మహా ప్రసాదం
చిటికెన వేలిపై గోవర్ధన గిరినెత్తి, గోవుల్ని కాపాడటానికి దాన్ని గొడుగుగా పట్టిన చిన్నిశిశువే- సకల జీవులకు తన ఛత్రచ్ఛాయలో రక్ష కల్పించేందుకు కొండంత దేవుడు కోనేటిరాయడైనాడు. తిరుమలపై కొలువుతీరాడు. 'పెద్ద కిరీటమువాడు, పీతాంబరమువాడు, వొద్దిక కౌస్తుభమణి వురమువాడు/ ముద్దుల మొగమువాడు, ముత్తేల నామమువాడు, అద్దిగో శంఖచక్రాలవాడు...' అంటూ చిగురుమోవివాడైన శ్రీవేంకటేశుని తన అక్షరాల్లో మన కళ్లకు కట్టాడు అన్నమయ్య. 'వెక్కసమగు నీ నామము- వెల సులభము, ఫలమధికము' అంటూ తనను కొలిచేవారికి ఆ స్వామి ఎంతటి కొంగుబంగారమో విశదపరచాడు. 'పాపమెంత గలిగిన బరిహరించేయందుకు/ నా పాలగలదుగా నీ నామము' అన్న ఆ సంకీర్తనాచార్యుని పలుకు మనకూ తారకమంత్రమే. అందుకే, నిత్యకల్యాణమూర్తియైు జన నీరాజనాలందుకుంటున్న 'వేంకటేశ సమోదేవో/ నభూతో న భవిష్యతి'- వేంకటేశ్వరుని మించిన మరోదైవం లేదని- పెద్దలు ఘంటాకంఠంగా చాటారు. వేదాలు శిలాకృతులై, తాపసులు తరువులై, సర్వదేవతలు మృగజాతులై, పుణ్యరాసులే ఏరులై ఆ దేవాదిదేవునికి ఆవాసమైన తిరుమల- ఇలపై నెలకొన్న వైకుంఠమేనని ప్రతీతి. 'కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ/ విరివైనదిదివో శ్రీవేంకటపు కొండ...' అంటూ పదకవితా పితామహుడు కీర్తించిన వేంకటాద్రికంటే మిన్నయైున మరో పుణ్యక్షేత్రం ఏడేడు లోకాల్లో ఎక్కడా లేదన్నది రుషివాక్కు. ఆ అయ్యను దర్శించాలన్న తపనతో, ఆర్తితో, భక్తితో, కాంక్షతో ఏడాది పొడవునా ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు నానాదిక్కులనుంచి తరలివచ్చే భక్తజన సందోహంతో నిండిపోయే తిరువీధుల్లో అనునిత్యం తిరునాళ్ల ప్రభలే, ఏడుకొండల్లో అనుక్షణం గోవిందనామస్మరణల ప్రతిధ్వనులే!
'ఈ ఓంకార తరంగిణిలో ఓలలాడి, ఈ కాంతి సముద్రంలో మునిగితేలి భక్తులు తమనుతామే మరచిపోతారు. తమ కోర్కెల్నీ మరచిపోతారు. తమ బాధల్నీ మరచిపోతారు. బాధలో పుట్టిన కన్నీటి బిందువులు ఆనందబాష్పాలుగా స్వామి పాదాలను చేరతాయి. ఆనంద స్వరూపులవుతారు. ఆనందోబ్రహ్మ! అదే బ్రహ్మోత్సవం' అంటూ- వేంకటనాథునికి ఏటా జరిగే ఆ రాజరాజోత్సవ ప్రాభవ ప్రాశస్త్యాన్ని అభివర్ణించారు ముళ్లపూడి రమణీయంగా. అంగరంగ వైభవం అన్న పదానికి అచ్చమైన అర్థతాత్పార్యాలు- అందమైన తిరువేంకటాధిపుడు అందుకునే సేవల్లోనే సాక్షాత్కరిస్తాయి. తూరుపురేకలు విచ్చుకోకముందే మొదలయ్యే సుప్రభాత సేవనుంచి అర్ధరాత్రి దాటాక శయన మంటపం చేరేవరకు స్వామికి జరిగే సేవలన్నీ కమనీయమైనవే. 'కౌసల్యా సుప్రజా రామా' అన్న సుప్రభాత గీత పఠనాలు, వేంకటేశ్వర స్తోత్రాలాపనలు, ప్రపత్తిగానాలు, మంగళాశాసనాలు, కర్పూరహారతులు, అర్చనలు, అభిషేకాలు, వస్త్రసమర్పణలు, పుష్పాలంకరణలు, నైవేద్య నివేదనలు- అన్నీ విన వేడుకే, కన వేడుకే! ఉపమించగరాని ఆ ఉన్నత రూపానికి తప్ప, ఓ పాటలో వేటూరి అన్నట్లు... 'రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు/పన్నీటి జలకాలు, పాలాభిషేకాలు/ కస్తూరితిలకాలు, కనక కిరీటాలు/ తీర్థప్రసాదాలు, దివ్యనైవేద్యాలు/ ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు' అనిపిస్తుంది. పుష్పమాలాలంకృతుడైన వేంకటేశుని దర్శించిన క్షణాన- 'సంపంగి, చంపక పూగపన్నాగ/ పూలంగిసేవలో పొద్దంత చూడగ/ నీపైని మోహము నిత్యము సత్యమై/ అహము పోదోలురా, ఇహము చేదౌనురా...' అన్న ఆత్రేయ కవిత, మనకు తెలియకుండానే గుండె తలుపులు తడుతుంది.
అమృత మథనుడైన ఆ జగత్పతికి 'ఇదివో నైవేద్యము' అంటూ నివేదించే- పులిహోర, పొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలి వంటి అన్న ప్రసాదాలు; లడ్డు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు వంటి పిండివంటలు భక్తులకు దివ్య ద్రవ్యాలే. చేతులుచాచి వారు మహద్భాగ్యంగా స్వీకరించే దివ్య ప్రసాదాలవి. శ్రీవారి శంఖు చక్రాలను తలపించే లడ్డు, వడ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తిరుమల వెళ్లి వచ్చిన యాత్రికులు తమ బంధుమిత్రులకు, పరివారానికి ప్రధానంగా పందేరం చేసేది కొండ లడ్డూనే. కొండంత దేవుణ్ని కొండంత పత్రితో పూజించలేనట్లే, కొండ లడ్డునంతటినీ వారు సన్నిహితులకు పంచలేకపోవచ్చు. చిన్న ముక్కగానైనా, విడి పొడిగానైనా తమవారు పంచే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారికి తామే స్వయంగా తిరుమల సందర్శించినంత దివ్యానుభూతి! తన కడకు రాలేకపోయిన తమకు తిరుమల ప్రభువే స్వయంగా ప్రసాదం పంపించి దీవించాడన్నంత బ్రహ్మానందం! మాధుర్యంలోనే కాదు, ప్రాచుర్యంలోను శ్రీవారి లడ్డు తిరుగులేనిదే. తిరుమలలోనే, అదీ తితిదేయే తప్ప ఇతరులెవరూ తయారుచేయడానికి వీల్లేకుండా దానికి పేటెంట్ హక్కూ ఈమధ్యే లభించింది. యాత్రికుల అవసరాలకు తగినన్ని లడ్డూలను తిరుమల-తిరుపతి దేవస్థానంవారు సరఫరా చేయలేకపోవడంతో వాటికీ ఆ మధ్య కటకట ఏర్పడింది. రోజుకు లక్షన్నర లడ్డూలు తయారు చేస్తున్నా- సరఫరా గిరాకీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందన్నది అధికారుల కథనం. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తితిదే ఇప్పుడు రంగంలోకి దిగింది. వెంకన్న భక్తులకు వారు కోరినన్ని లడ్డూలను అతి త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్న అధికారులు- అయిదులక్షల లడ్డూల తయారీకి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామంటున్నారు. ఇకపై భక్తులకు కొండలరాయని లడ్డూలు కోరినన్ని లభిస్తే అంతకుమించిన మహాప్రసాదం ఏముంటుంది?
(ఈనాడు, సంపాదకీయం, ౧౩:౧౨:౨౦౦౯)
________________________________
Labels: Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home