సత్యాన్వేషణ
రుషి అనేది చాలా ఉదాత్తమైన పదం. ఉన్నది ఉన్నట్లుగా చూసేవాడని ఆ మాటకు అర్థం. చూడటం అంటే తనలోని అంతర్యామిని దర్శించడమైనా కావచ్చు, మానవ వేదనను గమనించడమైనా కావచ్చు. తన లోపలి ప్రపంచంలో ఆనందాన్ని కనుగొని, దాన్ని బాహ్యప్రపంచానికి పంచి ఇవ్వాలని చేతులు చాచి ఎదురొచ్చే ప్రతి మనిషినీ మనం మహర్షిగానే పరిగణించవలసి ఉంది. మహర్షుల ప్రయత్నాలన్నీ మానవ కల్యాణ కాంక్షే లక్ష్యంగా సాగాయని పురాణాలు వర్ణించాయి. ఆ కోణంలోంచి ఆలోచిస్తే- స్కైలాబ్ శకలాలు జనావాసాలపై పడితే వాటిల్లే భయంకర వినాశనాన్ని ముందే ఊహించుకుని తల్లడిల్లిపోయి, వాటిని సముద్రంవైపు మళ్ళించడానికి అహర్నిశలూ తపనపడి చివరికి విజయం సాధించిన శాస్త్రవేత్తలందరినీ మనం మహర్షులుగానే గౌరవించాలి. శాస్త్ర పరిశోధనలకై తమ జీవితాలను ముడుపు కట్టి, నిరంతరం ప్రయోగాల్లో మునిగితేలుతూ, వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొంటూ- చివరికి తమ తపస్సు ఫలించి సత్యం స్ఫురించి ఆనందాతిరేకంతో ఒంటిమీద బట్ట ఉందో లేదో తెలియని ఉన్మత్త స్థితిలో యురేకా... యురేకా... అంటూ వీధుల్లో పడి నృత్యంచేసిన శాస్త్రజ్ఞులందరిదీ బ్రహ్మానంద స్థితే అనాలి! ఆత్మ సాక్షాత్కార దివ్యానుభూతి లభించిన అపురూప క్షణాల్లో కనుగొంటినీ... అంటూ ఆనంద తాండవం చేసిన పరమభక్తుడిదీ, ఆ శాస్త్రజ్ఞుడిదీ స్థితి ఒక్కటే అవుతుంది. లోకాస్సమస్తాః సుఖినోభవన్తు అనే ఉదాత్త భావనతో యజ్ఞయాగాలు నిర్వహించిన మన రుషులకీ- కంటినీరు తుడవాలని, రోగాలనుంచి కాపాడాలని, మనిషి సుఖంగా జీవించడానికి పనికొచ్చే పరికరాలను రూపొందించాలని... అనుక్షణం తపించే శాస్త్రజ్ఞులకీ మధ్య తేడా ఏమీలేదు. విధానాలు వేరుకావచ్చుగాని, వారిద్దరి లక్ష్యాలు ఒక్కటే!
కావ్యాల్లోని అంతర్వాణిని విననేర్చినవాడు భావుకుడవుతాడు, విద్వాంసుడవుతాడు. తనలోని అంతర్వాణిని విననేర్చినవాడు, అంతర్యామి చైతన్యాన్ని గమనించినవాడు వేదాంతి అవుతాడు, తత్వవేత్త అవుతాడు. ప్రకృతిలోని అంతర్వాణిని విననేర్చినవాడు, అంతశ్చేతనను కననేర్చినవాడు దార్శనికుడవుతాడు, శాస్త్రజ్ఞుడవుతాడు. ...కలవొక కొన్ని వేళలు నికామ భవత్పద చింతనానలోజ్జ్వలిత శిఖాసనాధములు... అన్న విశ్వనాథ పలుకుల్లోని 'కొన్నివేళలు', దివ్యానందమయ ప్రపంచమిట మూర్తీభావముం దాల్చి నాకు అవ్యాజ ప్రణయాతిరేకమున తానై స్వాగతంబిచ్చెడున్... అని మురిసిపోయిన శ్రీశ్రీ మాటల్లోని 'ప్రపంచం', కృష్ణశాస్త్రి తన నివాసమని సగర్వంగా ప్రకటించిన గంధర్వలోక మధుర సుషమా సుధాగాన 'మంజువాటి'... వారికి ఎలా అనుభవానికి వచ్చాయి? తమ ఇహలోకపు అస్తిత్వాలు మాయమైన స్థితిలో వచ్చాయి. వ్యక్తి చేతనలోంచి విశ్వచేతనలోకి ప్రయాణం ప్రారంభించాక వచ్చాయి. మానుషానందంలోంచి దివ్యానందంలోకి ప్రయాణించే క్రమంలో అనుభవానికి వచ్చాయవి. ఉపనిషత్తులు మానుషం, దివ్యం అని చేసిన విభజనలో ఆనందాలు రెండు రకాలని కాదు అర్థం- ఒకే ఆనంద స్వరూపానికి రెండు కొసలవి. అయితే అనుభవం విషయానికి వస్తే- మానుషానందానికి దివ్యానందానికీ చాలా అంతరం ఉంది. మొదటిది- శాక్రిన్ వెర్రితీపి. రెండోది- పట్టుతేనె అమోఘ మాధుర్యం. అది తెలిసింది కనుకనే, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ కృష్ణశాస్త్రి ప్రకటించారు. కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా... అని నిశ్చయించారు విశ్వనాథ. కష్టజీవికి అటూ ఇటూ నిలిచి క-వి గా మిగిలిపోతానన్నారు శ్రీశ్రీ. శాస్త్రజ్ఞులకు దక్కే ఆనంద స్వరూపాన్ని నిర్ధారించేందుకు మనం ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. భౌతికమైన అస్తిత్వాన్ని వదిలేసుకుని వ్యక్తిచేతనలోంచి విశ్వచేతనలోకి ఎదిగినవారే మన శాస్త్రజ్ఞులంతా. అందుకే ప్రాపంచిక సుఖానుభూతులకై వారెవరూ తాపత్రయపడిన దాఖలాలు కనపడవు.
జీవపరిణామ క్రమాన్ని సిద్ధాంతీకరించిన ఛార్లెస్ డార్విన్ జన్మించి సరిగ్గా రెండువందల ఏళ్ళయిన సందర్భంగా ఆ దార్శనికుణ్ని మనసారా స్మరించాల్సిన సందర్భమిది. 'దేవుడు ఈ ప్రపంచాన్ని ఏడురోజుల్లో సృష్టించాడు' అని ఐరోపా విశ్వసించిన రోజుల్లో, దానికి విరుద్ధంగా ఆలోచించినవాడు డార్విన్. 'జీవజాతుల సృష్టి ఒకే కాలంలో ఒకే శక్తివల్ల జరిగింది కాదు, కాలక్రమేణా జీవం తనంత తానుగా పరిణామం చెందుతూ వచ్చింది' అని ధైర్యంగా ప్రకటించాడు. 'బలంగా వేగంగా పరిసరాలకు అనుగుణంగా జీవనం సాగించే క్రమంలో సామర్థ్యాన్ని ప్రకటించగల జీవులే మనుగడలో మన్నుతాయి (సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్)' అనేది ఆయన సిద్ధాంతపు మూలసూత్రం. అది ఆనాటి మత విశ్వాసాలకు పూర్తిగా వ్యతిరేకమైనది. కనుక సహజంగానే ఆయన సిద్ధాంతం తిరస్కారానికి గురయింది. విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్టసుఖముల పారమెరిగితి... అని మహాకవి ప్రకటించినట్లుగానే- డార్విన్ కూడా ఎన్నో అగచాట్లకు గురయ్యాడు. సానపెట్టిన వజ్రమయ్యాడు. 1859లో ఆయన ప్రకటించిన జీవజాతుల ఉత్పత్తి మూలం (ది ఆరిజన్ ఆఫ్ స్పీసీస్) గ్రంథం ఇప్పటికీ సాధికారికంగా నిలిచింది. మైక్రోబయాలజీ, జెనటిక్స్, మాలిక్యులర్ బయాలజీ వంటి అత్యాధునిక శాస్త్ర విభాగాల్లో పరిశోధనలకు ఆధార గ్రంథమై, జీవశాస్త్ర అధ్యయనానికి తోడ్పడుతోంది. 'మావాడు ఆదివారం నవ్వాలని మీరు అనుకుంటే- జోక్ శనివారమే చెప్పాలి' అని ఒకాయన చమత్కరించాడు. ప్రపంచమంతా డార్విన్ సిద్ధాంతానికి జేజేలు పలికాక, దాన్ని నిషేధించిన పెద్దలు మెల్లగా మేలుకొని 'మా నమ్మకాలకు అది వ్యతిరేకం కాదు' అని ఈ మధ్యనే ప్రకటించారు. దాన్ని పత్రికలు 'డార్విన్‌కు 200వ పుట్టినరోజు కానుక'గా వర్ణించాయి. నిజానికి ఆయనకు చాలా గొప్పగౌరవం ఒకటి దక్కింది. కేవలం రాజవంశీయులకే పరిమితమైన- అంత్యక్రియల్లో రాజ్య లాంఛనాలు డార్విన్‌కీ లభించాయి. అలా దక్కిన అయిదుగురిలో డార్విన్ ఒకడు. న్యూటన్ సమాధి పక్కనే ఆయనకు చోటు లభించింది. రుషులకైనా, శాస్త్రజ్ఞులకైనా మతాలతో ప్రమేయం ఉండదు. వారందరి అన్వేషణ ఒకే ఒక్కదానికోసం- దానిపేరు సత్యం!
(ఈనాడు, సంపాదకీయం, ౨౨:౦౨:౨౦౦౯)
____________________________________
Labels: Life/telugu, Personality, Religion
0 Comments:
Post a Comment
<< Home