My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, February 21, 2009

వాఁహ్‌.. తాజ్‌

వాల్మీకి రామాయణం వంటి అద్భుతమైన కావ్యమైనా కావచ్చు, తాజ్‌మహల్‌ వంటి అపురూపమైన కట్టడమైనా కావచ్చు, మాయాబజార్‌ వంటి గొప్ప చలనచిత్రమూ అంతే- వాటి గురించి ఎంతోమంది చెప్పారనడమేగాని, అంతా చెప్పేశారు అనడానికి లేదు. ఇది దృష్టిదోషం కాదు- సృష్టిదోషమే! వాటి నిర్మాణాలు అంత విశిష్టమైనవి. అపురూపమైన కళాఖండాల పట్ల అభిప్రాయాలే తప్ప, అంతిమతీర్పులు ఉండవు. తరతరాలుగా ప్రజలు వాటిని గమనించి మురిసిపోతూ ఉంటారు. తమ ఆనందానుభూతులను రకరకాలుగా వ్యక్తంచేస్తూ ఉంటారు. 'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక'- ఒక్కొక్కరిదీ ఒక్కోరకం అనుభూతి. ఒక్కో రకం ప్రతిస్పందన. అందులో ఎవరిదీ- ఇదే చివరిది... అనేందుకు లేదు. 'నా పాటల చివరి అర్థం నీకు మాత్రమే బోధపడుతుంది' అన్నాడు రవీంద్రనాథ్‌ టాగోర్‌- కవుల్లోకెల్లా కవీశ్వరుడైనవాణ్ని ఉద్దేశించి! మంచి కవిత్వం భావన చేసేవారి స్థాయిని బట్టి పెరుగుతుంది. కళాఖండాల వర్ణనలు ఎలాంటివంటే- హనుమంతుడు లంకలో తొలిసారిగా జానకిని దర్శించినప్పుడు వాల్మీకి చెప్పిన శ్లోకాల్లాంటివి. అపురూపమైన ఒక జ్ఞాపకం మధ్యలో తెగిపోయిందనుకోండి- ఎలా ఉంటుంది? జానకి అలా ఉందట. అపనిందల పాలై సత్కీర్తి మాసిపోయిందనుకోండి- ఎలా ఉంటుంది? మైథిలి అలా ఉంది. భగ్నమైన ఆశలా, విఘ్నమైన సిద్ధిలా, చెడిపోయిన బుద్ధిలా, పతనమైన శ్రద్ధలా అభ్యాసం కరవై కుంటువడిన చదువులా... సంక్లిష్ట భావచిత్రంలా తోచింది జానకి. ఆ పోలికల్లోని విశేషం ఏమంటే- ఎవరి స్వీయ అనుభవాన్ని బట్టి వారికి ఆ పోలిక మరింత గాఢంగా బోధపడుతుంది. అనర్గళంగా ప్రసంగిస్తుండగా ఠక్కున ఆలోచన తెగిపోయి మాటల ప్రవాహం నిలిచిపోతే- ఆ ఇరకాటం ఎలా ఉంటుందో అనుభవించినవారికి మాత్రమే తెలుస్తుంది.

ఆనందమే కానక్కరలేదు... విరహమైనా కావచ్చు, వియోగమైనా కావచ్చు- అది కళాత్మక రూపం దాల్చినప్పుడు ఎదుటివారికి రసానుభూతిని కలిగిస్తుంది. కనుకనే విషాదభరితమైన నాటకాన్ని వేదికపై వీక్షిస్తున్నప్పుడు సైతం ప్రేక్షకుడికి ఆనందమే లభిస్తుంది. అదే కళాత్మక సృష్టి ప్రత్యేకత! తాజ్‌మహల్‌ కూడా అలాంటి ఒకానొక అపురూపమైన సృష్టి. నిజానికి అది వెన్నెల వాటిక కాదు- చేదు జ్ఞాపకాల పేటిక, విషాదమాలిక, వియోగ గీతిక. ఆ విషయం తెలిసినా అరుదైన ఆ సౌందర్యాన్ని ప్రేమించకుండా ఉండలేం. ఒకానొక ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ మాధుర్యాన్ని అణువణువూ పీల్చుకుని, ప్రేమకు అజరామరమైన తీపిగుర్తుగా ఠీవిగా మిగిలిపోవడం ఆ కట్టడంలోని కళాత్మక విశేషం. అద్దం మీదపడి మెరిసినట్లుగా- వెన్నెల ఆ శ్వేతసౌధంపై ప్రతిఫలిస్తుంటే చూసి ఆనందించడం ఎంతటి గొప్ప అనుభూతి! ఒక్క రసజ్ఞుడి గుండె చిరుసవ్వడికి ఎన్నో తరాల ప్రేమికుల గుండెచప్పుళ్లు ప్రతిధ్వనులుగా మారుమోగుతుండటం ఎంత గొప్ప విశేషం! ఏమనాలి ఆ జాబిలి కూనను... ఎలా వర్ణించాలి ఆ ధావళ్యాన్ని... ఏ భాషలో అక్షరబద్ధం చేయగలం ఆ అనుభూతి దొంతరలను! అందుకనే తాజ్‌మహల్‌ గురించి కవిత్వాలు ఎప్పటికీ కొత్తవి పుట్టుకురావడమే తప్ప- పూర్తి అయిపోవడం ఉండదు. 'తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు?' అని నిలదీయడం ఒకానొక వర్గస్పృహకు గుర్తే తప్ప- మహాకవికి దాని సౌందర్యం పట్ల చిన్నచూపులేదు. 'ముగ్గేలా తాజ్‌మహల్‌ మునివాకిటిలో...' అని ప్రశ్నించడం దానికి తార్కాణం.

తాజ్‌మహల్‌ ఇటీవల మరో సంచలనానికి కారణమైంది. విశ్వజనీనతకు, సహృదయ సంస్పందనకు మాతృకగా నిలిచింది. మరో ప్రతిరూపానికి మూలమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మరో తాజ్‌మహల్‌ వెలసింది. నకళ్లు పుట్టేకొద్దీ అసలుకు విలువ పెరుగుతుంది. అనువాదాలు పెరిగేకొద్దీ మూలగ్రంథానికి ప్రతిష్ఠ చేకూరుతుంది. అలా తనకో ప్రతిబింబం తయారయ్యేసరికి అసలు తాజ్‌మహల్‌ ప్రాశస్త్యం ఇనుమడించింది. అహసనుల్లా మోనీ అనే బంగ్లాదేశీ సంపన్న చలనచిత్ర దర్శకుడు తొలిసారిగా 1980లో తాజ్‌మహల్‌ను దర్శించాడు. దాని సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఇంతటి గొప్ప ఆనందానుభూతిని తన దేశప్రజలు చాలామంది పొందలేకపోతున్నారన్న వూహ తోచింది. పేదప్రజలైన తన దేశీయులు ఈ ఆనందాన్ని దక్కించుకోవాలంటే- వారంతా భారతదేశానికైనా రావాలి లేదా తాజ్‌మహల్‌ను బంగ్లాలో సాక్షాత్కరింపజేయాలి. వీటిలో రెండోదే సాధ్యమని మోనీ అనుకున్నాడు. అమోఘమైన తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన రూ.290 కోట్లు వెచ్చించాడు. ఢాకాకు ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో మరో తాజ్‌మహల్‌ నిర్మాణం పూర్తిచేశాడు. ఇటలీ నుంచి ప్రత్యేక మార్బుల్‌, బెల్జియం నుంచి వజ్రాలు తెప్పించారు. 160 కిలోల రాగిని వినియోగించారు. భారత్‌ నుంచి నిర్మాణ శాస్త్రజ్ఞులు, శిల్పకళా నిపుణులు వెళ్లారు. అత్యాధునిక నిర్మాణ సామగ్రి తోడ్పాటుతో భారీ కట్టడం అయిదేళ్లలో పూర్తయింది. అది అచ్చం ఆగ్రాలోని తాజ్‌మహల్‌లాగే కనపడుతోందంటున్నారు. ఎంతసేపూ యుద్ధ వాతావరణంలో, ఉగ్రవాద భయంతో, ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న ప్రపంచానికి ఇలా ఒక శ్వేత శాంతికుసుమాన్ని కానుక చేయాలన్న వూహ కలగడమే మోనీ ఘనతకు నిదర్శనం అంటున్నారు సామాజికవేత్తలు. అసలు తాజ్‌మహల్‌ నిర్మాణంలో షాజహానుకు ముంతాజ్‌ పట్ల ప్రేమ ప్రేరణగా నిలిచింది. అదే మోనీకి అయితే తన దేశ ప్రజలు అందరూ ఆనందించాలన్న తపన ప్రేరణ అయింది. రెండోది మరింత ఉదాత్తమైంది కదా అంటున్నారు భావుకులు. నిజమే మరి!
((ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౧:౨౦౦౯)
__________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home