చైనాకు 60 ఏళ్లు
1949 అక్టోబర్ 1న విదేశీ దురాక్రమణశక్తుల నుంచి, స్థానిక భూస్వామ్య పాలకుల నుంచీ విముక్తిని సాధించిన చైనాకు నేటితో 60 ఏళ్లు నిండాయి. ఈ ఆరు దశాబ్దాల కాలంలో చైనా అనేక మలుపులు చూసింది. సోషలిస్టు దేశంగా ఆసియాఖండంలోని దేశదేశాల విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిన జనచైనా నేడు ప్రభుత్వ కఠిన నియంత్రణలో ఉన్న బలమైన మార్కెట్ శక్తిగా పరిణామం చెందింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా దూసుకెళ్తూ.. అగ్రరాజ్యాలకు ధీటుగా పోటీనిస్తూ.. చైనా వస్తువులు కనిపించని నేలంటూ లేని పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చైనా పరిస్థితులను ఒకసారి అవలోకిస్తే...
విద్యారంగం
1949కిముందు చైనా జనాభా 54 కోట్లు. వారిలో 80 శాతం ప్రజలు నిరక్షరాస్యులే. అయితే, 1949లో విముక్తి సాధించిన తర్వాత జనచైనా ప్రభుత్వం ప్రజల్లో అక్షరజ్ఞానం పెంపొందించటానికి చాలా ప్రాధాన్యమిచ్చింది. దీనివల్ల ప్రస్తుతం ఆ దేశంలో అక్షరాస్యత 90.8 శాతానికి చేరుకుంది. ఏటా ఆ దేశంలో 4,50,000 మంది ఇంజినీరింగ్, 50 వేల మంది పీజీ, 8 వేల మంది పీహెచ్‌డీ పూర్తి చేస్తున్నారు.
పరిశ్రమలు
విముక్తికి ముందు చైనాలో వ్యవసాయమే తప్ప పరిశ్రమలు అరకొరగా తప్ప లేవు. అలాంటి దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. కొనుగోలుశక్తి పరంగా చూస్తే రెండో స్థానంలో నిలుస్తోంది. దీనికి కారణం, నిశితమైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వాటిని పరిపూర్తి చేయటం. మొదటి పంచవర్ష ప్రణాళిక (1953-57) ద్వారా దేశంలో మౌలిక పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 1956 నుంచి 1966 మధ్య పారిశ్రామిక ఉత్పత్తి నాలుగురెట్లు పెరిగింది. జాతీయాదాయం 58 శాతం పెరిగింది.
మలుపుతిప్పిన సంస్కరణలు
1978లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి మార్కెట్ ఆధారిత విధానాలను అమలు చేయటం మొదలుపెట్టిన నాటి నుంచీ చైనాలో కీలకమైన మార్పులు రూపుదిద్దుకున్నాయి. అంతవరకూ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చైనా ఆర్థికవ్యవస్థలోకి ప్రైవేటు దేశీయ కంపెనీలు, కొన్నాళ్ల తర్వాత వాటికి పోటీగా విదేశీ కంపెనీలు చొచ్చుకొచ్చాయి. అప్పటికే మౌలికరంగాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్న చైనా.. వినియోగ, సేవా రంగాలపై దృష్టి సారించి విప్లవం సృష్టించింది. తనకున్న చవకైన శ్రమశక్తిని ఆధారంగా చేసుకొని మొబైల్‌ఫోన్లు, ఆటవస్తువులు, క్రీడాపరికరాలు... వంటి రంగాల్లో ప్రప్రంచవ్యాప్తంగా విస్తరించింది.
సైన్యం
ప్రపంచంలోనే అతిపెద్ద సైనికబలం చైనా సొంతం. దాదాపు 30 లక్షల సైనికులు చైనా సైన్యంలో ఉన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ పురుషుడూ సైనిక శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు కూడా సైనిక అనుంబంధ కార్యకలాపాల్లో కొంతకాలంపాటు సేవలు అందించాలి.
క్రీడలు
చైనాలో ప్రాచీనకాలం నుంచీ పోరాటవిద్యలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంలో క్రీడలకు, శారీక ఆరోగ్యానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించింది. ఒలింపిక్స్‌లో ఆ దేశం ఎప్పటికప్పుడు తన సత్తాను చాటుకుంటూనే వచ్చింది. అయితే, 1994 నుంచీ ప్రభుత్వ నియంత్రణ తగ్గి ప్రైవేటు స్పాన్సర్‌షిప్‌లు మొదలుకావటంతో ఆటలు అక్కడొక వృత్తిగా స్థిరపడ్డాయి. గత ఏడాది బీజింగ్‌లో నభూతో అన్న రీతిలో నిర్వహించిన ఒలింపిక్స్ ద్వారా ప్రపంచానికి తన సామర్థ్యం ఏమిటో చైనా తెలియజెప్పింది.
అంతరిక్షంలో అద్భుతాలు
అగ్రరాజ్యాలకు ధీటుగా అంతరిక్ష రంగంలో చైనా ప్రయోగాలను చేపట్టింది. అనేక ఉపగ్రహాలను ప్రయోగించింది. మానవసహిత అంతరిక్ష యాత్రలను సైతం విజయవంతంగా జరిపింది. ప్రస్తుతం ఆ దేశం అంగారకుడు లక్ష్యంగా పరిశోధనలు జరుపుతోంది. 2014-33 మధ్యలో అరుణగ్రహంపై మానవరహిత ప్రయోగాలను జరపాలని ప్రణాళికను రచించుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది.
వైద్యం
చైనాలో వైద్యరంగం 1980 వరకూ బాగా అభివృద్ధిని సాధించింది. ఆ తర్వాత వైద్యసేవల ప్రైవేటీకరణ అనంతరం పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులొచ్చాయి. 'రోగుల వద్దకే వైద్యుడు' అనే అత్యంత ప్రాచుర్యం పొందిన విధానం రద్దయింది. మిగిలిన కొద్దిపాటి ప్రభుత్వ వైద్యసేవల్లో అవినీతి రాజ్యమేలింది. ఈపరిస్థితిని మార్చటానికి 2005లో ప్రభుత్వం నడుం కట్టింది.
కీలక ఘటనలు
* చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావోసేటుంగ్ నాయకత్వంలో 1949 అక్టోబర్ 1న చైనా విముక్తి సాధించింది. దేశాధినేతగా మావో బాధ్యతలు స్వీకరించారు. సోషలిజం ఆర్థికవిధానాల ప్రాతిపదికన పాలన మొదలైంది.
* నాయకత్వంలో, చైనా సమాజంలో పాతకాలపు ధోరణులు అలాగే కొనసాగుతున్నాయని గ్రహించిన మావో 1966లో సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించి.. తప్పులుగా కనిపించిన దేనినైనా విమర్శించమని ప్రజలకు పిలుపునిచ్చారు.
* 1976లో మావో మరణానంతరం డెంగ్‌జియావోపింగ్ సారథ్యంలో సాంస్కృతిక విప్లవం కాలం నాటి విధానాలను పక్కనబెట్టి ఆర్థికసంస్కరణలు ప్రారంభించారు.
* సోషలిస్టు చైనా క్రమంగా పెట్టుబడిదారీ విధానం వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో, పార్టీలో పెట్టుబడి దారులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
----------------------------------------------
జాతీయ దినోత్సవ సంబరాలు నేడు అష్ట దిగ్బంధంలో బీజింగ్
బీజింగ్: కమ్యూనిస్టు చైనా అవతరించి గురువారంతో 60 వసంతాలు పూర్తికానున్న సందర్భంగా ఆ దేశ రాజధాని బీజింగ్ ఎరుపు రంగు సంతరించుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ దినోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. వేడుకలు జరిగే ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించాయి. బీజింగ్‌లోని ముఖ్యమైన కూడళ్లను దిగ్బంధించారు. తియాన్మెన్‌స్వేర్, ఫర్‌బిడెన్ సిటి, ఇతర చారిత్రక స్థలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలను విస్తృతం చేశారు. గత ఒలింపిక్ పోటీలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచిన చైనా... జాతీయ దినోత్సవాన్ని సైతం అంతే భారీతనంతో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనా తాజాగా రూపొందించిన క్షిపణులు, ఉపగ్రహాలు, అత్యాధునిక రాడార్లు, మానవ రహిత విమానాలు, ఆయుధ పాటవాన్ని వేడుకల్లో ప్రదర్శించి, తన సైనిక సత్తా చాటనుంది. అనంతరం దేశాధ్యక్షుడు హూ జింటావో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 10వేల మంది భద్రతా సిబ్బంది డేగకళ్లతో పహారా కాస్తున్నారు. మరో 8లక్షల మంది వాలంటీర్లు వారికి సహాయసహకారాలు అందిస్తున్నారు. చైనా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి అధికారులతో భారత సైనికాధికారుల బృందం గురువారం బమ్లాలో స్నేహపూర్వకంగా భేటీ కానుంది.
(ఈనాడు, ౦౧:౧౦:౨౦౦౯)
____________________________
Labels: Events
0 Comments:
Post a Comment
<< Home