పాదముద్రలు

ఓ చిన్నోడి పిడికెడు గుండెను అమాంతం దోచుకుంది ఓ చక్కనిచుక్క. దాన్ని వాపస్ చేయకపోతే మానె, తన మనసునూ ఇంకా ఇవ్వని ఆ చిన్నదాన్ని- ఆమె ఇంటిదాకా దిగబెట్టే డ్యూటీని యథాప్రకారం పూర్తిచేశాడా కుర్రాడు. ఇంట్లోకి వెళ్తూవెళ్తూ ఆ చిన్నది- కుడి భుజంమీదుగా తలతిప్పి అతగాడిపై కొంటెచూపుల్ని విసిరి లోనికి తుర్రుమంది. ఆ క్షణాన, అక్వేరియంలో దూసుకుపోతూ సర్రున వెనక్కితిరిగిన రెండు నల్లని చేపపిల్లల్లా తోచిన ఆమె విశాల నేత్రద్వయం వెంటాడుతుంటే చేసేదేంలేక- 'ప్రేయసి గృహవీధి స్పృహతప్పి పడిపోయి/ ముదిత కాలిగురుతు ముద్దుగొంటి'నన్న గాలిబ్ కవితను తలచుకుంటూ నిట్టూర్చాడా వెర్రినాయన! ఆడవాళ్ల పాదాలు ఒక్కోసారి కావ్యరచనకూ ప్రోద్బలమవుతుంటాయనడానికి 'పారిజాతాపహరణ' ప్రబంధమే ఉదాహరణ. తెల్లవారి నిద్రలేచాక తన తలపై రాణిగారి పాదాలుండటం చూసి ఆగ్రహించిన రాయలవారు ఆ తరవాత ఆమె ఇంటిఛాయలకే పోలేదట. భర్త తలపై భార్య కాళ్లు పెట్టడం తప్పుకాదని తెలియజెప్పడానికి నంది తిమ్మన ఆ కావ్యం రాశాడని ప్రతీతి. తనపై కినిసిన సత్యభామ ఎడమకాలితో తన శిరస్సును తన్నినా కృష్ణయ్య- 'నను భవదీయ దాసుని నెయ్యపుకిన్క బూని తాచినయది నాకు మన్ననయ' అంటూ ఆమెకు విన్నవించుకున్నాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. పైగా- 'నా శిరస్సును తాకి, కోమలమైన నీ పాదాలు కందిపోయాయికదా అన్నదే నా బాధ' అంటూ మోకరిల్లి నల్లనయ్య ఆమె అలక తీర్చాడని విన్నప్పుడు... 'మేలి ముసుగు సడలించి చూస్తేనే కద/ కాలి చెంత కనపడుతుంది చెలీ, నా వ్యధ' అన్న ఆరుద్ర 'అరబ్బీ మురబ్బా' గుర్తుకు రాకమానదు.
గడచిన అయిదేళ్లుగా మహిళల పాదాల పరిమాణం పెరుగుతోందని, వారు ధరించే పాదరక్షల సగటు సైజు అయిదు నుంచి ఆరుకు చేరిందని ఓ అధ్యయనంలో వెల్లడయింది. ఒకప్పుడు ఆరో సైజు పాదరక్షలు ధరించే మహిళల సంఖ్య అరుదుగా ఉండేదని, ఇప్పుడు అవి సర్వసాధారణమయ్యాయని వారు అంటున్నారు. ఊబకాయంవల్ల, యుక్తవయసులో పిజ్జా తదితర జంక్‌ఫుడ్స్ భుజించడంవల్ల హార్మోన్లలో వచ్చే మార్పులు- ఆడవారి పాదాల పరిమాణం పెరగడానికి ప్రధాన కారణమన్నది వైద్యనిపుణుల అభిప్రాయం. అంతమాత్రాన- వాటి అందం తరిగిపోతుందనుకోవడం పొరపాటే. పాదాల పరిమాణం ప్రధానం కాదు, చరిత్రలో తమ పాదముద్రలు చిరస్థాయిగా గుర్తుండేలా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడం ముఖ్యం. స్త్రీని ఏనాడో శక్తిపీఠంపై ప్రతిష్ఠించి- 'ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తా'రన్న గురజాడ వాణిని సార్వజనీన సత్యంగా ఇప్పటికే ఎల్లెడలా ప్రతిధ్వనింప చేసిన, చేస్తున్న ఘనకీర్తి మన స్త్రీమూర్తులది. సేవానిరతిలో ఒక మదర్ థెరెసా, ధైర్యస్త్థెర్యాల్లో ఒక కిరణ్‌బేడి, సాహసవిన్యాసాల్లో ఒక సునీతా విలియమ్స్, సంగీతసామ్రాజ్యంలో ఒక ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, సాహితీలోకంలో ఒక అరుంధతీరాయ్- ఇలా ఎందరెందరో అధునాతన మహిళలు చెరిగిపోని రీతిలో తమవైన పాదముద్రల్ని చరిత్రకు అందించారు. ఆ స్ఫూర్తి నిరంతరం మహిళల్లో పరిఢవిల్లాలి. ఆ పరంపరను ప్రతి మహిళా అప్రతిహతంగా కొనసాగించిననాడు వసంతం నిత్యం హసిస్తూనే ఉంటుంది. గాలిబ్ ఓ సందర్భంలో అన్నట్లు 'ఎచట నీ పదాంకమునీక్షింతు, నచట అడవిదారియు నందనమట్లు తోచు'నని మహిళా లోకానికి యావత్ మానవాళి నీరాజనాలర్పిస్తుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౧౦:౦౧:౨౦౧౦)
__________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home