తుతుంది. సుగంధం స్మృతివంటిది- పదేపదే స్ఫురిస్తుంది...' అంటూ వర్ణించిన కృష్ణశాస్త్రి, పరిమళాన్ని మాత్రం 'సమయం చూసి దగ్గర చేరే నేస్తం'గా పోల్చిచెప్పారు. వర్షపు చినుకుకీ- నేలతల్లికీ గొప్ప స్నేహం. సమయం చూసి తొలకరి చినుకు నేలను తాకగానే కమ్మని పరిమళం వెదజల్లడం- మట్టి స్వభావం! తీవ్రమైన ఎండల వేడికి ప్రాణం సొమ్మసిల్లిపోయిన సమస్త జీవజాలంతోపాటు, భూమిసైతం తొలకరికోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. స్వాతి చినుకును ప్రేమగా స్వాగతిస్తుంది. కమ్మని పరిమళాన్ని వెదజల్లడం ద్వారా తన పులకరింతను వ్యక్తం చేస్తుంది. కాంతిని దీపం పీల్చుకున్నట్లుగా, వర్షాన్ని పీల్చుకుని భూమి సురభిళించడం- సృష్టికి శోభను చేకూర్చే అంశం. ప్రకృతికి జీవంపోసే విషయం. 'గ్రీష్మాదిత్య పటుప్రతాపాని'కి, తీవ్రతాపానికీ ప్రాణం డస్సిపోయిన స్థితిలో తొలకరి పలకరింత- సృష్టికి పులకరింత. అందుకే వర్షర్తువును జీవరుతువంటారు. 'ప్రాణం లేచొచ్చినట్లు' అనిపించేది వర్షాగమనానికే! రోహిణీకార్తెకు వీడ్కోలుపలికి, మృగశిర ప్రవేశించడం మనకి తొలకరి. అంతవరకూ భూమి నుండి అదేపనిగా నీటిని పీల్చుకున్న ఆకాశం సమయం చూసి బదులు తీర్చేస్తుంది. నీటిని వర్షిస్తుంది. ఇది పంచభూతాల మధ్య సృష్టి కుదర్చిన ఒక ఒప్పందం. బాకీ తీర్చేవాడికోసం మనం కళ్ళు విప్పార్చి ఎదురుచూసినట్లుగానే- వర్షపు చినుకుకోసం నోరు తెరిచి కూర్చున్నట్లుగా భూమి నెర్రెలు విచ్చి ఎదురుచూస్తుంది. ఆషాఢమూ, శ్రావణమూ, భాద్రపదమూ, ఆశ్వీయుజమూ నాలుగూ వార్షుకమాసాలు. వానకారు. నీరే జీవులకు ప్రాణాధారం. ప్రాణులకోసమే భూమి వర్షాన్ని ఆశిస్తుంది. అది తల్లి స్వభావం. అందుకే నేలను భూమాత అంటాం. వర్షమే భూమిపై పాడిపంటలకు, సిరి సంపదలకు మూలం. వర్షం లేకపోతే కరువు కాటకాలు ఏర్పడతాయి. వర్షపు లేమి- అనే అర్ధంలో క్షామాన్ని 'వర్షపు టెవ్వ'గా పేర్కొన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అడవికి ఆమని- కోరిక. వయసుకు వలపు- కానుక. పుడమికి తొలకరి- వేడుక! గొప్ప సంబరం!

వర్షర్తువు- సాహిత్యవర్ణనలకి అద్భుతమైన కొలువు. కవిసమయాలకి అందమైన నెలవు. 'కురిసేదాకా అనుకోలేదు- శ్రావణమేఘమని, తడిసేదాకా అనుకోలేదు- తీరని దాహమని' అని ఆశ్చర్యపడిన సినీకవి వేటూరి నుండి వెనక్కువెళ్ళేకొద్దీ- జాబితా ఆదికవి వాల్మీకి దాకా విస్తరిస్తుంది. 'అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు. కొంచెకొంచెమేని, రాలాలి తుంపరులుయేని. కాని ఉక్క ఏ మాత్రము ఉండరాదు' అని కృష్ణశాస్త్రి కోరుకున్నారు. మనిషి స్వార్థాన్ని నిలదీస్తూ 'ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?' అని ప్రశ్నించారు జయప్రభ. పింగళి కాటూరి కవుల 'తొలకరి', ఇస్మాయిల్‌ 'రాత్రి వచ్చిన రహస్యపువాన' వంటివి యువతరం స్మృతిపథంలోని లేతచినుకులు- అనుకుంటే, వాల్మీకి కిష్కింధాకాండ. నన్నెచోడుడి 'కుమారసంభవం'.. వంటివి రసజ్ఞుల గుండెల్లో స్వాతి చినుకులు. పరమశివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంటే- ఆమె పాపిట రాలిన వర్షబిందువు కిందకి జారి, నాభిదాకా ప్రయాణించిన వైనాన్ని వర్ణిస్తూ చెప్పిన- స్థితాఃక్షణం... నాభిం ప్రథమోద బిందవః శ్లోకంలో ఆమె స్థిరదీక్షా భంగిమను కాళిదాసు వర్ణించిన తీరు- రసజ్ఞతకు అమృత జీవధార. కాళిదాసుదేనని చాలామంది భావిస్తున్న ఘటకర్పర కావ్యంలో 'మేఘావృతం నిశి న భాతి నభో వితారం'... శ్లోకం వ్యంగ్యార్థపు చినుకుల్లోంచి రూపుదిద్దుకున్న స్వాతిముత్యం. కృష్ణదేవరాయల వర్షర్తువర్ణనమైతే ఒక దట్టమైన జడివాన. కృష్ణరాయల కవిత్వమే ఒక గొప్ప వర్షర్తువు- అన్నారొక భావుకపట్టభద్రుడు. వర్షర్తువు సాహిత్యాటవికి వసంతరుతువు. సాహిత్యపు విందులలో రుచికరమైన ఆధరువు.

వర్షం కురిసి వెలిసింది. మబ్బులు తెల్లబడ్డాయి. వాటి మధ్య ఒక సంధ్యారుణ రేఖ మెరిసింది. అదెలా ఉందో తెలుసా? చేతికి గాయమై, కట్టుకట్టినప్పుడు- చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో ఎర్రగా ఉంటుందికదా! అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి. అతి ప్రాచీనకావ్యంలో అధునాతన అభివ్యక్తిని ప్రదర్శించినది- వాల్మీకి అయితే, ఆధునిక కావ్యంలో ప్రాచీన వైదిక పరిమళాన్ని పరిచయం చేసినవారు శేషేంద్ర. అదే నిజానికి వర్షాల ప్రయోజనం కూడా! కవులంతా సౌందర్యాన్ని వర్ణించగా, వేదం మాత్రం వర్షం ప్రయోజనాన్ని ప్రకటించింది. గ్రీష్మకాలే దావాగ్ని నా దగ్ధప్రదేశే, అచిరకాలే వర్షర్తౌ వృష్టి పతనేన- భూయస్యః కోమల యుక్తాశ్చ ఓషధయః ప్రజాయన్తే!- గ్రీష్మరుతువులో దావాగ్ని కారణంగా దగ్ధమైన ప్రదేశాలన్నింటా వర్షాలు పడ్డాక కోమలమైన ఔషధీ లతలు, రోగనివారణా మూలికలు పూర్వంకన్నా అధికసంఖ్యలో పుట్టుకొస్తాయని వేదం చెప్పింది. ఇదీ వర్షం బాపతు పరమ ప్రయోజనం. భూమి తాలూకు పరమ సార్ధక్యం. రుతు పరిణామానికి ధన్యత అదే! దీన్ని దృష్టిలో పెట్టుకునే శేషేంద్ర ఆ పరిణామక్రమానికి ప్రణామాలు చేశారు- ఒక కవితలో... 'వర్షం వెళ్ళిపోయింది- మబ్బుల రథాలెక్కి/ జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు/ భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి/ మొదటవచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది... కృతజ్ఞతతో...' అన్నారాయన. దీన్ని ఆకళించుకుంటే వర్షకళ లక్ష్యం బోధపడుతుంది. వానా వానా వందనం అని ఎందుకు మొక్కాలో తెలుస్తుంది.
(ఈనాడు, సంపాదకీయం, 08:06:2008)
_____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home