My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, April 30, 2010

స్వేదం శ్రీశ్రీ వేదం

- డాక్టర్‌ సశ్రీ

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.
రెండక్షరాల శ్రీశ్రీ అంటే లోతు,
శ్రీశ్రీ అంటే ఎత్తు.
శ్రీశ్రీ కవిత్వం అగ్ని.
శ్రీశ్రీ సాహిత్యం మార్పు.
శ్రీశ్రీ ఓ నేత, ఓ దూత, ఓ భావి!
'తెలుగు సాహిత్యం'పై శ్రీశ్రీదే అసలైన 'ముద్ర'. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో 'మహాప్రస్థానం' మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది. 1933-'47 నాటి నలభై ఒక్క కవితల స్తంభాలతో కట్టిన మేడ, అగ్నిమంటపం 'మహా ప్రస్థానం'. అది ఓ రకంగా శ్రీశ్రీ చేసిన అగ్నిసంతకం. ప్రజల చేతిలో కాగడా 'మహాప్రస్థానం'. ప్రాచీనమైనదంతా విశిష్టమనీ, ఆధునికమైందంతా అరిష్టమనీ అపోహలు రాజ్యం చేస్తూన్న కాలంలో ఆధునికతలోని ప్రామాణికతకు కొలబద్దగా శ్రీశ్రీ సాహిత్యం నిలుస్తుంది. కార్మిక, కర్షక అభ్యుదయమే శ్రీశ్రీ కవితామార్గం. సామాన్యుడే మహాకవి పాలిటి స్వర్గం. మానవుడే సందేశం... మనుష్యుడే సంగీతం. 'పురోగామి భావాలకు' పునరుత్తేజం కలిగించినదోపిడీకి తావులేనిది సామ్యవాద రాజ్యమేనని ఎలుగెత్తి చాటిన ఎర్రజెండా శ్రీశ్రీ అక్షరాక్షరం.
కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి ఖరీదు లేదన్న శ్రీశ్రీకి స్వేదమే వేదం... శ్రామికుడే దేవుడు!! శ్రీశ్రీ చారిత్రక జ్ఞానం రాబోయేకాలంలో కాబోయే కవులకు పాఠమై ప్రవహిస్తుంది. నిజానికి కవిత్వం అన్నది వ్యక్తీకరణ కళ. ఎవరు ఏ మేరకు కవో శిల్పమే పట్టిస్తుంది. శ్రీశ్రీది ప్రత్యేక శైలి. శబ్ద విన్యాసంలో శక్తిమంతుడిగా పేరొందిన శ్రీశ్రీ ఆధునిక కవుల్ని అధిగమించాడు. ఇవాళ్టి వచన కవితతో శ్రీశ్రీ కవితను పోల్చలేం. నిరంతర పరిణామానికి అలవాటుపడ్డ వచన కవిత్వంలో శ్రీశ్రీది ఓ ప్రస్థానం... ఓ శుభారంభం... తొలకరివాన. తనలో తాను వర్షమై కురిసి కురిసి మహా ప్రస్థానమై వెలిసిన కవి శ్రీశ్రీ. తన అంతరాత్మను మండించి లావాగా పెల్లుబికిన కలం శ్రీశ్రీ. సాహిత్య స్పృహకు ఆలవాలం... సామాజిక స్పృహకు బలం శ్రీశ్రీ. ఆయనో సాహిత్య సంస్కర్త. 'ఇంటెలిజెంటిల్మన్‌' లాటి ప్రయోగాలకు శ్మశానాల నిఘంటులు దాటిన అక్షర బాటసారి శ్రీశ్రీ. వ్యధాసర్పదష్టులారా అనాల్సింది 'బాధాసర్పదష్టులార' అంటూ వ్యాకరణాల సంకెళ్లు విదిలించుకున్న కలం శ్రీశ్రీ.
పారశీక గజల్‌ నడకను మాత్రాగణాల్లో పరకాయ ప్రవేశం చేయించి ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలించుకున్న అక్షర పారిజాతం శ్రీశ్రీ. ఆకలి, ఆవేదనలు తొడుక్కున్న బట్టలు శ్రీశ్రీ అక్షరాలు. ఆవేశపు ఇస్త్రీ మడత నలగని తెలుగుదనం వెల్లివిరిసే పట్టుపంచె శ్రీశ్రీ సృజన. అవ్యక్తానుభూతుల 'రసన' శ్రీశ్రీ సాహితి. అందరిలా శ్రీశ్రీ కావ్యకర్త మాత్రమే కాదు, అంతకు మించి కార్యకర్త కూడా. పౌరహక్కుల ప్రతినిధిగా పనిచేసిన ఉద్యమ కెరటం శ్రీశ్రీ. విప్లవోద్యమాల పురిటిగడ్డ ఆయన మస్తిష్కం. 1930 తరవాత నడిపించిన పెద్దదిక్కుగా, మార్గదర్శిగా విమర్శకుల మన్ననలందుకున్నాడు. ఏ కూలీ నాలీ జఉద్యమంగా ఉరకలెత్తబట్టే కవుల్లో శ్రీశ్రీ మాత్రమే మహాకవిగా నిలిచాడు, యుగకర్తగా జనహృదయం గెలిచాడు. తెలుగు సాహిత్యానం కోసం కలం పట్టానని శ్రీశ్రీ పలికాడో ఆ సామాన్యులకు శ్రీశ్రీ శబ్దభేరీ 'కవిత్వం' ఏమేరకు అర్థమవుతుందన్నది ఓ ప్రశ్న. ఉన్నంతలో తెలుగు సమాజం చుట్టూ పరిభ్రమించకుండా తక్కిన కవులకు భిన్నంగా ప్రపంచ బాధల్ని పల్లవించటం వరకూ మెచ్చుకోలు. వట్టి నినాదాలు కవితలు కావుకానీ, 'మినీ' కవిత్వాన్ని శ్రీశ్రీ ఆహ్వానించాడు.
'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు...' అంటూ శ్రీశ్రీ అక్షరీకరించిన సామాన్య వాక్యాలు సత్యాన్వేషణలో భాగం కనక గొప్పమాటలే అవుతాయి. కష్టజీవికి ఇరువైపులాఉన్నవాడు శ్రీశ్రీ. అక్షరానికి ఆవేశాన్ని నేర్పినవాడు. శ్రీశ్రీ వచ్చేదాకా తెలుగు అక్షరానికి ప్రణయార్చన తప్ప ప్రళయగర్జన తెలీదు. గుప్పెడు అక్షరాల అణువుల్ని ఎలా పోగేయాలో నేర్చిన శాస్త్రవేత్త శ్రీశ్రీ. కన్నీటికి ఉప్పెన రూపాన్ని ఇవ్వగల ప్రకృతి శ్రీశ్రీ. సామ్యవాదం జాబిలిని చూపి అక్షరాల గోరుముద్దలు తినిపించే అమ్మ శ్రీశ్రీ. ఓ అభ్యుదయ సంతకం... ఓ విప్లవ కెరటం... ఓ పోరాట రూపం. కవిత్వాన్ని ఆరాటంగా కాక పోరాటంగా మలచిన యోధుడు. శ్రీశ్రీ అక్షరాలు ఆశావాదానికి కళ్లు, పురోగామి భావాలకు కాళ్లు!
(ఈనాడు, ౩౦:౦౪:౨౦౧౦)
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home