కలవరమాయె మదిలో...
పువ్వుల కారణంగా మొక్కలను ఆదరిస్తాం. పళ్లు పేరుచెప్పి చెట్లకు గుర్తింపు దక్కుతుంది. వర్షాల పుణ్యమా అని, మేఘాలకి పూజలు జరుగుతాయి. పంటలవల్ల భూమి ఆరాధనకు నోచుకుంటుంది. అలా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత మూలంగా మన్నన లభిస్తుంది. ఆలోచన కారణంగా మనిషి గౌరవనేయుడవుతున్నాడు. ఆలోచనే మనిషి ప్రత్యేకత. ఆలోచనే మనిషి పెట్టుబడి. ఆలోచనే నిజమైన సంపద! ఆలోచించే శక్తి సృష్టిలో మనిషికే సొంతం. మనిషి ఆలోచనలకు మనసు కేంద్రం. శరీరంకన్నా భిన్నమైన మనసు అనేదాన్ని ప్రజాపతి ప్రతి మనిషిలోనూ నిక్షిప్తం చేశాడు. అది అపూర్వమైనది. అపూర్వా ప్రజాపతేః తనూ విశేషః తన్మనః అన్నది- ఐతరేయ బ్రాహ్మణం. చెట్లు బతుకుతున్నాయి. పశువులూ పక్షులూ బతుకుతున్నాయి. అయినా జీవనమంటే మనిషిదే- ఎందుకంటే మనిషి ఆలోచనలతో జీవిస్తాడు కనుక! సజీవతి మనోయస్య మననేవహి జీవతి- అన్నది యోగ వాసిష్ఠం. మనిషి ఆలోచన ఎన్నో అద్భుతాలను సాధించింది. ఎన్నో జగత్తులను ఆవిష్కరించింది. ఎన్నో సత్యాలను గ్రహించింది. గట్టిగా మాట్లాడితే మనిషి ఆలోచనే, భగవంతుణ్ని సృష్టించింది. అందుకే ఆలోచనాపరుడైన మనిషే సృష్టిలో అన్నింటా ప్రమాణమన్నాడు గ్రీకు దార్శనికుడు ప్రొటొగొరస్. చిత్రం ఏమంటే, ఈ లోకంలో చాలామంది ఆలోచించరు- కొంతమందికి ఆలోచించడం రాక, మరికొందరికి అవసరం లేక! కవి మనసులో మొదట గొంగళి పురుగుల్లా మొదలైన ఆలోచనలు అక్షర రూపంలోకి వచ్చేసరికి సీతాకోక చిలుకలై, ఆకర్షణీయమైన కవిత్వం రూపు దాలుస్తాయి. ఆలోచించే పాఠకుడికి ఆనందాన్ని పంచుతాయి. అందుకే సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు.
అలా స్పష్టంగా చెప్పలేకపోయినా, చెప్పడం ఇష్టంలేకపోయినా- అవతలివాడి మనసును చదివేసే శక్తి కొంతమందికి ఉంటుంది. దాన్ని పరేంగిత జ్ఞానం అంటారు. మాటలు ఇంకారాని పసివాడు ఏం చెప్పదలచుకున్నాడో తల్లి గ్రహిస్తుంది. రోగి చెప్పుకోలేకపోతున్న ఇబ్బందులను నిపుణుడైన వైద్యుడు అర్థం చేసుకుంటాడు. పరేంగిత అవగాహనమైన బుద్ధి పండితుని విశేషం అన్నాడు చిన్నయసూరి. ధృతరాష్ట్రుడి ఇంగితాన్ని పదో ఎక్కం అంత సులువుగా ఆకళించుకున్నవాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక, భీముణ్ని కౌగలించుకుంటానని ధృతరాష్ట్రుడు ముందుకు వస్తే- ఒక విగ్రహాన్ని అందుబాటులో ఉంచి, భీముణ్ని రక్షించింది- కృష్ణుడి పరేంగిత జ్ఞానమే! అలా అని, పరేంగిత జ్ఞానం అన్నివేళలా ఆనందదాయకం కాదు. గంగానదిమీద చలాగ్గా నడిచి వస్తున్న యోగిని చూసి మనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. అద్భుతం అనుకుంటాం. అదేమాట పక్కవాడితో అంటాం. తీరా అతగాడు 'ఆఁ ఇందులో అద్భుతం ఏముంది? ఆ యోగికి ఈత వచ్చి ఉండదు' అని చప్పరించే బాపతు అనుకోండి. అలాంటివాడి ఇంగితం కనుగొనడం వల్ల ఏం ప్రయోజనం లేదు సరికదా, అంతకుముందు యోగప్రక్రియను చూసినప్పటి ఆనందం కూడా ఆవిరైపోతుంది. ఈ తరహా వ్యక్తులు ఎక్కువగా పేకాటలో తారసపడతారు. 'ఈ రోజు ఏమిటో చెయ్యి తెగ తరుగు ఆడుతోంది' అంటూ, తన పేక పడేసి మన పక్కన చేరి సలహా చెప్పబోతారు. 'వీడి దుంపతెగా! ఇంతకన్నా నా పేక చాలా నయం. ఇలాంటివి ఆడేసి గెలిచేస్తున్నాడన్నమాట. ఈ పేక బతికేలోగా, ఎవడైనా షో చూపించేస్తే బాగుణ్ను!' అనేదే ఆ వ్యక్తి మనసులో నిజమైన ఆలోచన అయి ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలామంది నిజ స్వరూపాలు ఇలాంటివే! అందుకే అజ్ఞానమంత సుఖం ఇంకోటి లేదన్నారు- అనుభవజ్ఞులు.
ఎదుటివారి మనసులో ఆలోచనలు తెలియకపోవడమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనిషి బుర్రలోని ఆలోచనలను చూసి చదివినట్లు చెప్పగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేస్తున్నారన్న వార్త- ఈ కారణంగానే చాలామందిని కలవరపెడుతోంది. తలకు ఎలక్ట్రోడ్‌లతో కూడిన పరికరాన్ని తగిలించి, ఏదైనా ప్రత్యేక విషయం గురించి ఆలోచించమంటారు. ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రఫీ పరిజ్ఞానంతో మెదడులోని సంకేతాలను అధ్యయనం చేస్తున్నారు. అలా ఎదుటివారి ఆలోచనలను పసిగట్టే సాఫ్ట్‌వేర్ రూపొందించడం వారి లక్ష్యం. అది తయారైతే కంప్యూటర్ ద్వారా చదవడమో, వాటిని స్పీకర్ ద్వారా వినడమో సాధ్యమవుతుందంటున్నారు. యుద్ధంలో గాయపడిన సైనికుల మనోగతాన్ని అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని భావించిన అమెరికా సైన్యం- ఈ కృషికి తన వంతుగా 40 లక్షల డాలర్ల సహాయాన్ని సమకూర్చింది. అదంతా శత్రు సైనికులు పట్టుబడినప్పుడు వారినుంచి రహస్యాలను రాబట్టేందుకేనన్న విమర్శలు వినవస్తున్నాయి. కళావతి ద్వారా పద్మినీ విద్యను సాధించిన స్వరోచి దాంతో సరిపెట్టుకోకుండా, విభావరిని వివాహం చేసుకోవడం ద్వారా జంతు, పక్షి భాషలను గ్రహించే సర్వభూత రుత శక్తి సంపాదించాడు. చక్రవాకి, మగలేడి తనను ఘాటుగా తిట్టిన తిట్లతో మనసు వికలం కావడం మినహా- మనుచరిత్రలో స్వరోచి బావుకున్నది ఏం లేదు. అలా అని, ఒక సరికొత్త ఆవిష్కారాన్ని స్వాగతించకుండా ఉండలేం. కొత్తదైనంత మాత్రాన ప్రతిదాన్నీ శంకించడం ప్రగతికి ఆటంకమవుతుంది. మనసులో గాఢమైన అనురాగాన్ని దాచుకుని, భర్తపై తన వలపును మాటల్లో వెల్లడించలేని ముగ్ధల తీయని మనోగతాన్ని భర్తలు కనుగొనగలిగితే అది అద్భుతమేగా- అనేవారు లేకపోలేదు. ఆ రకంగా మాటల్లో చెప్పలేని మధురమైన భావాలు అవగతమైతే ఆ దాంపత్య మాధుర్యం వర్ణనాతీతం. అలాంటి సందర్భాల్లో ఇలాంటి పరికరం పరమ ప్రయోజనకరమైనదని చెప్పక తప్పదు.
(ఈనాడు, సంపాదకీయం, 31:08:2008)
_______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home