సాటిలేని సాధనం... మైండ్ మ్యాపింగ్
ఎంతో ఉపయోగకరమైన 'కార్నల్ నోట్సు'కు కూడా కొన్ని పరిమితులున్నాయి. అవి- వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు చోటుచేసుకోవటం, జ్ఞాపకశక్తి వినియోగానికి తక్కువ అవకాశం ఉండటం. ఈ లోపాలను సవరించి మంచి ఫలితాలనిచ్చే తిరుగులేని నోట్సే 'మైండ్ మ్యాపింగ్'. మన మెదడు పనిచేసే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధానాన్ని మానవాళికి అందించిన విద్యావేత్త టోనీ బూజాన్.
మైండ్ మ్యాపింగ్ స్వరూపం చూద్దాం. విషయానికి కీలకమైన ప్రధాన భావం ఓ చిత్రం/దానికి చిహ్నమైన ఆకృతి (image) రూపంగా నోట్సు మధ్యభాగంలో ఉంటుంది. చెట్టులోని కాండానికి కొమ్మలు అతికినట్టు ప్రధాన భావానికి ప్రతిరూపమైన చిత్రం/ ఆకృతికి అనుసంధానంగా మిగతా భావాలు కొన్ని వర్గాలుగా విడివడివుంటాయి. ప్రతి భాగం తనకు సంబంధించిన విజ్ఞానాన్ని శాఖ, ఉపశాఖలుగా ప్రదర్శిస్తుంది. శాఖ, ఉపశాఖల లైన్ల (lines) పైన ముఖ్యభావాలను సూచించే కీలక పదాలు, చిత్రాలు లేదా గుర్తులను సూచిస్తారు. ఈ శాఖలు, ఉపశాఖలు, చిత్రాలు, చిహ్నాలు వివిధ రంగుల్లో ఉండడం వల్ల మైండ్‌మ్యాపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
మైండ్ మ్యాపింగ్ ఎలా చేయాలి?
దీని నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆకృతిలో ఎంత స్వేచ్ఛ కనిపిస్తుందో, దాని నిర్మాణంలో అంత శాస్త్రీయత ఇమిడివుంటుంది. మైండ్‌మ్యాపులను ఇష్టం వచ్చినట్టు కాక, కొన్ని సూత్రాల ఆధారంగా తయారుచేసుకోవాలి. సౌలభ్యం కోసం వాటిని ఐదు వర్గాలుగా విభజించి, మైండ్ మ్యాపు నిర్మాణాన్ని చూద్దాం.
1. పేపరు మధ్య నుంచి నోట్సు
తెల్లగా ఉండే కాగితాన్ని అడ్డుగా ఉండే లాండ్‌స్కేప్ ఆకృతిలో పెట్టి దాని మధ్యభాగంలో విషయానికి కీలకమైన ప్రధానభావాన్ని ఓ చిత్రం/ దానికి చిహ్నమైన ఆకృతి రూపంలో చిత్రించాలి.
ఉదాహరణకు... పుస్తకం చదవడం వల్ల ఉపయోగాల గురించి నోట్సు రాసేటప్పుడు పేపరు మధ్యలో పుస్తకం ఆకృతిని గీయాలి. ఇలా నోట్సు మధ్యభాగంలో ప్రారంభించడం వల్ల మన ఆలోచనలకు అన్నివైపులా అల్లుకుపోయే అవకాశం లభిస్తుంది. పైగా, భావాలను స్వేచ్ఛగా, సహజంగా వ్యక్తీకరించడానికి వీలవుతుంది.
2. ప్రధాన చిత్రానికి శాఖల అమరిక
చెట్టుకు కొమ్మలు, వాటి రెమ్మలు ఎలా పొందికగా ఉంటాయో, అదే విధంగా మైండ్‌మ్యాపులోని శాఖలు, ఉపశాఖలు ఒకదాని నుంచి మరొకటి పుట్టుకొచ్చినట్టు చక్కని అమరికలో లైన్లు గీయాలి. మధ్యశాఖలను లావుగా, ఉపశాఖలను సన్నగా గీయాలి. రేఖల నిడివి సమానంగా ఉండాలి. చెట్టుకొమ్మల మల్లే ఈ రేఖలు కూడా వంపు తిరిగి సహజంగా ఉండేలా గీయాలి. అలా ఉంటేనే మెదడు గుర్తుపెట్టుకుంటుంది.
3. కీలక పదాల, చిత్రాల, రంగుల వాడుక
శాఖల, ఉపశాఖల లైన్ల పైభాగంలో కీలక పదాలను అందంగా రాయాలి. ఒక గీతపై ఒక పదమే ఉండాలి. మాటలతో పాటు గుర్తులు/చిత్ర ఆకృతులు వాడితే మరీ మంచిది. ఓ చిత్రం వేల మాటల అర్థాన్ని స్ఫురింపజేస్తుంది కదా! అలాగే మైండ్‌మ్యాపులో తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏమంటే- కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ముఖ్యశాఖ, దాని ఉపశాఖలు, వాటి ఉప ఉపశాఖలన్నీ ఒకే రంగులో ఉండాలి. వాటిపై రాసే చిత్రాలను కూడా రంగుల్లో చిత్రిస్తే మెదడు బాగా గుర్తుపెట్టుకుంటుంది. రంగులకు సృజనాత్మకత ఎక్కువ. కాబట్టి అవి వేల భావాలను ప్రేరేపిస్తాయి.
4. స్పష్టమైన నిర్మాణం
అవసరానికి తగ్గట్టు కావలసిన రీతిలో వంచుకోడానికి మైండ్‌మ్యాపులో అవకాశం ఉన్నా, దానిలో కూడా ఓ స్పష్టమైన నిర్మాణం ఉంది. శాఖల పొడవు, పదాల నిడివి సమానంగా ఉంటాయి. ఒక శాఖకూ, మరో శాఖకూ మధ్య ఉండే ఖాళీస్థలం కూడా సమానంగా ఉంటుంది. అందువల్ల మైండ్‌మ్యాప్ ఆకర్షణీయంగా కన్పిస్తుంది. మైండ్‌మ్యాపును పెంచి రాయవలసివస్తే వేరే పేపర్లో కానీ, పక్క పేపర్లో కానీ రాయకూడదు. ఉన్న పేపరుకు మరో పేపరును అతికించి పేపరును పెద్దది చేయాలి. ఒకే పేపర్లో మొత్తం మైండ్‌మ్యాపును చిత్రించాలి.
మైండ్ మ్యాపు తయారుచేసే విధానం వినోదాత్మకంగా ఉండాలి. వ్యక్తిలోని సృజనాత్మకత, కాల్పనికత, భావుకత, ఊహా ప్రాగల్భ్యాలను నిద్ర లేపేలా ఉండాలి. అలాగే మైండ్‌మ్యాపును లిఖించే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వం నోట్సులో ప్రతిఫలిస్తూ ఉండాలి. అందం, అభినయంతో మైండ్‌మ్యాపు ఆకర్షణీయంగా ఉండాలి.
మైండ్‌మ్యాపును తయారు చేసుకోవటం గురించి చెప్పుకున్న పై భావాలను మైండ్‌మ్యాపులో ఏ విధంగా చిత్రించవచ్చో చూడండి.
________________________________________
అభ్యాసం చేస్తే అద్భుతాలు
మైండ్ మ్యాప్ ఉపయోగాలను ప్రధానంగా పది రకాలుగా చెప్పుకోవచ్చు.
ఓ మైండ్‌మ్యాపుగా ఇలా చిత్రీకరించవచ్చు.
1. విషయం అర్థం కావాలంటే: ప్రధాన అంశాన్ని ఒక చిత్రం లేదా దాని చిహ్నమైన ఆకృతి ద్వారా నోట్సు మధ్యలో చిత్రించాలి. దాని చుట్టూ ముఖ్యమైన భావాలను శాఖలుగా అమర్చాలి. ఒక్కొక్క శాఖలో సాపేక్షంగా ఇతర భావాలను పేర్చి, వాటికి తగిన వివరణ ఇవ్వాలి. ఇలా చేస్తే ఎంతటి క్లిష్టమైన భావమైనా తేలిగ్గా అర్థమవుతుంది.
2. కాలం ఆదా చేయాలంటే: మైండ్ మ్యాపింగ్‌లో కీలక పదాలకు చోటు ఉంటుంది. రాతలో 80 శాతం ఆక్రమించే పూరణపదాలకు (ఫిల్లింగ్ వొర్ద్స్) కు తావుండదు. అందువల్ల తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు రాసుకోవచ్చు.
3. స్పష్టంగా గుర్తుండాలంటే: మన మెదడు ఎలా పనిచేస్తుందో మైండ్ మ్యాప్‌లో చిత్రీకరణ అలా జరుగుతుంది. మెదడు, మైండ్‌మ్యాప్ పరస్పరం బింబ ప్రతిబింబాలుగా ఉంటాయి. దానివల్ల-
- శాఖ, ఉపశాఖలతో అనుసంధానమనేది జ్ఞాపకశక్తికి ప్రాణవంతమైన సూత్రం. ఒక భావం తట్టగానే వందల వేల భావాలు మన మస్తిష్కంలో నిద్రలేవడానికి కారణమిదే. అలాంటి అనుసంధానం, అల్లిక జిగిబిగి మైండ్‌మ్యాప్‌కు ప్రత్యేకం.
- మెదడు కీలక పదాలనూ, చిత్రాలనూ, ఆకృతులనూ గుర్తుపెట్టుకుంటుంది. మైండ్‌మ్యాప్‌లో ఉండేవి కూడా కీలక పదాలూ, చిత్రాలూ, ఆకృతులే. అందువల్ల అమోఘమైన జ్ఞాపకశక్తి మైండ్‌మ్యాప్ సొంతం.
* మైండ్‌మ్యాపులు దృశ్యాత్మకంగా ఉండడం వల్ల పునశ్చరణ (రివిజన్) చేయడం తేలిక అవుతుంది.
4. మెదడుకుండే అనంతశక్తిని వాడుకోవాలంటే: మెదడులోని కుడి ఎడమ వలయాల్లో అనంత మేధాశక్తి దాగివుంటుంది. ఊహాశక్తి, చిత్రలేఖనం, పద విజ్ఞానం, తార్కిక అంశాలు ఉన్న కుడి, ఎడమ వలయాలు అనుసంధానమైనపుడు అద్భుతశక్తి ఆవిర్భవిస్తుంది. మెదడులోని ఈ అపూర్వశక్తులను అనుసంధానం చేసుకోవడానికి మైండ్‌మ్యాప్ చక్కగా సహకరిస్తుంది.
5. సృజనాత్మకంగా ఆలోచించాలంటే: యాంత్రికమైన లీనియర్ ఆలోచనా విధానానికి కాక, క్రియాత్మకమైన లేటరల్ ఆలోచనా విధానానికి మైండ్‌మ్యాప్ అవకాశం కల్పిస్తుంది. అందువల్ల మనసు సృజనాత్మకమైన కొత్త ఆలోచనలతో ప్రేరణ పొందుతుంది.
6. సమస్యా పరిష్కారం చేయాలంటే: విషయాన్ని విశ్లేషించడం, దాన్ని కొన్ని వర్గాలుగా విభజించడం, వాటిమధ్య అనుబంధాన్ని నిర్మించడం మైండ్‌మ్యాప్‌కు కొట్టిన పిండి. అందువల్ల సమస్యలోని వివిధ పార్శ్వాలను ఏకకాలంలో అవగతం చేసుకోడానికీ, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం రాబట్టడానికీ మైండ్‌మ్యాప్ సహకరిస్తుంది.
7. ప్రణాళికాబద్ధంగా ఉండాలంటే: విషయాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికీ, ఓ క్రమపద్ధతిలో వ్యవస్థీకరించడానికీ, ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్తంగా ఒకచోట నిక్షిప్తం చేయడానికీ పక్కా ప్రణాళిక కావాలి. ప్రణాళికా ప్రక్రియకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది మైండ్‌మ్యాప్. కాబట్టి సుదీర్ఘ పరిశోధనా పత్రాలు రూపొందించడానికీ, విపులమైన వ్యాసాల/ పుస్తకాల రచనకూ, సుదీర్ఘమైన సభల నిర్వహణకూ; ప్రయాణాలు, వినోద యాత్రల వంటి అనేక క్లిష్టమైన అంశాలు చేపట్టడానికీ మైండ్‌మ్యాప్ అనుకూలంగా ఉంటుంది.
8. ధారాళంగా భావ వ్యక్తీకరణ చేయాలంటే: ఒక ఉపన్యాసం రక్తి కట్టాలంటే వక్త ధారాళంగా, సుదీర్ఘంగా భాషిస్తూ ఎలాంటి విరామాలు లేకుండా శ్రోతలను ఉర్రూతలూగించాలి. సుదీర్ఘమైన, విషయ ప్రాధాన్యం ఉన్న ప్రెజెంటేషన్స్ వంటి భావవ్యక్తీకరణకు దృశ్యాత్మకంగా ఉండే మైండ్‌మ్యాప్‌లు ఎంతో సదుపాయంగా ఉంటాయి.
9. చదువు వినోదాత్మకంగా సాగాలంటే: చిత్రాలతో, వివిధ వర్ణాలతో మైండ్‌మ్యాపులు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని తయారుచేయడం, చదవడం కూడా తమాషాగా ఉంటుంది. అందువల్ల చదువు వినోదాత్మకంగా ఉండి, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
10. సర్దుబాటుతో పాటు స్పష్టమైన ఆకృతి కలిగివుండాలంటే: స్పష్టమైన ఆకృతిని కలిగివుంటూనే మైండ్‌మ్యాపులో అవసరానికి తగ్గట్టుగా సర్దుబాటు గుణం ఉంటుంది. అంతేకాక ఒక ప్రధాన భావాన్ని ప్రతిబింబించే శాఖకూ, మరొక ప్రధాన భావాన్ని వ్యక్తం చేసే శాఖకూ మధ్య కొంత ఖాళీ చోటు ఉంటుంది. నూతన విషయాలను చేర్చుకొని రాసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అందువల్ల కాలం వెచ్చించి, మరొక మైండ్‌మ్యాప్ రాసుకోవాల్సిన అవసరం లేదు.
(ఈనాడు, ౨౩ & ౩౦:౦౩:౨౦౦౯)
________________________________________________
Labels: Self development/Telugu
2 Comments:
Dear Rao gaaru: Although I have introduced your blog among my friends, I never perhaps thanked you for this effort of re-sharing the good posts and some of your thoughts and opinions. But, I do refer to the posts time to time. Thanks once again and please keep a watch on long term relevance of the content you're saving here (I am compelled to say this due to the respect I got for you despite the fact that these are all your own personal picks and likes). - Usha
9:34 pm
Thanks a ton, Usha gaaru.
1:17 pm
Post a Comment
<< Home