My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, February 28, 2010

కాలజ్ఞానం

'కన్ను తెరిస్తే జననం- కన్నుమూస్తే మరణం- రెప్పపాటేగదా ఈ ప్రయాణం!' అన్నాడొక కవి. నిజానికి కంటిరెప్ప కొట్టుకోవడానికి జీవితకాలం అక్కర్లేదు. 'కాలపత్రంమీద కాలాతీత సిరాతో రాసినప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి' అని ఆచార్య గోపి ఎంత గొప్పగా చెప్పినా అసలు చిత్రమంతా ఉన్నది అనంతంనుంచి అనంతంలోకి నిరంతరంగా సాగే కాల జీవప్రవాహంలోనే! మనిషి అందులోని ఓ అల... అతని జీవితకాలం ఆ అల లేచిపడినంత. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం రానంతవరకూ కాలం ఓ అంతుబట్టని వింత! మహాభారతంలో యక్షుడు 'సూర్యుడిని నడిపించేదెవరు?' అని అడిగినప్పుడు ధర్మరాజు సమాధానంగా చెప్పిన 'బ్రహ్మం' అంటే ఈ 'కాలం' అనే భావం. పెను విస్ఫోటన (బిగ్‌బ్యాంగ్‌) సిద్ధాంతం ప్రకారం- కాలం విశ్వంతోసహా పుట్టినది, విశ్వమున్నంత వరకూ ఉండేది. 'కాలం అతిక్రమించలేనిది' అంటుంది వాల్మీకి రామాయణం. కురుక్షేత్ర యుద్ధసమయంలో సాక్షాత్‌ శ్రీకృష్ణపరమాత్ముడంతటివాడూ, అస్తమించే సూర్యుడిని ఆపలేక సుదర్శనచక్రాన్ని అడ్డుపెట్టాడు! కాలం మనిషికి అయాచితంగా దక్కిన వరం. కోరకుండానే దొరికిన పెన్నిధి. 'టైమ్‌ ఈజ్‌ మనీ' అనటం సరికాదు. సమయమనేది నిధి మాదిరి పోగేయలేనిది. బదిలీకి కుదరనిది. తిరిగిరానిది. గడియారాన్ని కొనగలంగానీ, దానిలోని కాలాన్ని కొనగలమా? జ్ఞానార్జనకోసం తననాశ్రయించిన చంద్రునితో బృహస్పతి 'నిజానికి నాకన్నా నీవే జ్ఞానివి నాయనా!' అంటాడు. తనవద్దలేని యౌవన విజ్ఞానం చంద్రుని వద్ద ఉందని రుషి భావం.

'కాలమనేది లేకపోతే అన్ని పనులూ ఒకేసారి చేయాల్సి వచ్చేది. ఎంత ఇబ్బంది?' అని చమత్కరించాడు బెర్నార్డ్‌ షా. కాలం విలువ ఒక్కొక్కరికి ఒక్కోవేళ ఒక్కోరకంగా ఉంటుంది. ఏడాది విలువ పరీక్ష పోయినవాడికి తెలుస్తుంది. నెల విలువ నెలతక్కువ బిడ్డను కన్నతల్లికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? 'వారం' వారపత్రికలకు సర్వం. రోజు అనేది రోజుకూలీకి ఉపాధి. గంట అంటే పరీక్ష రాసే విద్యార్థికి, నిమిషమంటే ఆంబులెన్సులోని రోగికి బాగా తెలుస్తుంది. ఒలింపిక్స్‌ పరుగుపందేల్లో సెకండులో వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు! వూరునుంచి వూరికి పోతూ దారిలో కారులోనే వీలున్నంతవరకు ఓ కునుకు లాగించే గాంధీగారి అలవాటు వెనక ఎంతో 'కాలప్రణాళిక' ఉండేది. పరీక్ష ముందు పెట్టి పాఠం, తరవాత నేర్పే వింత గురువు- కాలం. మామూలు మనిషికి కాలం సాపేక్షికత ఓ పట్టాన అర్థం కాదు. వివరంగా చెప్పమని వేధించేవారికి ఐన్‌స్టీన్‌ 'ఇష్టమైన వారికోసం ఎదురుచూసే వేళ క్షణమొక యుగం... వారు ఎదురుగా ఉన్నవేళ యుగమొక క్షణంగా గడవటమే సాపేక్షికత' అని సరదాగా ఉదాహరించేవాడు. ఇరవై ఏళ్ల వయసులో రోజుకు ఇరవైనాలుగు గంటలున్నా చాలని కాలం, అరవైల్లో గంటకు అరవై నిమిషాలున్నా గడవటం భారంగా అనిపించటమే సాపేక్షికత అంటారు 'థియరీ ఆఫ్‌ ఎవ్విరిథింగ్‌' నిర్మాత స్టీఫెన్‌ హాకింగ్‌.

'జారిపోయే ప్రతిక్షణాన్నీ మాలిమి చేసుకోవడంలోనే మనిషి నిజమైన ప్రజ్ఞ దాగి ఉంది' అంటున్నారు వ్యక్తిత్వ వికాసవేత్తలు. ఓ గంట హాయి కావాలంటే కునుకుతీయి. రోజంతా సుఖంగా ఉండాలంటే కొత్త ప్రదేశానికి వెళ్లు. ఏడాదంతా ఏ దిగులూ వద్దంటే ఏదైనా బ్యాంకులో నీ సంపాదన దాచుకో. అదే జీవితాంతం ఆనందంగా గడవాలంటే ఇరుగుపొరుగుతో కలిసిపో అంటుంది చైనా సూక్తి. 'ఆపన్నులనాదుకుంటే ఆ దేవుడి విలువైన సగం సమయాన్ని ఆదా చేసినట్లు' అంటారు మదర్‌ థెరెసా. 'చేద్దాంలే... చూద్దాంలే అనుకోవద్దు. 'మనిషి జీవితకాలం 60 ఏళ్లేగాని వాస్తవంగా చూస్తే 13 ఏళ్లే' అంటున్నారు 'ది రోడ్‌లెస్‌ ట్రావెల్‌' రచయిత స్కాట్‌పెక్‌. చదువు సంధ్యలకు పాతికేళ్ళు, పనిపాటలకు రోజుకు ఎనిమిది గంటల చొప్పున పన్నెండేళ్ళు; స్నానపానాలు, ఆహారవిహారాలు, ఒంట్లో బాగోలేకపోవడం వంటివాటికి మరో పదేళ్ళు పోగా- మిగిలేది 13 ఏళ్లే! మనం చేసే పనిలో ప్రతి ఎనిమిదేసి నిమిషాలకు, ఐదు నిమిషాలకు తక్కువలేకుండా రోజుకు కనీసం ఏడుసార్లు ఆటంకాలు ఏర్పడతాయని టైం మేనేజ్‌మెంట్‌ నిపుణులు అంటున్నారు. రోజూ ప్రయాణానికి అరగంట, సెల్‌ఫోన్‌లో పనికిరాని మెసేజ్‌లు చదివి తొలగించటానికి పావుగంట, టీవీ రిమోట్‌ వాడకానికి పావుగంట. అన్నింటికన్నా ముఖ్యం- అయినదానికీ కానిదానికీ అనవసరంగా వాదించి ఓడిపోవటానికో, ఓడించి ఎదుటివాడి సమయాన్ని పాడుచేయటానికో 37 నిమిషాలు మనిషి వృథాగా వాడుతున్నాడని వాళ్ళు వాపోతున్నారు. ఆవులింతకు ఆరుసెకన్లు పడుతుందని ఆపుకోలేంగానీ, ఈ అనవసరమైన కాలయాపనను అదుపు చేసుకోలేమా? 'సమయాన్ని సమయానుకూలంగా, తనకిష్టమైన రీతిలో ప్రతిభావంతంగా వాడుకునే సాధనలో సాధించే విజయమే మనిషి నిజమైన సంపద' అంటున్నారు 'రిచ్‌ డాడ్‌-పూర్‌ డాడ్‌' రచయిత కియోసాకి.
'నిన్న' చెల్లని చెక్కు, 'రేపు' చేతికిరాని డబ్బు. నేడనేదే మనం నిజంగా వాడుకునే చిల్లర! చిల్లరమల్లరగా దీన్ని వాడుకోరాదనే దానికి మించిన కాలజ్ఞానం మనిషికి ఇంకేముంటుంది?
(ఈ నాడు, సంపాదకీయం, ౦౬ :౧౨ :౨౦౦౯ )
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home