మెదడు హార్డ్‌వేర్‌కు నమ్మకమే సాఫ్ట్‌వేర్!
సత్య
ఎక్కువ మార్కులు రావాలంటే శక్తినిచ్చే నమ్మకాలను దరిచేర్చుకోవాలి. ప్రతి విద్యార్థీ 'నేను తెలివైన వాణ్ని. నాకు మంచి మార్కులు వస్తాయి. చదువు ఆటలాంటిది' వంటి నమ్మకాలు ఏర్పరచుకోవాలి. సామాన్య విద్యార్థి కూడా విజేతగా మారటానికి ఇదెంతో ఉపకరిస్తుంది! మనిషి జీవితానికి నమ్మకం చాలా ప్రధానమైనది. 'కంప్యూటర్' పని చేయడానికి 'ఆపరేటింగ్ సిస్టం' ఎంత ప్రధానమైందో, మనిషి మెదడు అనే కంప్యూటర్ పనిచేయడానికి నమ్మకాల వ్యవస్థ అంత ప్రధానం. మనిషి 'మెదడు' అనే హార్డ్‌వేర్ పనిచేయడానికి 'నమ్మకం' అనే సాఫ్ట్‌వేర్ కావాలి.
విద్యార్థి మార్కులకూ, అతని నమ్మకాలకూ సంబంధం ఉంటుందా అని కొందరికి సందేహం రావొచ్చు. విద్యార్థి మార్కులనే కాదు, అతని జీవితాన్ని సైతం మార్చేయగల శక్తి నమ్మకాలకుంది.
ఓ నమ్మకం అందలమైనా ఎక్కిస్తుంది. అగాధానికైనా తోసేస్తుంది. అది స్వర్గానికి నిచ్చెనలేస్తుంది. నరకానికి లాకులు తీస్తుంది. నమ్మకానికున్న అనంతశక్తిని చూసే 'అది దేనినైనా సృష్టించగలదు; దేనినైనా నిర్జించగలదు' అంటాడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఏంథోని రాబిన్స్.
బలమైన నమ్మకమున్న విద్యార్థి మనసు- ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి దారులు వెదుకుతుంది. తన శక్తినంతా కేంద్రీకరించి మంచి ఫలితాలు సాధించడానికి వ్యూహాలు పన్నుతుంది. సరైన నమ్మకం లేని విద్యార్థి మెదడు మొద్దుబారిపోతుంది. తన ముందున్న దారులను మూసేస్తుంది. ఫలితంగా ఏదీ సాధ్యం కాకుండాపోతుంది.
'విజయ-విఫల' వృత్తం
* ఓ పనిలో విజయం సాధించడానికైనా, విఫలం కావడానికైనా నమ్మకమే ప్రధానం.
* ఆ నమ్మకానికి అనుగుణంగానే ఏ వ్యక్తి అయినా చర్య (action) తీసుకుంటాడు.
* చర్య తీసుకున్నపుడే అతని శక్తి అంతా వినియోగానికి వస్తుంది.
* శక్తి వినియోగమైనప్పుడే ఫలితం వస్తుంది.
ఆ ఫలితమే నమ్మకాన్ని మరింత బలపడేట్టు చేస్తుంది. వృత్తాకారంలో అనునిత్యం అది పరిభ్రమిస్తూ ఉంటుంది.
విజయ వృత్తం (Circle of success)
విద్యార్థి మార్కుల దృష్ట్యా దీనికి ఓ దృష్టాంతాన్ని చూద్దాం. 'నేను తెలివైనవాణ్ని.' 'నాకు ర్యాంకు వస్తుంది'. 'చదువు ఆటలాంటిది'. ఇలాంటి సానుకూల నమ్మకాలు ఉండే విద్యార్థి ఎలాంటి చర్యలు తీసుకుంటాడు?
తప్పనిసరిగా ఎక్కువ మార్కులు రావాలని ఓ లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. చదువు ఆటలాంటిది కాబట్టి ఇష్టపడి చదువుతాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఎక్కువ గంటలు పనిచేస్తాడు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఆ విద్యార్థి తన శక్తి సామర్థ్యాల్లో 90 శాతానికి మించి ఉపయోగించుకుంటాడు. ఫలితంగా అతడు లక్ష్యంగా నిర్దేశించుకున్న మార్కులు వస్తాయి. లేదా దానికి దగ్గర మార్కులు వస్తాయి.
దీనివల్ల ఆ విద్యార్థికి ఉండే 'నేను తెలివైనవాణ్ని, నాకు ర్యాంకు వస్తుంది, చదువు ఆటలాంటిది' లాంటి నమ్మకాలు మరింత బలపడతాయి. భవిష్యత్తులో విజయం సాధించడానికి మరింత ఉపకరిస్తాయి. ఇదే విజయ వృత్తం/సాఫల్య వృత్తం. సామాన్య విద్యార్థులు కూడా విజేతగా మారటానికి కారణం- వారికుండే బలమైన నమ్మకమే.
దీన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.
వైఫల్య వృత్తం (Circle of failure)
అదే విద్యార్థికి ప్రతికూల నమ్మకాలు ఉన్నాయనుకుందాం. 'నేను మందబుద్ధిని. ఎంత చదివినా బుర్రకెక్కదు. చదువంటే బోరు. అది చాలా కష్టం' లాంటి నమ్మకాలు బుర్రలో తిష్ఠ వేసే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ కుర్రాడు చదవడానికి ప్రయత్నిస్తాడా?
చదువనగానే పుస్తకాన్ని పక్కన పారేస్తాడు. కాలాన్ని కంప్యూటర్ క్రీడలకో, సెల్‌ఫోన్ చాటింగ్‌కో, టీవీలో చెత్త ప్రోగ్రాములకో వినియోగిస్తాడు. చదవడం ఇష్టం లేని కుర్రాడి మెదడు ఎంత శక్తిని వినియోగించుకుంటుంది? బహుశా సున్నా శాతాన్ని. ఫలితం- సున్నా మార్కులు లేదా అత్తెసరు మార్కులు.
ఆ మార్కులు వచ్చిన విద్యార్థికి ఏమనిపిస్తుంది?- ''నే చెప్పలే! మనకి చదువు అచ్చిరాదు. అది మన ఒంటికి సరిపడదు. అదో పెద్ద బోరు''. ఈ నమ్మకాలు బలపడ్డ విద్యార్థి ఏం చేయగలడు? ఇంకేం మార్కులు తెచ్చుకోగలడు? ఇదే వైఫల్య వృత్తం. విఫలమయ్యే విద్యార్థి మరింత విఫలుడు కావడానికి కారణం అతనిలో తాను సఫలుణ్ని కాలేననే నమ్మకాలే.
మరేం చేయాలి?
ఎక్కువ మార్కులు రావాలంటే ప్రతి విద్యార్థీ వైఫల్య వృత్తం నుంచి బయటపడాలి. అలా బయటపడాలంటే ముందు తనలోని నిర్వీర్య నమ్మకాలను తొలగించుకోవాలి. శక్తినిచ్చే నమ్మకాలను దరిచేర్చుకోవాలి. నమ్మకాల్లో మార్పు వస్తే జీవితంలో కూడా మార్పు వస్తుంది. అందువల్ల ప్రతి విద్యార్థీ 'నేను తెలివైన వాణ్ని. నాకు మంచి మార్కులు వస్తాయి. చదువు ఆటలాంటిది' వంటి శక్తినిచ్చే నమ్మకాలు కలిగివుండాలి. ఆ నమ్మకాలే విద్యార్థి జీవితాన్ని మార్చే సంజీవని లాంటివి.
నిర్వీర్య నమ్మకాలను ఎవరూ కావాలని కోరుకోరు. మనకు తెలియకుండానే మన పరిసరాల నుంచీ, మన అనుభవాల నుంచీ, మన విద్యావ్యవస్థ నుంచీ ఈ నమ్మకాలు చొరబడతాయి. క్రమేపీ వేళ్ళు దన్ని వూడలు దింపి మర్రిమానుల్లా ఎదిగిపోతాయి. అందుకే వేగవంతమైన విద్యార్జన (Accelerated Learning)కు ఆద్యుడైన జార్జ్ లొజనెవ్ ''పుట్టినప్పుడు అంతా మేధావులే. పెరుగుతున్నకొద్దీ ఆ మేధ తరిగిపోతుంది'' అంటాడు.
చిన్నప్పుడు 'నువ్వో పనికిమాలినవాడివి, బుద్ధిహీనుడివి, బుర్ర తక్కువవాడివి' లాంటి బిరుదులు తగిలిస్తారు. వీటిని మన అచేతన మనసు గ్రహించి అలాగే మనల్ని మార్చేస్తూ ఉంటుంది. వాటినే మనం నమ్ముతాం; అలాగే ప్రవర్తిస్తాం. ఆ విధంగానే మారతాం.
విద్యా విషయంలో కూడా తమలో ఏర్పడ్డ నమ్మకాలనే విద్యార్థులు నిజమని నమ్ముతారు. 'ఆల్‌జీబ్రా గుండె గాభరా', 'లెక్కలంటే లంకణాలు పడడం', 'ఇంగ్లిష్ అంటే గింగరాలు తిరగడం' 'బోటనీ బోరు బోరు' లాంటివి విద్యార్థులకు బయటినుంచి వచ్చే నమ్మకాలే. వీటన్నిటినీ మార్చుకుంటే తప్ప మన సబ్జెక్టుల మీద ఆసక్తి రాదు. ఆసక్తి లేకుంటే ఆశించే ఫలితాలు రావు. అందువల్ల నిర్వీర్యమైన నమ్మకాలను తుంగలో తొక్కి, శక్తినిచ్చే నమ్మకాలను అక్కున చేర్చుకోవాలి.
ఈ నమ్మకాలు శక్తినిస్తాయి!
విజేతలైన విద్యార్థులంతా శక్తినిచ్చే నమ్మకాలతో జీవిస్తారు. ఆ నమ్మకాలే ఉత్తమ ఫలితాలు రావటానికి ఉపకరిస్తాయి. అలాంటి విజేతలైన విద్యార్థులు పాటించే ఓ ఐదు శక్తిమంతమైన నమ్మకాలను మనవిగా చేసుకుని మననం చేసుకుందామా?
1. ఇతరులు చేయగలదాన్ని నేనూ చేయగలను (If others can do, so can I) :
ఒక వ్యక్తి చేయగలిగినదాన్ని ఎవరైనా చేయగలరు. ఒక మైలు దూరాన్ని నాలుగు నిమిషాల లోపు ఎవరూ పరుగెత్తలేరని శతాబ్దాల కాలం నుంచి ఉన్న నమ్మకాన్ని రోజర్ బేనిస్టర్ బద్దలు కొట్టాడు. రోజర్ చేసిన తర్వాత వందలకొద్దీ జనాలు తామూ చేయగలమని నిరూపించారు.
2. వైఫల్యం లేనేలేదు, అది కేవలం సంకేతమే (There is no failure, only feedback) :
విజయం రాకపోతే అది వైఫల్యంగా భావిస్తారు సగటు వ్యక్తులు. విజయం రాకపోతే తమ ప్రయత్నం స్థాయిని తెలియజేసే సంకేతంగా భావిస్తారు విజేతలు. థామస్ ఎడిసన్, బిల్‌గేట్స్‌లు తమ వైఫల్యాలను విద్య నేర్పే అనుభవాలు (Learning experiences) గా అభివర్ణించారు.
3. చదువనేది ఓ ఆట (Learning is fun):
ఏది సాధించాలన్నా, ముందు దాన్ని ప్రేమించాలి. ప్రతి వ్యక్తీ ఆటల్ని ప్రేమిస్తాడు కాబట్టే ఆటలంటే చెవి కోసుకుంటాడు. చదువును ప్రేమించే విద్యార్థి దాన్ని ఆటలానే తీసుకుంటాడు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాడు.
4. నా జీవిత గమనానికి నేనే బాధ్యుణ్ని (I am responsible for my destiny) :
విద్యారంగంలో విప్లవాన్ని సృష్టించిన మార్వా కొలీన్స్ ప్రారంభించిన పాఠశాలలో ఓ ఆరేళ్ళ విద్యార్థి తల్‌మాగ్డే. 'నువ్వేం నేర్చుకున్నా'వని అడిగితే ఆ విద్యార్థి చెప్పిన మాట- 'నీ గురించి సమాజం ఏమైనా అనుకోనీ. కానీ నీ గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సింది కేవలం నువ్వే'. ఆ చిన్నపిల్లాడి మాట కోటి మార్కుల మూట.
5. నేను తెలివైనవాణ్ణి. చురుకైనవాణ్ణి:
'నేను తెలివైనవాణ్ణి, చురుకైనవాణ్ణి, అవిశ్రాంత శ్రామికుణ్ణి. నాకు ఎక్కువ మార్కులు వచ్చి తీరతాయి' అనే నమ్మకాలు విజేతలైన విద్యార్థుల్లో కనిపిస్తాయి.
ఇలాంటి ఓ అయిదు నమ్మకాలు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉంటే పరీక్షల్లోనే కాదు, బతుకుబాటలో కూడా మార్కులన్నీ మీవే!
__________________________________________________________
చిన్నప్పుడు 'నువ్వో పనికిమాలినవాడివి, బుద్ధిహీనుడివి, బుర్ర తక్కువవాడివి' లాంటి బిరుదులు తగిలిస్తారు. వీటిని మన అచేతన మనసు గ్రహించి అలాగే మనల్ని మార్చేస్తూ ఉంటుంది. వాటినే మనం నమ్ముతాం; అలాగే ప్రవర్తిస్తాం. ఆ విధంగానే మారతాం.
_____________________________________________________
(Eenadu, chaduvu, 19:01:2009)
_________________________________________________
Labels: Self development, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home