తెలుగువాడి వేదన
-శంకరనారాయణ
తెలుగువాడు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని తేల్చి చెబుతాడు. చిన్న జబ్బునైనా తేలిగ్గా చూడడు. పడిశం పదిరోగాల పెట్టు అని కాస్త దూరంగా ఉంటాడు. ముక్కూమొహం చూసేటప్పుడూ జలుబు ఏమైనా ఉందా అని నిశితంగా చూడ్డం ఈమధ్య అలవాటు చేసుకున్నాడు. ఆబాలగోపాలమూ ఇదే వరస!
పూర్వకాలంలో మునులు తపస్సును 'ముక్కు మూసుకుని' ఎందుకు చేసేవారని ప్రశ్నిస్తే- 'స్వైన్‌ఫ్లూ భయంతోనే' అని తెలుగునాట చిచ్చరపిడుగులు జవాబు చెబుతున్నారు. ఈరోజుల్లో అయితే శుభ్రంగా ముక్కుగుడ్డలు వాడుకునేవాళ్లు అంటున్నారు. ప్రజలు స్వైన్‌ఫ్లూతో బాధపడుతుంటే- ప్రభుత్వం మాత్రం 'స్వయం ఫ్లూ'తో బాధపడుతోందని, ఆరోగ్యం 'యావత్తు'పోయి ఆ 'రోగం'తో బాధపడుతున్నవారు విమర్శిస్తున్నారు. మనది అపరిశుభ్ర దేశమనీ, ప్రపంచంలోని చెత్త అంతా ఇక్కడే పేరుకుంటుందనీ ఖండఖండాంతరాల్లో ఒకటే ప్రచారం! విదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయనీ హోరెత్తుతుంటుంది. చిత్రమేమిటంటే, ఎయిడ్స్ మొదలుకొని స్వైన్ ఫ్లూ వరకు అన్ని జబ్బులూ విదేశాలనుంచే ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి తప్ప, ఏ జబ్బూ ఇండియానుంచి ఎగుమతి కావడంలేదు.
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని ఎప్పుడూ పాడే తెలుగువాడు వైద్యంలో చేయితిరిగినవాడే! ఆ మాటకొస్తే పైసా ఖర్చు లేని మందూ మనవాడే చెబుతాడు. 'లంఖణం పరమౌషధం' అంటాడు. మందుకు విపరీతార్థం చెప్పి 'పానా'యామం చేయగల దిట్ట తెలుగువాడే! ఎవడి ఇంట్లో వాడు వైద్యం చేసుకుంటానంటే అతగాడు ఒప్పుకోడు. ఔషధం కానిది అవనిలో లేదు అంటూనే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదంటాడు! నవ్వొచ్చిందంటే వైద్యుణ్నీ లెక్కచెయ్యడు. 'వైద్యో నారాయణో హరిః' అని అందరూ అంటుంటే, అతడు వైద్యోనారాయణో 'హరీ' అని పళ్లికిలిస్తాడు. హరీ అన్నా, టపా కట్టడమన్నా తెలుగువాడి అర్థం వేరుగా ఉంటుంది. తిక్కరేగితే చెట్టంత వైద్యుణ్నీ పట్టుకుని 'నీచేతి మాత్ర వైకుంఠయాత్ర' అనడం తెలుగువాడికే చెల్లు.
ప్రపంచంలో ఏ పిచ్చీ లేనివాడు ఎవడూ లేనట్టే, ఏ జబ్బూ లేనివాడు ఎవడూ లేడన్నది తెలుగువాడి సిద్ధాంతం.
'లేనివాడికి ఆకలిజబ్బు ఉన్నవాడికి అరగని జబ్బు' అని పాడతాడు.
వైద్యవృత్తి రహస్యాలను తెలుగువాడు ఔపోసన పట్టాడు. అందుకే 'చావుకు పెడితేకానీ లంఖణానికి తేలదు' అంటాడు. 'నినువీడని నీడ' ఎవరూ అని అడిగితే వైద్యుడు అని తెలుగువాడు ఠక్కున చెబుతాడు. 'చచ్చేదాకా వైద్యుడు వదలడు' అని చెబుతాడు. వెనకటికి రోగులు వైద్యులను చూసి భయపడేవాళ్లు. స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని, ఇప్పుడు రోగులను చూసి వైద్యులు భయపడుతున్నారు. ఏ రోగివల్ల తన ప్రాణంమీదికి వస్తుందోనని తల్లడిల్లుతున్నారు.
'నేను రాను మొర్రో సర్కారు దవాఖాన'కు అనేది ప్రభుత్వ వైద్యుల గీతం కూడా అయిపోయింది.
'ఎన్నో వ్రణాలు కోసినాను, నా వ్రణం కోసినప్పుడున్నంత నొప్పి లేదే' అన్నవాడూ మన వైద్యుడే!
జబ్బులకు సైతం మానసిక బలహీనతలు అంటగట్టడం తెలుగువాడి ప్రతిభే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటాడు!
'ఇంతింతై జబ్బు ఇంతై' అనడం మనవాడికి పరిపాటి. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయిందే అని కలత చెందుతాడు. దీనికన్నా పుండుమీద కారం రాసినట్టు మాట్లాడేవారిని చూసి ఎక్కువ బాధపడతాడు.
'బాధే సౌఖ్యమనే భావన' తెలుగువాడి ఆరోగ్య వేదాంతం! నొప్పికి విరుగుడూ చెబుతాడు. 'గర్భాధానం ముచ్చట్లు లంఖణాల్లో తలచుకుంటే' ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ సాగితే రోగమంత భోగమే లేదంటాడు. 'అన్నం హితవు లేనివాణ్ని కరవేం చేస్తుంది?' అని ప్రశ్నిస్తాడు.
అంతమాత్రాన ప్రతిదానికీ లేదు, లేదంటే వూరుకోడు. ప్రత్యేకించి తన భార్య నోటివెంట లేదు అనే మాట వస్తే అస్సలు వూరుకోడు. 'పుండు మీదికి నూనె లేదంటే బూరెలొండవే పెళ్లామా' అన్నవాడూ తెలుగువాడే.
విశేషమేమిటంటే, తెలుగువాడు వైద్యుడి దగ్గరకు పోయేటప్పుడు తన జాతకం ఎలా ఉందో ఆలోచించడు. వైద్యుడి హస్తవాసి ఎలా ఉందోనని ఆరాతీస్తాడు. అదేమిటంటే 'ఆయుష్షు గల రోగి హస్తవాసి గల వైద్యుని దగ్గరకే పోతాడు' అని చెబుతాడు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ వైద్యుల నియామకాలన్నీ హస్తవాసి పరీక్షించి ఇస్తే బాగుంటుందనిపిస్తాడు.
అలవోకగా ఆరోగ్య సూత్రాలు, ముందు జాగ్రత్తలు చెప్పడం తెలుగువాడికి అలవాటు. 'అనగా అనగా రాగం, తినగా తినగా రోగం' అంటాడు. 'రాయంగరాయంగ కరణం... పారంగ పారంగ మరణం' అని సిద్ధాంతీకరిస్తాడు. 'అరఘడియ భోగం... ఆరు నెలల రోగం' అనీ హెచ్చరిస్తాడు. అరిశె ఆరు నెలల రోగం బయటకు తెస్తుదని పరిశోధనాత్మకంగా చెబుతాడు.
తెలుగువాడు 'ఎవ్వనిచే జనించు' పద్యమే కాదు , ఎవ్వనిచే మరణించు' అన్న పద్యమూ పాడతాడు. 'ఆయువు గట్టిదైతే అన్ని రోగాలూ పోతాయి' అని ధీమాగా చెబుతాడు. 'ఆయుష్షు లేక చస్తారు కానీ ఔషధం లేక చస్తారా?' అని ఎదురు ప్రశ్నలు వేస్తాడు. ఇంతచేసీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నానంటాడు. 'కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు' అంటాడు. అంతవరకు సర్దుకోవచ్చు. ఎటొచ్చీ కొత్త వైద్యుల నియామకం ఎందుకు? పాత రోగులనే వెతికి పట్టి ఆసుపత్రుల్లో వైద్యులుగా నియమించాలంటాడేమోనని ఎంతమంది హడలి చస్తున్నారో ఎవరికి తెలుసు?
(ఈనాడు, ౧౯:౦౯:౨౦౦౯)
__________________________
Labels: Humour/ Telugu, pun/telugu
0 Comments:
Post a Comment
<< Home