తెలుగు మాటకేదీ పలుకుబడి?
- డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
దేశంలోనే భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సుసంపన్నమైన చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం తెలుగుభాష సొంతం. ఆంధ్రరాష్ట్ర అస్తిత్వానికి కారణమైన అమ్మభాష- కాలం గడుస్తున్నకొద్దీ తెలుగునాట మసకబారుతుండటమే కలచివేస్తున్న అంశం. అటు బోధనలోనూ, ఇటు జనవ్యవహారంలోనూ తెలుగు మాట అప్రాధాన్యాంశంగా మారుతోంది. తెలుగు ప్రాభవం కొడిగట్టడానికి కారణాలెన్నో ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగం, సంస్కృతి, విజ్ఞానాల్లోనూ; ప్రజల వ్యాసంగాల్లోనూ కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం తెలుగుభాషపై పడుతోంది. మనభాషపై సాంస్కృతికంగా సంస్కృతం, పాలనపరంగా అరబిక్, పర్షియన్; శాస్త్ర సాంకేతికపరంగా ఆంగ్లభాషల ప్రభావం ఎక్కువ. ఈ కారణంగా తెలుగులో అన్యభాషల పదాలు వేలకొద్దీ చేరిపోయాయి. ఫలితంగా తెలుగుభాష నిత్య వ్యవహారంనుంచి క్రమంగా పక్కకు జరుగుతోంది.
ఆవిరైపోతున్న అధికార భాష
తెలుగువాడు 'నిద్ర' సంస్కృతంలో లేవడంతో తెలుగు 'కునుకు' కునుకు తీసింది. బ్రష్ చేయడంలో 'పదుంపుల్ల' అరిగిపోయి విరిగిపోయింది. 'పళ్లపొడి' పొడైపోయింది. 'టిఫిన్' దెబ్బకు చద్దన్నాలూ అంబళ్లూ పులిసిపోయాయి. 'లంచ్'లు, 'డిన్నర్'ల దెబ్బకి కూడు కాస్తా నోటికి దూరం అయ్యింది. తెలుగు కూర 'ఫ్రై', 'కర్రీ' అయిపోయింది. సాయంత్రం 'స్నాక్స్'లో పైటన్నం ఎటో కొట్టుకుపోయింది. ఈ వాక్యాలు వినడానికి చమత్కారంగానూ అతిశయంగానూ అనిపించినా ఇవి తెలుగు భాషపై ఆంగ్ల ప్రభావానికి దర్పణం పడతాయి. 'అన్యదేశ్యాలు వాడితే తప్పేముంది? దానివల్ల భాష విస్తృతమవుతుంది కదా' అన్న అభిప్రాయమూ వ్యాప్తిలో ఉంది. అదీ నిజమే. కానీ, అన్యదేశ్యాల వాడకం ప్రాథమిక పదజాలం నశించిపోయేంతగా ఉంటేనే సమస్య. సాధ్యమైనంతవరకూ నూతన పదబంధాలను సృష్టించాల్సిన చోట వాటినే వ్యాప్తిచేయాలి. కుదరని చోట అన్యభాషా పదాలను వాడితే తప్పులేదు. తమిళంలో ప్రాణవాయువు అనే తత్సమపదం 'పిరాణ వాయువు' అనే తద్భవంగా వ్యాప్తిలో ఉంది. తమిళులు దానితో సంతృప్తి చెందక 'ఉయిర్ కాట్రు' అనే దేశ్యపదాన్ని తయారుచేసి వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. మన వాక్యంలో వ్యాకరణం తెలుగులో ఉంటుంది, పదాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాక్యరచన, క్రియలు, నామవాచకాలపై ఆంగ్లప్రభావం మితిమీరడమే దీనికి కారణం. ఈ ప్రభావాన్ని తగ్గించి తెలుగుభాషా వాడకాన్ని పెంచాలంటే మన భాషలో కూడా ఆధునిక వస్తువులకు ప్రత్యామ్నాయంగా అదే అర్థం స్ఫుర్తించే విధంగా నూతన పదబంధాలను సృష్టించాలి.
ఏ అంశాన్నయినా ఆంగ్లంలో చెప్పడమే నవనాగరకతగా చెలామణీ అవుతోంది. వ్యవహారంలో ఉన్న ఆంగ్లపదాలకు సరైన ప్రత్యామ్నాయాలు తెలియకపోవడంవల్ల ఆంగ్లపదాల సంఖ్య తెలుగులో అధికమవుతోంది. దీనివల్ల మన భాషలో రాటుదేలిన పదజాలమంతా క్రమంగా మసకబారిపోతోంది. ఏదైనా కొత్తపదం ఆంగ్లంనుంచి తెలుగులోకి ప్రవేశించినప్పుడు ఆ పదాన్ని అలాగే వాడుతున్నారు. ఇరుభాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఆ ఆంగ్లపదానికి సరైన ప్రత్యామ్నాయ తెలుగుపదాన్ని అన్వేషించేందుకు కృషి చేయడం లేదు. మరోవైపు- కొన్ని సందర్భాల్లో అదే ఆంగ్లపదం సామాన్యజన వ్యవహారంలో సొంతభాషలోనికి మారుతుంటుంది. దొంగోడ, డబ్బిళ్ల, తవ్వోడ, గ్యాసుబండ వంటివి ఎంతో సహజంగా మూలానికి దగ్గరగా ఉంటూ తెలుగుతనాన్ని పుణికిపుచ్చుకున్నాయి. వీటి సృష్టికర్తలు సామాన్యులే. ఇలాంటివారు కొత్తపదజాలాన్ని సృష్టిస్తే దాని ప్రామాణికత ఎంత అన్న సందేహం వెన్నాడుతూనే ఉంటుంది. ఇక తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాలు చేసిన కొద్దిపాటి కృషి ప్రజలకు సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు.
మాతృభాషలో బోధనాభ్యాసాలు చేస్తే మిగిలినవారికంటే వెనుకబడిపోతామన్న అపోహలు సైతం తెలుగుభాష వెనుకబాటుకు కారణమవుతున్నాయి. జపాన్, రష్యా, చైనా ప్రజలు పూర్తిగా మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అంతర్జాతీయంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాలు ఎంత ముందంజలో ఉన్నాయో తెలిసిందే. ఆంగ్లభాషను విడిచిపెట్టాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. రష్యన్లు ఆంగ్లాన్ని రష్యన్ భాషలోనూ, చైనీయులు చీనీ భాషలోనూ అభ్యసిస్తున్నారు. కానీ తెలుగునాట మాత్రం మాతృభాషను సైతం ఆంగ్లంలోనే నేర్చుకునే దురవస్థలో కొందరు మగ్గుతున్నారు. భారతీయ భాషలన్నీ పదసంపదలో సుసంపన్నాలు. వాడుకలో లేకపోవడంవల్లే ఈ భాషలు వెనుకబడిపోతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన తరుణమిది. ఆంగ్లభాషపై వ్యామోహంతో శాస్త్రసాంకేతిక విద్యాబోధనకు తెలుగు పనికిరాదని చేసే వాదనలో అర్థం లేదు. వాడుకలోకి తీసుకువస్తే ఆధునిక విజ్ఞానాన్ని అలవోకగా అందించగల శక్తి మాతృభాషకు ఉంది.
తెలుగుభాషను పరిరక్షించి, పరిపుష్టం చేయాలంటే కాలానుగుణంగా వచ్చి చేరే అన్యదేశాలకు సమానార్థకాలను సృష్టించుకోవడం తక్షణావసరం. శాస్త్రీయ అంశాలతోపాటు, వ్యవహార భాషకు సంబంధించీ సమానార్థక పదాలను తయారుచేసుకోవాలి. విద్యావిషయిక పారిభాషిక పదకల్పనలో తత్సమపదాలకే ప్రాధాన్యం ఎక్కువ. అది అనివార్యమే కాదు, సౌలభ్యం కూడా. వివిధ శాస్త్రాలకు సంబంధించిన పారిభాషిక పదాలు సులభగ్రాహ్యం కావని; వాటికన్నా ఆంగ్లపదాలే సులభంగా ఉన్నాయన్న వాదన ఒకటి ఉంది. శాస్త్రం బుద్ధిగ్రాహ్యం కాబట్టి కష్టంగా ఉన్నప్పటికీ తత్సమపదాలను ఉపయోగించాల్సిందే. కానీ- నిత్యవ్యవహారంలోని అన్యభాషాపదాలకు సాధ్యమైనంతవరకు అచ్చతెలుగు పదాలతో సమానార్థకాలను సృష్టించుకోవడం మంచిది. తొలినాళ్లలో పత్రికలు, అకాడమీలు, కొన్ని విశ్వవిద్యాలయాలు పెద్దయెత్తున ఈ కృషి చేశాయి. కాలం గడుస్తున్నకొద్దీ కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు, విద్యలు రంగప్రవేశం చేశాయి. వీటికి సంబంధించిన సాంకేతిక పారిభాషికపదాలకు తెలుగు పదాలను సృష్టించుకోవడంలో ఎక్కడలేని అలసత్వం కనిపిస్తోంది. అన్నిరంగాల పారిభాషిక పదాలకు మారుగా తెలుగులో పదకల్పన చేయమనడం ఇక్కడ ఉద్దేశం కాదు. సాధ్యమైనంతమేరకు, ఆయా సాంకేతిక పదాలకు ప్రాంతీయ భాషల్లో సమానార్థకాలను తయారుచేసుకోవడం తప్పుకాదు. దీని సాధ్యాసాధ్యాలపై పెద్దయెత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా భాషను తీర్చిదిద్దాల్సిన బాధ్యత భాషాశాస్త్రవేత్తలపై ఉంది. ఆంగ్లపదాలను ఉపయోగించక తప్పని పరిస్థితుల్లోనూ- గట్టి ప్రయత్నం చేస్తే దేశయంగా నూతన పదబంధాలను సృష్టించడం అసాధ్యమేమీ కాదు. ఇది మొండిగా అన్యభాషాపదాలను తిరస్కరించే ఛాందసవైఖరిగా మాత్రం మారకూడదు. రామ్ మనోహర్ లోహియా అన్నట్లు కేవలం రెండున్నర లక్షల పదసంపద ఉన్న ఆంగ్లంలో కంటే- ఆరు లక్షల పదాలున్న తెలుగులో భావవ్యక్తీకరణ సులభం. అందుకే ఆంగ్లపదాలకు మారుగా నూతన పదనిర్మాణం జరగాలి. ఇది తెలుగు అస్తిత్వాన్ని విస్తరింపజేసే ప్రయత్నంలో భాగం.
నూతన ఆంగ్ల పద నిర్మాణ ప్రక్రియ ఏ భాషకైనా ప్రాణావసరమే. 'ఆక్స్‌ఫర్డ్' నిఘంటువును అయిదేళ్లకోసారి పునర్నిర్మిస్తుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా అన్యదేశ్యాలను చేర్చడం; కొన్నింటికి కొత్త పదాలను కల్పించడం; భాషావ్యవహారంలో పదాలకు జతపడుతున్న కొత్త అర్థాలను స్వీకరించడం వంటివాటిని చేస్తుంటారు. తెలుగులో ఆంగ్లభాషాపదాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సమానార్థక పదాలను సృష్టించుకోవడంలో ప్రయత్నలోపం తప్ప మరే కారణమూ కనిపించదు. తొలుత తెలుగులో మహానిఘంటు నిర్మాణం జరగాలి. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నించాలి. తెలుగులో మహానిఘంటువు ఏర్పడితే కనీసం పదేళ్లకు ఒకసారయినా దాన్ని సవరించుకోవచ్చు.
కొత్త పదాలకు శ్రీకారం
గతంలో సమానార్థక పదసృష్టి ఓ నియమంగా జరిగేది. అర్థాన్ని బట్టి మన భాషలో ఒక పదాన్ని స్థిరపరచుకొని వాడేవారు. ఇప్పుడు శీర్షికల్లోనూ ఆంగ్లపదాలే దర్శనమిస్తున్నాయి. తొలినాళ్లలో సమానార్థక పదనిర్మాణానికి మన పత్రికా సంపాదకులు కొన్ని విధానాలను అనుసరించేవారు. తమిళ ఆకాశవాణిలో ప్రతిరోజూ కొత్తపారిభాషిక పదాలకు సంబంధించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. కిందటిరోజు ఆంగ్లపత్రికలో వచ్చిన కొత్త పారిభాషిక పదాలకు తమిళంలో సమానార్థకాలను తయారుచేసి ప్రసారం చేస్తారు. ఆ రకంగా వాటిని ప్రజల నిత్యజీవన వ్యవహారంలో భాగం చేస్తారు. ఇంగ్లిషు మాటలను ఉపయోగించకుండానే రాసేందుకు హిందీ, తమిళం, కన్నడ వంటి భాషాపత్రికల్లో విలేకరులు ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు ఇటీవల స్వైన్‌ఫ్లూ జ్వరానికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఆ పదాన్ని మన పత్రికలు యథాతథంగా వాడాయి తప్ప కొత్తపదాన్ని సృష్టించలేదు. కన్నడిగులు దాన్ని 'హందిజ్వర' అని తమభాషలోకి తర్జుమా చేసుకున్నారు. స్వైన్‌ఫ్లూ వంటి పదానికి అనువాదం దొరకడం కష్టమే. చక్కటి కొత్తపదాన్ని తయారుచేసినప్పుడు అది వాడుకలో చేరిపోతుంది. రామాయణం, మహాభారతం వంటి ఉద్గ్రంథాలను తెలుగు చేసుకోగలిగిన మనకు- నేటి అవసరాలను తీర్చే మాటలను కూడగట్టుకోవడం అసాధ్యమేం కాదు. కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రికను వారపత్రికగా స్థాపించిన తరవాత 1938లో పారిభాషిక పదకోశాన్ని నిర్మించారు. ఆ మాటలను కందుకూరి వీరేశలింగం 'వివేకవర్థిని'ద్వారా, కొండా వెంకటప్పయ్య కృష్ణాపత్రిక ద్వారా ప్రచారం చేశారు. నైట్రోజన్‌కు నత్రజని, నికిల్‌కు నిఖలం, ఆక్సిజన్‌కు ప్రాణవాయువు, ఫొటోసింథసిస్‌కు కిరణజన్య సంయోగక్రియ అని తెలుగు చేసింది కాశీనాథులవారే.
సుసంపన్నమైన భాష- జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు, కీర్తి ప్రతిష్ఠలకు ప్రతీక. అపారమైన ప్రేమాభిమానాలుంటే అమ్మభాషను రక్షించుకోవడం, కొత్త దిశలకు విస్తరింపజేయడం అసాధ్యం కాదు. జనబాహుళ్యంలో సువ్యాప్తమైన భాషను ప్రభుత్వం అక్కున చేర్చుకుని ఆదరించాలి. ప్రభుత్వం అండగా నిలిచి, పాలన వ్యవహారాల్లో చోటు కల్పించినప్పుడే తెలుగుకు భద్రత, గౌరవం. భాష సామాజిక ఆస్తి. ఈ భావన తమిళుల్లో బలంగా వేళ్లూనుకుని ఉంది. తమిళనాడులో 'తిరుక్కురళ్' చదవనిదే ఇప్పటికీ ఏ సభా ప్రారంభం కాదు. 'మాతృభాష మనకి కళ్లు... ఆంగ్లభాష కళ్లజోడు' అని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అంటుంటారు. గుండెల్లో అంతటి అభిమానం ఉండబట్టే తల్లిభాషలోకి అన్యభాషాపదాల చొరబాటును తమిళులు అంగీకరించలేకపోతున్నారు. ఎంత మమకారం పెంచుకున్నా పరభాష ఏ రకంగానూ తల్లిభాషకు సాటికాదు, రాదు!
(ఈనాడు, ౦౧:౧౧:౨౦౦౯)
____________________________
Labels: Telugu language
0 Comments:
Post a Comment
<< Home