హల్'సెల్'

మనిషిగా ఎంతదూరాన ఉన్నా మనసుకు దగ్గరైనవారి మౌనగానం నీలిమేఘాలపైనా, గాలి కెరటాల మీదా తేలియాడుతూ వచ్చి గుండెల్లో పల్లవిస్తూనే ఉంటుంది. వినగలిగిన చెవులకు వినిపిస్తూనే ఉంటుంది. అది- ప్రణయసందేశం, పరిణయ అభ్యర్థన, విరహ విన్నపం, ఆర్తగీతం, క్షేమసమాచారాల ఆరా... ఏదైనా కావచ్చు. ఎద తలుపులు తడుతూనే ఉంటుంది. మనసుకు దగ్గరైనా మనిషిగా దూరమైనవారి జాడకోసం హృదయం తహతహలాడుతుంది. ఆత్మబాంధవి సీతమ్మ ఎక్కడ ఉందో తెలియక రామయ్య అలాగే తల్లడిల్లాడు. అమ్మ అన్వేషణకు బయలుదేరిన హనుమ వద్ద తన ఆర్తిని వెలిబుచ్చుతూ 'ఇదె నాదు ముద్రిక యిది సీతకిచ్చి/ సుదతి చిత్తములోని శోకంబు మాన్పి/ సీతకు మేమున్న సేమంబు చెప్పి/ సీత సేమము గొంచు శీఘ్రంబె రమ్ము-' అంటూ గుర్తుగా తన ఉంగరాన్నిచ్చి వీడ్కోలు చెప్పాడు. '... నీవు శిశుపాల జరాసుతులన్ జయించి/ నా వంకకు వచ్చి, భవదీయ శౌర్యమే యుంకువసేసి కృష్ణ, పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్...' అంటూ తన మనోహారిణి రుక్మిణి- పురోహితుని ద్వారా పంపిన పరిణయ సందేశాన్ని మన్నించిన ఘనత నల్లనయ్యది. పరస్పరం మనసులు ఇచ్చిపుచ్చుకున్నవాళ్లు అందమైన వూహలు పంచుకోవడానికి, అంతరంగంలోని వూసులు చెప్పుకోవడానికి- మన్మథుడి బాణాలైన పూరేకులవంటి లేఖాపత్రాల్ని మించినవేమున్నాయి? అసలు, పుస్తకాలు ఎరువడిగి తెచ్చుకోవడంలో ఉండే పెద్ద లాభం- ప్రేమలేఖాయణమేనట. ఆ మాటే చెబుతూ- 'అంతగా బుక్స్ చదవాలని దుగ్ధ ఉంటే ఎరువడగవోయ్. దానివల్ల పరిచయాలేర్పడతాయి. అవి స్నేహాలవుతాయి. ప్రేమగా వికసిస్తాయి. పుస్తకాలద్వారా లవ్‌లెటర్స్ గట్రా అద్భుతంగా బట్వాడా అవుతాయి. ఎవరి పుస్తకం వారు కొనుక్కొని ఎరువడగడం మానేస్తే ఇంక ప్రేమకలాపాలెలా సాగేట్టూ?' అన్నది ముళ్లపూడి వెంకట'రమణీ'య ఉవాచ! 'రాను రాను రానంటూ బిత్తరి/ రాస్తున్నది ప్రేమలేఖ హత్తెరి/ అయిదువేళ్లతో పట్టుకొంటుంది కలం/ అయిదు ప్రాణాలూ తీస్తుంది సత్వరం' అని మురిసిపోతూ అమ్మడి జవాబుకోసం నిరీక్షణలోనే గడిపే ప్రేమలోకోత్తర కుమారులు కోకొల్లలు!
యావత్ విశ్వాన్నే వీక్షింపజేసే 'అంతర్జాల'యుగమిది. వర్తమానాలూ సందేశాలూ పంపుకోవడానికి ఇదివరకటి కాలంలాగా ఎవర్నీ ఆశ్రయించనూ అక్కర్లేదు. కష్టపడాల్సిన అవసరమూ లేదు. అక్షయపాత్రలాంటి సెల్‌ఫోన్ ఉంటే చాలు, అఖిల భూగోళం అరచేతి నిమ్మపండే! ఈ విషయంలో మహిళలదే పైచేయిగా ఉండటం చూస్తుంటే 'అందాల హరివిల్లు/ అరచేతిలో సెల్లు/ ఆడవారికె చెల్లు' అనాలనిపిస్తుంది. ఆ మాటకొస్తే, సెల్‌ఫోన్‌ను వారు ఆరోప్రాణంలా చూసుకుంటున్నారన్నా ఆశ్చర్యం లేదనడానికి- ఆస్ట్రేలియాలో ఈ మధ్య నిర్వహించిన ఓ అధ్యయనం నిదర్శనం. తమకు మొగతోడుకన్నా మొబైల్ ఫోన్ ముఖ్యమని వారు అంటున్నారు. మొబైల్ పోతే ఏమాత్రం తట్టుకోలేమని అక్కడి మహిళల్లో నూటికి నలభైమంది- సెల్‌ఫోన్‌ను ఒడిసిపట్టుకున్నంత గట్టిగా సెలవిచ్చారు! అంతేకాదు- 'పడతీ నీ రహస్యాలు పదిలంగా రక్షిస్తా/ బిగి గుండెల బీగమేసి తాళం నే పారేస్తా'నంటూ వెన్నంటే చెలికాణ్నీ ఆ దేశ మహిళ లెక్కపెట్టడంలేదు. సైదోడుగా ఉండే బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోవలసి వచ్చినప్పుడు కలిగే బాధ కన్నా, సెల్‌ఫోన్ పోయినప్పుడు కలిగే ఆవేదనే తమను ఎక్కువగా వేధిస్తోందని వారు అంటున్నారు! 'సెల్లుంటే చాలురా, సఖుడా నీవేలరా' అంటున్న ఆస్ట్రేలియా మహిళల పాట- ఇక్కడ కాలర్ టోన్‌లా మారకుండా యువకులు జాగ్రత్తపడక తప్పదు. లేకుంటే- 'కొమ్మ దేహము పువ్వు కంటెను/ కోమలమురా మిత్రమా/ గుండె మాత్రము ఎందుకొరకో/ బండబారెను చిత్రము' అన్న బహద్దుర్‌షా జఫర్ కవిత రింగ్‌టోన్‌లా బాధించే ప్రమాదం లేకపోలేదు!
(ఈనాడు, సంపాదకీయం, ౨౪:౦౧:౨౦౧౦)
_____________________________
0 Comments:
Post a Comment
<< Home