శృంగార యోగం
రకరకాల ఆసనాలు వేయడం, ప్రాణాయామం వంటిప్రక్రియలు సాధన చేయడమే యోగ జీవనంఅనుకుంటారు చాలామంది. నిజానికి అవి సోపానాలుమాత్రమే! యోగ జీవనం సిద్ధించడానికి అవన్నీసాధనాలు, పరికరాలు. యోగమనేది ఒకానొకపరిపూర్ణ జీవన విధానం. వట్టి ఆరోగ్యం కోసమే కాదు- శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కక్ష్యలు మూడింటా అదుపు సాధించి, మనిషి స్థితప్రజ్ఞతతో ఆనందంగా, ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుర్దాయాన్ని అనుభవించడమే యోగజీవనం. అది జీవకళ తొణికిసలాడే జీవన కళ. దానికోసం మనిషికి యోగ సాధన తప్పనిసరి. సాధనలేకపోతే మనసుకు ఒక ప్రత్యేక అస్తిత్వంఏర్పడుతుంది. ఇంద్రియాలకు నాయకత్వం వహించిమనిషిపై పెత్తనం చలాయిస్తుంది. మనసు ఆజ్ఞకు లోబడిన ఇంద్రియాలు అది చెప్పినట్లు నడుస్తాయి. చిత్తవృత్తులు ఏదారిలో పోతే మనిషి సైతం ఆ దారిలోనే పరుగులెడతాడు. ఉదాహరణకు భోజనం చేసేటప్పుడు మనసు గత రాత్రి చూసినసినిమా మీద లగ్నమైందనుకోండి- మనిషి భౌతికంగా కంచం దగ్గరున్నా, మానసికంగా సినిమాహాల్లో ఉంటాడు. కళ్లుఆహార పదార్థాల్ని చూస్తూనే ఉంటాయి, దృష్టి మాత్రం ఇక్కడ ఉండదు. ఆ స్థితిలో ఐ బ్యాంకులో దాచి ఉంచిన కళ్లకీ వీటికీపెద్ద తేడా ఏమీ ఉండదు. మనిషి ఆఫీసులో ఉంటే మనసు ఇంటిలో ఉండటం, వాహనాన్ని నడుపుతూ అప్పుల గురించో, షేర్ మార్కెట్ పతనం గురించో ఆలోచించడం అలవాటైనవారందరికీ యోగ సాధన చాలా అవసరం. పూజ్యభావంతోతినకపోతే అన్నం ఒంటపట్టదన్నాడు మనువు. ఏకాగ్రత లోపిస్తే పనులూ చెడతాయి. చిత్తవృత్తుల నిరోధమే యోగం అంటారు. అంటే ఏ పని చేస్తుంటే ఆ పనిమీదే మనసు లగ్నంకావడం! అదే యోగ జీవనమంటే. అది జీవితాన్ని జీవనయోగ్యం చేస్తుంది.
యోగసాధనలు మనసును తన ఇష్టానుసారంగా పోనీకుండా అదుపుచేస్తాయి. మనిషికి, మనసుకు 'కూర్పు' చేస్తాయి. అలా మనిషీ మనసూ రెండూ 'కూడి' ఉండటం యోగ జీవనం. మనసుతో స్నేహం కుదుర్చుకోవడమంటే- మనిషి తనతో తాను యోగ స్థితిని అనుభవించడమని లెక్క! తనతో తాను ఉండటం, తనలో తాను ఉండటం నిజానికి కష్టసాధ్యమైన విషయాలు. వ్యక్తిగతంగా మనసుతో చక్కని సమన్వయం సాధించుకున్న మనిషికి సామాజికంగా తన చుట్టూ ఉన్న ప్రపంచంతో శ్రుతి కలపడం తేలికవుతుంది. పదిమందిలో ఇమడలేక చాలామంది తమను ప్రత్యేకంగా వూహించుకుంటారు. రాగద్వేషాలకదే పునాది. దాంతో అశాంతి మొదలవుతుంది. ఏనాడో పాపం చేశాను- ఫలితంగా ఈ కోతిమూకతో కలిసి గడపవలసి వచ్చిందని రాముడు చింతించిన దాఖలాలు ఎన్నడూ లేవు. అటు భరతుడితోనూ ఇటు విభీషణుడితోనూ, మధ్యలో గుహుడితోనూ ఆయన ఒకేలా ఉన్నాడు. అందుకే అయోధ్యలో ఎలా ఉన్నాడో అడవిలోనూ అలాగే ఉండగలిగాడు. మనిషికి 'ఇక్కడ సుఖంగా ఉన్నాను' అనిపించే ఆవరణను మనస్తత్వవేత్తలు 'కంఫర్ట్‌జోన్' అంటారు. యోగం సిద్ధించిన వారికి ఈ లోకమంతా కంఫర్ట్‌జోన్ అవుతుంది. ఆ స్థితిలో మనిషికి తనతోనేకాదు, ప్రపంచంతోనూ ఘర్షణ ఉండదు. అలాంటివారిని 'వీతరాగులు' అని వర్ణించారు పతంజలి మహర్షి. యోగజీవనం గడిపేవారికీ కష్టాలొస్తాయి, కుంగిపోవడం ఉండదు. భోగాలొస్తాయి, మునిగిపోవడం ఉండదు. రైలుప్రయాణంలో గాంధీజీ కాలిచెప్పు ఒకటి జారిపడిపోయింది. వెంటనే రెండో చెప్పును ఆ దిశగా విసిరేశారాయన. ఆయన ఆంతర్యమేమిటో తెలిస్తే- మనిషి యోగ జీవనం ద్వారా స్వీయ ప్రయోజనాల పరిధిలోంచి లోక ప్రయోజనాల పరిధిలోకి విస్తరించడమంటే ఏమిటో బోధపడుతుంది. యోగమంటే వ్యాపించడమని తెలుస్తుంది!
యోగసాధన ద్వారా మనిషి తాను సుఖంగా బతుకుతూ లోకాన్ని సుఖంగా బతకనివ్వడం సాధ్యమవుతుంది. 'నేను, నాది' అనే పరిధిలోంచి 'మనము, మనది' అనే పరిధిలోకి వ్యాపించడం కుదురుతుంది. కనుక ఇంటాబయటా బతుకులో ప్రశాంతత లభించడానికి అవకాశాలు పెరుగుతాయి. దానికితోడు యోగప్రక్రియల ద్వారా మరో గొప్ప ప్రయోజనం సిద్ధిస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యోగసాధన శృంగార జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుందన్నది వాటి సారాంశం. ఆరోగ్యానికి మాత్రమే కాక శృంగారానికి ఉత్ప్రేరకంగానూ యోగసాధన పనికొస్తుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. శృంగారంలో అసంతృప్తికి లోనయ్యే మహిళలు భారతీయ యోగసాధనల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చునంటున్నారు. వారిలో లైంగిక ఆసక్తిని ప్రేరేపించడం మొదలు భావప్రాప్తిని కలిగించడం వరకు యోగా తోడ్పాటు అందిస్తుందని తేలింది. అలాగే పురుషుల్లో శీఘ్రస్ఖలనంతో పాటు ఎన్నో సమస్యలను నివారించడమూ సాధ్యమని చెబుతున్నారు. 'మైండ్‌ఫుల్‌నెస్' అనేది దీని అంతటికీ కారణంగా వారు విశ్లేషిస్తున్నారు. మనిషి తాను ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో దానిపట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండటాన్నే వారు మైండ్‌ఫుల్‌నెస్‌గా చెప్పారు. దాన్నే మనం 'వర్తమానంలో ఉండటం' అంటాం. నిన్నటి దిగులులోనో, రేపటి బెంగలోనో కాకుండా ఈ క్షణంలో మనిషి తనతో తాను ఉండటమే ఏకాగ్రత. యోగప్రక్రియల ద్వారా అలాంటి ఏకాగ్రతను సాధిస్తే శృంగార జీవితం రసమయం అవుతుందన్నది ఆ పరిశోధనల సారాంశం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ యోగా మేలు చేస్తుందని వారు గట్టిగా చెబుతున్నారు. ఇది తెలిస్తే యోగ సాధనలపై మోజు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. బద్ధక యోగాసనాలకు బదులు ఇష్టపూర్తి సాధనలు మొదలవుతాయంటున్నారు. యోగ సాధనల ప్రయోజనం మరింత విస్తృతంకావడం- ఆనందం, ఆరోగ్యం!
(ఈనాడు, సంపాదకీయం, ౦౧:౦౨:౨౦౦౯)
________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home