My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, January 02, 2009

తెలుగుధనం

గొప్ప చిత్రకళా ప్రదర్శనం నడుస్తోంది. సజీవంగా నిలబడి ఉందా అనిపించేంత అందమైన పడుచుపిల్ల బొమ్మను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడొకాయన. ఆ పిల్ల ఒంటిమీద బట్టలు లేవు. పచ్చని ఆకులు మాత్రం కప్పుకొంది. చూసి చూసి ఆయన భార్య, 'ఏం స్వామీ! శిశిరం వస్తేగాని అక్కడినుంచి కదిలిరారా ఏమిటి?' అని ప్రశ్నించింది. చిన్నతనంలో మనం 'శిశిరంలో చెట్లు ఆకులు రాల్చును...' అని పెద్ద బాలశిక్షలో చదువుకున్నది గుర్తొస్తే- ఆమె ప్రశ్నలో చమత్కారం అర్థమై, ఎక్కడో గుండె లోతుల్లోంచి ఆనందం ఉబికి వస్తుంది. రాముడి బొడ్డు కోస్తుంటే బ్రహ్మదేవుడు ఉలిక్కిపడ్డాడని రాశారు- విశ్వనాథ! రాముడు మహావిష్ణువు అవతారం. విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి- పునాదులు కదులుతుంటే బ్రహ్మ కంగారుపడ్డాడని అందులో ధ్వని. ఇది తెలిసేసరికి మనసులో కలిగే ఒకానొక అపురూపమైన స్పందన పేరే ఆనందం. రసజ్ఞత దానికి మూలం. సాహిత్య అధ్యయనం వల్ల కలిగే పరమ ప్రయోజనమది. సాహిత్యం మనిషిని సహృదయుణ్ని చేస్తుంది. జీవితానికి రంగులద్దుతుంది. వూహలకు రెక్కలు తొడుగుతుంది. భావుకతను పెంచుతుంది. చదువులూ డిగ్రీలూ చేయలేని పని మనిషిని రసజ్ఞుణ్ని చేయడం. అది సాహిత్యంవల్ల సాధ్యపడుతుంది. 'చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకం...' అనేశాడు భాస్కర శతకకారుడు. రసజ్ఞత అలవడకపోతే మనిషి తన జీవితంలో ఎన్నోరుచులు కోల్పోతాడు. అందుకే- '...లే జవరాలు చెక్కుమీటిన వస వల్చు బాలకుడు డెందమునం కలగంగ నేర్చునే...?' అని నిలదీశాడు శ్రీనాథుడు. సాహిత్యంలో మజా ఎంత గొప్పదో- అది అనుభవించినవాడికే తెలుస్తుంది. సాగరమథనంలో అమృతం పుట్టినట్లు సాహిత్య మథనంలో మాధుర్యం పుట్టి- మనిషికి జీవించిన క్షణాలను మిగిలిస్తుంది.

ప్రాచీనం కావచ్చు, ఆధునికం కావచ్చు- రచన గొప్పదనం సహృదయ పాఠకుడికి అది కలిగించే అనుభవ విశేషాన్ని బట్టి ఉంటుంది. ఆ అనుభవం పాఠకుడిలో ఎన్నో ప్రవృత్తులకు కారణమవుతుంది. రామాయణాది ప్రాచీన కావ్యాల అధ్యయనం- మనిషిని మంచి యోగ్యుడిగా చేస్తుంది. ఆధునిక రచన కన్యాశుల్కం చదవడం పూర్తయ్యేసరికి మనలోపలి గిరీశాన్ని మనం గుర్తించగలుగుతాం. అదీ సాహిత్య ప్రయోజనం! పాలకడలిని చిలికినప్పుడు పుట్టుకొచ్చిన కాలకూట విషాన్ని- జనహితం కోరి మింగేయవయ్యా అని భర్తకు అనుమతి ఇచ్చింది సర్వమంగళ. '...మంగళ సూత్రమ్ము నెంత మది నమ్మినదో...' అన్నాడు పోతన్న. ఆ భావం ఇంకితే బండరాయి వంటి గుండెకాయ సైతం కరిగి నీరవుతుంది. నీ కవితాకన్య చాలా సొగసుగా ఉంది- అన్నవారే '... మీదే కులము? అన్న ప్రశ్న వెలయించి, చివుక్కున లేచి పోవుచో బాకున క్రుమ్మినట్లగును...' అని కవి మనసు విలవిల్లాడిందని తెలిస్తే- మనకీ గుండె కలుక్కుమంటుంది. 'హృదయ సంబంధి' సాహిత్యం మనిషిలో కలిగించే సంస్కారాలకు ఇవి ఉదాహరణలు. మనిషితనానికి చిహ్నాలు. వేసవికాలంలో ఒకోసారి పెద్దగా సుడిగాలి రేగి, పొడవైన గుండ్రని దుమ్ము చక్రాలు ఏర్పడతాయి కదా! ఆ ఆకారాన్ని బట్టి కాబోలు, వాటిని 'ఎగిరే బావులు' అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. నూతులు ఎగరడమేమిటయ్యా అంటే తమలోని నీళ్ళను నీ వేడి పూర్తిగా పీల్చేసింది మొర్రో- అని సూర్యుడికి విన్నవించుకోవడానికి అవి ఆకాశంలోకి లేచాయి అన్నాడు. బుద్ధితో ఆలోచించి గ్రహిస్తే- ఆహాఁ అనిపించే ఊహ అది. బాలరాముడు ఓంకారంలా ఉన్నాడు చూడండి అన్నారు విశ్వనాథ. బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాలుణ్ని వూహించుకుని, ఆ భంగిమను తెలుగు 'ఓం' అక్షరంతో పోల్చిచూస్తే ఆ దర్శనం మనకీ లభిస్తుంది. ఇది 'బుద్ధిసంబంధి' సాహిత్యం తీరు.

'నన్నయ తిక్కనలు ప్రయోగించినంత గొప్పగా శబ్దాన్ని ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు... మహారాజుకు నన్నయ గురువు... పెద్దన సార్వభౌముని ప్రాణస్నేహితుడు... శ్రీనాథుడు కవుల కవి... వేమన రెక్క ముడవని భరత పక్షి, కాలాలు దాటి ఇంకా ఎగిరివస్తూనే ఉంది...-' ఆయా కవుల జీవధాతువును పట్టిచ్చే ఈ విశ్లేషణ కృష్ణశాస్త్రిది. ఇది బుద్ధిగతమైన వివేచన. బుద్ధిసూక్ష్మతకు సూచన. తిరువళ్ళిక్కేన్‌ దేవాలయం ఏనుగుకు రోజూలాగే ప్రసాదాన్ని అందించాడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. ఆ రోజెందుకోగాని ఏనుగు తన తొండంతో భారతిని ఎత్తికొట్టింది. ఆయన మరణించిన రోజున మరో ప్రముఖ కవి వాలి విలపిస్తూ- 'తమిళ చెరుకుగడను తిరువళ్ళిక్కేన్‌ ఏనుగు మింగేసింది' అన్నాడు. కృష్ణశాస్త్రి మరణించారని తెలిసి శ్రీశ్రీ- 'అద్దం బద్దలైంది... రోదసి రోదించింది... షెల్లీ మళ్ళీ మరణించాడు... వసంతం వాడిపోయింది' అన్నాడు. ఇది గుండెల్లోంచి పొంగే స్పందన. రసజ్ఞతకు సూచన. 'ఎయ్యది హృద్యము? అపూర్వం బెయ్యది?' అని అడిగి వూరుకోలేదు మనవాళ్ళు. అంటే- హృదయ సంబంధి, బుద్ధి సంబంధితో సరిపెట్టుకోలేదు. '...ఎద్దాని వినిన ఎరుక సమగ్రమగు?' అనీ ప్రశ్నించారు. ఎరుక కలగడం సాహిత్యం తాలూకు పరమ ప్రయోజనం! భారతీయ సాహిత్య అధ్యయనం గొప్ప ఉదాత్త లక్ష్యాలతో కూడుకున్నది. నన్నయ్య వెలుగుతో, తిక్కన్న తెలుగుతో, పోతన్న ఎలుగుతో... కనీస పరిచయం లేకుండా- 'నేను తెలుగువాణ్ని' అని ఎవరైనా ఎలా చెప్పుకోగలరు? అశోకవనంలో సీతాదేవిలా ఉంది ప్రస్తుతం తెలుగు భాష! ప్రాచీన భాష హోదాతో రాజయోగం అమరింది. చెర విముక్తికి దారి దొరికింది. పఠన యోగాన్ని కూడా మనం పట్టిస్తే- అగ్నిపునీత అయి లక్ష్యాన్ని చేరుకుంటుంది. తెలుగు భాష ఘనతను వివిధ కోణాల్లోంచి గ్రహించి అటు కవులూ, ఇటు భావుకులూ దాని వైభవాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కృషిచేస్తే అదే పదివేలు!
(Eenadu, 16:11:2008)
_________________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home