My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, October 31, 2009

సమైక్య జీవనసౌందర్యం


'అనేకానేక అద్భుతాలకు నెలవైన ఈ విశ్వంలో మానవ జన్మకన్నా అద్భుతమైనది మరొకటి లేద'న్నాడు గ్రీకు మేధావి సొఫొక్లిస్‌! అవును. ప్రపంచంలోని అన్ని జీవులకంటే, ఆ మాటకొస్తే- ఉందో లేదో తెలియని వూహాలోకంలో మనం ఉన్నారనుకుంటున్న అమర్త్యుల కంటే- మన కట్టెదుటనున్న జగత్తులోని మర్త్యుడే మిన్న. అతడి ఆవిర్భావం- మహిపై జీవన యవనికమీద విరిసిన హరివిల్లు. 'ఏడూ వర్ణాలు కలిసీ ఇంద్రధనుసవుతాది... అన్నీ వర్ణాలకూ ఒకటే ఇహమూ పరముంటాది...' అని పాటూరించాడు వేటూరి. మనిషి మానసంలోని రాగద్వేషాలు, అతడు అనుభవించే సుఖదుఃఖాలు, అనుభూతించే ఖేదప్రమోదాలు, ఆస్వాదించే ప్రశాంతి, దిగమింగుకునే అశాంతి, పలవరించే బాధామయ గాథలు, పరితపించే విషాదమాధుర్యాలు- ఏడు రంగులై విచ్చుకున్న మహేంద్రచాపం మానవజీవితం. సప్తవర్ణాలవంటి ఆ అనుభూతుల సమ్మిళితమైన విజయహారాన్ని ధరించి, జీవనప్రస్థానం సాగించి, విజేతగా నిలిచిన మనిషే ఇహపరాల సాధకుడవుతాడు. మరే జీవికీ లేని ఈ అనుభూతులు మనిషికి మాత్రమే సొంతం కనుకనే కాబోలు భగవంతుడు కూడా మానవునిగా అవతరించాడు, మహనీయుడనిపించుకున్నాడు. రామునిగా, కృష్ణునిగా, తిరుమలేశునిగా నరుడైన నారాయణుడే- తన ఇతర అవతారాల్లోకంటే ఎక్కువగా ఆరాధనీయుడవుతూ 'దైవం మానుష రూపేణా' అన్న ఆర్యోక్తిని సాకారం చేస్తున్నాడు! 'మనిషిగా పుట్టి దేవుడు మాత్రమేమి బావుకున్నాడు... బాధలు పడుట తప్ప!' అని ఆత్రేయ అని ఉండవచ్చు. కానీ, బాధలు పడటంలోని అనిర్వచనీయమైన ఆనందానుభూతి కోసమే దేవుడు మనిషిగా పుట్టి ఉంటాడు.

'జీవిత మైదానంలో ఆనందం జీవనది'గా అభివర్ణించాడు రచయిత గోపాలచక్రవర్తి. ఒకరితో ఒకరు చెట్టపట్టాలుగా, ఒకరికొకరు చేదోడువాదోడుగా మానవ సమూహాల మహాప్రస్థానం సాగిపోతే- సామాజిక జీవిత మైదానంలోనూ ఆనందం అలలు అలలుగా జీవనదియై ప్రవహిస్తుంది. మనుషుల హృదయాల్లో మానవత్వ పరిమళాల్ని గుబాళింపజేసే మానవీయ సంబంధాల కంటే ఆనందదాయకమైనవి వేరే ఏముంటాయి? మనిషి జననం, జీవనం, జీవితం, చివరికి మరణం... అన్ని దశలూ సామాజిక సంబంధాలతో ముడిపడినవే. అందుకే- 'సంఘం శరణం గచ్ఛామి' అన్న తారకమంత్రాన్ని బుద్ధభగవానుడు ఈ వేదభూమికి ఉపదేశించాడు. బహుముఖాలుగా ఉన్న సమాజం ఏకోన్ముఖంగా, మానవుడు వ్యష్టిగా కాక సమష్ఠిగా కదిలితే సమైక్య జీవనసౌందర్యం సాక్షాత్కరిస్తుంది. సమాజానికి, అందులో అంతర్భాగమైన వ్యక్తులకు తుష్టిని, పుష్టిని సమకూరుస్తుంది. అందుకు కావలసిందల్లా మనుషుల మధ్య సామాజికంగా సంబంధాలు బలపడటమే! సమత, 'సహ'వాసం పొడ గిట్టని ఓ పెద్దమనిషి- 'మీ కుర్రకారువన్నీ వెర్రి పోకడలు. 'సమానత్వం, సమానత్వం' అంటూ కేకలు వేయగానే సరా... మన చేతి అయిదు వేళ్లే సమంగా ఉండవు, అటువంటిది మనుషుల మధ్య సమానత్వం అసలెలా సాధ్యం?'- మెటికలు విరుస్తూ ఆ కొద్దిపాటి నొప్పికే 'అబ్బా' అనుకుంటూ ఓ కుర్రాణ్ని కోప్పడ్డాడు. 'మన చేతి వేళ్లు సమానంగా ఉండవుకానీ, వాటిలో ఏ ఒక్క వేలికి గాయమైనా శరీరానికి కలిగే నొప్పి మాత్రం సమంగానే బాధిస్తుంది మరి' అంటూ చురక అంటించాడు ఆ చిన్నోడు! 'లోకులతో నాకేమిటి, నా లోకమె నాద'నుకునే ఉలిపికట్టె బాపతు మనుషుల్లా కాక, పదిమందితో కలసిమెలసి తిరగడం మనిషిని ఉల్లాసంగా ఉంచుతుంది. మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది. మనిషి ఆరోగ్యానికి ఆ రెండింటినీ మించిన మరో కొండగుర్తు ఏముంటుంది?

మనుషుల ఆరోగ్యం- వారు భుజించే ఆహారం, చేసే వ్యాయామం కంటే, సమాజంలో వారు జీవనాన్ని గడుపుతున్న తీరుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అమెరికా పరిశోధకులూ తాజాగా కనుగొన్నారు. పదుగుర్నీ పలకరిస్తూ సమాజంలోని తమ తోటివారితో పదం కలుపుతూ సన్నిహితంగా మెలిగే మనుషులు- అదిగో అంటే వచ్చి ముసిరే జలుబు, హఠాత్తుగా పంజా విసిరే గుండెపోటు తదితరాల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆ పరిశోధకుల బృందం నాయకుడు ప్రొఫెసర్‌ అలెక్స్‌ ఇస్లాం చెబుతున్నారు. సంఘజీవనంలో మానవులు అన్యోన్య సంబంధాలు కలిగి ఉంటే కలదు సుఖం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
అందరూ విడివిడిగా కాక కలివిడిగా జీవించేలా మానవీయ సంబంధాలకు అంటుకట్టడం మనుషులకు అసాధ్యమేమీకాదు. పరస్పర సంబంధాల సేతు నిర్మాణానికి పేగు బంధమొక్కటే ఆధారశిల కానక్కరలేదు. అందుకు సాటి మనిషీ ప్రాతిపదికయితే చాలు... ఎదుటివారు దుఃఖంలో కుమిలిపోతున్నప్పుడు వారి కన్నీటిని తుడిచే ఓ ఆత్మీయత చాలు... బాధతో పరితపిస్తున్నప్పుడు వారికి ఓదార్పునిచ్చే ఓ చల్లని పలుకు చాలు... కష్టాల్లో కుంగిపోతున్నపుడు వారి వెన్నుతట్టి ఊరట కలిగించే ఓ ధైర్యవచనం చాలు, మనిషికీ మనిషికి మధ్య సామాజిక సంబంధాలు తప్పకుండా మోసులెత్తుతాయి. ఎందుకంటే- శ్రీశ్రీ అన్నట్లు 'ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ ఎంతగా పైపై భేదాలున్నా/ ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/ అంతరంగం అట్టడుగున మాత్రం/ అంతమందిమీ మానవులమే!' ఆర్థికాంశాలు కాక, మానవీయ సంబంధాలే మనిషి హృదయాన్ని శాసించే రోజు రావాలి. కనీసం అప్పుడైనా- వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని దిక్కులేనివారిగా వీథులపాలుజేసే 'సుపుత్రుల' మానసిక అనారోగ్యానికి మందు దొరుకుతుందేమో!


Labels:

0 Comments:

Post a Comment

<< Home