My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, April 20, 2009

తెలివైన మదుపునకు.. ఏడు సూత్రాలు


జయప్రకాశ్‌
(వ్యాసకర్త హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌పీ సెక్యూరిటీస్‌లో డైరెక్టర్‌)

గత నెల రెండో వారం నుంచి స్టాక్‌ మార్కెట్లలో అనూహ్యంగా ర్యాలీ మొదలైంది. బహుశా దీన్ని ఎవరూ ఊహించి ఉండరు. దాదాపు 4 నెలల పాటు స్థిరీకరణ జరిగిన తరువాత మార్కెట్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చూడబోతే ఇది సరికొత్త ర్యాలీ (2008 అక్టోబరు- 2013) మాదిరిగా కనిపిస్తోంది. కాకపోతే అక్కడక్కడా ఆగుతూ, దిద్దుబాటుకు లోనవుతూ సూచీలు మళ్లీ గరిష్ఠ స్థాయిలకు చేరడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో మదుపుదార్లు కొన్ని ప్రాథమికాంశాలను గుర్తెరిగి ప్రవర్తించాలి. గతంలో చేసిన తప్పులను పునరావృత్తం చేయడం సరి కాదు.

మదుపుదార్లు మళ్లీ మళ్లీ మననం చేసుకోవలసిన సప్త సూత్రాలివి:


1. ఏదీ శాశ్వతం కాదు
ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఏదీ లేదు.. ప్రతిదీ మార్పులకు లోనవుతూ ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌కూ ఇది వర్తిస్తుంది. షేర్ల ధరలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. షేర్ల యజమానులు మారిపోతూ ఉంటారు. మదుపుదార్ల ప్రవర్తన కూడా ఒకే విధంగా ఉండదు. డబ్బు ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లిపోతూ ఉంటుంది. అన్నీ అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. మదుపుదారు ఈ సంగతిని కనిపెట్టి స్టాక్‌ మార్కెట్‌/షేర్‌ ధరల హెచ్చు తగ్గుల నుంచి లాభపడే ప్రయత్నం చేసినప్పుడు అదే వివేకం అనిపించుకొంటుంది.

2. ధర- విలువ
స్టాక్‌ మార్కెట్లో షేర్ల ధరలను నడిపించేది దానికి ఉన్న వాస్తవిక విలువ. దీనికి తోడు కంపెనీ ఆర్జనపై ఆధారపడి షేర్‌ ధర పెరుగుతుంది. మదుపుదారు దాని విలువను పసిగడితే ఆ విలువకు తగ్గట్లుగా ధర ఒక నిర్ణీత స్థాయికి వృద్ధి చెందుతుంది. మార్కెట్లో కనిపించేది షేర్‌ ధర అయితే, షేరు విలువను తెలుసుకొనేందుకు మాత్రం సంబంధిత కంపెనీ మూలాలను శోధించాల్సిందే. షేర్ల ధరలు పెరిగేది ముఖ్యంగా కంపెనీ ఆదాయాల మీద ఆధారపడేనన్న విషయాన్ని మరచిపోకూడదు.



3. గొప్ప వ్యాపారంపై మోజుపడండి..

మీకు అర్థమైన వ్యాపారం చేసే కంపెనీనే విశ్వసించండి. ఆ కంపెనీలో ఈ కింది లక్షణాల కోసం వెతకండి. అ) వృద్ధి అవకాశాలు; ఆ) తక్కువ రుణ భారంతో, పెట్టిన మూలధనం మీద ఆర్జన అధికంగా ఉండటం; ఇ) వాటాదార్ల విలువ స్థిరంగా పెరుగుతున్నదీ, లేనిదీ.

ఈ మూడిటికీ సమాధానం 'అవున'నిపిస్తే, ఆ కంపెనీని పెట్టుబడికి అర్హమైందిగా ఎంచుకోవచ్చు.

4. కొనే వేళ
దీనినే కదా గుర్తించాల్సింది. సరైన ధరలో షేర్లు కొనుగోలు చేయడంలో మదుపుదారు యుక్తి బయటపడుతుంది. ఒక షేరు, దాని వాస్తవిక ధరలో 50 డిస్కౌంట్‌లో లభిస్తున్నప్పుడు దానిని కొనాలి. ఆ తరువాత ఓపిగ్గా ఎదురుచూడటమే. షేరు వాస్తవిక ధర కన్నా 50 శాతం ప్రీమియం ధర లభించిన టైములో అమ్మివేయవచ్చు. రెండింతల లాభాన్ని జేబులో వేసుకోవచ్చు.

5. సంక్షోభం సరైన సమయం
మార్కెట్లో తీవ్ర సంక్షోభం చోటుచేసుకొన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో కొంతకు షేర్లు తెగనమ్మి బయటకు వెళ్లిపోదామనుకుంటారు. కానీ తెలివైన మదుపుదారు మేల్కొనాల్సింది ఆ సమయంలోనే. ధరల పతనం అయిపోయిందని గుర్తించి కొనుగోళ్లు మొదలుపెట్టాలి. ఎందుకంటే మార్కెట్లో 'డిస్కౌంట్‌ సేల్‌' ఉండేది అప్పుడే కాబట్టి.

6. ఆ రెండూ కీలక దశలు
స్టాక్‌ మార్కెట్‌ కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలను ఆనవాలు పట్టడం మదుపుదార్లకు అలవాటుగా మారాలి. కనీస స్థాయి అయినా, గరిష్ఠ స్థాయి అయినా హెచ్చు ట్రేడింగ్‌ పరిణామాలు (వాల్యూమ్‌) నమోదు అవుతాయి. ఇదొక గుర్తు. అప్రమత్తంగా ఉంటే వీటిని గుర్తించడం పెద్ద కష్టం కాదు.

7. ఎప్పుడూ మార్కెటే కరెక్టు
మదుపరులు ఎప్పుడైనా మార్కెట్‌ ప్రవర్తనకు అనుగుణంగా వ్యవహరించాలే గాని, తమ ఆలోచనల ప్రకారం మార్కెట్‌ ఉంటుందనుకుంటే పొరపడ్డట్లే. మార్కెటే ఎప్పుడూ యథార్థమైనది. మనం దానిని అనుసరించడమే నీతి.

బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి సెన్సెక్స్‌ ప్రస్తుత పుస్తక విలువ రూ.3,700. కనిష్ట స్థాయిలో ఏటా 10 శాతం విలువ పెరుగుతుందని అనుకొంటే వచ్చే మూడేళ్లలో (2011-12 నాటికి) పుస్తక విలువ రూ.5,000 అవుతుంది. దీనికి 5 పీఈ (ప్రైస్‌ ఎర్నింగ్‌) ఇచ్చినా సెన్సెక్స్‌ 25,000 పాయింట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఇతర అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి.
(ఈనాడు,౨౦:౦౪:౨౦౦౯)
_______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home