My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, August 16, 2009

రాగంతో రోగ నివారణ


కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తమ 'రుతుగానం'లో శరదృతువును వర్ణిస్తూ- 'తెల్లచీర గట్టి తెలివెల్గులన్‌గల్గి సితకుముదము దాల్చు రుతులతాంగి దైవతమును పాడె...' అన్నారు. రుతువనేది కాలానికి సంబంధించినది. తెలుపు- వర్ణాలకు చెందినది. దైవతం- సంగీతశాస్త్ర పారిభాషిక పదం. సప్తస్వరాల్లో దైవతాన్ని 'ద' అనే స్వరస్థానంగా సంకేతిస్తారు. మామూలు దృష్టికి ఇవి ఒకదానికొకటి పొంతన లేనివిగా, పరస్పర విరుద్ధాలుగా తోస్తాయి. అందుకే దీన్ని 'శాస్త్రదృష్టి'తో పరిశీలించాలని తమ పీఠికలో సూచించారు విశ్వనాథ. వేకువకీ భూపాలరాగానికీ ఉన్న సంబంధం ఏమిటో సంగీతజ్ఞుడికే తెలుస్తుంది. వేణువుకూ మోహనరాగానికీ ఒక తరహా స్వరమైత్రి. కదనకుతూహల రాగానికీ వీణకూ మరోబాపతు అన్యోన్యత. ఈ బాంధవ్యాల్లోని లోతులను అర్థం చేసుకోవడానికి ఒకానొక విశేష శాస్త్రదృష్టి మనిషికి చాలా అవసరం. మన సంగీత వైశిష్ట్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఇక్కడి సంగీతం గంధర్వ విద్యగా వాసికెక్కింది. 'గాంధర్వేచ భువిశ్రేష్ఠో... సంగీత గాంధర్వ విద్య నెరిగిన శ్రేష్ఠుల్లో రాముడు అగ్రశ్రేణికి చెందినవాడు' అన్నారు వాల్మీకి. రుషుల దృష్టిలో సంగీతమనగా సాక్షాత్తు వేదమే! సామసంహిత భారతీయ సంగీత శాస్త్రానికి ఆధార షడ్జమం. ముముక్షువులకు సంగీతం ఒక మోక్షసాధనం. 'సంగీత జ్ఞానము, భక్తివినా సన్మార్గము కలదే? ఓ మనసా!' అని త్యాగరాజస్వామి ప్రశ్నించారు. 'సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులైన వారెందరో మహానుభావులు... అందరికీ వందనాలు' అంటూ చేతులు జోడించారు. సామగానం శరీరధాతువులపై చూపించే ప్రభావం మనిషిని ధన్యుణ్ని చేస్తుంది. అందుకే ఆ కైమోడ్పు.

నెమలి, ఎద్దు, మేక, సింహం, కోకిల, గుర్రం, ఏనుగు చేసే ధ్వనుల నుంచి వరసగా సరిగమపదని స్వరభేదాలు ఏర్పడ్డాయన్నది లోకంలో ప్రసిద్ధమైన సిద్ధాంతం. మహాదేవుడి ఏడుముఖాల నుంచి సప్తస్వరాలు ప్రభవించాయని సంగీత శాస్త్రాలు వర్ణించాయి. పరశివ, ఈశ్వర, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే ఏడుముఖాలు వరసగా సరిగమపదని స్వరాలకు జన్మస్థానాలు. సంగీతానికి ప్రకృతితోను పంచభూతాలతోనే కాకుండా గ్రహరాశుల చలనంతోనూ లోహాలతోసైతం సంబంధం ఉంది. ఈ విషయాన్ని దివ్యజీవన సమాజానికి చెందిన హెలీనా పెట్రోవా బ్లావెట్‌స్కీ తమ 'సీక్రెట్‌ డాక్ట్రిన్‌'లో సాధికారికంగా ప్రస్తావించారు. షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదాలకు వరసగా ఇనుము, బంగారం, పాదరసం, సీసం, తగరం, రాగి, వెండి లోహాలతో సంబంధం ఉంది. మళ్ళీ అదే వరసలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శని, గురుడు, శుక్రుడు, చంద్రుడు అనే గ్రహాలతో సంబంధం ఉంది. అలాగే వివిధ రంగులతోనూ ఉందని మేడమ్‌ బ్లావెట్‌స్కీ నిరూపించారు. ఇదే విశ్వనాథ సూచించిన శాస్త్రదృష్టి. సంగీత విద్వాంసులు తథరిణోం అంటూ కచేరీ మొదలుపెడతారు. తత్‌హరిః ఓం అనేవి అందులోని అక్షరాలు. సంగీతం ద్వారా సృష్టి మొత్తాన్ని సంబోధించే సంప్రదాయమది. సంగీతానికి, ప్రకృతికి గల బాంధవ్యానికి జేజేలవి.

ప్రతీరాగానికి ఒకో ప్రత్యేక జీవస్వరం ఉంటుంది. శంకరాభరణంలోను కల్యాణిలోను స్వరాలు సమానమే గాని 'మ' పలకడంలో తేడా ఉంది. శుద్ధమధ్యమం అయితే అది శంకరాభరణం. ప్రతిమధ్యమం అయితే కల్యాణి. మధ్యమం ఎలా పలికాడన్నదాన్నిబట్టి గాయకుడు వాటిలో ఏ రాగం పాడుతున్నాడో రసజ్ఞులు గ్రహిస్తారు. బ్లావెట్‌స్కీ వివరణ ప్రకారం సప్తస్వరాల్లోని దైవతానికి, లోహాల్లో రాగికి సంబంధం. రాగి లోపంవల్ల మానవ దేహానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దైవతం జీవస్వరంగా కలిగిన రాగాన్ని వినడానికి మనిషి ఇష్టపడతాడు. సంగీత సారం మనిషికన్నా దేహానికి బాగా తెలుసు. ఒంట్లో నీరు శాతం తగ్గినప్పుడు దాహం అనే కోరిక పుడుతుంది. కాల్షియం లోపించిన పిల్లలు సున్నాన్ని గోక్కొని తింటారు. కడుపులోబిడ్డ పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) పీల్చేస్తున్నప్పుడు బియ్యం తినాలని గర్భిణికి అనిపిస్తుంది. అలాగే శరీరంలో లోహాల కొరత ఏర్పడినప్పుడు వాటిని భర్తీచేసే సంగీత స్వరాలను దేహం కోరుకుంటుంది. కొరవడిన లోహంతో సంబంధం కలిగిన జీవస్వరమున్న పాటవైపు మనసు పోతుంది. దేహంలోని జీవధాతువులకు సంగీతంపట్ల గల అవగాహనకు అది సాక్ష్యం. కూనిరాగాల్లోని రహస్యం ఇదేనంటారు పెద్దలు. ఒక్కోరోజు ఒకోపాట మనసును వెంటాడుతుంది. పొడిబారిన ఇసుక నీటిని పీల్చుకున్నట్లు- ఆ పాటలోని స్వర చైతన్యాన్ని జీవధాతువులు పీల్చుకుని లోహాలకు చెందిన కొరతను భర్తీ చేసుకుంటాయి. ఈ సిద్ధాంతం మీదే 'సంగీతంతో చికిత్సా విధానం'(మ్యూజిక్‌ థెరపీ) అభివృద్ధి చెందింది. రాగంతో రోగం కుదర్చడం దాని లక్ష్యం. ఏ రాగం ఈ రోగానికి చికిత్స చేయగలదనేది ఆ రోగ లక్షణాలను బట్టి, ఆ లోపాలను సరిదిద్దగల శక్తిని తమలో ఇముడ్చుకున్న రాగాలను బట్టీ ఉంటుంది. దాదాపుగా వినోదానికే పరిమితమవుతున్న భారతీయ సంగీతపు వివిధ కోణాలను, శక్తిసామర్థ్యాలను ఈ దిశగా పరిశోధించి, మానవాళికి మేలు చేకూర్చవలసిన బాధ్యత విద్వాంసులపై ఉంది. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా విజ్ఞులు ఈ కోణంలోంచి ఆలోచించాలి.
(ఈనాడు, సంపాదకీయం, ౨౧:౦౬:౨౦౦౯)
____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home