కంటిముత్యాలు
ఏడుస్తూ పుట్టి ఏడిపించి పోతాడు మనిషి. భాషకన్నా ముందే బాధ పుట్టింది. కన్నీళ్లుకార్చే సౌకర్యం సృష్టిలో ఒక్క మనిషికి మాత్రమే ఉంది. మొసలికన్నీరు మనిషి బాష్పాల వంటిది కాదు. నాకం అంటే న అకం... శోకం లేనిది. లోకంలో దొరికేదంతా దుఃఖమే అంటుంది మహాభారతం. దుఃఖాన్ని పోగొట్టడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సిద్ధార్థుడు, కట్టుకున్న ఇల్లాలికి మాత్రం పుట్టెడు దుఃఖం మిగిల్చాడు! 'చెప్పులు లేవని నీవు దిగులు పడవద్దు, కాళ్లులేని వాళ్లెంతమంది ఉన్నారో చూడు!' అని బైబిలు బోధించినా, మనిషి పుటక పుట్టినవాడు మనసు కలతబారినప్పుడు కంటతడిపెట్టకుండా ఉండలేడు. ఒకడు గాలిబ్‌లాగా బాధ భరియింపలేక బాష్ప జలమోడ్చి దానతానమాడితే, ఇంకొకడు యుద్ధమారంభించకముందే పార్థుడి లాగా విషాదయోగంలో పడిపోతాడు. ఎవడి ఏడుపు వాడిదే! నీటిలో సాగే పడవలోకి నీరు రాకుండా చూసుకున్నట్లే, దుఃఖసాగరంలో కదిలే జీవితంలోకి క్లేశం రాకుండా చూసుకోవాలని పరమహంస ఎంత ప్రబోధించినా- ఉల్లిపాయ వంటి జీవితం పొరల్ని కన్నీళ్లు చిందకుండా వలవాలంటే ఎంత స్థితప్రజ్ఞత కావాలి! బతుకు పుస్తకాన్నెంత భద్రంగా చూసుకుందామనుకున్నా, మామూలు మనిషికి కన్నీళ్ళతో మధ్యలోని పుటలు తడవకతప్పదు. ఒకడు కృష్ణశాస్త్రిలాగా తనకోసం ఏడిస్తే... ఒకడు శ్రీశ్రీలాగా ప్రపంచంకోసం ఏడుస్తాడు. ఏడుపు ఎలాగూ తప్పనప్పుడు ఏడుస్తూ పోవడమెందుకనుకున్నాడో ఏమో- ఓ కవిగారు ఆసుపత్రి పడక మీదున్నప్పుడు తన శ్రీమతి గురించి వాపోతూ 'పెళ్ళప్పుడు నావెంట రమ్మంటే ఏడ్చింది. ఇప్పుడు నావెంట రాలేనందుకు ఏడుస్తున్నది' అని చమత్కరించాడు!
హతో హనుమతా రామః సీతాసాహర్ష నిర్భరారుదంతి రాక్షసాస్సర్వే హాహారామోహతోహతః- రాముడు హనుమంతుని చేత హతుడైతే సీత సంతోషించింది. రాక్షసులందరూ ఏడుస్తున్నారని ఇంకో మహానుభావుడు చెప్పుకొచ్చాడు. హనుమతారామఃని హనుమతా ఆరామః అని విరిచి- ఆరామః అంటే వనం అనే అర్థం చెప్పుకొంటే, పద్యం హృద్యంగా ఉంటుంది. విరుపు వడుపు తెలిసినవాడే కన్నీటి సుడులనుంచీ బైటపడగలిగేది. వందేళ్ల కిందట ఓ పెద్దమనిషి ఆ పొద్దువచ్చిన వార్తాపత్రికలోని తన చావు ప్రకటన చూసి బిక్కచచ్చిపోయాడు. డైనమైట్ అనే విస్ఫోటక పదార్థాన్ని కనుక్కున్నందుకు జరిగిన సన్మానమది! తప్పు తెలుసుకుని శాంతి పురస్కారాలు ఆరంభించిన తరవాతగాని ఆ ఆల్‌ఫ్రెడ్ నోబుల్ బెర్న్‌హార్డ్ మనసు శాంతించలేదు. కన్నీటి రుచి తెలియనివాడు మనిషేకాడు అంటాడు తులసీదాసు. జీవితం చార్లీచాప్లిన్ చిత్రమంత చిత్రమైనది. శోకమొస్తే సోమాలియాలోనైనా సోంపేటలోనైనా మనిషి ఒకేరకంగా శోకాలు పెడతాడు. ఏడ్చి కళ్లు తుడుచుకునేవాళ్లు కొందరైతే, ఎదుటివాళ్ల కళ్లు తుడిచేందుకు తపన పడే థెరెసా లాంటి తల్లులు కొందరు. తృణంకన్నా దట్టమైనది 'చింత' అని ధర్మరాజు చెప్పినదాన్నే, గతమంతా తడిసె రక్తమున... కాకుంటే కన్నీళులలో అని కొత్తగా చెప్పాడు శ్రీశ్రీ. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖ మందనేలా అని అన్నమయ్య సందేహపడితే, ఏటికి జల్లిన నీళ్లాయె నా బ్రతుకు రామచంద్రా అంటూ రామదాసు ఏడుస్తూ గుండె బాదుకున్నాడు. ఫ్రాంకోజర్మన్ మిత్రపక్షాలు పాతగుమెర్నికా రాజధాని బాస్క్‌ని నేలమట్టంచేసిన విషాదానికి పికాసో విపరీతంగా చలించిపోయి ఆ దుండగుల్ని ఎద్దుబొమ్మలుగా గొప్ప కళాఖండం గీసి కసి తీర్చుకున్నాడు. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపుల విచారణలో నిందితుడైన మైఖేల్ జాక్సన్ ఓ అనాథ బాలిక కోసం తయారుచేసిన తన ఆల్బమ్‌ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రసంగానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఉద్వేగం పట్టలేక బహిరంగంగా ఏడ్చేశాడు.
నవరసాలలో కరుణ రసమొకటి. కవివాల్మీకి శోకపూరితుడు కాకపోయుంటే రామాయణ మహాకావ్యమసలు పుట్టి ఉండేదేకాదు! జాన్‌మిల్టన్ 'పేరడైజ్ లాస్ట్', గుండెలను పిండేసే కావ్యం. రవివర్మ గీసిన రావణాసురుడి కత్తివేటుకు రెక్కలు తెగి రక్తమోడే జటాయువు చిత్రం- విషాద ప్రతిఘటన కొక కళాప్రతీక! వానలో తడవనివాడు జీవితంలో ఏడవనివాడు ఉండడు. ఆడదానిలాగా ఏడవడానికి మొగవాడు మొగపడతాడుగాని, నిజానికి ఏ మనిషైనా ఏడాదికి కోటిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటారని కంటిశాస్త్రం చెబుతోంది. పైరెప్ప పడిలేచినప్పుడల్లా కంటిగ్రంథుల్లో నీరూరి కనుపాప మాలిన్యాన్ని కడుగుతుంది. ఏడుపొస్తే కంటిపాపే కాదు గుండెకాయా తేలికై హాయిగా ఉంటుందని వైద్యులు ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు శోకం మానసిక బంధాల్ని మరింత దృఢతరం చేస్తుందని, మనుషులను దగ్గరకు చేరుస్తుందని, ఏడిస్తే నరాలమీది ఒత్తిడి సడలి ఆయుష్షు పెరుగుతుందని, కడుపు మంటకు కన్నీళ్లు మంచి మందని చెబుతున్నారు. నూటికి ఇరవై మంది ఆడవాళ్లు రోజుకు అరగంట తక్కువ కాకుండా కుళాయి వదిలేస్తారనీ, వందకు డెబ్భైఏడు మంది ఇంటిపట్టున ఏడవటానికి ఇష్టపడతారనీ వెల్లడిస్తున్నారు. నలభై శాతంమంది ఏకాంతంలో ఏడుస్తుంటే, ముప్ఫై తొమ్మిది శాతం సాయంకాలాలు ఆరు ఎనిమిది గంటల మధ్య మాత్రమే కుమిలిపోతారట! 88.8శాతం సందర్భాల్లో ఏడ్చిన తరవాత ఎంతో హాయిగా ఉందని ఆ పరిశోధకులు నిగ్గుతేల్చారు. ఉచితంగా వచ్చేది ఉపశమనాన్నిచ్చేది, ఇతరత్రా దుష్ప్రభావాలు లేనిది ఒక్క శోకౌషధమే అంటున్నారు. ఏడుపు ఒక్క ఆడవారి ఆయుధమే కాదు... మగవారికీ మంచి ఔషధం. సాధించటానికే కాక మంచి ఆరోగ్యం సాధించటానికీ శోకం అవసరం అంటున్నప్పుడు- చప్పుడు చేయకుండా ఏడవడమెందుకు? 'బిగ్ బాయ్స్ డోంట్ క్రై' అనే మాట మరిచిపోయి, హాయిగా బిగ్గరగా ఏడిస్తే పోయేదేముంది- కడుపులో మంటతప్ప!
(ఈనాడు, సంపాదకీయం, ౨౦:౦౯:౨౦౦౯)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home