వానావానా వల్లప్పా...
వేసవి వేడి, వెన్నెల హాయి, చినుకు చురుక్కు, చలి గిలిగింత- అన్నీ మనిషి అనుభవించి కలవరించాల్సిన అనుభూతులే. విరగకాసే ఎండలు, విరబూసే చంద్రికలు, జలధారలై ఉరికివచ్చే వర్షాలు, జలదరింతలై పలకరించే చలిగాలులు- కాలచక్రంలో వరసక్రమంలో కదలాడే వర్ణోజ్జ్వల వలయాలే. అన్ని రుతువులూ ఆనందహేతువులు. వసంతం ఒళ్లు విరుచుకుంటే చెట్లకు చిగురింత; హేమంతం హసిస్తే మంచు బిందువులకు తుళ్లింత! 'పంచాంగంలో భయపడి దాక్కున్న వసంత రుతువును/ పంచమ ప్రాణంగా లాక్కుని, గుండెల్లో దాచుకున్నాను' అన్నాడు కవితాపయోనిధి దాశరథి. హేమంత రుతువులో గుమ్మడిపువ్వులో ఒయ్యారమొలికిస్తున్న హిమబిందువు- బుట్టలో కూర్చోబెట్టిన నవవధువులా ఉందని మురిసిపోయాడు కవిసమ్రాట్ విశ్వనాథ. నిరంతరం దొర్లుతూపోయే రుతుచక్రంలోని ఆకుల్లాంటి కాలాలు- ఒకదాని వెంబడి మరొకటి మనిషిని నిత్యం వెన్నంటే ఉంటాయి. వేసవి వేసంలో తీవ్రతీవ్రంగా నిప్పులు చెరగడం, వర్షనర్తనమై చినుకు చినుకునా హొయలు చిలకడం, శిశిరవీచికై చలిగాలుల్లో రివ్వురివ్వున రవళించడం- ప్రకృతిధర్మంగా మూడుకాలాలూ పునరావృతం చేసే విలాస విన్యాసాలు. వాటిలో మనిషి పరిభ్రమించక తప్పదు. మహాకవి పలుకుల్ని మననం చేసుకుంటూ, తాను 'ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా?/ వానకాలం ముసిరి రాగా నిలువు నిలువున నీరు కాలేదా?/ శీతకాలం కోతపెట్టగ కొరడుకట్టీ...' అని పలవరించకా తప్పదు. ఆయా కాలాల్లోని సౌందర్య మాధుర్యాల్నే కాదు, చేదు రుచుల్నీ స్వాగతించాల్సిందే. వడగాలులు భయపెట్టవచ్చు, జడివానలు జడిపించవచ్చు. అయితేమాత్రమేం, 'ఉగ్రమైన వేసంగి గాడ్పులు... ఆగ్రహించి పైబడినా అదరిపోవకు/ ఒక్కుమ్మడిగా వర్షామేఘం... వెక్కివెక్కి రోదించినా లెక్కచేయకు' అన్న కృష్ణశాస్త్రి కవితనే ధైర్యకవచంగా ధరించి, దారిదీపంగా వరించి ముందుకు సాగిపోలేమా!
ఆయా కాలాల ప్రభావాన్ని అంతకుముందరి రోజులతో పోలుస్తూ- గత కాలమె మేలు ప్రస్తుత కాలముకంటెనని ఉస్సురనడం కొందరికి రివాజు. ముఖ్యంగా వేసవిని ఆస్వాదించే వేళ అటువంటివారు మంచి గతమున కొంచెమేనని గుర్తించకపోవడమూ కద్దు. ప్రతిఏటా- నిరుటి ఎండలే నయమని నిట్టూర్చడం, నేటి ఎండలు భయంకరమని వాపోవడం వారికి పరిపాటి. నిజానికి వెనకటి రోజుల్లోనూ చండభానుడి చండ్రనిప్పులు లోకానికి కొత్తేమీ కాదు. పైన భగ్గున మండే సూర్యుడు పులికోరలా, బయట ఫెళ్లున కాసే ఎండ పాముపడగలా; రోడ్డుపైని ఎర్రటి మధ్యాహ్నం మంటల జుట్టును విరబోసుకున్న చందాన- యాభైఏళ్ల క్రితంనాటి వేసవి దినాలూ విజృంభించినట్లు రచయితలు అక్షరబద్ధం చేయడమే అందుకు దాఖలా. ఆ మాటకొస్తే- ఎండల కాలం మంటల కొలిమిలా మారడం శతాబ్దాల కిందటా ఉన్నదే. గ్రీష్మరుతువు అగ్నిశిఖల్ని విరజిమ్ముతున్నవేళ, వృక్షమూలాల్లో అణగిన నీడల్ని చూస్తుంటే అవి- మండుటెండల ధాటికి భీతిల్లి ఆ మాకుల కింద దూరాయా, లేక తమ దాహార్తిని తీర్చుకోవడానికి తమ నీడల్ని ఆ చెట్లే స్వయంగా తాగేశాయా... అన్నట్లుందని నన్నెచోడుడు అభివర్ణించింది పన్నెండో శతాబ్దిలో! శేషేన్ కవిత్వీకరించినట్లు 'చటుల దుర్జన రాజ్య శాసనము వోలె/ సాగె చండ ప్రచండ మార్తాండ రథము' అనిపించేలా దాదాపు ఎనిమిది వందల ఏళ్లక్రితమూ ఎండల కాలంలో సూర్యుడు అంతలా చెలరేగాడు! మనిషి వగచినా, వాపోయినా- ప్రతి కాలమూ కాస్త స్థాయీభేదాలతో తన ప్రభావాన్ని చూపుతూ అలా కదలిపోతూనే ఉంటుంది. దానిస్థానే కొత్తగా వచ్చి చేరే కాల లక్షణమూ అదే.
మొన్నమొన్నటిదాకా సెగలూ పొగలు కక్కి ఉడికించిన వేసవి- కాల యవనిక వెనక్కి జారుకుంది. తాపోపశమనాన్ని కలిగించి, సాంత్వన చేకూర్చగలదన్న ఊరింపులతో వర్షకాలం విచ్చేసింది. రుతుపవనాలు, వానలు మొదలయ్యాయి. చిన్ని చిన్ని చినుకులు, సనసన్నని తుంపరలు, చిరుచిరు జల్లులు, జడివానలు- ఇలా ఏ రూపాన ఉన్నా వర్షం ఎదల హర్షం కురిపించేదే. రుతుపవనాలు దోబూచులాడితే మనిషి నిరాశపడటం, దాగుడుమూతలు మాని అవి వానలై సాక్షాత్కరించాలని ఆకాంక్షించడం సహజం.
వానలు మబ్బుల వెనకే తారట్లాడుతుంటే '...కురిసి తీరాలి వర్షాలు/ కొంచెకొంచెమేని రాలాలి తుంపరలేని; కాని ఉక్క మాత్రమేమాత్రమూ ఉండరాదు' అని ఆశించని వారెవరు? వర్షాలు మరీ విరుచుకుపడినా మనిషికి అసంతృప్తే. అలా కురిసిన ఏట- ఈసారి ఎప్పుడూ లేనంతగా భగ్గుమన్న ఎండలు, ఎన్నడూ ఎరుగనంత విపరీతంగా వణికించిన చలి మాత్రమే కాదు, వానలూ ఎడతెరిపి లేకుండా పడుతున్నాయే అని చికాకు పడుతుంటారు కొందరు. అందుకే- 'ఎండో, వానో, మబ్బో ఎలాగో ఒకలాగ ఉండాలి కదా వాతావరణం/ ఎలా ఉన్నా దాన్ని ఆడిపోసుకుంటేనే కాలహరణం' అంటూ మానవ స్వభావంపై చెణుకు విసిరాడు ఆరుద్ర. ఆకసంలో మబ్బులు కమ్ముకుంటే రైతు కళ్లలో ఆశల మెరుపులు. చినుకు రాలితే నేలతల్లి కంట ఆనందబాష్పాలు. వాన కురిస్తే చేనంతా చెమరింత. చిరుజల్లుల్లో ఆడుతూ పాడుతూ మురిసిపోయే పసి హృదయాల కేరింతలు. తుంపర్లలో తడుస్తూ చెట్టపట్టాలుగా సాగిపోయే పడుచు గుండెల్లో సంతోష తరంగాలు- అన్నీ వానల చలవే. మనిషిని వేధించి, బాధించే తులవతనమూ వాటికి ఉంది. అది అతివృష్టి కుంభవృష్టిగా ముంచెత్తి కూడు లేని, గూడు లేని దీనజనుల కడుపు కొట్టే వర్షాల దౌర్జన్యం- గుండెను కలుక్కుమనిపిస్తుంది. కాలకన్యకకు పొగరెక్కువనిపిస్తుంది!
((ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౭:౨౦౧౦)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home