My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, September 29, 2009

నవ్వుకు జయహో!


నాయుడుబావ ఏ ఛలోక్తి విసిరాడో ఏమో కానీ, 'వొక్క నవ్వే యేలు... వొజ్జిరవొయిడూరాలు' అంటూ అతడే మైమరచిపోయేంతగా నవ్వింది మరదలు పిల్ల యెంకి! 'రాసోరింటికైనా రంగు తెచ్చే' ఆ పిల్ల- అరమొగ్గలై విచ్చుకున్న తన పెదవుల వంపుల్లో మెరిపించిన మెరుపుల్ని చూసి 'సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి' అనీ జతగాడు మురిసిపోయాడు. నవ్వంటే- అధరం మీద మనోజ్ఞ నృత్యం, హృదయావిష్కరణ, జీవనసౌందర్య సాక్షాత్కారం! 'జీవితం, దేవతల దరస్మితం/చిన్నారీ, పెదవిపై సింగారించు' అన్నాడు కవి తిలక్‌. కలతలు, కొలతలు, అలసటలు, అలజడులు వద్దంటూ నిత్య దరహాసంతో బతుకుదారిలో సాగిపోవాలన్నాడు. అందుకు పెట్టుబడీ ఏమీ అక్కర్లేదు. మనం నవ్వగలిగితే చాలు, తోటివారిని నవ్వించగలిగితే చాలు! తిలక్‌ మాటల్లోనే చెప్పాలంటే అప్పుడు 'సరదాగా, నిజాయతీగా, జాలిజాలిగా, హాయిహాయిగా' బతికేయగలం! థాయ్‌లాండ్‌లో ఓ సామెత ఉంది. 'రోజుకు మీరు మూడుసార్లు నవ్వండి, ఆ రోజు ఆరుసార్లు నవ్వుతూ సంతసిస్తూ ఉంటుంది' అని. నవ్వుతూ రోజునే నవ్వించి సంతోషపెట్టగల మనకు- మన సాటివారిని నవ్విస్తూ ఆనందింపజేయడం ఏమంత కష్టమని? నవ్వడానికి రవంత రసహృదయం చాలు... నవ్వించడానికి కాసింత హాస్యస్ఫూర్తి చాలు. అన్ని నవ్వులూ ఒకేవిధంగా ఉండవన్నదీ నిజమే. నోటి వంకర నవ్వులు, నొసటి వెక్కిరింతల నవ్వులు, సినిమాల్లోని విలన్‌ తరహా నవ్వులూ ఉంటాయి. వాటి ఊసు వదిలేద్దాం!

సమయజ్ఞతతో, హాస్యరస దృష్టితో విసిరే ఛలోక్తులు మల్లెపూల మీద కురిసిన మంచుబిందువులంత స్వచ్ఛంగా, తెలుగు అక్షరమంత అందంగా, తెలుగు పదాలంత సొగసుగా నవ్వుల్ని విరబూయిస్తాయి.
'ఆనాడూ ఈనాడూ హాస్యానికి విలువ కద్దు... సాహితీ సభాంగణాన వ్యంగ్యానిది తొలి పద్దు' అంటూ కవిత్వీకరించిన శ్రీశ్రీని 'మీరు ఛలోక్తులకు ప్రసిద్ధిట కదా, ఏదీ ఒకటి విసరండి చూద్దా'మని గడుసుగా అడిగాడు ఓ పాఠకుడు. 'ఇదిగో, విసిరాను' అన్నాడు టూకీగా శ్రీశ్రీ. మహాకవి ఇచ్చిన ఈ జవాబులోని చమక్‌, ప్రశ్నించినవాణ్నీ గిలిగింతలు పెట్టేదే. నా అంత చమత్కా'రంగారావు' ఈ పరగణాల్లోనే లేడనుకునే ఓ బాసు జోకులాంటి మాటేదో అన్నాడు. బతకనేర్చినవారందరూ పొట్టలు పట్టుకుని మరీ గొల్లుమన్నారు. సారువారు కొలువు చాలించాక- కళ్లు తుడుచుకుంటూ వస్తున్న సహోద్యోగిని మరో చిరుద్యోగి అడిగాడు, 'కళ్ల వెంబడి నీళ్లు వచ్చేంతగా నవ్వాల్సినంత జోకా అది' అని అమాయకంగా. 'పిచ్చివాడా! నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్న పాట గుర్తులేదా నీకు. ఇవి రెండోకోవకు చెందిన కన్నీళ్లు' అన్నాడు సహోద్యోగి చేతిరుమాలుతో కళ్లొత్తుకుంటూ! అవతలివారిమీద తమదే పైచేయి అనిపించుకోవడానికి జోకులు వేసేవారు ఉన్నట్లే, తమమీద తామే జోకులు వేసుకుంటూ ఆనందించేవారూ ఉంటారు. వెనకటికి నలుగురు అబ్బాయిలు ఓ చిన్నదాని ప్రేమలో తలమునకలుగా మునిగిపోయారు. 'వాళ్లల్లో అదృష్టవంతుడెవరో?' అన్న సందేహాన్ని వెలిబుచ్చింది ఆ అమ్మడి స్నేహితురాలు. 'ప్రేమిస్తున్నవాళ్లు నలుగురైనా, నన్ను పెళ్లాడేది ఒక్కడే కదా, మిగిలిన ముగ్గురూ అదృష్టవంతులు' అని ఠపీమని సమాధానం ఇచ్చింది ఆ గడుసు పిల్ల! ఆ బంగారుతల్లిలా తమను చూసి తామే కాసేపు నవ్వుకోగల రసజ్ఞత అందరికీ ఉంటే, లోకం ఎంత ఆనంద మయంగా ఉంటుంది!

ఇతరుల్ని నవ్వించడానికి కాక, వారిపై ఆధిపత్యం చలాయించడానికే చాలామంది హాస్యాన్ని ఓ సాధనంగా మలచుకుంటారన్న మాట నిజమేనని జర్మన్‌ పరిశోధకులూ చెబుతున్నారు. పురుషులు ఇతరులపై జోకులేసి ఆనందిస్తుంటారని, మహిళలు తమపై తామే జోకులేసుకుంటూ ముచ్చటపడుతుంటారనీ వారి అధ్యయనం వెల్లడించింది. దాదాపు యాభై ఏళ్లక్రితం వరకు మహిళలు హాస్యాన్ని పండించడం, వ్యంగ్యబాణాల్ని సంధించడం చాలా అరుదుగా ఉండేదని జర్మన్‌ పరిశోధకుల బృందానికి సారథ్యం వహించిన హెల్గా కొట్చాఫ్‌ చెప్పారు. అవును మరి, 'నవ్వే ఆడదాన్ని నమ్మరాద'నేంత స్థాయిలో పురుషుల కుసంస్కారం రాజ్యమేలుతున్న రోజుల్లో- మహిళలు ఇతరుల్ని నవ్వించడానికి ముందుకు రాలేకపోవడంలో ఆశ్చర్యమేముంది? తమవంక పలకరింపుగా చూసినా, తమ మాటలకు సాటి మనిషే కదా అన్న భావనతో సన్నగా నవ్వినా- అది ప్రేమేననుకుని గ్రీటింగులతోనో, బహుమతులతోనో వెంటపడే మగానుభావులూ ఉన్న సమాజంలో- మహిళలు తమ హాస్యస్ఫూర్తిని తమలోనే అణచిపెట్టుకోవడంలో వింతేముంది? ఇప్పుడు మహిళలూ పురుషులతో సమానంగా హాస్యానికి, వ్యంగ్యానికి పట్టాభిషేకం చేస్తూ 'ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే...' అన్న సూక్తికి నిలువుటద్దంలా నిలుస్తున్నారని జర్మన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలడం హర్షణీయం. పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా, నాలుగైదేళ్ల వయసులోనే మగపిల్లలు జోకులేయడం మొదలుపెడుతున్నారట, శైశవప్రాయంలోనే నవ్వుల్ని పువ్వుల్లా వికసింపజేస్తున్నారట. అదేప్రాయంలో ఉన్న పువ్వుల్లాంటి ఆడపిల్లలు వాటిని విని ముసిముసిగా నవ్వుకుంటున్నారే తప్ప తాముగా జోకులెయ్యడం లేదట. జర్మనీ చిన్నారుల మాటేమో కానీ, ఇక్కడ మాత్రం చిరుదివ్వెల్లాంటి చిట్టితల్లులూ మాటల్లో మతాబుల వెలుగుల్ని విరజిమ్ముతున్నారు. వారి పలుకుల్ని వింటున్నవారి పకపకలు జలజల రాలుతున్న సన్నజాజుల్నీ, మిలమిలలాడే స్వర్ణకాంతుల్నీ తలపిస్తున్నాయి. అందుకే అన్నారేమో...
నగలాగా ధగధగలాడుతూ పెదవులమీద వెలుగులీనుతుంది కనుకనే నవ్వును 'నగ'వు అని!
(ఈనాడు, సంపాదకీయం , ౧౩:౦౯:౨౦౦౯)
____________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home