మీ పీసీలో ఈ పనోళ్లు ఉన్నారా?
అలాగే, సిస్టం సామర్థ్యం ఎంత ఎక్కువున్నా అనవసరమైన ఫైల్స్ అక్కడక్కడా ఉండిపోతే... మెమొరీ నిండిపోయి పనితీరు మందగిస్తుంది. మరి ఈ చెత్తను తీసేయడం ఎలాగబ్బా! ఏముందీ.. కొందరు పనోళ్ళను పెట్టుకోవడమే! వాళ్ళే వీళ్ళు!
చెప్పకుండానే
పేరు 'రిజీసీకర్'. ఓ మంచి పనోడు. సిస్టం రిజిస్ట్రీలో ఉన్న అనవసరమైన చెత్తను తొలగించడం ఇతని బాధ్యత. అన్‌ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్లకు సంబంధించిన ఫైల్స్ సిస్టంలో ఏదో మూల ఉండిపోతుంటాయి. బ్రౌజింగ్ చేసినప్పుడు హిస్టరీ, రిజిస్ట్రీల్లో కొన్ని ఫైల్స్ చేరుతుంటాయి. ఇలాంటి వాటిని వెతికి పట్టుకుని తోలగించడం రిజీసీకర్ కర్తవ్యం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పని చేసుకుపోకుండా Automatic, Exclusion పద్ధతుల్లో ఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని చూపుతూ అవసరమా కాదా అని తెలుసుకున్న తర్వాతే డిలీట్ చేస్తాడు. ఈ పనోడిని పిలిపించుకోవడానిక http://fileforum.betanews.com/detail/ regseeker/1035382760/1 చూడండి.
చక్కగా సర్దేస్తుంది...
పేరు 'ట్యూన్‌అప్ యుటిలిటీస్ 2009'. ఓ నమ్మినబంటు. శుభ్రం చేయడం మాత్రమే కాకుండా చక్కగా సర్దడం కూడా చేస్తాడు. పని మొదలు పెట్టగానే సిస్టం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ పనికిరాని ఫైల్స్ ఉన్నాయో గుర్తించడం, టెంపరరీ ఫైల్స్‌ని, రిజిస్ట్రీ, హిస్టరీలోని అనవసర ఫైల్స్‌ని చూపించి ఏరి పారేయడం చేస్తాడు. ఒకే ఒక్క క్లిక్‌తో సిస్టం మొత్తం జాతకాన్ని చూపిస్తాడు. అవసరానికి అనుగుణంగా Tuneup Drive Defrag, Tuneup memory Optimizer, Tuneup Speed optimizer... ఎన్నో అవతారాలు ఎత్తేస్తాడు. ఈ పనోడి మరిన్ని వివరాలకు www.tune-up.com/products/tuneup-utilities/ చూడండి.
చూసిరమ్మంటే చాలు!
పేరు 'సింపుల్ ఫైల్ స్రెడ్డర్ 3.2'. చూసిరమ్మంటే ఏకంగా కాల్చొచ్చే రకం. ఒక్కసారి పనికిరాని ఫైల్‌ని డిలీట్ చేస్తే అది మళ్లీ కనిపించదు. అయినా ఈ పనోడితో ప్రమాదం ఏం కాదులెండి. అన్నీ మన ఆదేశాల మేరకే చేస్తాడు. ముఖ్యమైన ఫైల్స్‌కు పాస్‌వర్డ్ ద్వారా రక్షణను ఏర్పాటు చేస్తాడు. చెత్తను ఊడ్చేస్తున్న క్రమంలో 'కలర్ గైడ్' ఆప్షన్ ద్వారా రన్ అవుతున్న ఫైల్స్‌ని, సిస్టం ఫైల్స్‌ని, రీడ్ ఓన్లీ- హైడ్ చేసిన ఫైల్స్‌ని సులువుగా గుర్తించవచ్చు. ఈ సేవకుడి కోసం www.download.com/simple-file-shredder/3000-2092_4-10301332.html చూడండి.
ఆస్థాన సేవకులు
పేర్లు సీక్లీనర్, హెచ్‌డీ క్లీనర్. ఎక్కువ శాతం పీసీ యూజర్లకు పరిచయం ఉన్న సేవకులు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే వీళ్లు పీసీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. టెంపరరీ ఫైల్స్, కూకీస్, హిస్టరీ, ఫాంట్స్, ఇన్‌స్టాలేషన్ ఫైల్స్... ఇలా చెత్త ఏ రూపంలో ఉన్నా వీరి కంటి నుంచి తప్పించుకోలేవు. ఈ జోడు పనోళ్లు సాఫ్ట్‌వేర్లను అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసేస్తారు. వీరి వివరాలకు www.download.com/ccleaner/ ,www.hdcleaner.en.softonic.com/ చూడండి.
(ఈనాడు, eనాడు , ౧౯౦౨౨౦౦౯)
___________________________________
Labels: computers
0 Comments:
Post a Comment
<< Home