My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, March 15, 2010

ఆశల మేడకు పునాది

మరో రెండు రోజుల్లో విరోధి నామ సంవత్సరానికి సాదరపూర్వకంగా వీడ్కోలు చెప్పబోతున్నాం.
వికృతి నామ సంవత్సరానికి హర్షాతిరేకాలతో స్వాగతం పలకబోతున్నాం.
తెరచాటు కాబోతున్న విరోధి అయినా, కాలయవనిక పైకి కొత్తగా రాబోతున్న వికృతి అయినా పేరులో ఏముంది, అవి- నిత్యం పరిభ్రమించే యుగచక్రంలోని ఆకులే! మంచీ-చెడు; మేలూ-కీడు; సుఖదుఃఖాలు; సంతోష విషాదాల కలనేత అయిన కాలపు తెరమీద మూడు కాలాలు, ఆరు రుతువులుగా సంవత్సరాలు కదలాడుతూనే ఉంటాయి. లోకంలో పరంపరానుగతంగా కొనసాగే ఆ చక్ర నిరంతర చలనంలో వెలుతురు వెనక చీకటి వెంటాడుతున్నా, మనిషి నడక నిరాఘాటమే. సుఖం వెంబడే దుఃఖం వెన్నాడుతున్నా, మనిషి పయనం నిర్నిరోధమే. 'దుఃఖంలోనే ఆశాదీపిక/ చీకటిలోనే తారాగీతిక/ కాలం మనదే/ లోకం మనదే/ అవి తెచ్చే రుచులన్నీ మనవే'నన్న శ్రీశ్రీ వాక్కుకు పట్టం కడుతున్నట్లుగా మానవజీవిత మహాప్రస్థానం ఏటా సాగిపోతూనే ఉంటుంది. ఏ సవాలునైనా తిప్పికొట్టే సాహసంతో, ఎటువంటి విపత్తునైనా అధిగమించే దృఢచిత్తంతో, ఎంతటి కష్టాన్నైనా ధిక్కరించే మనోస్త్థెర్యంతో కాలానికి ఎదురొడ్డటం- మనిషి జీవనయాత్రాపథంలోని ప్రతి మజిలీలోనూ దృశ్యమానమవుతూనే ఉంటుంది. 'అంతిమ విజయం కాలానిదే అనుకుంటారు కొందరు. కాదు, మానవుడిదే అని గర్జిస్తాన్నేను' అంటూ మనుష్యశక్తికి మకుటం పెట్టిన మహాకవి సూక్తిని ప్రతిక్షణం ప్రతిధ్వనింపజేస్తూనే ఉంటుంది.

రుతువులరాణి వసంతకాలానికి ఆది- ఉగాది. తెలుగు వత్సరానికి నాందీవాచకం పలికే పెద్ద పండుగ అది. సంవత్సరాది పర్వదినాన్ని తలచుకోగానే మత్తకోకిలల కుహూకుహూరావాలు ఎదలో గుసగుసలాడతాయి. చెట్లు సింగారించుకున్న కొత్త చివుళ్ల సోయగాలు కళ్లముందు తారట్లాడతాయి. నీలాకాశంలో మిలమిలలాడే నక్షత్రగుచ్ఛంలా- ఆకుపచ్చని ఆకుల నడుమ స్వచ్ఛ ధవళకాంతులీనే వేపపూల పలకరింతలు వినిపిస్తాయి. మరుమల్లెల సుగంధం మేనినంతటినీ ఆవరిస్తుంది. మనసైన చినదాన్ని తక్షణం మల్లెపూలతో అభిషేకించాలని మనసవుతుంది. వాటి ధర హెచ్చుగా ఉన్నందున కొనలేని చినవాడు ప్రేమతో మోదుగుపూలను తన కొప్పున తురిమినా ప్రణయినికి ప్రమోదమే. 'నేను మోదుగుపూలను తెచ్చినానటన్న/ దోసిటగల మల్లెలు పారబోసికొనును/ సహజ వాసనలుగల మల్లెసరము కన్న/ ప్రణయ వాసనల పలాశగణము మిన్న'- అన్న నవ్య కవితాపయోనిధి దాశరథి కవితే అందుకు సాక్ష్యం. ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చే షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలో ఉట్టిపడేది అచ్చమైన తెలుగుదనమే. దాని మధురిమ తెలుగు పలుకులోని తీయదనాన్ని తలపిస్తుంది. ఆ పచ్చడి పులుపు తెలుగువాడి చిరు కినుక అనిపిస్తుంది. మిరప ముక్కల్లోని ఘాటులో తెలుగువాడి పౌరుషం తొంగిచూస్తుంటుంది. వగరులో తెలుగువాడి పొగరు గోచరిస్తుంది. చేదులో తెలుగువాడి అలక ప్రత్యక్షమవుతుంటుంది. అలా- ఉగాది పచ్చడి రుచి యావత్తులో సాక్షాత్కారించేది సాక్షాత్తు తెలుగువాడి గడుసుదనమే!

ఉగాది రాకకే కాదు, తనతోపాటు ఆ పండుగ తెచ్చే పంచాంగంకోసమూ తెలుగు ప్రజ నిరీక్షిస్తుంటుంది. నింగిలో సూర్యచంద్రులున్నంతవరకు నేలపై అన్నీ సుదినాలే, శుభఘడియలే. అయినా, పంచాంగంలోని ఆదాయ-వ్యయ పట్టికల్లో, రాజపూజ్య- అవమానాల జాబితాల్లో తమ భావి జాతకచక్రాలను చూసుకోవడంలో ప్రజలకు ఓ తృప్తి. అందులో చెప్పినట్లు జరుగుతాయా, లేదా అన్న సంగతి అటుంచితే- పంచాంగపఠనం వినడంలో వారికి ఓ వూరట. అందుకే, కృష్ణశాస్త్రి అన్నట్లు- 'ఏయుగాదికా యుగాదికి/ యెప్పటికప్పుడు యెదురై/ ద్వారము కడ చిరునవ్వుల హారతులెత్తును మానవుడు'. పచ్చడి ప్రసాదాలు, పంచాంగ శ్రవణాలు, కవితా పఠనాల మధ్య అరుదెంచే ఉగాదికి స్వాగత తోరణాలు కట్టని ఇళ్లూ, ఆహ్వానగీతాలు పలకని వాకిళ్లూ ఉంటాయా? 'గుమ్మం తగిలి తల గొప్పికట్టినా/ గొప్పకి నవ్విన కొత్తకోడలులాగా వచ్చి నిలుచుంది కొత్త సంవత్సరం' అన్న తిలక్‌ కవితను తలచుకుని మనం వాపోనక్కర్లేదు ఇప్పుడు! పురుషాధిక్య భావజాలాల నేతాశ్రీలు పన్నిన వ్యూహాల్ని బదాబదలు చేసి, స్వీయ హక్కుల సాధన బాటలో అప్రతిహతంగా ముందడుగులు వేస్తున్న మహిళల ధీమాను స్ఫురింపజేస్తూ చైత్ర రథం కదలివస్తోంది నేడు! చట్టసభల్లో తనకు కోటా కల్పించాలన్న బిల్లును పెద్దల సభలో నెగ్గించుకున్న మహిళలా సగర్వంగా తలెత్తుకుని, ఠీవిగా నడుస్తూ, తెలుగు లోగిళ్లలోకి ఈసారి దర్జాగా అడుగిడబోతోంది ఉగాది. ఆచార్య సినారె మాటల్లో ఉగాది అంటే- 'కమ్మని ఆశల మేడకు/ కాలం వేసిన పునాది'. అవకాశాల్లో స్త్రీల వాటా పెరిగితే- తమ ఆధిపత్యానికి గండి పడుతుందేమోనన్న ఆక్రోశమే తప్ప, అమూల్యమైన సాహచర్యం తమకు లభిస్తుందన్న స్పృహే లేని ఉష్ట్రపక్షి బాపతు నాయకగణానికి 'దగా'దిగా అనిపించవచ్చు. కానీ, ఆకాశంలో అర్ధభాగమైన మహిళాలోక సంపూర్ణ సాధికారసౌధానికి ఈ ఉగాది- కావాలి గట్టి పునాది!
(ఈనాడు, సంపాదకీయం, ౧౪:౦౩:౨౦౧౦)
_____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home