My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, February 28, 2010

వివాహమే మహాభాగ్యం

జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.
ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,
దేవతల రుణాన్ని యజ్ఞాలతో,
పితృరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఉవాచ
.
తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వివాహాన్ని ధార్మిక సంస్కారంగా ఆచరించే సంప్రదాయం మనది.
'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవారు బయటపడాలని తహతహలాడుతుంటారు. వెలుపల ఉన్నవారు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతుంటారు' అని ఓ మేధావి చమత్కరించాడు కానీ, భారతీయ సంస్కృతిలో పాటించాల్సిన నాలుగు ధర్మాల్లో గృహస్థాశ్రమమూ ఒకటి. ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగిడే పొదరిల్లు అది! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము...' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పాడు. ఆ పురుషార్థాన్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. సుఖదుఃఖాల్లో, కలిమిలేముల్లో సహభాగస్వాములై భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహదీపమే దిక్సూచి కావాలి. 'మాయ, మర్మములేని నేస్తము/మగువలకు, మగవారికొక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు రాజమార్గము'ను నిర్దేశించాడు వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయతాహస్తాన్ని అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యానికి పట్టం కట్టాల్సింది పురుషుడే.

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల,్‌ భార్య ఎర్తు' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకడం సున్నా అన్నాడు.
భార్యాభర్తల సాహచర్యం-
సమశ్రుతి చేసిన ఆ పేటికలో బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా తరంగితం కావాలి.
దాంపత్యమంటే-
మూడు ముడులతో పెనవడిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాలవలె కలిసి ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవన మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గానానికి సప్తస్వరాలై ఊపిరులూదడం!
దాంపత్యమంటే-
ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులే, సప్తాశ్వాలుగా వారి జీవనరథం మలిసంధ్యలోనూ సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెలు- కోరికలు తీరి, ఆఖరి మజిలీకి చేరుకున్నాక 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని...' నిరీక్షిస్తూ ఆర్ద్రమవుతుంటాయి. శృంగార అవసరాల్లేని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమైనది. లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళిక' అన్నది ముళ్లపూడి రమణీయ భాష్యం.

ఇతర దేశాల్లో మాదిరి కాకుండా మన సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ-పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటివాటివల్ల వివాహబంధాలు తెగిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిన రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో- వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేనివారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి పట్టం కట్టేదే. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని ఇంతకుముందరి అధ్యయనాలు పేర్కొనగా- స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసిక స్వాస్థ్యం చేకూరుస్తుందని తాజాగా వెల్లడయింది. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళలకన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగిపోతారని చెబుతున్న పరిశోధకులు- పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నవారికన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ పరస్పర నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ, పురుషులు వివాహబంధంతో ఒక్కటై బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతమే!
(ఈనాడు, సంపాదకీయం, ౦౩:౦౧:౨౦౦౧౦)
___________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home