My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, August 30, 2009

మట్టిని నమ్మితే...

మనిషి ఆయుర్దాయాన్ని సంవత్సరాల్లో లెక్కించడం మన పద్ధతి కాదు. ఎన్ని పున్నములు చూశాడన్నదే మనకులెక్క! నెలకొక పౌర్ణమి చొప్పున మనిషి వేయి పున్నములు చూసి ఉంటే- దాన్ని సంపూర్ణ ఆయుర్దాయంగా భావిస్తారు. అందుకు గుర్తుగా మనవాళ్లు 'సహస్ర చంద్రదర్శనోత్సవం' వేడుకగా చేస్తారు. వృద్ధాప్యాన్ని జీవితపు చరమదశ అనీ, పడమటి సంధ్య అనీ, వృద్ధులను పండుటాకులనీ వ్యవహరించడం జనసామాన్యంలో పరిపాటి. 'పండుటాకులము మిగిలితిమి, ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి' అన్న ఆత్రేయ సినీగీతానికి పై సంప్రదాయంపల్లవి కాగా- జనవాక్యం అనుపల్లవి. ఎనభై పరుగులు చేసిన క్రికెట్ఆటగాడికి శతకం పూర్తిచేయాలన్న ఆశ సహజం. మనిషికీ అలానే అనిపిస్తుంది. నిండు నూరేళ్లూ జీవించాలనే ఉంటుంది. దానికి శరీరంతో పాటు ఇంద్రియాల సహకారంబాగా అవసరం. అరవయ్యో పడిలో పడేసరికి శరీరదారుఢ్యం సడలుతుంది. ఇంద్రియ పటుత్వం సన్నగిల్లుతుంది. బతకాలనే కోరిక బలంగానే ఉన్నా- బతుకు బరువైపోతుంది. దుస్థితిని నివారించేందుకుమన పెద్దలు వయసులో ఉన్నప్పుడే శరీర వ్యాయామం, ఇంద్రియనిగ్రహం వంటివి పాటించేవారు. దానికితోడు శాస్త్రంనిర్దేశించిన పునరుత్తేజక విధులు నిర్వహించేవారు. అరవై నిండిందని షష్ట్యబ్దపూర్తి, డెబ్భైకి సప్తతి, ఎనభైలో అశీతి, తొంభై వస్తే నవతి, అశీతికి నవతికి మధ్య సహస్ర చంద్రదర్శనోత్సవం వంటివన్నీ శాస్త్రం సూచించిన విధులే. షష్టిపూర్తిని వేడుక అంటాంగాని, నిజానికది 'ఉగ్రరథ శాంతి'. మృత్యువు ప్రధాన దేవతగా సాగే ఉగ్రరథ శాంతికర్మకు 'శతఛిద్రాభిషేకం' ఉద్యాపన. పుట్టినరోజును 'వర్ధాపనవిధి'గా శాస్త్రం నిర్వచించింది. మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లూ జీవించేందుకై ఇవన్నీ మహర్షులు సూచించిన విధులు. అకాల మృత్యుహరణం, ఇంద్రియ పునరుత్తేజం, ధాతుపుష్టి వంటివి వీటి లక్ష్యాలు.

యౌవనం జీవితానికి వసంతరుతువు లాంటిది. 'ప్రాయం' అనే మాట దానికే వర్తిస్తుంది. ప్రాయానికి కోటిదండాలన్నారు ఆత్రేయ. 'చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాడు రచియించితి మరుత్తరాట్చరిత్ర... నూనూగు మీసాల నూత్నయౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి...' అని సగర్వంగా చాటాడు శ్రీనాథుడు. చరిత్రలోకి వెళితే అలెగ్జాండర్‌ తన ఇరవయ్యో ఏట సింహాసనం అధిష్ఠించాడు. మరో పదిపన్నెండేళ్లకు 'విశ్వవిజేత'గా కీర్తి గడించాడు. గెలీలియో తన పద్దెనిమిదో ఏట పెండ్యులం కనుగొన్నాడు. ప్రస్థానత్రయ భాష్యాలను, బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలను, ప్రకరణ గ్రంథాలను, స్తోత్రవాఞ్మయాన్ని ఈ లోకానికి అందించిన శంకర భగవత్పాదులు ముప్ఫైరెండేళ్లకే తమ కర్తవ్యాలను పూర్తిచేశారు. ఎవరి రచనలను ఈ జాతి అధ్యయనం చేస్తే విదేశీ వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో పనిలేదో- ఆ వివేకానందస్వామి యౌవనంలోనే తమ విధులను ముగించారు. ఇలాంటి ఉదంతాలు విన్నప్పుడు- జీవితమంటే యౌవనమే అనిపిస్తుంది. పన్నెండేళ్లు వచ్చినకుర్రకారంతా త్వరత్వరగా యౌవనం వచ్చేయాలనుకుంటారు. నిగనిగలాడే నూనూగు మీసాలకోసం తహతహలాడతారు. తీరాచేసి... అలా చూస్తుండగానే, నిగనిగ పాలిపోతుంది. వయసు జారిపోతుంది. దిగులు ఆరంభమవుతుంది. నిర్వీర్యంఆవరిస్తుంది. యౌవన భోగాలకోసం వృద్ధాప్యాన్ని తాకట్టుపెట్టిన ఫలితమిది! అలాకాకుండా వయసులో ఉన్నప్పుడేతగుజాగ్రత్తలు తీసుకున్నవారికి వృద్ధాప్యం ఒక వరంగా లభిస్తుంది. జీవితంపట్ల కుతూహలం ఉంటుంది. గడపడానికి, జీవించడానికి గల తేడా వారిని చూస్తేచాలు తెలుస్తుంది. అలాంటి అదృష్టవంతులు వయసుమీరినా యౌవనోత్సాహంతోరెపరెపలాడుతూ ఉంటారు. అది చాలా ఆనందకరం అంటారు అనుభవజ్ఞులు. 'ముప్ఫైఏళ్ల వయసులో వృద్ధాప్యంకన్నా డెబ్భయ్యోఏట యౌవనం చాలా ఆనందాన్నిస్తుంది' అంటాడు రాబర్ట్‌ ఫ్రాస్ట్‌. పండువయసులో అద్భుతాలు సృష్టించినవారి చరిత్రలను నెమరేస్తూ స్ఫూర్తిపొందిన మనిషిని వృద్ధాప్యం ఎన్నటికీ కుంగతీయదు. తరహా కుతూహలంవల్ల మనిషిలోనూ మనసులోనూ మహిమలు జరుగుతాయి.

జీవితం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది, మరో పదేళ్లు ఆయుర్దాయం ఉంటే అన్నీ చక్కబెట్టుకోవచ్చు- అని మనిషిఆశపడుతుంటాడు. శాంతికర్మలు, ఇష్టి, కామ్యకర్మల ద్వారా అది సాధ్యమేనని శాస్త్రాలు చెబుతాయి. శంకరులకు బ్రహ్మనిర్దేశించిన ఆయువు కేవలం ఎనిమిదేళ్లు. సన్యాసం స్వీకరించిన కారణంగా మరో ఎనిమిదేళ్ల పొడిగింపు సాధ్యమైంది. కాశీలో శంకరుల నోట బ్రహ్మసూత్ర భాష్యాన్ని విని ఆనందించిన సందర్భంలో వేదవ్యాస మహర్షి మరో పదహారేళ్లుఆయుర్దాయాన్ని అనుగ్రహించారు. అలా మనిషి తన జీవితకాలాన్ని పెంచుకోవడం సాధ్యమేనని ఇప్పుడు శాస్త్రజ్ఞులుప్రకటిస్తున్నారు.
తూర్పు దీవుల్లోని మట్టిలో లభించే 'రేపామైసిన్‌' ఉపయోగించి ఇరవైఏళ్లపాటు జీవితకాలాన్ని పొడిగించే దివ్యఔషధం శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఆ మట్టి మిశ్రమంలో వృద్ధాప్యాన్ని నివారించే గుణాలున్నాయి. దాంతో తయారయ్యే ఔషధం నిజంగా అమృతమేనని, వయసు పెరుగుదలను త్వరితం చేసే జీవకణాలపై అది గట్టి ప్రభావాన్ని చూపించి వాటి చురుకుదనాన్ని అరికడుతుందని బార్‌షాప్‌ విజ్ఞాన సంస్థకు చెందిన ఆర్నాన్‌ రిచర్డ్‌సన్‌ చెబుతున్నారు. 'అంతా మట్టేనని తెలుసు... అదీ ఒక మాయేనని తెలుసు' అన్నంతవరకూ కవులు చెప్పారు. మట్టిని నమ్మితే ఫలితం ఉంటుందంటూ అందులోని మాయ సంగతి ఆయనవెల్లడించారు. పర్వతాలు ఎగజిమ్మే లావా చల్లారిన తరవాత ఆ బూడిదలోంచి తయారైన 'హెక్లాలావా'ను దంత చికిత్సకు ఉపయోగిస్తున్నాం. ఒంటినిండా మట్టి పూసి సూర్యస్నానం చేయించడం, ప్రకృతి వైద్యంలో చూస్తున్నాం. తనలోంచే పుట్టిన ఈ జీవజాలానికి ఆయువును పెంచే లక్షణం సైతం మట్టికి ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. శాస్త్రజ్ఞుల కృషి త్వరలోనే ఫలించి- యౌవనాన్ని, జీవితకాలాన్ని పెంచే ఔషధం అందరికీ అందుబాటులోకి రావాలనిఆశిద్దాం!
(ఈనాడు, ౧౯;౦౭:౨౦౦౯)
___________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home