My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, November 01, 2009

ఇది తెలుగు 'ముద్ర'

ఎవరెవరు పాలించారు? ఎన్ని యుద్ధాలు చేశారు?ఎంతమందిని పెళ్లాడారు?ఎన్నిటన్నుల కస్తూరి పూసుకున్నారు? ...ఏజాతి చరిత్ర చూసినా ఆ వోతలే, ఆ రాతలే! ఆ సమాచారమంతా పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా పనికొస్తుంది. బట్టీపట్టడానికి భలే అనువుగా ఉంటుంది.ఆ చరిత్రలు మనకొద్దు. ఆ భజనలు మనం చేయం. తెలుగుజాతికి ఆ అవసరంలేదు. మనక్కావలసింది భుజంతట్టినట్టు స్ఫూర్తినింపే చరిత్ర. కాగడా పట్టినట్టు దారిచూపే చరిత్ర. అంజనం వేసినట్టు అవకాశాలు వెతికిచూపే చరిత్ర. తొడపాశం పెట్టినట్టు హెచ్చరించి మేల్కొలిపే చరిత్ర. ఎన్ని దేశాలకు విస్తరించాం, ఎన్ని ఖండాల్లో జెండాలు పాతాం, ఎన్ని ఆవిష్కరణలు చేశాం, ఎన్ని ఘనతలు సొంతం చేసుకున్నాం... ఆ వివరాలే కావాలిప్పుడు. ఆ బౌద్ధిక జైత్రయాత్రల్నే సగర్వంగా తలుచుకోవాలిప్పుడు. 'ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం' సందర్భంగా... జాతీయంగా అంతర్జాతీయంగా 'టెలుగు ముద్ర'ల్ని వెతుక్కునే చిన్న ప్రయత్నం...

-------------------
మన జెండా
జాతీయ పతాకం









ఎగురవే ఎగురవే...
ఎగురవే జెండా!
ఎంతెత్తు ఎగిరినా...
ఎదురు ఏమున్నదే!
ఎర్రకోట మీద సగర్వంగా
రెపరెపలాడుతున్న ఆ మువ్వన్నెల జెండా...స్వతంత్ర భారతికి తెలుగువారు పెట్టిన పసుపుకుంకాల చీర!
మన 'తిరంగా' యాదృచ్ఛికంగా ఏం పుట్టలేదు. దాని వెనుక పింగళి వెంకయ్యగారనే మహానుభావుడున్నారు. 1916లోనే మనకంటూ ఓ జెండా ఉండాలన్న ఆలోచన వచ్చిందాయనకి. ఆ ప్రయత్నంలో దేశదేశాల పతాకాలు పరిశీలించారు. జెండాల చరిత్రలు అధ్యయనం చేశారు. రంగుల భావాలు అర్థంచేసుకున్నారు. ఐదేళ్లపాటు అదే ప్రపంచంగా బతికారు. 1921లో జరిగిన బెజవాడ కాంగ్రెస్‌ సమావేశంలో అధికారిక పతాకం గురించి చర్చ జరిగింది. అప్పుడే వెంకయ్యగారు తన ఆలోచనల్ని మహాత్ముడి ముందుంచారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో జెండా తయారుచేశారు. గాంధీజీ దానికి తెలుపు జోడించారు. మరో పెద్దమనిషి సామాన్యుడి వికాసానికి గుర్తుగా చరఖా పెడితే బావుంటుందన్నారు. వెంకయ్యగారు ఆ సూచనలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకో జెండా తయారు చేశారు. కరాచి సమావేశంలో, చరఖా ఉన్న మువ్వన్నెల జెండాకు వర్కింగ్‌ కమిటీ ఆవోదం లభించింది. రాజ్యాంగ నిర్మాణసభ చిన్నచిన్న మార్పులతో కాంగ్రెస్‌ జెండానే భారత జాతీయ జెండాగా స్వీకరించింది. అశోకచక్రమున్న త్రివర్ణపతాకం పంద్రాగస్టున దేశమంతా రెపరెపలాడింది.
'ఈ జెండా తెలుగుబిడ్డ తయారుచేసిందే...' అనుకోవడంలో గొప్ప ఆనందముంది.

---------------------
బంగారు బసవన్న
ఒంగోలు గిత్త


మనం కారో బైకో కొంటున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం! డిజైన్‌ చూస్తాం, మైలేజీ చూస్తాం, మెయింటెనెన్స్‌ చూస్తాం, రంగు చూస్తాం. పరమశివుడు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకునుంటాడు. అందుకే, ఏరికోరి ఒంగోలు ఎద్దునే వాహనంగా ఎంచుకున్నాడు. కావాలంటే, లేపాక్షి బసవన్నను చూడండి. మీఊరి శివాలయంలోని నందిని చూడండి. అచ్చంగా ఒంగోలు గిత్తలాగే ఉంటాయి.
ఒంగోలు జాతి పశువులు బలంగా ఉంటాయి. అంతెత్తు ఆకారం. కళ్లు తిప్పుకోనివ్వనంత అందం. ఒళ్లుదాచుకోకుండా పనిచేస్తాయి. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుని నిలబడతాయి.
రోగనిరోధకత ఎక్కువ. ఆ పనితనానికి విదేశీయులూ పడిపోయారు. ఒక్క బ్రెజిల్‌లోనే ఇరవై లక్షల ఒంగోలు పశువులున్నాయి. అమెరికాలో ఒంగోలు గిత్తల సాయంతో 'బ్రహ్మన్‌' అనే సంకరజాతిని సృష్టించారు. 1906 ప్రాంతంలోనే ఒంగోలు పశువుల ఎగుమతి ప్రారంభమైంది. హాలెండ్‌, మలేసియా, బ్రెజిల్‌, అర్జెంటీనా, కొలంబో, మెక్సికో, పోర్చుగల్‌, ఇండొనేషియా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా...మన ఒంగోలు గిత్తలు ప్రపంచమంతా వ్యాపించాయి.
హాలెండ్‌లోని ఓ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 'పోతురాముడు' అనే ఒంగోలు గిత్త విగ్రహం పెట్టారట! ఐదేళ్ల క్రితం, బ్రెజిల్‌ మూడులక్షల రూపాయలకు ఒకటి చొప్పున రెండు గిత్తల్ని కొనుక్కుని వెళ్లింది. యాంత్రికీకరణ పెరిగాక చాలా దేశాలు ఒంగోలు పశువుల్ని సేద్యానికి వాడుకోవడం మానేశాయి. మాంసం కోసం పెంచుతున్నాయి. ఈధోరణి ఒంగోలు పశువుల్ని ప్రేమించేవారికి బాధ కలిగిస్తోంది. ఇక, బక్కపలచ తెలుగు రైతన్న ఒంగోలు గిత్తల్ని పోషించలేనని ఎప్పుడో చేతులెత్తేశాడు. భూస్వాములేవో ట్రాక్టర్ల సేద్యానికి అలవాటుపడ్డారు. దీంతో సొంతగడ్డమీదే ఆ జాతి కనుమరుగు అవుతోంది.

---------------------
మహాప్రసాదం!

తిరుపతి లడ్డు


ఓసీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి పదవీగండం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ఖాకీబాసు తిరుపతి లడ్డూలు పట్టుకుని ఓ కీలకనేత దర్శనానికెళ్లారు. అనుకున్నట్టే, రెండ్రోజుల్లో దొరగారి పదవి వూడింది. కానీ, బొత్తిగా పన్లేని సీట్లో కూర్చోబెట్టకుండా, కాస్త గౌరవప్రదమైన బాధ్యతే కట్టబెట్టారు. తిరుపతి లడ్డూ రాయబారం పనిచేసిందన్నమాట!

తిరుపతి లడ్డూలు చేతిలో ఉంటే తిరుగే ఉండదు. సీఎం పేషీకెళ్లినా ప్రైమ్‌మినిస్టర్‌ ఆఫీసుకెళ్లినా పనులు చకచకా జరిగిపోతాయి. ఇక అమెరికాకెళ్తే, సాక్షాత్తు శ్రీవేంకటేశుడే వచ్చినంత సంబరపడిపోతారు ప్రవాస సోదరులు. అంత కమ్మగా ఉంటాయి కాబట్టే శ్రీనివాసుడు ఏరికోరి వండించుకుంటున్నాడో, శ్రీనివాసుడికి నివేదించడంవల్లే ఆ కమ్మదనం వచ్చిందో తెలియదు కానీ...లడ్డూలంటే తిరుపతి లడ్డూలే! ఆ రుచి నాలుకని తాకగానే అప్రయత్నంగా కళ్లుమూసుకుంటాం. అది భక్తి కావచ్చు, తీపంటే అనురక్తీ కావచ్చు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే తిరుపతి లడ్డూ!

1940 ప్రాంతంలో కల్యాణోత్సవాలు వెుదలైనప్పుడే...లడ్డూ ప్రసాదం పుట్టింది. తిరుపతి లడ్డూ తయారీకి కచ్చితమైన పద్ధతంటూ ఉంది. ఏయే దినుసుల్ని ఎంతెంత పరిమాణంలో వాడాలో తెలియజేసే 'దిట్టం' ఉంది. కాలానికితగినట్టు దానికీ మార్పులు చేస్తున్నారు. తొలిరోజుల్లో కట్టెల పొయ్యిమీద ప్రసాదం తయారు చేసేవారు. మెల్లగా యంత్రాలు ప్రవేశించాయి. రుచిలోనూ నాణ్యతలోనూ ఎంతోకొంత తేడా వచ్చింది. అయినా, తిరుపతి లడ్డూలకు తిరుగులేదు. పేటెంటు పుణ్యమాని ఆ విశిష్టత రికార్డులకెక్కింది.

-----------------------
ఆంధ్రుల 'అమృతం'

అమృతాంజనం


ఒకప్పుడు 'ముక్కోటి ఆంధ్రుల'మని కాలరెగరేసి చెప్పుకునేవాళ్లం. ఆ మాటల్లో 'మేం ముక్కోటి దేవుళ్లకు సరిసమానమండోయ్‌!' అన్న అతిశయమూ వినిపించేది. అయినా ఆ దేవుళ్లు, తెలుగువాళ్లకంటే ఎందులో గొప్ప! ఇన్నేళ్లలో దేవతల జనాభా పెరిగిన దాఖలాల్లేవు. మరి మనవో, పదికోట్లు దాటిపోయాం. వాళ్లు అమృతం సృష్టిస్తే, మనం అంతకంటే రెండక్షరాలు ఎక్కువున్న అమృతాంజనం సృష్టించాం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి హృదయసాగర మథనంలోంచి పుట్టిందా దివ్యాంజనం. దేవుళ్లు తమ్ముళ్లను నొప్పించి అమృతం లాగేసుకుంటే, మనం తోటివాళ్ల నొప్పులు తగ్గించడానికి అమృతాంజనాన్ని దేశమంతా విస్తరించాం. ఇప్పుడది ఖండాంతరాలకు పాకిపోయింది. యూరప్‌ దాకా వెళ్లింది. అమెరికాలోనూ దొరుకుతోంది. మధ్యప్రాచ్యంలో బోలెడంత గిరాకీ ఉందట.
అటూఇటుగా అమెరికాలో 'విక్స్‌ వెపొరబ్‌' పుట్టినప్పుడే ఆంధ్రదేశంలో అమృతాంజనం పుట్టింది. 1893లో ప్రాంతంలో పంతులుగారు బొంబాయి కేంద్రంగా వ్యాపారం ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఉత్తరదక్షిణాలన్న తేడాలేనంతగా గిరాకీ పెరిగింది. నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం వ్యాపారంలో లక్షలు గడించారు. కానీ నయాపైసా దాచుకోలేదు. ఉన్నదంతా దేశం కోసమే ఖర్చుచేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన 'ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది. తొలిరోజుల్లో బ్రిటిష్‌
వ్యతిరేక సభల్లో, హర్తాళ్లలో అమృతాంజనం సీసాలు ఉచితంగా పంచేవారట. అలా...తలనొప్పినే కాదు, తెల్లవాళ్లనూ తరిమేసింది తెలుగువారి అమృతాంజనం.

----------------------
నెమలికి నేర్పిన నడక...

కూచిపూడి నృత్యం


'భామనే సత్యాభామనే... తన్మయంగా పాడుకుంటూ, దర్పంగా జడూపుకుంటూ, వయ్యారంగా నడుమూపుకుంటూ సత్యభామాదేవి నడుస్తూనే ఉంది. కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామం నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక...ప్రపంచమంతా!
గత ఏడాది అమెరికాలోని క్యూపర్టినోలో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం జరిగితే, వేలమంది నృత్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వైభోగమంతా చూసుంటే, కూచిపూడి రూపకర్త సిద్ధేంద్రయోగి ఎంత మురిసిపోయేవారో! పదిహేనో శతాబ్దంలో, సిద్ధుడు గజ్జెకట్టి ఆడిన రోజుల్లో ఇంత వైభోగం లేదు. ఇంత ప్రచారం లేదు. ఇంత ప్రోత్సాహం లేదు. కూచిపూడి భాగవతులకు గ్రామబహిష్కారం విధించిన అనుభవాలున్నాయి. కూచిపూడిని అసలు నాట్యమే కాదన్న దాఖలాలున్నాయి. ఆడవారు ఆడకూడదన్న వివక్షలున్నాయి. ఆ బంధనాలన్నీ తెంచుకుని...తెలుగువారి కూచిపూడి అంతర్జాతీయ కూచిపూడిగా ఎదుగుతోంది. భామాకలాపమైనా, అర్ధనారీశ్వరమైనా, శాకుంతలమైనా, యుద్ధము-శాంతి అయినా...ప్రపంచంలో ఎక్కడ ఏ వేదిక మీద కూచిపూడి ప్రదర్శన జరిగినా కుర్చీలు నిండుతాయి. చప్పట్లు వోగుతాయి. ఇంతకు మించి కావలసినదేముంది?
కూచి
పూడీ బహుపరాకు!
తెలుగుజాతీ బహుపరాకు!

--------------------
సాహితీ సమరం

అవధానం

యుద్ధమంటే అదీ! అటు అవధానీ ఇటు పృచ్ఛకులూ సాహితీ సుమాయుధాలతో సిద్ధమవుతారు. గణపతి స్తోత్రంతో యుద్ధభేరి వోగుతుంది. సమస్యాపూరణంతో రణం భీకరమవుతుంది. ఛందోబందోబస్తుల్ని లౌక్యంగా తప్పించుకోవాలి. నిషిద్ధాక్షరిని నిర్భయంగా ఎదిరించాలి. దత్తపదులతో ఒంటరిగా పోరాడాలి. వర్ణనల విన్యాసాలు చేయాలి. ఆశుకవితలతో 'భేషు' అనిపించుకోవాలి. కేరింతలు, హాహాకారాలు, విమర్శలు, ప్రతివిమర్శలు...రణభూమిని తలపిస్తుంది అవధాన వేదిక. మీసాలు మెలేసిన కవులున్నారు. తొడగొట్టిన అవధానులున్నారు. తిరుపతి వెంకటకవులూ కొప్పరపు కవులూ కలబడ్డారా...ఇండోపాక్‌ క్రికెట్‌ మ్యాచంత ఉత్కంఠభరితం.

అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, శతసహస్రావధానం...పిండికొద్దీ రొట్టె అన్నట్టు, ధారణకొద్దీ అవధానం. అవధాన విద్యకు ఆద్యులు మాడభూషి వెంకటాచార్యులు. వెంకట రామకృష్ణకవులు, రాజశేఖర వెంకట కవులు, పల్నాటి సోదరులు, దేవులపల్లి సోదరులు ... ఎందరో మహాపండితులు నలుదిశలా విస్తరించారు. అవధానం మీద కన్నడిగుల కన్నూ పడింది. హిందీ కవులకు భలే పసందుగా అనిపించింది. సంస్కృత పండితుల ప్రేమ సరేసరి. అక్కడక్కడా త్రిభాషావ ధానాలూ (తెలుగు-సంస్కృతం-ఇంగ్లిషు) జరుగుతున్నాయి. మనదీ అని సగర్వంగా చెప్పుకోదగిన సాహితీ ప్రక్రియ అవధానం.

---------------------
తెలుగు గోళీలు
ఔషధాలు


మెథోట్రెక్సేట్‌...
క్యాన్సర్‌ నివారణ ఔషధం. కీళ్లనొప్పులు, సోరియాసిస్‌ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

టెట్రాసైక్లిన్‌...
పదిహేనేళ్ల క్రితం గుజరాత్‌, మహారాష్ట్రలలో ప్రబలిన ప్లేగువ్యాధిని నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడింది. ఆ మందే లేకపోతే ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో. మూడోతరం టెట్రాసైక్లిన్‌ అయిన డాక్సీసైక్లిన్‌ మలేరియా నివారణలోనూ సమర్థంగా పనిచేస్తుందని గుర్తించారు.

అరియోమైసిన్‌...
వెుట్టవెుదటి టెట్రాసైక్లిన్‌ యాంటీబయాటిక్‌. యాభై ఏళ్లలో కొన్నివేల ప్రాణాలు కాపాడింది. ఆ సమయానికి, ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కంటే వాక్స్‌మన్‌ స్ట్రెప్టోమైసిన్‌ కంటే చాలా శక్తిమంతమైంది.

హెట్రాజన్‌...
బోదకాలు నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఔషధం.

వీటన్నిటిని ప్రపంచానికి అందించింది ఓ తెలుగు వ్యక్తే, డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు.
రక్తహీనతకు ప్రధాన కారణమైన విటమిన్‌ బి 12ను గుర్తించింది సుబ్బారావే. ఆయన కనిపెట్టిన ఫోలిక్‌ ఆమ్లాన్ని ఎన్నో ఔషధాల్లో మిశ్రమంగా వాడుతున్నారు. లుకేమియా చికిత్సలోనూ ఆయన మందులు పనికొస్తున్నాయి. నిజానికి, సుబ్బారావు ఆవిష్కరణల చిట్టా చాలాపెద్దది. అనేక సందర్భాల్లో ఆయన ఆ ఘనతను తనకింద పనిచేస్తున్న సిబ్బందికే వదిలేశారు. సుబ్బారావు దగ్గర సహాయకులుగా పనిచేసినవారు కూడా నోబెల్‌ పురస్కారాలు అందుకున్నారు.
ఆయన మాత్రం ఎలాంటి ప్రచారాన్నీ కోరుకోలేదు. కనీసం తన ఆవిష్కరణలకు పేటెంట్‌ తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అంత నిరాడంబరుడు. పాతికేళ్లు అమెరికాలో నివసించినా సుబ్బారావుకు అక్కడి పౌరసత్వం లేదు. యాభైమూడేళ్లూ తెలుగువాడిగానే బతికారు. భారతీయుడిగానే మరణించారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ సహకారంతో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ సోమరాజు రూపొందించిన 'స్టెంట్‌' హృద్రోగులకు ఓ వరం. రెడ్డీస్‌, శాంతా బయోటెక్స్‌, మాట్రిక్స్‌, నాట్కో వంటి ఔషధ తయారీ సంస్థలు బహుళజాతి సంస్థలతో చేతులు కలిపి అంతర్జాతీయం అవుతున్నాయి. ఓరకంగా చెప్పాలంటే, తెలుగు గోళీల్ని ప్రపంచమంతా మింగుతున్నారు.

----------------------
వెలుగుల కొండ కోహినూర్‌ వజ్రం


బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ (అంటే... వెలుగుల కొండ!) మనది మనది మనదే. గుంటూరు సీమలోని కొల్లూరు గనుల్లో పుట్టింది. అప్పట్లో ఆ ప్రాంతం గోల్కొండ సామ్రాజ్యంలో అంతర్భాగం కాబట్టి, వెుదట సుల్తానుల వశమైంది. ఆతర్వాత...బానిసలు, ఖిల్జీలు, తుగ్లక్‌లు, సయ్యద్‌లు, లోడీలు, సిక్కులు...ఎన్ని తలలు మారిందో, అన్ని తలలు బలితీసుకుంది. కోహినూరు వజ్రం చేతులుమారిందంటేనే, ఒక సామ్రాజ్యం పతనమైనట్టు. ఒక వంశం నాశనమైనట్టు. దాని తత్వమే అంత.
వస్తూవస్తూ విజయం తెస్తుంది.
వెళ్తూవెళ్తూ ప్రాణాలు తీస్తుంది!
ఆ భయంలోంచే బోలెడు కథలు పుట్టుకొచ్చాయి. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. అది సాక్షాత్తు సత్యభామాదేవి వజ్రం కాబట్టి, స్త్రీలు మాత్రమే ధరించాలన్న ప్రచారం జరిగింది. బ్రిటిష్‌ రాజకుటుంబం కూడా కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికే వారసత్వ కానుకగా ఇస్తోంది.
నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రాన్ని ఖరీదు కట్టే షరాబు ఇప్పటిదాకా పుట్టలేదు. బాబర్‌ చక్రవర్తి మాత్రం 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అని లెక్కేసుకున్నాడు. తెల్లదొరల బొక్కసానికి వెళ్లాక, దానికి మెరుగులుపెట్టించాలని ఆల్బర్ట్‌ యువరాజుకు ఆలోచన వచ్చింది. సానబట్టడానికే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది.
ఆ అమూల్య వజ్రాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ఆ వెలుగులకొండను మనదేశానికి తీసుకురాగలిగితే...నేరుగా ఆంధ్రప్రదేశ్‌కే తీసుకురావాలి.
కోహినూర్‌ మన ఆస్తి!

-----------------------------
రండి...భోంచేద్దాం! ఆవకాయ


ఆపదల నాదుకొను కూర ఆవకాయ
అతివ నడుమైన జాడియెు ఆవకాయ
ఆంధ్రమాత సిందూరమ్మె ఆవకాయ
ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ
ఎంత గొప్పగా చెప్పారండీ గరికిపాటివారు!
మామిడికాయ వూరగాయ ఎవరైనా పెట్టుకోగలరు. అదేం బ్రహ్మవిద్య కాదు. నాలుగు కాయలు కోసేసి ఉప్పూకారం కలిపితే చచ్చినట్టు పచ్చడైపోతుంది. ఆంధ్రులు తప్ప, ఎవరైనా ఆపనే చేస్తారు. కానీ తెలుగిళ్లలో ఆవకాయ పెట్టడమంటే ఏ సత్యనారాయణస్వామి వ్రతవో చేసినంత భక్తీశ్రద్ధా. చిన్నరసాలు పట్టుకోడానికి పెద్దప్రయత్నమే చేయాలి. చిన్నావాల కోసం సూపర్‌మార్కెట్లన్నీ గాలించాలి. ఆవపిండికి ఆర్డరివ్వాలి. ఎర్రటి ఎర్రకారం తెప్పించాలి. కల్తీలేని నువ్వుల నూనె ఎక్కడ దొరుకుతుందో అంజనమేసి గాలించాలి. అంతా అయ్యాక, జాగ్రత్తగా జాడీలకెత్తాలి. అందులోనూ స్పెషలైజేషన్‌. బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.ఇవిచాలవన్నట్టు మాగాయ. తియ్యగా వడ్డిద్దామనుకునే తల్లులు తేనె ఆవకాయా పెడతారట!
అరవై అయిదో కళ...ఆవకాయ పెట్టడం. అది ఆంధ్రుల సొత్తు. కాబట్టే, చెన్నై అయ్యరుగారైనా బెంగుళూరు కులకర్ణిగారైనా...పొరుగింటి తెలుగుపిల్ల చిట్టిగిన్నె పట్టుకొచ్చి 'ఆయ్‌... ఆవకాయ పెట్టామండీ! కాస్త రుచిచూసి పెట్టండి' అనడక్కపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అయినా జిహ్వచాపల్యం తీరకపోతే 'ఆవకాయ పెట్టడమెలా?' అన్న విషయం మీద స్పెషల్‌ క్లాసులు పెట్టించుకుని తమిళంలోనో కన్నడంలోనో నోట్సు రాసుకుంటారు. ఆ తీరికా ఓపికా లేనివారికోసం ఉండనే ఉంది... 'ఓప్రియా...ప్రియా!'
----------------------

పాటలీపుత్రమ్ము కోటకొమ్మల మీద తెలుగు జెండాల్‌ నర్తించునాడే... తెలుగుముద్ర భారతజాతి రాజముద్రగా రాజిల్లింది. విదేశీ యాత్రికులు రత్నమాలలతోపాటు తెలుగు అక్షరమాలనీ ఓడలకెత్తిననాడే... అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. పాలగుమ్మివారి 'గాలివాన'తో తెలుగు కథ అంతర్జాతీయమైంది. జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాలు విన్నాకే ప్రపంచానికి 'తత్వం' బోధపడింది.
పీవీ సరళీకరణ విధానం, ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదం...
బాలమురళి శాస్త్రీయం, బాలూ లలితగానం...
అజహర్‌ అద్భుతాల క్రికెట్టు, శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు...
నాయుడమ్మ వైద్యం, బాపూ చిత్రం...
తెలుగువెలుగుల కీర్తికిరీటం!
గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, చిరాల, నారాయణపేట, మచిలీపట్నం చేనేతలు...
మగ్గాల మీద అల్లిన ముత్యాల ముగ్గులు!
బంగినపల్లి మామిడిపళ్లు, పలాస జీడిపప్పులు,
ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డూలు, తాపేశ్వరం కాజాలు...రుచుల్లో రాజాలు!
శాకాంబరీదేవి ప్రసాదం...ఆంధ్రాబ్రాండ్‌
గోంగూర పచ్చడి.
తెలుగువారి వ్యాపారాలకు జైబోలో!
ఎంతచెప్పినా తెలుగు విజయాల చరిత్ర అసమగ్రమే.
ఎంతరాసినా తెలుగు ముద్రల జాబితా అసంపూర్ణమే.
మాతెలుగుతల్లికి మల్లెపూదండ వేసి,
ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు!
అని దండం పెట్టుకుంటే,
తెలుగు వెలుగులందర్నీ స్మరించుకున్నట్టే
తెలుగు ముద్రలన్నీ తడిమిచూసుకున్నట్టే!
_______________________
(ఈనాడు, ఆదివారం, ౦౧:౧౧:౨౦౦౯)
___________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home