My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, January 06, 2009

దాంపత్య సౌభాగ్యం

తొలి దశలో మానవులది స్వేచ్ఛాశృంగారం. మనసైన ఆడది కంటపడితే 'తల్లో పూలు కొనిస్త... సేతులకు బందర్‌ గాజులేయిస్త... ఉప్పాడ చమ్కీ బుటా మల్లీమొగ్గల తెల్లకోక... ఇగో... ఈ మారెల్లి పట్కొస్తనే...' తరహాలో మగాడు ఎలాగోలా ప్రలోభపెట్టి తన కోరిక తీర్చుకునేవాడు. సరసత ఎరుగని మొరటువాడైతే రావణాసురుడి ఫక్కీలో పరస్త్రీలను చెరపట్టడం, బలాత్కరించడం కానిచ్చేవాడు. ఈ దశలోనే ఉద్దాలకుడనే ముని ఇంటికి వచ్చిన అతిథి- ముని భార్యతో పొందుకోరాడు. సాధ్వియైన తన తల్లిని అలా పరాయివాడు కామించడం కొడుకు శ్వేతకేతువు దుర్భరంగా తోచింది. గొప్ప తపశ్శాలియైన శ్వేతకేతువు ఉగ్రుడై 'ఇది మొదలుగా వివాహితలను పరులు కోరడానికి వీల్లేదు... మానవజాతికి ఈ రకమైన కట్టడిని నేను ఏర్పాటు చేస్తున్నాను' అని తీవ్రస్వరంతో ప్రకటించడాన్ని భారతం ఆదిపర్వం వివరించింది. అది నేపథ్యంగా భారతీయ వివాహవ్యవస్థలో ఒక స్పష్టత చోటుచేసుకుంది. కామం విషయంలో క్రమశిక్షణ మొదలైంది. భృగుని భార్య పులోమ గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను కామించిన రాక్షసుడొకడు పందిరూపంలో వచ్చి ఆమెను అపహరించబోయాడు. ఆ దురాగతాన్ని గమనించిన ఆమె కడుపులోని బిడ్డ తీవ్రక్రోధంతో గర్భం నుంచి వెలువడ్డాడు. ఆయన పేరు చ్యవనుడు. చ్యవనుడి తేజస్సుకే రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. దాంపత్య ధర్మాన్ని నిష్ఠగా కొనసాగించేవారికి రక్షణ ఎలా లభిస్తుందో, పవిత్ర వైవాహిక జీవనఫలంగా లభించే సంతతికి ఎంతటి శక్తిసామర్థ్యాలు సమకూరతాయో భారతం కథలు కథలుగా వివరించి చెప్పింది.

దాంపత్య జీవనానికి అన్యోన్య అనురాగం పునాది. పరస్పర అనురాగంతో బంధం బలపడ్డప్పుడు- భార్యావియోగం పురుషుడిలో ఎంతటి వేదనకు కారణమవుతుందో రామాయణం వివరించింది. భార్యకు ఏదైనా జరిగితే భర్తకు ఏమనిపిస్తుందో భారతం చెప్పింది. ద్రౌపదిని సైంధవుడు అపహరించుకుపోతే ఎక్కడో దూరంగా ఉన్న ధర్మజుడికి 'చేయిపెట్టి కలచినట్లయ్యెడు చిత్తంబు... తనువు నిశ్చేష్టమయ్యె...' అనిపించింది. చిక్కని అనురాగానికి చక్కని సంతానం వరంగా లభిస్తుంది. బిడ్డను చూడగానే తండ్రికి కలిగే ఆనందానుభూతిని వర్ణిస్తూ శకుంతల 'తాన తననీడ నీళ్లులలో ఏర్పడ చూచునట్లు... మహానందము పొందు...' అంది భారతంలో. హాలీవుడ్‌ అందాలతార ఏంజెలీనా జోలీ మాతృత్వపు మహానందాన్ని ఇటీవలే గొప్పగా వర్ణించి చెప్పింది. తల్లిని కావడంవల్ల తన అందం మరింత పెరిగిందంది. పండును రుచి చూడగానే చెట్టుసారం తెలిసినట్లు- పిల్లల ప్రవర్తన చూడగానే లోకం వారి తల్లిదండ్రుల దాంపత్య సారం అర్థం చేసుకుంటుంది. తమలపాకుతో నీవొకటిస్తే, తలుపుచెక్కతో నే రెండిస్తా... తరహా సరసాలు మనలో చాలామందివి. అదే బాధ! నిజానికి ఇల్లంటే ఒక గుడి. దానిలో వీలైనంత ఎక్కువసేపు గడపాలనిపించడం మంచి ఇంటి లక్షణం. దాని విషయంలో ఈ జాతి నిర్లక్ష్యం వహిస్తోంది. సత్‌సంతానం కోసమే దాంపత్య భోగం అనే సత్యాన్ని విస్మరిస్తోంది. 'కుమారసంభవ ప్రమాదమెరుగని అనవరత రతి మన సమాజం ద్రుతగతి...' అని కాళోజీ బాధపడ్డారు. కలయికలు అసమభోగాలై ఫలితాన్ని తారుమారు చేస్తున్నాయి. వేపవిత్తు నాటితే రసాల మామిడి మొలుస్తుందా మరి! చివరికి 'ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు.. ముద్ద పెట్టుమనగ గుద్దెనేడు...' అని తల్లిదండ్రులు వాపోవడం మిగులుతోంది. దాంపత్యాన్ని అద్భుతమైన ఒకానొక కళగా నిర్వహించకపోవడం వల్ల చెడు పరిణామాలివి!

దంపతుల్లో అనురాగం స్థానే అహంకారం చోటు చేసుకున్నప్పుడు, విడివిడిగా ఎవరి వ్యక్తిత్వాలకు వారు ప్రత్యేక విలువలను ఆపాదించుకున్నప్పుడు దాంపత్య సమతౌల్యం దెబ్బతింటుంది. మనిషిలో వివేకం మేలుకోవలసింది అప్పుడే! తల్లిదండ్రులైతే ఈ అవసరం మరింత ఎక్కువ. అరమరికలకు దూరంగా- ఆత్మీయత అనురాగం పునాదులుగా నిలిచిన దాంపత్యం సమాజానికి మంచి పౌరులను కానుక చేస్తుంది. దాంపత్య భాగ్యమే నిజమైన సౌభాగ్యం! సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకోవాలని మనిషి తహతహలాడితే- ఆ ఇల్లు స్వర్గం. కాకపోతే అది కేవలం మకాం. ఇంటిలోని పోరు ఇంతింత గాదయా... అనే దుస్థితి ఏర్పడితే దానికి ఇద్దరూ బాధ్యులే. తల్లిదండ్రుల బాంధవ్యాల్లో నిర్లిప్తత, నైరాశ్యం పెరిగితే అది పిల్లల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయమై మానవీయమైన తీర్పు వెలువరించింది. పిల్లలకోసమని తల్లిదండ్రులు తమలోని వైరుధ్యాలను సమీక్షించుకోవాలని కోరింది. అవగాహన లోపాల్ని అధిగమించాలంది. 'కలిసి ఉండటానికి అనుకూలమైన దారులన్నీ పూర్తిగా మూసుకుపోయాక మాత్రమే తల్లిదండ్రులు విడిపోవడం గురించి ఆలోచించాలి' అని ఆదేశించింది. భార్యాభర్తలు ఘర్షణ పడవచ్చు, విడిపోనూవచ్చు. తల్లిదండ్రులు ఆ పనిచేస్తే పిల్లలకు ద్రోహం జరుగుతుంది. విడిపోవడానికేముంది! ఒక్క కాగితమూ, రెండు సంతకాలూ చాలు. కలవడానికే మూడు ముళ్లూ, ఏడడుగులూ అవసరం. 'ఇరవై నెలల బిడ్డను నానుంచి విడాకులు వేరుచేశాయి. ఇన్నాళ్ళ నా వేదన తీరి, ఎదురుచూపులు ఫలించి దేవుడు కరుణించి అత్యున్నత న్యాయస్థానం ద్వారా నాకు అనుగ్రహం ప్రసాదించాడు' అని ఆ తల్లి నిట్టూర్చింది. అర్థం కావలసినవారికి ఆ మాటలు సరిగ్గా అర్థం అయితే అంతే చాలు!
(Eenadu, editorial, 30:11:2008)
_________________________________________


Labels:

0 Comments:

Post a Comment

<< Home