శివాయనమః
- బులుసు-జీ-ప్రకాష్
మహాశివరాత్రి పర్వదినం మాఘమాస కృష్ణపక్ష చతుర్దశినాడు వస్తుంది. శివరాత్రి నాడు జాగరణకు తోడు ఉపవాసం కూడా చేస్తారు. శైవులు, వైష్ణవులు ఏ భేదభావమూ లేకుండా శివరాత్రి వ్రతాన్ని ఆచరించే వైనాన్ని, పూజాఫలానికి పాత్రులయ్యే తీరును 'ఈశ్వర సంహిత' ప్రస్తావించింది.
శివకేశవులకు భేదం లేకపోవడమేఇందుకు హేతువు. ఈ హేతుగాథ మహావిష్ణువు భూదేవికి వరాహపురాణంలో చెబుతాడు- 'శివుడెక్కడున్నాడో నేనక్కడున్నాను. నేనెక్కడున్నానో శివుడక్కడున్నాడు. ఎవరు పరమశివుని పూజిస్తారో వారు నన్ను పూజించినట్లే' సమాజంలోని అన్ని వర్గాలవారూ శివరాత్రివ్రతాన్ని ఎలా ఆచరించాలో ఈశాన సంహితలో ఉంది.
మొదటిజాములో ,
ెండో జాములో పెరుగుతోను,
మూడో జాములో నేతితోను,
నాలుగో జాములో తేనెతోను అభిషేకం చేయాలి.
ఆ దినమంతా జపతపాలతోను, స్నాన ధ్యానాదులతోను శివకథ శ్రవణంతోను గడపాలి.
మొదటిజాములో 'ఈశానుడు'గాను,
రెండో జాములో 'అఘోరుడు'గాను,
మూడో జాములో 'వామదేవుడు'గాను,
నాలుగో జాములో 'సద్యోజాతుడు'గాను పూజనీయుడు.
శివార్చనలో బిల్వదళాలకు ప్రముఖస్థానం ఉంది. బిల్వపత్రార్చనకు శివుడు ప్రసన్నుడై భక్తుల దారిద్య్రాన్ని నిర్మూలిస్తాడంటారు.
శివుని లింగాకారం సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకు సంకేతం.
త్రిశూలం సత్త్వ రజస్తమోగుణాలకు,
డమరుకం ఓంకార శబ్దబ్రహ్మకు,
చంద్రుడు నిశ్చలబుద్ధికి సూచకం.
జటాజూటంలోని గంగ అమరత్వానికి సంకేతం. గంగ అమరవాహిని కదా!
తన శరీరంపై వేలాడే సర్పాలు, జీవులు పరమాత్మపై ఆధారభూతులనడానికి,
ఫాలభాగాన ఉన్న విభూతి శుద్ధత్వానికి,
హస్తభూషణమైన లేడి నాలుగుకాళ్లు, నాలుగు వేదాలకు సంకేతం.
మూడో నేత్రం జ్ఞాననేత్రం. గాయత్రీమంత్ర జపంతో విడివడే ఉప'నయనం' ఇదే!
శ్రీరాముడు లంకమీద యుద్ధానికి వెళ్లే ముందు, ధనుష్కోటిలో పరమశివుని పార్థివలింగం తయారుచేసి పూజించాడు. ఆ ఇసుకలింగం ప్రతిష్ఠించిన స్థలం శ్రీరాముని పేర 'రామే'శ్వరం అయింది. రామునిచేత ప్రతిష్ఠితమైన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడై, ద్వాదశజ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
కోటి అంటే నూరులక్షలు, వింటి చివరకప్పు అని అర్థాలున్నాయి. శ్రీరాముని విల్లు చివరికప్పుతో సహా ఎంత పొడవుందో అంత పొడవున్న నూరులక్షలు అనగా ఒకకోటి రాళ్లను నీలుని 'రామ'నామమంత్రంతో కోతులు సముద్రం మీద వేశాయి. ఆనాటి లంక శతయోజన విస్తీర్ణం అని రామాయణంలో వర్ణించారు వాల్మీకి మహర్షి. యోజనం అంటే నాలుగు క్రోసులు. క్రోసు అంటే రెండు మైళ్లు. నాలుగు క్రోసులు అంటే ఎనిమిది మైళ్లు. నూరు యోజనాలు అంటే ఎనిమిదివందల మైళ్లు. రావణ సంహారానంతరం, విభీషణుని రాజుగా పట్టాభిషిక్తుణ్ని చేశాక, శ్రీరాముడు పుష్పకవిమానం మీద అయోధ్యకు వస్తూ, తాను అంతకుముందు ధనుష్కోటిలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని సీతామాతకు చూపించాడని రామాయణ గాథ.
(ఈనాడు, అంతర్యామి, ౨౨:౦౨:౨౦౦౯)
______________________________
Labels: Religion
0 Comments:
Post a Comment
<< Home