పాపం గాంధీ!
- శంకరనారాయణ
ఏ పాపం చేయని మహాత్ముణ్ని అన్యాయంగా అలా అంటావేమిటి? అనడానికి వీల్లేదు!
'పాపం చేస్తే పశ్చాత్తాపపడవచ్చు... పాపం చేయకపోతే ఆ తరవాత పశ్చాత్తాపపడీ ప్రయోజనం లేదు' అని వెనకటికి కవి పఠాభి నొక్కి వక్కాణించాడు. అయ్యో! పాపం గాంధీ! జాతిపిత కష్టాలు జాతిపితవి. ఇప్పుడు ఆయన్ను తలచుకునేదెవరు, తలచుకోవడానికి మటుకు ఆయన 'చేసింది' ఏముంది? (ఎప్పుడూ) ఏ పదవిలోనూ లేనివాణ్ని ఏ పెదవి పలకరిస్తుంది? ఎందుకు అభిమానం చిలకరిస్తుంది?
'పదవిలేని పాడుబతుకు పగవాడిక్కూడా వద్దు' అని ఊరకే అన్నారా?
మరణానంతరం కూడా తన ఉనికిని తానే కాపాడుకోవాలి. అటువంటివారినే 'కీర్తిశేషులు' అంటారు. పదవీ దీపం ఉండగానే వారసుల్ని చక్కబెట్టుకోవాలి. ఎవరి వారసుల్ని వారే తయారు చేసుకోకపోతే ఇంకెవరికి అవసరం! అది తెలియని గాంధీని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? 'దేశమును ప్రేమించుమన్నా' అంటే ఏం లాభం? సొంతలాభం మాత్రమే గుర్తుపెట్టుకుని 'కోశమును ప్రేమించుమన్నా... ఆస్తిపాస్తులు పెంచుమన్నా' అనుకుని ఉంటే ఎంత బాగుండేది? బినామీ పేర్లతోనైనా నాలుగు రాళ్లు వెనకేసుకుని ఉంటే వారసులు అయినా గుర్తుపెట్టుకుంటారని తాజా రాజకీయ 'అపేక్ష' సిద్ధాంతం గట్టిగా చెబుతోంది. అన్నట్టు సాపేక్ష సిద్ధాంతం ప్రవచించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, బాపూజీ గురించి ఆణిముత్యాల్లాంటి మాటలన్నారు. 'మహాత్మాగాంధీ వంటి వ్యక్తి ఈ భూమ్మీద ఒకప్పుడు ఉండేవారంటే భావితరాలకు నమ్మశక్యం కాకపోవచ్చు' అని ఆయన చెప్పారు. ఇది ఇంకో రకంగా నిజమైంది. ఎటొచ్చీ మరీ తొందరగా నిజమైంది. ఇప్పటి బుడతళ్లకు గాంధీ అంటే మహాత్మాగాంధీ తప్ప ఇతర గాంధీల పేర్లన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పగలుగుతున్నారు! మన నాయకులకే గుర్తులేనప్పుడు ఆ అర్భకులను అని ఏం ప్రయోజనం? ఏ మాటకామాటే చెప్పాలంటే- గాంధీ జయంతికి సెలవు ఇస్తూ ప్రభుత్వం కొంతలోకొంత ఓ మంచిపని చేస్తోంది. లేకపోతే ఏడాదికి ఒకసారైనా గాంధీజీని తలచుకునే అవసరం ఏముంది? ఆ మాటకొస్తే గాంధేయులమని చెప్పుకొనే వాళ్లకూ ఆ అవసరం లేదు.
స్వాతంత్య్ర సమరకాలంలో 'కల్లు మానండోయ్ బాబూ కళ్లు తెరవండోయ్' అనేది గాంధీజీ ప్రబోధంగా ఉండేది. ఆ రోజుల్లో ఇది అందరికీ ప్రమోదంగా ఉండేది. ఇప్పుడలా కాదు. 'మందు కొట్టండోయ్ బాబూ కళ్లు మూయండోయ్' అనేది తాజా నినాదం! మద్యం పద్యం కాకుండాపోయింది. ఇదే 'మనసారా' విధాన 'సారా'ంశమైంది. తాగితే తప్పేముంది అనేవాళ్లూ బడాబడా నాయకులవుతున్నారు! ఐన్స్టీన్ను మరిచిపోవచ్చుగానీ- ఇటువంటి 'వైన్'స్టీన్లను ఎవరు మరిచిపోతారు? 'స్వైన్'ఫ్లూ తిక్కకుదిర్చే మందు ఉంటుందిగానీ- 'వైన్ఫ్లూ' తగ్గించే మందెక్కడుంది? 'మందు'కు మందు కనిపెట్టే మహానుభావుడెక్కడుంటాడు?
గాంధీజీ తన బాల్యంలో 'సత్యహరిశ్చంద్ర' నాటకం చూసి మారిపోయాడంటారు! అదేం గొప్ప- ఇప్పటి నాయకుల్లో అనేకమంది మీద కూడా హరిశ్చంద్రుడి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంది. సత్యహరిశ్చంద్రుడిలా నిజం చెబితే తమ బతుకూ బస్టాండే అనుకుంటున్నారు. అందువల్ల చచ్చినా 'నిజం' చెప్పకూడదని తమ మీద తాము ఒట్టు వేసుకుంటున్నారు. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా లక్ష ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు! పోతన ఇప్పుడు ఉంటే- 'వారిజాక్షులందు వైవాహికములందు' అనే పద్యంలో ఎన్నికలందు అనీ చేర్చి 'పాప విముక్తి'కి మార్గం చెప్పేవారు! సత్యంవద ధర్మంచర అనేది సత్యం'వధ', ధర్మం'చెర'గా మారిపోయింది. అన్నట్టు గాంధీజీ తాను జైలుకు వెళ్లి, ఎంతోమంది 'కృష్ణ జన్మస్థానం' వెళ్లడానికి కారకులయ్యారు! దానివల్ల ఆయనకూ, వాళ్లకూ మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. అలా పేరు ప్రతిష్ఠలు వస్తుంటే జైలుకు వెళ్లడంలో తప్పేం ఉంది? గొప్పేం ఉంది? 'త్యాగం' ఏముంది? ఆయన 'పేరు' చెప్పుకొని 'ఓట్లు' (ప్రజాస్వామ్యం అనే చెట్టు కాయలు) కొంటున్నవారు అనేకమంది నానా కుంభకోణాలకు పాల్పడి పేరు పోగొట్టుకుని అప్రతిష్ఠపాలైనా సరే జైళ్లను 'పావనం' చేస్తున్నారు! ఇంతకన్నా 'త్యాగం' ఏముంటుంది, 'ధనకార్యం' ఏముంటుంది? మానాభిమానంబులు దేహంబునకే కాని, ఆత్మకు అంటనేరవని వెనకటికి ఓ మహారచయిత రచనలో ఉంది!
గాంధీ టోపీ అంటే అందరికీ తెలుసు. దానికి దేశమంతా ఎంతో ప్రచారం. ప్రస్తుత నాయకుల్లో ఎవరో తప్ప అందరూ ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఇతరులకు టోపీ పెడుతున్నారు! ఔరంగజేబు చక్రవర్తి టోపీలు కుట్టి తన జీవనం సాగించాడంటారు. అతగాణ్ని తలచుకుంటేనే జాలి కలుగుతోంది. టోపీలు కుట్టి సంపాదిస్తే ఏ మూలకొస్తుంది? టోపీలు పెట్టి తమ (ప్రజా) జీవనం సాగిస్తున్న గాంధీ వారసులు పుట్టుకొచ్చేశారు!
గాంధీజీ ఆదర్శాలు ఎక్కడికీ పోలేదు. ఆయన్ను తెల్లప్రభువులు అర్ధనగ్న ఫకీర్ అని ఎగతాళి చేశారు. తనను తాను 'దరిద్రనారాయణుడి ప్రతినిధి' నని గాంధీజీ చెప్పుకొనేవారు. అందువల్ల ఆయన 'వారస నాయకులు' దరిద్రనారాయణులను పెంచే పనిలో తలమునకలయ్యారు. గాంధీ జీవితాంతం విలువల రాజకీయాలకు కట్టుబడ్డారు. ఆయన వారసులు దాని 'అర్థం' మార్చేశారు. ఎంతో కొంత 'వెల' ముట్టచెప్పనిదే ఏ పనీ అడుగు ముందుకు కదలదు! చివరికి దేవుడి 'కోవెల'లో అయినా సరే...
రామరాజ్యం అని బాపూజీ కలవరించారు! ఆయన వారసులు 'సంగ్రామరాజ్యం' సాధించారు. ఆయన పుట్టిన రాష్ట్రంలోనే మతానికి మతానికి మధ్య చిచ్చుపుట్టి జనం సతమతమయ్యారు.
గాంధీజీ ఖద్దరు దుస్తులు ధరించాలని చెప్పేవారు. ఖైదీ దుస్తులైనా ధరిస్తాం తప్ప ఖాదీ దుస్తులు ధరించడం తమవల్ల కాదనే వాళ్లూ కనిపిస్తున్నారు!
గాంధీ స్వర్గస్థులయ్యాక 'బరి'స్థితులు మారి 'గాంధీపుట్టిన దేశమా ఇది' అని అందరూ కలవరపడ్డారు. ఆయన మళ్లీ పుడితే 'నేను పుట్టిన దేశమేనా ఇది' అని అనుమానపడవచ్చు. బాధపడవచ్చు! ఆ పాపం ఎందరికో అంటుతుంది. అందువల్ల బాపూ! మళ్లీ పుట్టకు!!
(ఈనాడు, ౦౨:౧౦:౨౦౦౯)
_____________________________
Labels: Personality, satire
0 Comments:
Post a Comment
<< Home